Advertisementt

సినీజోష్‌ రివ్యూ: నిర్మలా కాన్వెంట్‌

Fri 16th Sep 2016 07:13 PM
telugu movie nirmala convent,nagarjuna in nirmala convent,nirmala convent movie review,nirmala convent review in cinejosh,nirmala convent cinejosh review,roshan,shriya sharma  సినీజోష్‌ రివ్యూ: నిర్మలా కాన్వెంట్‌
సినీజోష్‌ రివ్యూ: నిర్మలా కాన్వెంట్‌
Advertisement
Ads by CJ

అన్నపూర్ణ స్టూడియోస్‌, మాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌, కాన్సెప్ట్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ 

నిర్మలా కాన్వెంట్‌ 

తారాగణం: అక్కినేని నాగార్జున, రోషన్‌, శ్రీయాశర్మ, ఆదిత్య మీనన్‌, సూర్య, అనితా చౌదరి, సత్యకృష్ణ, తాగుబోతు రమేష్‌, సమీర్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి.విశ్వేశ్వర్‌ 

సంగీతం: రోషన్‌ సాలూరి 

నిర్మాతలు: నిమ్మగడ్డ ప్రసాద్‌, అక్కినేని నాగార్జున 

రచన, దర్శకత్వం: జి.నాగకోటేశ్వరరావు 

విడుదల తేదీ: 16.09.2016 

హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా పరిచయమవుతున్న సినిమా నిర్మలా కాన్వెంట్‌. ఈ సినిమాకి చాలా ప్రత్యేకతలు వున్నాయి. అవేమిటంటే నిన్న మొన్నటి వరకు ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కనిపించిన శ్రీయా శర్మ హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్‌ అవ్వడం, సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్‌ సాలూరి ఈ సినిమాకి మ్యూజిక్‌ చెయ్యడం, ఎ.ఆర్‌.రెహమాన్‌ తనయుడు సింగర్‌గా పరిచయం కావడం, వీటన్నింటినీ మించి నాగార్జున ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి ఈ సినిమాలో ఓ స్పెషల్‌ క్యారెక్టర్‌ చెయ్యడం, అంతే కాకుండా మొదటి సారి ఓ పాట కూడా పాడడం, ఎప్పుడూ సినిమాల నిర్మాణం జోలికి రాని నిమ్మగడ్డ ప్రసాద్‌ ఈ చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరించడం... ఇలా ఈ సినిమాకి సంబంధించి అన్నీ ప్రత్యేకతలే. ఇన్ని స్పెషాలిటీస్‌ వున్న ఈ సినిమా కోసం ఎంచుకున్న కథలో ఏదైనా ప్రత్యేకత వుందా? నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారంటే ఏదో వుంది అని అందరూ అనుకుంటారు. నిజంగానే ఈ సినిమాలో అంత విషయం వుందా? రోషన్‌ హీరోగా ఈ సినిమాలో ఎలా కనిపించాడు? డైరెక్టర్‌ నాగకోటేశ్వరరావు తన మొదటి సినిమాని ఎలా తెరకెక్కించాడు? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

అబ్బాయి వయసు 16, అమ్మాయి వయసూ 16. ఇద్దరూ టీనేజ్‌లో వున్నారు. వారిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ఓ ప్రేమ కథ తయారైంది. ఇద్దరూ చిన్న పిల్లల్లా వున్నారు, ఫ్రెష్‌గా వున్నారు. కాబట్టి ఇది ఫ్రెష్‌ లవ్‌స్టోరీ. తెలిసీ తెలియని వయసులో, అదీ పదహారు సంవత్సరాల వయసులో పుట్టేది ప్రేమ కాదని, అది ప్రేమంటే ఏమిటో అర్థం చేసుకునే వయసు కూడా కాదని ఆ వయసు క్రాస్‌ చేసిన ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ, ఆ వయసులోనే ప్రేమలు, ముద్దులు, మురిపాలు. వీటన్నింటినీ మించి ప్రేమను గెలుచుకోవడానికి ఛాలెంజ్‌లు. దాని కోసం సామాన్యుడి ఊహకి కూడా అందని విధంగా హీరో చెప్పింది చెయ్యడం. ఇవన్నీ సినిమాల్లోనే సాధ్యమవుతాయి కానీ, నిజజీవితంలో కాదు అని మరోసారి చాటి చెప్పిన సినిమా నిర్మలా కాన్వెంట్‌. 

