లక్కీ మీడియా
నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్
తారాగణం: హెబా పటేల్, రావు రమేష్, తేజస్వి, నోయల్,
అశ్విన్, పార్వతీశం, ధన్‌రాజ్, సన, కృష్ణభగవాన్, షకలక శంకర్, రాజ్ తరుణ్(గెస్ట్ అప్పియరెన్స్) తదితరులు
సినిమాటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు
సంగీతం: శేఖర్‌చంద్ర
ఎడిటింగ్: ఛోటా కె.ప్రసాద్
కథ: బి.సాయికృష్ణ
మాటలు: ప్రసన్నకుమార్ బెజవాడ
సమర్పణ: మానస, మహాలక్ష్మీ
నిర్మాత: బెక్కెం వేణుగోపాల్
దర్శకత్వం: భాస్కర్ బండి
విడుదల తేదీ: 16.12.2016
ఒకప్పుడు ఆడపిల్ల పెళ్ళి చెయ్యాలంటే పెళ్ళిచూపులు ఒక్కటే మార్గం. ఇప్పటికీ ఆ సంప్రదాయాన్ని కొంతమంది పాటిస్తున్నారు. ఈమధ్యకాలంలో ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువైపోవడంతో తమ జీవిత భాగస్వామిని తామే ఎంచుకుంటున్నారు యువతీయువకులు. పెళ్ళిచూపుల కాలం నుంచి ఇప్పటివరకు రకరకాల ప్రేమకథల్ని మనం సినిమాల్లో చూస్తున్నాం. ఈరోజు విడుదలైన నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ చిత్రకథ పైవాటన్నింటికీ పూర్తి విరుద్ధం. తన లైఫ్ పార్టనర్‌ని సెలెక్ట్ చేసుకోవడం కోసం ముగ్గురిని ప్రేమించి అందులో ఒకరిని ఫైనల్ చేస్తుంది హీరోయిన్. సాధారణంగా మన సినిమాల్లో ఈ యాటిట్యూడ్‌ని హీరోలకే పరిమితమైంది. ఇప్పుడు ట్రెండ్ మారి హీరోయిన్‌కి కూడా అది పాకింది. కుమారి 21 ఎఫ్‌లో లవ్‌ని బోల్డ్‌గా, మరింత బోల్డ్‌గా చూపించడంతో తర్వాతి సినిమాల్లో కూడా అలాంటి క్యారెక్టర్స్‌నే క్రియేట్ చేస్తున్నారు డైరెక్టర్లు. ముగ్గుర్ని ప్రేమించి ఒకర్ని ఫైనల్ చేసుకునే క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చిందే తడవుగా హెబా పటేల్ గుర్తొచ్చి వుంటుంది డైరెక్టర్‌కి. నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ అనే విచిత్రమైన టైటిల్‌తో ఈరోజు విడుదలైన ఈ సినిమాకి డైరెక్టర్ భాస్కర్ బండి. లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈరోజు విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారు? టైటిల్ పరంగా ఆలోచిస్తే ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎంతవరకు ఆకట్టుకునే అవకాశం వుంది? ఈ సినిమా ద్వారా డైరెక్టర్ ఏం చెప్పదలుచుకున్నాడు? వంటి విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
