Advertisementt

సినీజోష్‌ రివ్యూ: ప్రేమమ్‌

Fri 07th Oct 2016 08:16 PM
telugu movie premam,telugu movie premam review,premam movie review in cinejosh,premam cinejosh review,naga chaitanya in premam  సినీజోష్‌ రివ్యూ: ప్రేమమ్‌
సినీజోష్‌ రివ్యూ: ప్రేమమ్‌
Advertisement
Ads by CJ

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 

ప్రేమమ్‌ 

తారాగణం: నాగచైతన్య, శృతిహాసన్‌, అనుపమ పరమేశ్వరన్‌, 

మడోన్నా సెబాస్టియన్‌, ప్రవీణ్‌, బ్రహ్మాజీ, పృథ్వీ, 

చైౖతన్యకృష్ణ, శ్రీనివాసరెడ్డి, నోయల్‌, నర్రా శ్రీను తదితరులు 

స్పెషల్‌ అప్పియరెన్స్‌: కింగ్‌ నాగార్జున, విక్టరీ వెంకటేష్‌ 

సినిమాటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని 

సంగీతం: గోపీ సుందర్‌, రాజేష్‌ మురుగేశన్‌ 

ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు 

కథ: అల్ఫాన్స్‌ పుతరెన్‌ 

సమర్పణ: పి.డి.వి.ప్రసాద్‌ 

నిర్మాత: సూర్యదేవర నాగవంశీ 

స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: చందూ మొండేటి 

విడుదల తేదీ: 07.10.2016 

కథల్లో చిరస్థాయిగా నిలిచిపోయేవి ప్రేమ కథలు. ప్రేమకు కొత్త అర్థం చెప్పే ప్రయత్నం ప్రతి రచయితా చేస్తాడు. ముఖ్యంగా సినిమాల్లో ఒక్కో దర్శకుడు ఒక్కోలా ప్రేమ కథల్ని విభిన్నంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారు. అయితే కొన్ని ప్రేమ కథలు మాత్రమే హృదయానికి హత్తుకుంటాయి. అలా ఆ చిత్రాలు మనకు గుర్తుండిపోతాయి. ఈమధ్యకాలంలో అలాంటి హృద్యమైన ప్రేమకథలు సినిమాల్లో కనిపించడం లేదనే చెప్పాలి. ప్రేక్షకులు మర్చిపోయిన ఆ తరహా ప్రేమకథని మరోసారి గుర్తు చేసింది ప్రేమమ్‌. మలయాళంలో విశేష ప్రేక్షకాదరణ పొందిన ప్రేమమ్‌ చిత్రాన్ని నాగచైతన్య హీరోగా చందూ మొండేటి తెలుగులో రూపొందించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో అందరి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు మెచ్చేలా రూపొందించడంలో చందూ మొండేటి సక్సెస్‌ అయ్యాడా? కథలోని వేరియేషన్స్‌కి తగ్గట్టుగా నాగచైతన్య నటన ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

ప్రేమమ్‌ అనేది ఒక లవ్‌ జర్నీ. విక్రమ్‌(నాగచైతన్య) అనే కుర్రాడి ప్రేమ కథలే ఈ సినిమా. టెన్త్‌ పూర్తయిన తర్వాత టెన్త్‌ క్లాస్‌ చదివే సుమ(అనుపమ పరమేశ్వరన్‌) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను పొందాలని ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు. కానీ, విక్రమ్‌.. సుమ దృష్టిలో పడతాడు. తనని చూడడమే కష్టం అనుకుంటున్న టైమ్‌లో అతనితో మాట్లాడుతుంది. ఇంటికి వస్తానంటుంది. వస్తూ తన బాయ్‌ఫ్రెండ్‌ని తీసుకొస్తుంది. ఇది చూసి షాక్‌ అవుతాడు విక్రమ్‌. తను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి మరొకరిని ప్రేమించడం తట్టుకోలేకపోతాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి సుమని మర్చిపోతాడు. ఇంజనీరింగ్‌ కాలేజీలో రెండో చాప్టర్‌ స్టార్ట్‌ అవుతుంది. ఆ కాలేజీకి లెక్చరర్‌గా వచ్చిన సితార(శృతి హాసన్‌)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కొంతకాలానికి విక్రమ్‌, సితార మంచి ఫ్రెండ్స్‌ అయిపోతారు. అతని ప్రేమను సితార యాక్సెప్ట్‌ చేస్తుంది. హాలీడేస్‌కి ఊరికి వెళ్ళిన సితారకి యాక్సిడెంట్‌ జరుగుతుంది. దాంతో గతాన్ని మర్చిపోతుంది. ఎదురుగా వున్న విక్రమ్‌ని కూడా కొత్తవాడిలా చూస్తుంది. ఆ తర్వాత ఆమెకు పెళ్ళయిపోతుంది. అక్కడితో ఆ అధ్యాయం ముగిసిపోతుంది. మూడో చాప్టర్‌ 2016లో స్టార్ట్‌ అవుతుంది. అప్పటికి స్టడీ కంప్లీట్‌ చేసిన విక్రమ్‌ కుకింగ్‌లో స్పెషలిస్ట్‌ కావడంతో ఓ రెస్టారెంట్‌ని స్టార్ట్‌ చేసి చాలా పాపులర్‌ అయిపోతాడు. అలా సితారని కూడా మర్చిపోతాడు. ఓరోజు రెస్టారెంట్‌కి వచ్చిన ఓ అమ్మాయి తన ఫ్యాన్‌ అని తెలుసుకుంటాడు విక్రమ్‌. గతంలో తను ప్రేమించిన సుమకి లవ్‌ లెటర్‌ని ఆ అమ్మాయి ద్వారా పంపిస్తాడు. ఆ అమ్మాయి పేరు సింధు(మడోన్నా సెబాస్టియన్‌). ఆ లవ్‌ లెటర్‌ సుమకి ఇవ్వకుండా తనే చదువుతుంది. అందులోని కవితలకు చిన్నప్పుడే ఫ్యాన్‌ అయిపోతుంది. అలా విక్రమ్‌, సింధుల మధ్య ఫ్రెండ్‌షిప్‌ స్టార్ట్‌ అవుతుంది. ఆ క్రమంలోనే సింధుని ప్రేమిస్తాడు విక్రమ్‌. ప్రేమ విషయంలో రెండు సార్లు విఫలమైన విక్రమ్‌కి ఈసారి ఎలాంటి అనుభవం ఎదురైంది? ఈసారైనా అతని ప్రేమ ఫలించిందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

