నందమూరి తారక రామారావు ఆర్ట్స్
ఇజం
తారాగణం: కళ్యాణ్‌రామ్, అదితి ఆర్య, జగపతిబాబు, తనికెళ్ళ భరణి,
పోసాని, ఆలీ, వెన్నెల కిశోర్, ఈశ్వరీరావు, జయప్రకాష్‌రెడ్డి తదితరులు
సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి.
సంగీతం: అనూప్ రూబెన్స్
ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖి
నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్
రచన, దర్శకత్వం: పూరి జగన్నాథ్
విడుదల తేదీ: 21.10.2016
పూరి జగన్నాథ్ సినిమాలంటే ఆడియన్స్‌లో ఓ డిఫరెంట్ క్రేజ్ వుంటుంది. అతని సినిమాల టైటిల్స్, హీరో క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ కొత్తగా వుండడం, ప్రతి సినిమాకి డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌ని సెలెక్ట్ చేసుకోవడం వంటివి పూరి సినిమాలకు ప్లస్ అవుతూ వచ్చాయి. గత కొంతకాలంగా పూరి జగన్నాథ్ ఐడియాలజీలో చాలా మార్పులు రావడం, సొసైటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఎక్కువగా దృష్టి సారించడంతో అతని సినిమాల్లో కూడా మార్పు వచ్చింది. బిజనెస్‌మేన్, కెమెరామెన్ గంగతో రాంబాబు, టెంపర్ వంటి సినిమాలు ఆ కోవకే చెందుతాయి. తాజాగా నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా, నిర్మాతగా పూరి జగన్నాథ్ రూపొందించిన ఇజం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కళ్యాణ్‌రామ్, పూరి ఫస్ట్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి ఎక్స్‌పెక్టేషన్స్ వున్నాయి. కళ్యాణ్‌రామ్‌ని పూరి ఎలా చూపించాడు? పూరి స్కూల్‌లో కళ్యాణ్‌రామ్ ఏం నేర్చుకున్నాడు? ఇజంతో పూరి జగన్నాథ్ దేన్ని టార్గెట్ చేశాడు? ఈ సినిమా కళ్యాణ్‌రామ్‌కి ఎంతవరకు ఉపయోగపడుతుంది? వంటి విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
సొసైటీలోని అవినీతి పరుల అక్రమాలను బట్ట బయలు చేయడాన్ని ఎల్లో జర్నలిజం అనేవారు. అయితే ఇప్పుడున్న టెక్నాలజీ సాయంతో దాన్ని మించిన జర్నలిజాన్ని ఇజంలో చూపించాడు పూరి. కథ విషయానికి వస్తే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా పేరు తెచ్చుకున్న జావిద్ ఇబ్రహీం(జగపతిబాబు) ఇండియాలో పోలీసుల తాకిడి తట్టుకోలేక ఓ ఐలాండ్‌లో తలదాచుకుంటాడు. అక్కడే స్ట్రీట్ ఫైటర్‌గా ఎంట్రీ ఇస్తాడు మన హీరో కళ్యాణ్‌రామ్. ఆ టైమ్‌లో అలియాఖాన్(అదితి ఆర్య)ను చూసిన హీరో తనను ప్రేమించమంటూ వేధించడం మొదలు పెడతాడు. అసహ్యించుకుంటూనే అతని ప్రేమలో పడిపోతుంది అలియా. జావిద్‌తో కూడా పరిచయం పెంచుకుంటాడు కళ్యాణ్‌రామ్. కళ్యాణ్‌రామ్, అలియా ఖాన్, జావిద్‌ల మధ్య ఎన్నో సీన్లు జరిగిన తర్వాత ఓ ఫైన్ మార్నింగ్ కళ్యాణ్‌రామ్ ఆ ఐలాండ్ నుంచి జంప్ అవుతాడు. తను కళ్యాణ్‌ని ప్రేమిస్తున్నానని, అతన్ని వదిలి వుండలేనని అలియా కూడా ఇండియాకి బయల్దేరుతుంది. కట్ చేస్తే ది గ్రాండ్ లీకేజ్ అనే వెబ్‌సైట్ సొసైటీలోని అవినీతిని బయట పెట్టడమే పనిగా పెట్టుకుంటుంది. ఆ సైట్ ఎప్పుడు ఎవరి బండారం బయట పెడుతుందోనని అవినీతి పరులు వణికిపోతుంటారు. ఆ వెబ్‌సైట్‌ను రన్ చేస్తున్న వ్యక్తి ఓ జర్నలిస్ట్. అతని పేరు సత్యమార్తాండ్(కళ్యాణ్‌రామ్). సత్య మార్తాండ్ అందరి అవినీతిని బట్టబయలు చేయడానికి బలమైన కారణమేమిటి? అండర్ వరల్డ్ డాన్ జావిద్‌తో, అతని కూతురు అలియాతో సత్య ఎందుకు పరిచయం పెంచుకున్నాడు? ఇండియా వెళ్ళిన సత్య గ్రాండ్ లీకేజ్ వెబ్‌సైట్‌లో వెలుగులోకి తెచ్చిన అంశం ఏమిటి? దానివల్ల ఎలాంటి పరిణామాలు జరిగాయి? అనేది మిగతా కథ.