పిల్లలంటే ఏ తండ్రికైనా ప్రాణమే. అందునా ఆడపిల్ల అంటే ఒకింత ఎక్కువే అని చెప్పాలి. అలాంటి ఓ తండ్రి రాఘవరావు(రావు రమేష్)కి లేక లేక ఓ ఆడపిల్ల పుడుతుంది. కానీ, జాతక ప్రకారం ఆ కూతురు తనకి శత్రువు అవుతుందని, ఎడ్డెం అంటే తెడ్డెం అనే ఆ అమ్మాయి వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని జోతిష్యుడు చెప్తాడు. అది విన్న తండ్రి షాక్ అవుతాడు. అప్పటి నుంచి ఆ అమ్మాయి పెరిగి పెద్దయ్యే వరకు ఏ విషయంలోనూ ఆమె ఇష్టానికి అడ్డు చెప్పడు రాఘవరావు. పెరిగి పెద్దదైన పద్మావతి(హెబా పటేల్) హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేస్తానని చెప్తే తనకి ఇష్టం లేకపోయినా పంపిస్తాడు. తన ఫ్రెండ్ మాగీ(తేజస్వి)తో కలిసి వుంటూ జాబ్ చేస్తుంటుంది పద్మావతి. పెళ్ళి చెయ్యాలని తల్లిదండ్రులు డిసైడ్ అవ్వడంతో తనకి ఆల్రెడీ బాయ్‌ఫ్రెండ్ వున్నాడని, ప్రస్తుతం అమెరికా వెళ్ళాడని, నాలుగు నెలల్లో వస్తాడని అబద్ధం చెప్తుంది. కానీ, ఆ అబద్ధాన్ని నిజం చెయ్యాలనుకుంటుంది. అందుకే గూగుల్‌లో వందల మందిని చూసి అందులో నుంచి ముగ్గుర్ని సెలెక్ట్ చేస్తుంది. ముగ్గుర్నీ ఒకరికి తెలియకుండా ఒకర్ని లైన్‌లో పెడుతుంది. ముగ్గురూ తనని ప్రేమించేలా చేసుకుంటుంది. ఆ ముగ్గురూ పద్మావతిని పీకలదాకా ప్రేమిస్తారు. ఎంతగా అంటే కెరీర్ పరంగా తమకి వచ్చిన అవకాశాల్ని కూడా వదిలేస్తారు. ముగ్గురూ పద్మావతిని పెళ్ళి చేసుకోవడానికి రెడీ అయిపోతారు. అప్పుడు పద్మావతి ఏం చేసింది? ముగ్గురిలో ఎవరిని పెళ్ళి చేసుకుంది? ఈ విషయం తెలుసుకున్న ఆమె తండ్రి ఎలా రియాక్ట్ అయ్యాడు? పద్మావతి తన పెళ్ళి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది? అనేది మిగతా కథ.
కుమారి 21ఎఫ్ చిత్రంలోని క్యారెక్టర్‌ని పోలిన క్యారెక్టర్‌నే ఈ సినిమాలో కూడా హెబా పటేల్. ఆ చిత్రంలోని క్యారెక్టర్‌నే కంటిన్యూ చేస్తున్నట్టుగా ఆమె పెర్‌ఫార్మెన్స్ కనిపిస్తుంది. గ్లామర్ పరంగా ఏమాత్రం ఆకట్టుకోని హెబా పెర్‌ఫార్మెన్స్ పరంగా ఫర్వాలేదు అనిపించింది. మాగీగా సినిమా మొత్తం కనిపించే తేజస్వి నటన కూడా బాగుంది. ఐటమ్ సాంగ్‌ని పోలిన పాటలో తన స్టెప్పులతో కొత్తగా కనిపించింది. పద్మావతి బాయ్ ఫ్రెండ్స్‌గా అశ్విన్, నోయల్ పార్వతీశం తమ పెర్‌ఫార్మెన్స్‌తో జస్ట్ ఓకే అనిపించారు. ఈ సినిమాలో హైలైట్ క్యారెక్టర్ ఎవరిదైనా వుందీ అంటే అది రాఘవరావుదే. ఆ పాత్రని రావు రమేష్ చాలా అద్భుతంగా పోషించాడు. కథ ఎలాంటిదైనా తన నటన, అతను చెప్పిన డైలాగ్స్ అందర్నీ ఆకట్టుకుంటాయి. మధ్య మధ్యలో జబర్దస్త్ టీమ్ చేసిన కామెడీ అంతగా ఆకట్టుకోలేదు.