15 సంవత్సరాల క్రితం మొదలయ్యే మొదటి ప్రేమ కథ నుంచి ప్రజెంట్‌గా జరిగే ప్రేమ కథ వరకు ఎన్నో వేరియేషన్స్‌ కనిపిస్తాయి. మూడు చాప్టర్స్‌లో హీరో లుక్‌గానీ, బాడీ లాంగ్వేజ్‌గానీ పూర్తి విభిన్నంగా వుంటాయి. ఆ వేరియేషన్స్‌ని ప్రజెంట్‌ చెయ్యడంలో నాగచైతన్య హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడు. టీనేజ్‌లో వున్న కుర్రాడి ఆలోచనలు ఎలా వుంటాయి? అతని బాడీ లాంగ్వేజ్‌ ఎలా వుంటుంది? అతని చేష్టలు ఎలా వుంటాయి? అనేది ప్రజెంట్‌ యూత్‌కి కనెక్ట్‌ అయ్యేలా, పెద్ద వాళ్ళు తమ జ్ఞాపకాల్ని నెమరు వేసుకునేలా వుంటాయి. ఆ తర్వాత కాలేజీలో మరో లుక్‌తో కాస్త డిగ్నిఫైడ్‌గా, కాస్త అల్లరిగా కనిపించే విక్రమ్‌ ప్రజెంట్‌ కాలేజీ కుర్రాళ్ళకి కనెక్ట్‌ అయ్యేలా వుంటాడు. ఇంజనీరింగ్‌ పూర్తయి బిజినెస్‌ చేసే విక్రమ్‌ మెచ్యూర్డ్‌ గైలా మరింత డిగ్నిఫైడ్‌గా కనిపిస్తాడు. ఇన్ని రకాల వేరియేషన్స్‌ వున్న విక్రమ్‌ క్యారెక్టర్‌ని నాగచైతన్య ఎంతో ఇన్‌వాల్వ్‌ అయి చేశాడు. తన ప్రేమ విఫలమైన సందర్భాల్లో చైతు నటన చాలా నేచురల్‌గా అనిపిస్తుంది. విక్రమ్‌ చిన్నప్పటి లవర్‌గా అనుపమ పరమేశ్వరన్‌ ఎంతో క్యూట్‌గా కనిపించింది. లెక్చరర్‌గా సితార చేసిన క్యారెక్టర్‌ ఎంతో డిగ్నిఫైడ్‌గా అనిపిస్తుంది. నాగచైతన్య, శృతిహాసన్‌ మధ్య వచ్చే సీన్స్‌లో ఇద్దరూ అద్భుతమైన నటనని ప్రదర్శించారు. హీరోకి మూడో లవర్‌ సింధుగా నటించిన మడోన్నా సెబాస్టియన్‌ కూడా తన క్యారెక్టర్‌ని బాగా చేసింది. హీరో ఫ్రెండ్స్‌గా నటించిన ప్రవీణ్‌, శ్రీనివాసరెడ్డి, చైతన్యకృష్ణ కూడా అందర్నీ ఆకట్టుకుంటారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే శ్రీనివాసరెడ్డి క్యారెక్టర్‌ మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆడియన్స్‌ రిలాక్స్‌ అయ్యేలా చేసింది. విక్టరీ వెంకటేష్‌ స్పెషల్‌ అప్పియరెన్స్‌ సినిమాకి కొంత ఎనర్జీనిచ్చింది. అలాగే క్లైమాక్స్‌లో హీరో తండ్రిగా నాగార్జున ఎంట్రీ అందర్నీ సర్‌ప్రైజ్‌ చేస్తుంది. 