కళ్యాణ్‌రామ్‌గా, సత్యమార్తాండ్‌గా రెండు వేరియేషన్స్ వున్న క్యారెక్టర్‌లో కళ్యాణ్‌రామ్ పెర్‌ఫార్మెన్స్ బాగుంది. అతని మేకోవర్ సినిమాకి కొంత ప్లస్ అయింది. పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరో ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలాంటి డైలాగ్స్ చెప్తాడు అనేది అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో కళ్యాణ్‌రామ్ కూడా పూరి స్కూల్‌లో చేరిపోయాడు. ఫస్ట్ హాఫ్ అంతా చిల్లరగా వుండే క్యారెక్టర్‌లో, సెకండాఫ్‌లో ఓ జర్నలిస్ట్‌గా తన పెర్‌ఫార్మెన్స్‌తో పాస్ అయిపోయాడు. ముఖ్యంగా ప్రీ క్లెమాక్స్‌లో కోర్టులో అతని పెర్‌ఫార్మెన్స్, చెప్పిన డైలాగ్స్ అందర్నీ ఆకట్టుకుంటాయి. ఇక హీరోయిన్ అదితి ఆర్య చేసిన అలియా ఖాన్ క్యారెక్టర్‌కి కథపరంగా ఇంపార్టెన్స్ తక్కువ. హీరో తను కావాలనుకున్నది సాధించుకోవడానికి ఆమె క్యారెక్టర్ ఉపయోగపడింది తప్ప హీరోతో రొమాన్స్‌గానీ, ఆమె గ్లామర్‌ని ఎలివేట్ చేసే సీన్స్‌గానీ ఎక్కువగా లేకపోవడం వల్ల అదితి ఆర్యకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదనిపిస్తుంది. జావిద్‌గా నటించిన జగపతిబాబుకి కూడా సినిమాలో అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఓ అండర్ వరల్డ్ డాన్‌గా జావిద్‌ను మాటల్లో పరిచయం చేసినప్పటికీ అతని యాక్టివిటీస్ అంత సీరియస్‌గా లేకపోవడంతో ఆ క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా అనిపించలేదు. మిగతా క్యారెక్టర్స్‌లో పోసాని, తనికెళ్ళ భరణి, ఈశ్వరీరావు ఓకే అనిపించారు. వెన్నెల కిషోర్, ఆలీ అక్కడక్కడా నవ్వించడానికి విశ్వ ప్రయత్నం చేశారు. కానీ, వర్కవుట్ అవ్వలేదు.
