Advertisementt

సినీజోష్‌ రివ్యూ: ఇంకొక్కడు

Thu 08th Sep 2016 09:13 PM
chiyan vikram new movie inkokkadu,inkokkadu movie review,inkokkadu movie review in cinejosh,inkokkadu movie cinejosh review,telugu movie inkokkadu  సినీజోష్‌ రివ్యూ: ఇంకొక్కడు
సినీజోష్‌ రివ్యూ: ఇంకొక్కడు
Advertisement
Ads by CJ

తమీన్స్‌ ఫిలింస్‌, ఎన్‌.కె.ఆర్‌. ఫిలింస్‌ 

ఇంకొక్కడు 

తారాగణం: విక్రమ్‌, నయనతార, నిత్యమీనన్‌, నాజర్‌, 

తంబి రామయ్య, బాల, కరుణాకరన్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: ఆర్‌.డి.రాజశేఖర్‌ 

సంగీతం: హేరిస్‌ జయరాజ్‌ 

ఎడిటింగ్‌: భువన్‌ శ్రీనివాసన్‌ 

మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి 

నిర్మాత: శిబు తమీన్స్‌ 

రచన, దర్శకత్వం: ఆనంద్‌ శంకర్‌ 

విడుదల తేదీ: 08.09.2016 

చియాన్‌ విక్రమ్‌.. ప్రయోగాత్మక చిత్రాలు చెయ్యడంలో కమల్‌హాసన్‌ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న హీరో. క్యారెక్టర్‌ కోసం ఎంతటి రిస్క్‌ అయినా తీసుకునే ఆర్టిస్ట్‌. హీరోగా తనకు ఎంతో పేరు తెచ్చిన శివపుత్రుడు నుంచి ఐ వరకు అతను చేసిన ప్రతి సినిమా డిఫరెంట్‌గానే వుంటుంది. తను చేసే ప్రతి సినిమా విభిన్నంగా వుండాలని కోరుకునే విక్రమ్‌ చేసిన మరో విభిన్న చిత్రమే ఇంకొక్కడు. ఆనంద్‌శంకర్‌ డైరెక్షన్‌లో శిబు తమీన్స్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని ఎన్‌.కె.ఆర్‌. ఫిలింస్‌ బేనర్‌పై ఎన్‌.కృష్ణారెడ్డి తెలుగులో అందించారు. విక్రమ్‌ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాలో విక్రమ్‌ ఎలాంటి క్యారెక్టర్స్‌ చేశాడు? ఐ చిత్రంతో ప్రేక్షకుల్ని నిరాశపరిచిన విక్రమ్‌ ఇంకొక్కడుగా అందర్నీ ఆకట్టుకున్నాడా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