ఈ అందమైన ప్రేమకథని అందంగా చూపించడంలో సినిమాటోగ్రాఫర్‌ కార్తీక్‌ ఘట్టమనేని ఎఫర్ట్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ప్రతి సీన్‌ని ఎంతో అందంగా చూపించి సినిమాకి మరింత అందాన్ని తీసుకొచ్చాడు. ముఖ్యంగా ఆర్టిస్టులందర్నీ అందంగా చూపించి ఆడియన్స్‌కి కన్నుల విందు చేశాడు. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించిన గోపిసుందర్‌, రాజేష్‌ మురుగేశన్‌ సిట్యుయేషన్‌కి తగ్గ పాటలతో అలరించారు. ప్రత్యేకంగా వచ్చే పాటలు కాకుండా కథతోపాటే వచ్చే పాటలు కావడంతో ఎంతో రిలీఫ్‌గా అనిపిస్తుంది. అలాగే ప్రతి సీన్‌ ఎలివేట్‌ అయ్యేలా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్‌ కూడా బాగానే వుంది. అయితే ఫస్ట్‌ హాఫ్‌లో, సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌ ల్యాగ్‌ అనిపించడం వల్ల ఆడియన్స్‌ బోర్‌ ఫీల్‌ అయ్యే అవకాశం వుంది. వాటిని ట్రిమ్‌ చేసి వుంటే బాగుండేది. ఇక డైరెక్టర్‌ చందూ మొండేటి గురించి చెప్పాలంటే.. ఒక భాషలో సూపర్‌హిట్‌ అయిన ఇలాంటి ప్రేమ కథని తెలుగులో రీమేక్‌ చెయ్యడానికి ముందుకు రావడం సాహసంతో కూడుకున్న నిర్ణయమే. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందిన కార్తికేయతో దర్శకుడుగా పరిచయమైన చందూ.. తన రెండో సినిమాతో ఎంతో బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. ప్రేమమ్‌ ఒరిజినల్‌ ఫ్లేవర్‌ని చెడగొట్టకుండా సవ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో చందూ చాలా వరకు సక్సెస్‌ అయ్యాడు. అయితే సినిమా స్టార్ట్‌ అవ్వడమే స్లో నేరేషన్‌తో స్టార్ట్‌ అవ్వడం, కొన్ని సీన్స్‌ లెంగ్తీగా అనిపించడం, సినిమా నిడివి కోసం కొన్ని అనవసరమైన సీన్స్‌ని ఇరికించడం వల్ల ఆడియన్స్‌ అక్కడక్కడా బోర్‌ ఫీల్‌ అయ్యే అవకాశం వుంది. ఓవరాల్‌గా చూస్తే ఫస్ట్‌ హాఫ్‌ కంటే సెకండాఫ్‌ గ్రిప్పింగ్‌గా వుందని చెప్పొచ్చు. చందూ రాసుకున్న డైలాగ్స్‌ కూడా కథకి, సీన్స్‌కి తగ్గట్టుగా వున్నాయి తప్ప ఎక్కడా ఓవర్‌ అనిపించవు. ఆర్టిస్టుల నుంచి తనకు కావాల్సిన పెర్‌ఫార్మెన్స్‌ రాబట్టుకోవడంలో చందూ హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడు. ఏ మాయ చేసావె తర్వాత మళ్ళీ అలాంటి ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీ జోలికి వెళ్ళని నాగచైతన్యకి ప్రేమమ్‌ మరో మంచి లవ్‌ ఫీల్‌ వున్న సినిమాగా మిగిలిపోతుంది. ఫైనల్‌గా చెప్పాలంటే యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌, యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్స్‌, హార్రర్‌ కామెడీ.. ఇలా రకరకాల సినిమాలు చూసి చూసి రొటీన్‌ ఫీల్‌ అయ్యే ఆడియన్స్‌కి ప్రేమమ్‌ ఒక ఫ్రెష్‌ ఫీల్‌ని కలిగిస్తుంది. మంచి ప్రేమ కథల్ని ఇష్టపడే వారికి చక్కని అనుభూతిని కలిగిస్తుంది. ప్రేమ కథలు ముగుస్తాయి. కానీ, ఆ ప్రేమ వాళ్ళ కలిగే  ఫీలింగ్స్ కాదు అని చెప్పే ఈ చిత్రం చక్కని ఫీల్ ను ఇస్తుంది. అక్కడక్కడా స్లో నేరేషన్‌ ఇబ్బంది పెట్టినా ఓవరాల్‌గా ఒక మంచి సినిమా చూశామన్న శాటిస్‌ఫాక్షన్‌ ఆడియన్స్‌కి కలిగించే చిత్రం ప్రేమమ్‌. 

ఫినిషింగ్‌ టచ్‌: ఎ బ్యూటిఫుల్‌ లవ్‌ జర్నీ 

సినీజోష్‌ రేటింగ్‌: 3/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