టెక్నికల్‌గా చూస్తే సినిమాకి పెద్ద ప్లస్ ఫోటోగ్రఫీ. ముఖేష్ ప్రతి సీన్‌ని ఎంతో రిచ్‌గా, ఎంతో బ్రైట్‌గా చూపించాడు. కొత్త లొకేషన్స్ కావడంతో సినిమా అంతా చాలా గ్రాండియర్‌గా కనిపిస్తుంది. స్టార్టింగ్ టు ఎండింగ్ అదే స్టాండర్డ్‌ని మెయిన్‌టెయిన్ చేశాడు ముఖేష్. అనూప్ చేసిన పాటల్లో మూడు పాటలు ఆకట్టుకునేలా వున్నాయి. వాటి పిక్చరైజేషన్ గురించి చెప్పుకునేంత గొప్పగా మాత్రం లేవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను చాలా అద్భుతంగా చేశాడు. అతని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వల్ల చాలా సీన్స్ ఎలివేట్ అయ్యాయి. జునైద్ ఎడిటింగ్ కూడా బాగుంది. ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి. కళ్యాణ్‌రామ్ నిర్మాతగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదని ప్రతి సీన్‌లోనూ అర్థమవుతుంది. ఇక డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి చెప్పాల్సి వస్తే ది గ్రాండ్ లీకేజ్ పేరుతో వెబ్‌సైట్‌ని రన్ చేసే కళ్యాణ్‌రామ్ ఫారిన్‌లోని బ్యాంక్ ఆఫ్ ప్యారడైజ్‌లో ఎవరెవరు ఎంతెంత బ్లాక్ మనీ కూడబెట్టారు అనే వివరాలు సేకరించడానికి ఆ బ్యాంక్ నడుపుతున్న జావిద్ కూతురుతో పరిచయం పెంచుకోవడం, తద్వారా ఆ బ్యాంక్‌కి సంబంధించిన అకౌంట్స్‌ని హ్యాక్ చెయ్యడం, అందులో వున్న లక్షల కోట్ల రూపాయలను భారతదేశంలోని పేదవారి ఎకౌంట్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయడం ఇవన్నీ హీరోకి అనుకూలంగా జరిగిపోతాయి. హీరో చేస్తున్నది కరెక్టే అయినా విధానం తప్పు అని భావించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ ముందు తను అలా ఎందుకు చెయ్యాల్సి వచ్చింది అనేది వివరిస్తాడు. పూరి ఎంచుకున్న పాయింట్ కొత్తగానే వున్నా దాన్ని పర్‌ఫెక్ట్ వేలో చెప్పలేకపోవడం, అసలు కథలోకి వెళ్ళడానికి ఫస్ట్ హాఫ్ అంతా తీసుకోవడంతో ఫస్ట్ హాఫ్ అంతా బోర్‌గా అనిపిస్తుంది. అసలు కథ స్టార్ట్ అయ్యేది సెకండాఫ్‌లోనే. ప్రీ క్లైమాక్స్ వరకు సినిమా ఓకే అనిపిస్తుంది. కోర్ట్ సీన్‌తో సినిమా పూర్తయిందనుకున్న సినిమాను మరికాస్త సాగదీసి ఓ ఫైట్‌తో ఎండ్ చేశాడు పూరి. కోర్ట్ సీన్‌లో కళ్యాణ్‌రామ్ పెర్‌ఫార్మెన్స్ అతని కెరీర్‌లోనే బెస్ట్‌గా చెప్పొచ్చు. ఇజం చిత్రానికి కళ్యాణ్‌రామ్ లుక్, ఫోటోగ్రఫీ, పూరి డైలాగ్స్, అనూప్ మ్యూజిక్, కొత్త లొకేషన్స్ ప్లస్ పాయింట్స్ అయితే, ఫస్ట్ హాఫ్ అంతా అసలు కథలోకి వెళ్ళకుండా హీరో, హీరోయిన్ మధ్య సీన్స్‌తో టైమ్ పాస్ చెయ్యడం, పూరి మార్క్ కామెడీ లేకపోవడం, హీరో, హీరోయిన్ మధ్య రొమాన్స్‌గానీ, రొమాంటిక్ సిట్యుయేషన్స్‌గానీ లేకపోవడం మైనస్ అయ్యాయి. పాయింట్ కొత్తదే అయినా ఒక సగటు ప్రేక్షకుడికి అది ఎంతవరకు అర్థమవుతుందనేదే పాయింట్. దాన్ని కూడా సెకండాఫ్‌కే పరిమితం చేసి అసలు కథంతా సెకండాఫ్‌లో చూపించేయడంతో ఫస్ట్‌హాఫ్ డమ్మీగా మారిపోయింది. ఫైనల్‌గా చెప్పాలంటే కళ్యాణ్‌రామ్‌తో పూరి జగన్నాథ్ చేసిన ఈ కొత్త ప్రయత్నం ప్రేక్షకులకు ఎంత వరకు రీచ్ అవుతుందనేది ప్రశ్నార్థకమే.
ఫినిషింగ్ టచ్: నథింగ్ బట్ రిచ్‌నెస్
సినీజోష్ రేటింగ్: 2.5/5