సరస్వతి ఫిలింస్
మన్యం పులి
తారాగణం: మోహన్‌లాల్, జగపతిబాబు, కమలిని ముఖర్జీ,
నమిత, లాల్, కిశోర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: షాజి కుమార్
సంగీతం: గోపీసుందర్
ఎడిటింగ్: జాన్ కుట్టి
మాటలు: ఎం.రాజశేఖరరెడ్డి
కథ, స్క్రీన్‌ప్లే: ఉదయ్‌కృష్ణ
నిర్మాత: సింధూరపువ్వు కృష్ణారెడ్డి
రచన, దర్శకత్వం: వైశాక్
విడుదల తేదీ: 02.12.2016
మోహన్‌లాల్... ఈ పేరు తెలియని సినీ ప్రేమికులు వుండరు. నటనకు మారుపేరుగా అందరి ప్రశంసలు అందుకొని మూదు దశాబ్దాలకుపైగా వివిధ రకాల పాత్రలు పోషిస్తూ నటనలో ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపించేందుకు ప్రయత్నించే పరిపూర్ణ నటుడు మోహన్‌లాల్. ఇప్పుడు అతని వయసు 56 సంవత్సరాలు. ఆ వయసులో ఒక కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చెయ్యాలంటే ఎంతో కమిట్‌మెంట్ వుండాలి. అలాంటి కమిట్‌మెంట్ వున్న మోహన్‌లాల్ లేటెస్ట్‌గా మలయాళంలో చేసిన సినిమా పులిమురుగన్. యంగ్ హీరోలకు తను ఏమాత్రం తీసిపోను అన్నట్టుగా ఈ సినిమాలో ఎన్నో రిస్కీ ఫైట్స్ చేసి యాక్షన్ హీరోలు సైతం ముక్కుమీద వేలేసుకొనేలా చేశాడు. మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన పులిమురుగన్ చిత్రాన్ని మన్యం పులి పేరుతో సరస్వతి ఫిలింస్ పతాకంపై సింధూరపువ్వు కృష్ణారెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈరోజు విడుదలైన మన్యం పులి చిత్రంలో ప్రేక్షకుల్ని అంతగా థ్రిల్ చేసే ఎలిమెంట్స్ ఏమున్నాయి? ఈమధ్య తెలుగులో మనమంతా, జనతా గ్యారేజ్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన మోహన్‌లాల్ మన్యం పులిగా ఆకట్టుకున్నాడా? మలయాళంలో సూపర్‌హిట్ అయిన ఈ సినిమాకి తెలుగులో ఎలాంటి టాక్ వచ్చింది? వంటి విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
అది పులియేరు గ్రామం. అడవికి దగ్గరగా ఈ గ్రామానికి పులి భయం ఎక్కువ. అదే గ్రామంలో వుండే పులి కుమార్(మోహన్‌లాల్) పులిని వేటాడడంలో ఎక్స్‌పర్ట్. ఆ గ్రామ ప్రజల్ని పులి బారి నుంచి కాపాడుతూ వుంటాడు. తండ్రిపై పులి దాడి చేసి తన కళ్ళ ముందే చంపెయ్యడంతో పగ పెంచుకున్న కుమార్ తన మావయ్య సాయంతో ఆ పులిని చంపేస్తాడు. తమ్ముడు సుబ్రహ్మణ్యం(విను మోహన్)ని సిటీలో చదివిస్తూ తను మాత్రం పులియేరు గ్రామానికే పరిమితమైపోతాడు. ఓ రోజు సిటీ నుంచి వచ్చిన సుబ్రహ్మణ్యం స్నేహితులు క్యాన్సర్‌కి సంబంధించిన మందుల్లో గంజాయి వాడతారని, దానికి భారీ మొత్తంలో గంజాయి కావాలని కుమార్ మావయ్యని అడుగుతారు. అలా గంజాయి డీల్ ఓకే అయిపోయిన తర్వాత సుబ్రహ్మణ్యంకి తన కంపెనీలోనే మంచి ఉద్యోగం ఇస్తాడు అతని స్నేహితుడు వంశీ(బాల). అయితే అనుకోకుండా ఈ గంజాయి కేస్‌లో కుమార్ ఇరుక్కుంటాడు. దానివల్ల చాలా సమస్యలు వస్తాయి. వీటన్నింటికీ మూల కారణం డాడీ గిరిజ(జగపతిబాబు). ఎవరీ డాడీ గిరిజ? అతని వల్ల కుమార్ ఫ్యామిలీకి ఎలాంటి సమస్యలు వచ్చాయి? కుమార్ వాటిని ఏవిధంగా సాల్వ్ చేశాడు? అనేది మిగతా కథ.