సమీక్షలోకి వెళ్ళే ముందు ఇంత ఉపోద్ఘాతం రాయడానికి కారణం...సినిమా చూసిన ప్రేక్షకుడి వ్యధ ఎలా వుంటుంది? సినిమా చూస్తున్నంత సేపు స్క్రీన్‌ మీద ఎన్ని ఉపద్రవాలు జరుగుతున్నా, నటీనటులు తమ విన్యాసాలతో ఎంతలా ఆడుకున్నా, డైరెక్టర్‌ తన పైత్యాన్ని మనపై రుద్దినా చివరి వరకు సినిమాని భరించి థియేటర్‌ బయటకు రావడం అంటే మామూలు విషయం కాదు కదా. ఈరోజు విడుదలైన నిర్మలా కాన్వెంట్‌ సినిమా చూసిన తర్వాత కూడా ప్రేక్షకులు ఇలాగే స్పందిస్తారు. ఎందుకంటే ఈ సినిమా కథ, కథనాలు అంత సిల్లీగా వుంటాయి మరి. 

భూపతినగరంలో ఓ రాజుగారు. ఆయనకు 99 ఎకరాల పొలం. ఈ పొలానికి వీరిగాడి(ఎల్‌.బి.శ్రీరాం) ఎకరం పొలం నుంచే నీళ్ళు రావాలి. ఆ పొలాన్ని కొనాలని రాజుగారు, అమ్మేది లేదని వీరిగాడు పట్టుదలగా వుంటారు. రాజుగారి పట్టుదల పెరగడంతో వీరిగాడు బలైపోతాడు. పోతూ పోతూ ప్రాణం పోయినా పొలం అమ్మొద్దని కొడుకు డేవిడ్‌(సూర్య) దగ్గర మాట తీసుకుంటాడు. కట్‌ చేస్తే.. అది నిర్మలా కాన్వెంట్‌. అందులో చదువుకునే సామ్యూల్‌(రోషన్‌), శాంతి(శ్రీయా శర్మ)ల మధ్య ప్రేమ రాజుకుంటుంది. ఆ ప్రేమ శాంతి తండ్రి భూపతిరాజు(ఆదిత్య మీనన్‌)కి తెలుస్తుంది. దాంతో సామ్యూల్‌కి దేహశుద్ది జరుగుతుంది. శాంతి అంటే తనకు ప్రాణమని, ఎలాగైనా భూపతిరాజుతో తమ ఇద్దరి పెళ్ళి విషయం మాట్లాడమని తండ్రిని పంపిస్తాడు సామ్యూల్‌. తన కూతుర్ని సామ్యూల్‌కి ఇచ్చి పెళ్ళి చెయ్యాలంటే ఆ ఎకరం పొలం తనకు అమ్మాలని కండీషన్‌ పెడతాడు భూపతిరాజు. డేవిడ్‌ సంతకం పెట్టిన తర్వాత తనకు పది ఊళ్ళల్లో పలుకుబడి వుందని, తను కోటీశ్వరుడినని, తన స్థాయికి వచ్చిన తర్వాత సంబంధం మాట్లాడడానికి రమ్మని డేవిడ్‌ని పంపిస్తాడు భూపతిరాజు. విషయం తెలుసుకున్న సామ్యూల్‌ ఇంట్లో చెప్పకుండా సిటీకి బయల్దేరతాడు. సిటీకి వచ్చిన సామ్యూల్‌ ఏం చేశాడు? ఎవర్ని కలుసుకున్నాడు? తన ప్రేమను గెలుచుకోవడానికి అతను ఎంచుకున్న మార్గం ఏమిటి? చివరికి తన శాంతిని దక్కించుకున్నాడా? అనేది మిగతా కథ. 

