శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
శతమానం భవతి
తారాగణం: శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్‌రాజ్, జయసుధ,
నరేష్, ఇంద్రజ, ప్రవీణ్, సిజ్జు, రాజా రవీంద్ర, సతీష్, తనికెళ్ళ భరణి, ప్రభాస్ శ్రీను తదితరులు
సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి
సంగీతం: మిక్కీ జె.మేయర్
ఎడిటింగ్: మధు
సమర్పణ: శ్రీమతి అనిత
నిర్మాతలు: దిల్‌రాజు, శిరీష్
రచన, దర్శకత్వం: వేగేశ్న సతీష్
విడుదల తేదీ: 14.01.2017
జనవరి వచ్చిందంటే సంక్రాంతి పండగ ఎలాగున్నా సినిమాల సందడి మాత్రం విపరీతంగా వుంటుంది. స్టార్ హీరోల సినిమాలు ఒక దానితో ఒకటి పోటీ పడుతూ జనంలోకి వచ్చేస్తాయి. ఈ సంక్రాంతికి ఇద్దరు టాప్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు పండగ సందడిని చేస్తుండగా మధ్యలో శర్వానంద్ హీరోగా శతమానం భవతి వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కూడా చేరింది. పూర్తి గ్రామీణ నేపథ్యంలో పండగలాంటి సినిమాగా శతమానం భవతి చిత్రాన్ని రూపొందించే ప్రయత్నం చేశాడు దర్శకుడు వేగేశ్న సతీష్. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ నిర్మించి అందర్నీ మెప్పించే దిల్‌రాజు ఈ చిత్రానికి నిర్మాత. ఈరోజు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ పండగకు కుటుంబ సమేతంగా కలిసి చూడదగ్గ అంశాలు ఈ చిత్రంలో ఏం వున్నాయి? ఇప్పటివరకు ఎన్నో కుటుంబ కథా చిత్రాలు వచ్చాయి. మరి ఈ చిత్రంలో చూపించిన కొత్తదనం ఏమిటి? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
ఒకప్పటి అనుబంధాలు, అప్యాయతలు, ప్రేమానురాగాలు ఇప్పుడు ఏ కుటుంబంలోనూ లేవు అనేది అందరికీ తెలిసిన సత్యమే. అది ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవడం వల్ల కావచ్చు, తల్లిదండ్రుల్ని వదిలి పిల్లలు ఉద్యోగ రీత్యా వేరే ప్రదేశాల్లో సెటిల్ అవ్వడం వల్ల కావచ్చు, పెరుగుతున్న టెక్నాలజీ వల్ల కావచ్చు. ఈ కథ విషయానికి వస్తే తన కొడుకులు, కూతురు పెళ్ళిళ్ళు చేసి భార్య జానకమ్మ(జయసుధ), తమ్ముడి కొడుకు కంగార్రాజు(నరేష్), మనవడు రాజు(శర్వానంద్)తో జీవితాన్ని గడుపుతుంటాడు రాఘవరాజు(ప్రకాష్‌రాజ్). కొడుకులు, కూతురు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా.. ఇలా వేర్వేరు దేశాల్లో ఉద్యోగరీత్యా సెటిల్ అయ్యారు. ఎనిమిది సంవత్సరాలు గడిచినా తల్లిదండ్రులను చూసేందుకు ఎన్నిసార్లు పిలిచినా వాళ్ళు రారు. కొడుకుల్ని, కూతుర్ని, మనవళ్ళని, మనవరాళ్ళని చూడడానికి తనే అక్కడికి వెళ్ళేందుకు సిద్ధపడుతుంది జానకమ్మ. ఎన్నిసార్లు పిలిచినా రాని వాళ్ళకు ఒక మెయిల్ పంపిస్తాడు రాఘవరాజు. దాంతో మూడు కుటుంబాలు ఆత్రేయపురం వచ్చి వాలతాయి. రాజు తన మరదలు నిత్య(అనుపమ పరమేశ్వరన్)తో ప్రేమలో పడతాడు. ఎన్నిసార్లు పిలిచినా రాని కొడుకులు, కూతురు ఒక్క మెయిల్‌కే ఎలా వచ్చారు? ఆ మెయిల్‌లోని సారాంశం ఏమిటి? దాని వల్ల ఎలాంటి మనస్పర్థలు వచ్చాయి? రాజు, నిత్యల ప్రేమను పెద్దవాళ్ళు ఒప్పుకున్నారా? చివరికి కథ సుఖాంతమైందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
పిల్లల ప్రేమ కోసం, వారిని చూడడం కోసం తపించే తల్లిగా జయసుధ నటన ఆకట్టుకుంది. అలాగే రాఘవరాజుగా ప్రకాష్‌రాజ్ పెర్‌ఫార్మెన్స్ కూడా బాగుంది. అందరితోనూ కలిసిపోయి, అందరికీ సహాయం చేసే కుర్రాడిగా శర్వానంద్ నటన ఓకే అనిపిస్తుంది. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ హీరోకి మరదలుగా అతని వెంట తిరిగేందుకు, అప్పుడప్పుడు పాటలు పాడేందుకు తప్ప ఆమె క్యారెక్టర్‌కు అంత ప్రాధాన్యత లేదు. ఆ ఇంట్లో తిరిగే పిల్లలతో కలిసిపోయిన ఛైల్డ్ ఆర్టిస్ట్‌లా అనిపిస్తుందే తప్ప హీరోయిన్ అనే భావన మాత్రం మనకు కలగదు. రాఘవరాజు కొడుకులుగా సిజ్జు, సతీష్, అల్లుడుగా రాజా రవీంద్ర ఆయా క్యారెక్టర్లకు సూట్ అవ్వలేదనిపిస్తుంది. దాదాపు ప్రకాష్‌రాజ్ సహ నటులుగా కనిపించే ఈ ముగ్గురు అతనికి కొడుకులు, అల్లుడు అంటే కాస్త అతిశయోక్తిగానే అనిపిస్తుంది. కంగార్రాజుగా నరేష్ క్యారెక్టర్‌కి కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు వుండదు. మధ్య మధ్యలో కామెడీ చేసి ప్రేక్షకుల్ని నవ్వించే ప్రయత్నం చేసిన ప్రవీణ్, జబర్దస్త్ బ్యాచ్ అక్కడక్కడ మాత్రమే సక్సెస్ అయ్యారు.