సాంకేతికంగా చూస్తే ఈ సినిమాకి ఛోటా కె.నాయుడు ఫోటోగ్రఫీ పెద్ద ప్లస్ అయింది. అలాగే కథపరంగా వచ్చే పాటలు, కథనానికి అనుగుణంగా శేఖర్ చంద్ర చేసిన మ్యూజిక్ ఫర్వాలేదు అనిపించింది. ఎడిటింగ్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకొని అనవసరమైన సీన్స్‌ని తొలగించి వుంటే బాగుండేది. సాయికృష్ణ రాసిన కథ వినడానికి బాగానే వున్నా ఒక అమ్మాయి ముగ్గుర్ని ప్రేమించి అందులో ఒకడ్ని సెలెక్ట్ చేసుకుంటుంది అనే పాయింట్ స్క్రీన్ మీద కన్విన్సింగ్‌గా అనిపించలేదు. ఈ సినిమాలో కథ కంటే తండ్రి రాఘవరావు క్యారెక్టర్‌ని డిజైన్ చేసిన విధానం, అతని కోసం రాసిన మాటలు బాగున్నాయి. ప్రజెంట్ యూత్ ఆలోచనలని సాయికృష్ణ కథగా మలిస్తే, దానికి ప్రసన్నకుమార్ మాటలు కూడా యాడ్ చేసి స్క్రీన్‌పై ప్రజెంట్ చెయ్యాలనుకున్న భాస్కర్ బండి కొంతవరకు మాత్రమే సక్సెస్ అవ్వగలిగాడు. కూతురు తప్పు దారిలో వెళుతున్న ఆమెకు అడ్డు చెప్పకుండా ఆమె వెళ్తున్న దారిని ఆమెకు తెలియకుండా క్లియర్ చేసుకుంటూ వెళ్తాడు తండ్రి. పైగా ఆమె ఎలాంటి తప్పు చెయ్యలేదని ముగ్గురు లవర్స్‌ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు. హీరోయిన్ ముగ్గురిని ఎందుకు సెలెక్ట్ చేసుకుంది అనే దానిపై ఆమె లెక్చర్ ఇచ్చినా అది ఏమాత్రం కన్విన్సింగ్‌గా అనిపించదు. కూతురు చేసిన తప్పుని సమర్థిస్తూ తండ్రి ఇచ్చే లెక్చర్‌కి కూడా మనం కన్విన్స్ అవ్వలేం. ఇలా ఏ విధంగా చూసినా కథలో, క్యారెక్టరైజేషన్స్‌లో బోలెడన్ని లొసుగులు కనిపిస్తాయి. ఇలాంటి కథ ద్వారా దర్శకుడు సొసైటీకి ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాదు. పద్మావతిని ఎంతగానో ప్రేమించిన ముగ్గురిని వదిలేసి చిన్నప్పుడు ఆమె ప్రాణాలు కాపాడిన రాజు(రాజ్ తరుణ్)కి ఇచ్చి పెళ్ళి చేస్తాడు. అలా పద్మావతిని ప్రేమించిన ఆ ముగ్గురు బకరాలుగా మిగిలిపోయారు. నాన్న, నేను ముగ్గురు బకరాలు అని టైటిల్ పెట్టి వుంటే ఈ కథకి కరెక్ట్‌గా సరిపోయేది.
ఓపెనింగ్ షాట్ చూసి ఫ్లాష్ బ్యాక్ చాలా భారీగానే వుంటుంది అని ఎక్స్‌పెక్ట్ చేసే ఆడియన్స్‌కి నిరాశే ఎదురవుతుంది. హీరోయిన్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ముగ్గురు లవర్స్‌ని సెలెక్ట్ చేసుకోవడం, వారిని లైన్‌లో పెట్టే ప్రాసెస్, ఆ తర్వాత వారిని టెస్ట్ చేసే ప్రాసెస్ చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో కాలయాపన కోసం షకలక శంకర్ ఆధ్వర్యంలో జరిగే అంత్యాక్షరి కూడా ఆడియన్స్‌ని విసిగిస్తుంది. ప్రీ క్లైమాక్స్‌లో రావు రమేష్ చెప్పే డైలాగ్స్ మాత్రం అందర్నీ ఆకట్టుకుంటాయి. టైటిల్ చూసి ఒక యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ని చూసి ఎంజాయ్ చేద్దామనుకునే ఆడియన్స్‌కి ఇందులోని సెంటిమెంట్ సీన్స్, అనవసరంగా వచ్చిపోయే అసహనానికి గురి చేస్తాయి. ఫైనల్‌గా చెప్పాలంటే యూత్‌ఫుల్ లవ్‌కి సెంటిమెంట్‌ని కూడా జతచేసి రూపొందించిన నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ బిలో ఏవరేజ్ మూవీ అని చెప్పొచ్చు.
ఫినిషింగ్ టచ్: కన్విన్స్ అవ్వలేని బోల్డ్ స్టోరీ
సినీజోష్ రేటింగ్: 2.25/5