కోన ఫిల్మ్ కార్పొరేషన్, ప్రభుదేవా స్టూడియోస్, ఎం.వి.వి. సినిమా ప్రొడక్షన్
అభినేత్రి
తారాగణం: ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్, సప్తగిరి, మురళీశర్మ, పృథ్వీ,
ఎమీ జాక్సన్, జాయ్ మాథ్యూ, హేమ తదితరులు
సినిమాటోగ్రఫీ: మనూష్ నందన్
సంగీతం: సాజిద్, వాజిద్, విశాల్ మిశ్రా
ఎడిటింగ్: ఆంటోని
కథ: విజయ్, పాల్ అరోన్
మాటలు: కోన వెంకట్
నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్
విడుదల తేదీ: 07.10.2016
ఆమె పేరు రూబి. హీరోయిన్ అవ్వాలన్నది ఆమె కల. తనని పొగడ్తలతో ముంచెత్తాలని, తన అభినయానికి అందరూ చప్పట్లు కొట్టాలని ఎంతో ఆశతో ముంబైలో అడుగుపెడుతుంది. అక్కడ టాప్ హీరో అయిన రాజ్‌ఖన్నా పక్కన హీరోయిన్‌గా నటించే అవకాశం వస్తుంది. కానీ, ఆ సినిమా ఆగిపోతుంది. దాంతో మనస్తాపం చెందిన రూబి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె కల కలగానే మిగిలిపోతుంది. తీరని కోరికతో ఆమె ఆత్మ ఆ ఇంటిలోనే తిరుగుతుంటుంది. కొత్తగా పెళ్ళయిన కృష్ణ(ప్రభుదేవా), దేవి(తమన్నా) ఆ ఇంట్లోకి కాపురానికి వస్తారు. అందానికి మారు పేరుగా వున్న దేవి శరీరంలోకి రూబి ప్రవేశిస్తుంది. హీరోయిన్ అవ్వాలన్న తన కలని నిజం చేసుకోవాలనుకుంటుంది. ఇదీ ఈ శుక్రవారం విడుదలైన అభినేత్రి కథ. ప్రభుదేవా, తమన్నా, సోనూ సూద్ ప్రధాన పాత్రల్లో విజయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నిర్మించారు. హార్రర్‌తోపాటు కాస్త కామెడీని, మరికొంత ఫ్యామిలీ సెంటిమెంట్‌ని కలిపి రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని కలిగించింది? ఈమధ్యకాలంలో హార్రర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
పేరుకి ఇది హార్రర్ సినిమా అయినా భయపెట్టే సన్నివేశాలుగానీ, థ్రిల్ చేసే సీన్స్‌గానీ ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో లేవన్నది సినిమా చూసిన వారందరికీ అర్థమవుతుంది. పోష్‌గా వుండే అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని కలలు కనే కృష్ణ తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళు చూసిన దేవిని చేసుకోవాల్సి వస్తుంది. ఎలాగైనా దేవిని వదిలించుకోవాలనుకుంటాడు. అదే సమయంలో దేవిని రూబి ఆత్మ ఆవహించడం, ఆమె ప్రవర్తన విచిత్రంగా వుండడం, ఓ హీరోయిన్‌లా బిహేవ్ చేయడం చూసి షాక్ అవుతాడు కృష్ణ. అనుకోకుండా దేవికి రాజ్ ఖన్నా పక్కన హీరోయిన్‌గా నటించే అవకాశం వస్తుంది. హీరోయిన్‌గా తనను తాను తెరపై చూసుకోవాలన్నది తన కోరికని, ఆ కోరిక తీరగానే దేవి శరీరాన్ని వదిలి వెళ్ళిపోతానని చెప్తుంది దేవిని ఆవహించిన రూబి. అలాగని అగ్రిమెంట్ కూడా రాసి ఇస్తుంది. చేసేది లేక దానికి ఒప్పుకుంటాడు కృష్ణ. సినిమా రిలీజ్ అయిన తర్వాత రూబికి హీరోయిన్‌గా మంచి పేరు వస్తుంది. తనకి ఆ పేరు శాశ్వతంగా కావాలని, దేవి శరీరాన్ని వదిలి వెళ్ళనంటుంది రూబి. దానికి కృష్ణ ఎలా రియాక్ట్ అయ్యాడు? రూబి నుంచి తన భార్యను రక్షించుకోగలిగాడా? దేవి తిరిగి మామూలు మనిషి అయ్యిందా? అనేది మిగతా కథ.
