సన్‌షైన్ సినిమా
సురేష్ ప్రొడక్షన్స్
పిట్టగోడ
తారాగణం: విశ్వదేవ్ రాచకొండ, పునర్నవి భూపాలం, ఉయ్యాలా జంపాలా రాజు, జబర్దస్త్ రాజు, శ్రీకాంత్ ఆర్.ఎన్. శివ ఆర్.ఎస్. తదితరులు
సినిమాటోగ్రఫీ: ఉదయ్
సంగీతం: కమలాకర్
ఎడిటింగ్: వెంకటకృష్ణ చిక్కాల, ఆర్యన్ మౌళి
సమర్పణ: డి.సురేష్‌బాబు
నిర్మాతలు: దినేష్‌కుమార్, రామ్మోహన్ పి.
రచన, దర్శకత్వం: అనుదీప్ కె.వి.
విడుదల తేదీ: 24.12.2016
అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, ఉయ్యాలా జంపాలా వంటి విభిన్న చిత్రాలతో అభిరుచి వున్న నిర్మాతగా పేరు తెచ్చుకున్న రామ్మోహన్ పి. తాజాగా పిట్టగోడ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. డి.సురేష్‌బాబు సమర్పణలో అనుదీప్ కె.వి. ని దర్శకుడుగా పరిచయం చేస్తూ విశ్వదేవ్ రాచకొండ, పునర్నవి భూపాలం హీరో హీరోయిన్లుగా నిర్మించిన ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. రొటీన్ కథలకు భిన్నమైన కథలతో సినిమాలు నిర్మించే రామ్మోహన్ పిట్టగోడ చిత్రంలో ఎలాంటి కథను చెప్పారు. ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏమేర ఎంటర్‌టైన్ చేసింది? ఈ బేనర్‌లో మరో సూపర్‌హిట్ సినిమాగా పిట్టగోడ నిలిచిందా? అసలు పిట్టగోడ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
ఇది ఓ నలుగురు స్నేహితుల కథ. ఆ నలుగురిలో టిప్పు(విశ్వదేవ్ రాచకొండ) నాయకుడు. సాధారణంగా మనం చూసే సినిమాల్లో కనిపించే ఫ్రెండ్స్‌లా వెకిలి వేషాలు వేస్తూ, పనికిరాని డైలాగ్స్‌తో నవ్వించే ప్రయత్నించే ఫ్రెండ్స్ కాదు. నేచురల్‌గా మధ్య తరగతి కుటుంబాల్లో కనిపించే అబ్బాయిలే ఈ నలుగురు స్నేహితులు. ఎప్పుడూ పిట్టగోడ మీద కూర్చొని కాలక్షేపం చేసే వీరికి తల్లిదండ్రుల నుంచి తిట్ల రూపంలో దీవెనలు అందుతూనే వుంటాయి. అలా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్న వీరికి ఓ బ్రహ్మాండమైన ఐడియా వస్తుంది. ఏదో ఒక పని చేసి వార్తల్లోకి ఎక్కాలనుకుంటారు. స్ట్రయికర్స్ టీమ్ పేరుతో ఓ క్రికెట్ టీమ్‌ని పెట్టి అదే ఊరిలో క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చెయ్యాలని ప్లాన్ చేస్తారు. అందుకోసం అందరి దగ్గరి నుంచి డబ్బు కూడా వసూలు చేస్తారు. అన్ని సినిమాల్లోని హీరోలాగే టిప్పు కూడా దివ్య(పునర్నవి భూపాలం) ప్రేమలో పడతాడు. క్రికెట్ టోర్నమెంట్‌కి సంబంధించిన ఏర్పాట్లలో వుండగానే అతనికి దివ్య గురించి ఓ నిజం తెలుస్తుంది. దీంతో అర్థాంతరంగా టోర్నమెంట్‌ని క్యాన్సిల్ చేస్తాడు టిప్పు. దీంతో టోర్నమెంట్‌కి డబ్బు పెట్టినవారు ఈ నలుగురితో గొడవ పడతారు. విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్తుంది. టోర్నమెంట్ పేరుతో జనాన్ని మోసం చేస్తున్నారన్న వార్త పేపర్లకు ఎక్కుతుంది. టోర్నమెంట్ ఎందుకు క్యాన్సిల్ చెయ్యాల్సి వచ్చిందన్న ప్రశ్నకు టిప్పు సమాధానం చెప్పడు. దీంతో ఫ్రెండ్స్ అతనికి దూరమవుతారు. టోర్నమెంట్ క్యాన్సిల్ చెయ్యడం వెనుక బలమైన కారణం ఏమిటి? దివ్య గురించి టిప్పు తెలుసుకున్న నిజం ఏమిటి? తను ప్రేమించిన దివ్యను టిప్పు సొంతం చేసుకోగలిగాడా? తనపై, తన స్నేహితులపై పడ్డ మచ్చను తొలగించుకోవడానికి టిప్పు ఏం చేశాడు? అనేది మిగతా కథ.