తెలుగు ఇండస్ట్రీకి నిర్మలా కాన్వెంట్‌తో పరిచయమవుతున్న రోషన్‌ పెర్‌ఫార్మెన్స్‌ పరంగా ఓకే అనిపించుకున్నాడు. కానీ, హీరో అనిపించుకోవడానికి ఇంకా టైమ్‌ పడుతుంది. ఇప్పటివరకు మనకు ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గానే తెలిసిన శ్రీయాశర్మ ఈ సినిమాలో హీరోయిన్‌ అయినప్పటికీ మనకి చిన్న పిల్లలాగే కనిపిస్తుంది. ఇక మిగతా క్యారెక్టర్స్‌లో చెప్పుకోవాల్సింది ఒక్క నాగార్జున గురించే. ఈ సినిమాలో తను చేసినది ఓ కీలకమైన క్యారెక్టర్‌ అని, హీరోని గెలిపించే క్యారెక్టర్‌ అని తన ఇంటర్వ్యూల్లో చెప్పారు. అయితే బుల్లితెరపై మీలో ఎవరు కోటీశ్వరుడులో ఈ క్యారెక్టర్‌ని ఆల్రెడీ చాలా సార్లు చేసేశారు నాగార్జున. ఈ సినిమాలో కూడా అదే తరహా క్యారెక్టర్‌ కావడంతో ప్రేక్షకులు ఎలాంటి థ్రిల్‌ ఫీల్‌ అవ్వరు. ఒక పెద్ద హీరో సినిమాలో వున్నాడు అని చెప్పుకోవడానికి తప్ప సినిమాకి దాని వల్ల ఒరిగేదేమీ వుండదు. 

సాంకేతిక పరంగా సినిమాలో చెప్పుకోవడానికి విశ్వేశ్వర్‌ ఫోటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి అందాల్ని వీలైనంత అందంగా చూపించే ప్రయత్నం చేశాడు. రోషన్‌ సాలూరి చేసిన పాటల్లో కొత్త కొత్త భాష అనే పాట తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌లో రణగొణ ధ్వని ఎక్కువగా వినిపిస్తుంది తప్ప అందులో క్లారిటీ అనేది లేదు. డైరెక్టర్‌ గురించి చెప్పాలంటే అతను రాసుకున్న సిల్లీ కథ ఇది. తేజ 15 సంవత్సరాల క్రితం జయం సినిమా చేశాడు. మళ్ళీ మొన్నీమధ్య హోరాహరీ పేరుతో మరో సినిమా చేశాడు. 15 సంవత్సరాల క్రితం తేజ రాసుకున్న కథకంటే ఘోరంగా హోరా హోరీ రాసుకున్నాడు. దాన్ని మించేలా నిర్మలా కాన్వెంట్‌ కథని డైరెక్టర్‌ నాగకోటేశ్వరరావు రాసుకున్నాడు. ప్రజెంట్‌ జనరేషన్‌ ఈ కథని ఎలా యాక్సెప్ట్‌ చేస్తారనుకున్నాడో తెలీదు, నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్‌లాంటి వారు ఈ కథను నమ్మి ఎలా ప్రొడ్యూస్‌ చేశారో అర్థం కాదు. ఫస్ట్‌ హాఫ్‌ అంతా సిల్లీగా సాగే కథ, కథనాలు, సెకండాఫ్‌ అంతకంటే సిల్లీగా వుండే గేమ్‌ షో.. వెరసి నిర్మలా కాన్వెంట్‌ పిల్లల సినిమానా, పెద్దల సినిమానా అర్థం కాకుండా పోయింది. నూనూగు మీసాలతో వున్న హీరో, ఇంకా చిన్న పిల్ల లక్షణాలు పోని హీరోయిన్‌.. వీళ్ళిద్దరి మధ్య లవ్‌, కథకు అవసరం లేకపోయినా హీరోయిన్‌ని బొడ్డు కనిపించేలా, ఇంకా చాలా కనిపించేలా ఎక్స్‌పోజ్‌ చెయ్యడం కుటుంబ సమేతంగా సినిమాకి వెళ్ళేవారికి ఇబ్బంది కలిగిస్తుంది. మీలో ఎవరు కోటీశ్వరుడులో పార్టిసిపేట్‌ చేసిన వారిలో టాప్‌ టెన్‌గా నిలిచిన వారిని పిలిపించడం, వాళ్ళంతా హీరోని క్వశ్చన్స్‌ అడగడం, వాళ్ళు ఆశ్చర్యపోయేలా హీరో సమాధానాలు చెప్పడం, దీంతో నాగార్జున ఛాంపియన్‌ ఆఫ్‌ ది ఛాంపియన్స్‌ అంటూ ఓ స్పెషల్‌ ప్రోగ్రామ్‌ చెయ్యడానికి ఒప్పుకోవడం, అదీ హీరో సొంత ఊరిలోనే చెయ్యడం, ఆ షోలో పార్టిసిపేట్‌ చేసిన హీరో రెండు కోట్లు గెలుచుకోవడం.. ఇదంతా టి.వి.లో ప్రోగ్రామ్‌ చూస్తున్న ఫీలే కలుగుతుంది తప్ప సినిమా చూస్తున్నామని అనిపించదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఫస్ట్‌ హాఫే బోర్‌ కొట్టించేలా వుందంటే, సెకండాఫ్‌ అంతకు మించిన బోర్‌ కొడుతుంది. డైరెక్టర్‌ రాసుకున్న మాటలు గానీ, నవ్వించడానికి తీసిన కామెడీ సీన్స్‌గానీ ఏ దశలోనూ ఆడియన్స్‌ని ఆకట్టుకోవు. పైగా నాగార్జున కోసమే ఈ సినిమా తీశారన్నట్టుగా సెకండాఫ్‌ అంతా నాగార్జునకు భజన చేయడమే సరిపోతుంది. సినిమాలోని కొన్ని క్యారెక్టర్స్‌ నాగార్జున అంటే చూపించే పిచ్చి అభిమానం మనకు పిచ్చెక్కిస్తుంది. 