కథ, కథనాలు పక్కన పెడితే సినిమాకి ప్లస్ అయిన అంశాలు సినిమాటోగ్రఫీ, మ్యూజిక్. పల్లెటూరు అందాల్ని ఎంతో అందంగా చూపించడంలో సమీర్‌రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. అయితే దాన్ని అతి సహజంగా చూపించేందుకు జరిగిన పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్‌లో కొన్ని కలర్స్ అతిగా అనిపిస్తాయి. మిక్కీ జె.మేయర్ చేసిన పాటలు ఇంతకుముందు విన్న పాటల్లాగానే అనిపించినా ఫర్వాలేదు అనేలా వున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సన్నివేశానికి తగ్గట్టుగా చేశాడు. ఎడిటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్‌లో వున్న గ్రిప్ సెకండాఫ్‌లో కనిపించలేదు. సినిమాని క్లైమాక్స్ వరకు తీసుకెళ్ళేందుకు చాలా అనవసరమైన సన్నివేశాల్ని ఇరికించారు. వాటిని కట్ చేసి వుంటే బాగుండేది. పూర్తి విలేజ్ బ్యాక్‌డ్రాప్ అయినప్పటికీ సినిమాని రిచ్‌గా చూపించేందుకు నిర్మాతలు పెట్టిన ఖర్చు స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఇక డైరెక్టర్ సతీష్ వేగేశ్న గురించి చెప్పాలంటే అతను ఎంచుకున్న పాయింట్ కొత్తది కాదు, దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు కూడా కొత్తవి కావు. సీతమ్మ వాకిట్లో, గోవిందుడు అందరి వాడేలే.. వంటి కుటుంబ కథా చిత్రాల కోవలోనే ఓ రొటీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని చూస్తున్న ఫీలింగే కలుగుతుంది తప్ప శతమానం భవతిలో ఇది కొత్తగా అనిపించింది అని చెప్పడానికి ఏమీ లేదు. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వచ్చే ప్రతి సీన్ మనం అంతకుముందు చాలా సినిమాల్లో చూసేసిన ఫీలింగే కలుగుతుంది. ఇందులో డైరెక్టర్ అనుకున్న కొత్త పాయింట్.. పిల్లల్ని విదేశాల నుంచి రప్పించడానికి తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నానని చెప్పడం. అది కథని ఎన్నో మలుపులు తిప్పుతుందని ఊహించిన ప్రేక్షకుడికి ఎలాంటి ట్విస్ట్‌లు లేకుండా ఫ్లాట్‌గా సినిమా వెళ్ళిపోవడం రుచించదు. పాత కథే మళ్ళీ చూస్తున్నామని సినిమా స్టార్టింగ్‌లోనే ఆడియన్స్‌కి అర్థమైనా ఫస్ట్ హాఫ్ వరకు ఫర్వాలేదు అనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌ని ఫిల్ చేసి కథని క్లైమాక్స్ వరకు తీసుకెళ్ళేందుకు సరైన స్టఫ్ లేకపోవడంతో అనవసరమైన కామెడీ సీన్స్, శ్రీనివాస కళ్యాణం, డబ్‌ష్మాష్ సీన్స్, రాఘవరాజు పెద్ద కొడుకు ఫ్లాష్ బ్యాక్ లవ్‌స్టోరీ, అప్పుడు ప్రేమించిన అమ్మాయితో ఇప్పుడు ఏకాంతంగా మాట్లాడడం, హీరో, హీరోయిన్ మధ్య వచ్చే రిపీటెడ్ సీన్స్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. విదేశాల్లో వున్న పిల్లలు తమ తల్లిదండ్రులకు దూరం కావద్దని, పిల్లల కోసం వేయి కళ్ళతో ఎదురు చూసే తల్లిదండ్రుల కోసం సంవత్సరానికి ఒక్కసారైనా వారి దగ్గరకు రావాలన్న పాయింట్ మంచిదే అయినా దాన్ని కన్విన్సింగ్‌గా చెప్పడంలో డైరెక్టర్ సక్సెస్ అవ్వలేకపోయాడు. కథ, కథనాల మాట ఎలా వున్నా ఈ పండగకి ఆహ్లాదకరమైన పల్లెటూరి వాతావరణం, చక్కని ఫోటోగ్రఫీ, మంచి మ్యూజిక్‌తో ఎలాంటి వల్గారిటీ లేకుండా కుటుంబ సమేతంగా టైమ్‌పాస్ కోసం శతమానం భవతి సినిమా చూసి పండగ సినిమా చూశామనిపించుకోవచ్చు.
ఫినిషింగ్ టచ్: రొటీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
సినీజోష్ రేటింగ్: 2.75/5