మనం ముందు చెప్పుకున్నట్టు మోహన్‌లాల్ అంటే పరిపూర్ణ నటుడు. ఇప్పటివరకు అతని కెరీర్‌లో యాక్షన్ పరంగా ది బెస్ట్ మూవీగా మన్యం పులి చిత్రాన్ని చెప్పుకోవచ్చు. యాక్షన్ పరంగా అతని పెర్‌ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆడియన్స్ చేత విజిల్స్ వేయించే స్థాయిలో అతను ఈ చిత్రంలో ఫైట్స్ చేశాడు. అతనికి జోడీగా కమలిని ముఖర్జీ ఓ సాధారణ గృహిణిగా తన పాత్ర పరిధిలో మెప్పించింది. కాలయాపన కోసం పెట్టిన ఓ ఎపిసోడ్‌లో నమిత తనదైన స్టైల్‌లో పెర్‌ఫార్మ్ చేసింది. ఈ చిత్రంతో మలయాళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జగపతిబాబు డాడీ గిరిజ ఓకే అనిపించాడు. క్యారెక్టర్ రెగ్యులర్ ఫార్మాట్‌లోనే వుండడం వల్ల పెర్‌ఫార్మెన్స్ పరంగా జగపతిబాబు గురించి ప్రత్యకంగా చెప్పుకునేందుకు ఏమీ లేదు.
టెక్నీషియన్స్‌లో ముందుగా చెప్పుకోవాల్సింది పీటర్ హెయిన్ గురించి. ప్రతి ఫైట్‌ని ఎంతో డిఫరెంట్‌గా డిజైన్ చేశాడు. రిస్కీ ఫైట్స్‌ని సైతం మోహన్‌లాల్ అద్భుతంగా చేశాడు. ముఖ్యంగా సెకండాఫ్ మధ్యలో వచ్చే ఫైట్, క్లైమాక్స్ ఫైట్ సినిమాకి పెద్ద హైలైట్ అయ్యాయి. ఇక సినిమాటోగ్రాఫర్ షాజికుమార్ చాలా కేర్ తీసుకొని విజువల్స్‌ని ఎంతో గ్రాండ్‌గా చూపించాడు. గోపీసుందర్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఈ చిత్రంలో పాటలు చాలా తక్కువైనా వున్నంతలో బాగానే చేశాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్స్‌ట్రార్డినరీ అనిపించేలా చేశాడు. సినిమాలో టైగర్ ఎపిసోడ్స్‌లో గోపీ చేసిన మ్యూజిక్ సూపర్బ్‌గా వుంది. సాధారణంగా మలయాళ సినిమాలు సినిమాటిక్‌గా వుండవని, నేచురాలిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని మనకు తెలుసు. అయితే మన్యం పులి విషయానికి వస్తే ఇది పూర్తిగా కమర్షియల్ ఫార్మాట్‌లో వుంది. నేచురాలిటీకి దగ్గరగా వున్న సన్నివేశాలు ఈ సినిమాలో తక్కువ. సి.జి.లో క్రియేట్ చేసిన పులితో చేసిన సీన్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్‌లోని నమిత ఎపిసోడ్, కామెడీ సీన్స్ సినిమా లెంగ్త్‌ని పెంచడానికి ఉపయోగపడ్డాయి తప్ప వాటి వల్ల ఆడియన్స్ ఎంటర్‌టైన్ అవ్వరు. మోహన్‌లాల్ పెర్‌ఫార్మెన్స్, పీటర్ హెయిన్ ఫైట్స్, షాజి కుమార్ సినిమాటోగ్రఫీ, గోపీసుందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, డైరెక్టర్ టేకింగ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ కాగా, సినిమా లెంగ్త్, అనవసరమైన సీన్స్, పూర్తి తమిళ నేటివిటీ మైనస్ అయ్యాయి. ఫైనల్‌గా చెప్పాలంటే మన్యం పులి చిత్రం మోహన్‌లాల్ వన్ మ్యాన్ షో. ఫస్ట్ హాఫ్‌లో అక్కడక్కడ బోర్ కొట్టడం, ఫస్ట్ హాఫ్ ఎండింగ్‌కి వచ్చినా అసలు కథలోకి రాకపోవడం, కామెడీకి అస్సలు నవ్వు రాకపోవడం మైనస్ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు.
ఫినిషింగ్ టచ్: మోహన్‌లాల్ ఒన్ మ్యాన్ షో
సినీజోష్ రేటింగ్: 2.75/5