ఒక సిల్లీ కథను తీసుకొని రెండున్నర గంటలు ఆడియన్స్‌ని సీట్లలో కూర్చోబెట్టాలనుకున్న డైరెక్టర్‌ ప్రయత్నం ఫలించలేదు. ఆడియన్స్‌కి క్యూరియాసిటీ కలిగించే చాలా ప్రత్యేకతలు సినిమాకి వున్నా అవి సినిమాని గట్టెక్కించలేవని సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. ఫస్ట్‌హాఫ్‌ అంతా అర్థం లేకుండా వుండడం, సెకండాఫ్‌ మొత్తం టి.వి. షోలా అనిపించడం వల్ల ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్‌ ఆడియన్స్‌కి కలగదు. చిన్న పిల్లలతో లవ్‌స్టోరీలు తీసేస్తున్నారని కొన్నేళ్ళ క్రితం కొన్ని సినిమాలకు విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా విషయానికి వస్తే చిన్న పిల్లలతో లవ్‌ సీన్స్‌ చేయించినట్టుగా అనిపిస్తుందే తప్ప ఒక లవ్‌స్టోరీ చూస్తున్న ఫీలింగ్‌ ఎక్కడా కలగదు. ఫైనల్‌గా చెప్పాలంటే కుటుంబ సమేతంగా ఈ సినిమా చూసే ధైర్యం ఎవ్వరూ చెయ్యరు. ఎందుకంటే ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు వుంటారు. వాళ్ళకి ఇప్పటి నుంచే ఇలాంటి పెద్ద విషయాలు తెలియాలని ఏ తల్లిదండ్రులూ కోరుకోరు కదా. 

ఫినిషింగ్‌ టచ్‌: ఎ సిల్లీ లవ్‌స్టోరీ విత్‌ చిల్డ్రన్‌ 

సినీజోష్‌ రేటింగ్‌: 2/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