వినడానికి ఇది ఓ సాదా సీదా కథలాగే అనిపించినా ఈ కథ కోసం ఎంచుకున్న బ్యాక్‌డ్రాప్, నటీనటులు, సహజంగా కనిపించే క్యారెక్టర్లు, చక్కని సంగీతం, శృతి మించని సన్నివేశాలు, డైలాగ్స్ సినిమాకి ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయని చెప్పొచ్చు. ఈ చిత్రంతో హీరోగా పరిచయమైన విశ్వదేవ్ రాచకొండ తొలి చిత్రమైనా ఎలాంటి తడబాటు లేకుండా పెర్‌ఫార్మ్ చెయ్యగలిగాడు. ఉయ్యాలా జంపాలా చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్‌గా కనిపించిన పునర్నవి ఈ చిత్రంలో హీరోయిన్‌గా పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్ వున్న క్యారెక్టర్ చేసింది. హీరో ఫ్రెండ్స్, హీరో, హీరోయిన్ల ఫ్యామిలీ, విలన్... ఇలా అందరి నటన బాగుంది.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ గురించి చెప్పాల్సి వస్తే ముందుగా కమలాకర్ మ్యూజిక్ గురించి చెప్పాలి. ప్రాణం, వాన వంటి సినిమాల్లో అద్భుతమైన పాటలు చేసిన కమలాకర్ ఈ చిత్రంలో కూడా మంచి పాటలు చేశాడు. సాహిత్యం స్పష్టంగా వినిపించేలా పాటలు చెయ్యడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. స్టార్టింగ్ టు ఎండింగ్ కమలాకర్ చేసిన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి చాలా ప్లస్ అయింది. ఉదయ్ ఫోటోగ్రఫీ ఎలాంటి ఆర్భాటాలు, హడావిడి లేకుండా చాలా నేచురల్‌గా చేశాడు. ఎడిటింగ్ కూడా కళ్ళకి హాని కలిగించేలా లేదు. డైరెక్టర్ అనుదీప్ విషయానికి వస్తే ఒక మామూలు కథతో దానికి తగ్గ నటీనటుల్ని సెలెక్ట్ చేసుకొని ఒక నీట్ మూవీని తీసే ప్రయత్నం చేశాడు. అయితే సినిమా అన్న తర్వాత అన్ని ఎమోషన్స్ క్యారీ చెయ్యగలిగితేనే ప్రేక్షకుల్ని హండ్రెడ్ పర్సెంట్ ఆకట్టుకోగలుగుతాం. ఈ విషయంలో కొంతవరకు సక్సెస్ అవ్వగలిగాడు అనుదీప్. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫ్లాట్‌గా వెళ్ళిపోతుంది తప్ప నెక్స్‌ట్ సీన్ ఏమిటి అనే క్యూరియాసిటీని ఆడియన్స్‌లో కలిగించలేకపోయాడు. నలుగురు ఫ్రెండ్స్ కథ అనగానే డబుల్ మీనింగ్ డైలాగ్స్, హీరోయిన్‌తో హీరో చేసే చిల్లర వేషాలు, వెకిలి కామెడీ ఇవన్నీ లేకుండా ఎంతో నీట్‌గా సినిమాని నడిపించాడు. హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కూడా చాలా నేచురల్‌గా వుంది. ఇలా చూడగానే అలా ప్రేమలో పడిపోయి డ్యూయెట్లు పాడేసుకునే టైప్ కాకుండా ఒక టౌన్‌లోని అబ్బాయి, అమ్మాయి ప్రేమలో పడితే వారు ఎలా బిహేవ్ చేస్తారు అనేది నీట్‌గా చూపించాడు. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ సినిమా ఎలా వుంది అనేది సగం డిసైడ్ చేసేస్తాయి. ఇందులో ఇంటర్వెల్ బ్యాంగ్ బాగానే వున్నా, క్లైమాక్స్ పేలవంగా అనిపిస్తుంది. ఒక సంఘటన వల్ల చెడ్డ పేరు తెచ్చుకున్న నలుగురు స్నేహితులు ఎలా మంచి పేరు తెచ్చుకొని వార్తల్లోకి ఎక్కారు అనేది చాలా సింపుల్‌గా తేల్చేసినట్టు అనిపిస్తుంది. ఫ్లాట్‌గా వెళ్తున్న సినిమా మధ్యలో థియేటర్ నుంచి బయటికి వచ్చినట్టుగా సినిమా ఎండ్ అయిన తర్వాత వచ్చినట్టనిపిస్తుంది. ఏది ఏమైనా ఒక మంచి క్లీన్ మూవీ, ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా డైరెక్టర్ అనుదీప్, ప్రొడ్యూసర్ రామ్మోహన్ ఈ సినిమాని తీశారు. ఫైనల్‌గా చెప్పాలంటే రొటీన్ యాక్షన్ మూవీస్, థ్రిల్లర్స్ చూసి విసుగెత్తిన ప్రేక్షకులకు రిలీఫ్‌నిచ్చే సినిమా పిట్టగోడ.
ఫినిషింగ్ టచ్: క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
సినీజోష్ రేటింగ్: 2.75/5