ఈ కథలో ఆసక్తికరమైన అంశాలుగానీ, నెక్స్‌ట్ సీన్‌లో ఏం జరగబోతోందనే క్యూరియాసిటీగానీ కనిపించవు. ప్రతి సీన్ చాలా నార్మల్‌గా వుంటుంది. రూబి ఆత్మ చేసే విన్యాసాలుగానీ, విచిత్రాలుగానీ చాలా సాదా సీదాగా వుంటాయి. హార్రర్ సినిమా అంటే లెక్కకు మించిన థ్రిల్స్ ఆశించే ప్రేక్షకులకు నిరాశే ఎదురవుతుంది. అయితే మధ్య మధ్యలో ప్రభుదేవా, సప్తగిరి కాంబినేషన్‌లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ మాత్రం నవ్వుకోవడానికి ఉపయోగపడతాయి. ఆత్మను వదిలించే స్పెషలిస్ట్‌గా పృథ్వీ చేసిన కామెడీ ఏమాత్రం నవ్వు తెప్పించదు. ప్రభుదేవా పెర్‌ఫార్మెన్స్, డాన్స్ బాగున్నాయి. దేవిగా, రూబిగా రెండు వేరియేషన్స్ వున్న క్యారెక్టర్‌ని తమన్నా చాలా సెటిల్డ్‌గా చేసింది. హీరో రాజ్‌ఖన్నాగా సోనూసూద్ నటన కూడా ఆకట్టుకుంటుంది. అక్కడక్కడా అతనితో కూడా చేయించిన కామెడీ బాగుంది.
ఈ సినిమాకి వున్న టెక్నికల్ ఎస్సెట్స్ గురించి చెప్పాలంటే మనూష్ నందన్ ఫోటోగ్రఫీ బాగుంది అయితే అక్కడక్కడా కొన్ని సీన్స్ చాలా డల్‌గా అనిపిస్తాయి. అందరి ముఖాలు బ్రైట్‌గా కనిపించినా ప్రభుదేవాలో మాత్రం ఆ బ్రైట్‌నెస్ కనిపించదు. సినిమాలోని అందరి కంటే డల్‌గా కనిపించే ఫేస్ ప్రభుదేవాదే. సినిమాలోని పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుందనిపిస్తుంది. కోన వెంకట్ రాసిన మాటలు కూడా అంతగా ఆకట్టుకోవు. 70 కోట్లతో మూడు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని బాగా పబ్లిసిటీ చేసినప్పటికీ సినిమాలో అంత ఖర్చు మనకు ఎక్కడా కనిపించదు. చాలా సాదా సీదాగా వుండే బ్యాక్‌డ్రాప్‌తో తీసిన ఈ సినిమాని చూస్తే 70 కోట్ల ఖర్చు ఎక్కడ? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతుంది. ఇక డైరెక్టర్ విజయ్ గురించి చెప్పాలంటే పాల్ అరోన్‌తో కలిసి అతను రాసుకున్న కథలో కొత్తదనం అంటూ ఏమీ కనిపించదు. రెండు గంటలపాటు ప్రేక్షకులు కదలకుండా సినిమా చూసేంత విషయం కథలో లేదు. దానికి తగ్గట్టుగానే కథనం కూడా అంతంత మాత్రమే వుంది. దేవిలో రూబి ఆత్మ వుందని కృష్ణ తెలుసుకునే ఇంటర్వెల్ సీన్‌గానీ, దేవిని రూబి వదిలి వెళ్ళిపోయే క్లైమాక్స్‌గానీ చాలా మామూలుగా వుంటుంది తప్ప ఆహా అనిపించదు. ఆత్మహత్య చేసుకున్న రూబీ సినిమాలో మనకు ఎక్కడా కనిపించదు. చాలా గ్యాప్ తర్వాత ప్రభుదేవా తెలుగులో చేసిన సినిమా కావడం, గ్లామర్‌స్టార్ తమన్నా టైటిల్ రోల్‌లో నటించడం, దేవిగా, రూబిగా రెండు విభిన్నమైన క్యారెక్టర్స్ చేయడం సినిమాకి వున్న ప్లస్ పాయింట్స్. ఫైనల్‌గా చెప్పాలంటే తమన్నా ప్రధాన పాత్రలో ఓ కొత్త కథాంశంతో రూపొందింది అంటూ చేసిన పబ్లిసిటీతో సినిమాలో ఏదో కొత్తదనం వుంది, తప్పకుండా తమని థ్రిల్ చేస్తుందని ఆశించే ప్రేక్షకులను అభినేత్రి నిరాశ పరుస్తుంది.
ఫినిషింగ్ టచ్: అభినేత్రికి అంత సీన్ లేదు
సినీజోష్ రేటింగ్: 2.5/5