ఓపెన్‌ చేస్తే.. మలేషియాలోని ఇండియన్‌ ఎంబసి. ఎంబసిలోకి 75 ఏళ్ళ వృద్ధుడు వెళతాడు. ఇన్‌హేలర్‌తో నోట్లోకి ఓ మెడిసన్‌ని స్ప్రే చేసుకుంటాడు. దాంతో అతనిలోని శక్తి పది రెట్లు అవుతుంది. దాంతో అక్కడున్న పోలీసుల్ని నిముషాల్లో హతమారుస్తాడు. అతను తీసుకున్న డ్రగ్‌ పేరు స్పీడ్‌. ఫార్మాసూటికల్స్‌కి సంబంధించిన డ్రగ్స్‌ని ఇల్లీగల్‌గా తయారు చేస్తూ భారతదేశంలో విధ్వంసాన్ని సృష్టించాలని లవ్‌(విక్రమ్‌) అనే సైంటిస్ట్‌ ట్రై చేస్తుంటాడు. ఫ్లాష్‌బ్యాక్‌కి వెళ్తే ..రా.. ఏజెంట్‌ అయిన అఖిలన్‌ వినోద్‌(విక్రమ్‌)... లవ్‌ని, అతని గ్యాంగ్‌ని నామ రూపాలు లేకుండా చేసేస్తాడు. కానీ, నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ లవ్‌ కార్యకలాపాలు కొనసాగించడం మలేషియా పోలీసుల దృష్టికి వస్తుంది. రెండు మర్డర్‌ కేసుల వల్ల సస్పెండ్‌ అయిన అఖిలన్‌ అయితేనే లవ్‌ని కనిపెట్టగలడని రా ఛీఫ్‌ మానిక్‌(నాజర్‌) భావిస్తాడు. కేస్‌ ఆఫీసర్‌ అయిన ఆయుషి(నిత్యమీనన్‌)కి అసిస్టెంట్‌గా అఖిలన్‌ని పంపిస్తాడు. మొత్తానికి లవ్‌ స్థావరాన్ని కనిపెడతారు అఖిలన్‌, ఆయుషి. కానీ, వాళ్ళిద్దరూ లవ్‌కి పట్టుబడతారు. ఇక అఖిలన్‌ పర్సనల్‌ ఫ్లాష్‌ బ్యాక్‌లోకి వెళ్తే అతనితోపాటు రా లో డేటా ఎనలిస్ట్‌గా వర్క్‌ చేసే మీరాను ప్రేమిస్తాడు. ఇద్దరూ పెళ్ళి చేసుకుంటారు. కానీ, పెళ్ళయిన రోజే మీరా హత్య చేయబడుతుంది. ప్రజెంట్‌కి వస్తే లవ్‌ స్థావరంలో మీరా దర్శనమిస్తుంది. మెంటల్‌గా డిస్ట్రబ్‌ అయిన మీరాని డ్రగ్స్‌తో తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు లవ్‌. గతాన్ని మర్చిపోయిన మీరా.. అఖిలన్‌ని కూడా గుర్తు పట్టదు. స్పీడ్‌ డ్రగ్‌తో నిండిన పదివేల ఇన్‌హేలర్లను ఇండియా పంపించేందుకు సన్నాహాలు చేసుకుంటున్న లవ్‌ని అఖిలన్‌ ఎలా అడ్డుకున్నాడు? గతాన్ని మర్చిపోయిన మీరా.. అఖిలన్‌ని తర్వాతైనా గుర్తుపట్టిందా? లవ్‌ డ్రగ్‌ రాకెట్‌ని అంతం చేయడంలో కథ ఎన్ని మలుపులు తిరిగింది? లవ్‌ని హతమార్చడానికి అఖిలన్‌ ఎలాంటి ఎత్తుగడ వేశాడు? అనేది తెరపై చూడాల్సిందే. 

స్పీడ్‌ డ్రగ్‌ అనే పదం వినడానికి కొత్తగానే వున్నా.. ఇది పాతదేనని, హిట్లర్‌ తన సైన్యాన్ని ఈ డ్రగ్‌ వాడమని సలహా ఇచ్చాడని డైరెక్టర్‌ తన కథనంలో చెప్పుకొచ్చాడు. సినిమా ప్రారంభంలో మాత్రం ఈ చిత్రంలో వాడిన రసాయనాలు కేవలం కల్పితాలని కూడా వేశాడు. ఏది ఏమైనా ఇది ఒక కల్పితమైన కథే కాబట్టి దేన్నయినా కథా వస్తువుగా తీసుకోవచ్చు. డైరెక్టర్‌ స్పీడ్‌ డ్రగ్‌ పేరుతో తీసుకున్న పాయింట్‌ కొత్తదే అయినా అది అన్ని క్లాసుల ఆడియన్స్‌కి రీచ్‌ అవ్వడం కష్టం. టేకింగ్‌ పరంగా, టెక్నికల్‌గా సినిమా చాలా హై రేంజ్‌లో వుంటాయి. బ్యాక్‌డ్రాప్‌, విలన్‌ డెన్‌, రా ఆఫీస్‌.. ఇలా అన్నీ చాలా రిచ్‌గా కనిపిస్తాయి. ఫస్ట్‌ హాఫ్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా వెళ్తుంది. చనిపోయిందనుకున్న తన భార్య విలన్‌ డెన్‌లో కనిపించడంతో హీరో షాక్‌ అవుతాడు. అక్కడితో ఫస్ట్‌ హాఫ్‌ ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌లో లవ్‌ని పట్టుకోవడం, అతను తప్పించుకోవడం, ఎన్నో ప్రయత్నాల తర్వాత హీరో అనుకున్నది సాధించడంతో కథ ముగుస్తుంది. కథలో ఎన్నో లొసుగులు వున్నప్పటికీ స్పీడ్‌ డ్రగ్‌ అనే కొత్త పాయింట్‌ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్‌ చేస్తుంది. అయితే ఈ డ్రగ్‌ ఫస్ట్‌ హాఫ్‌లో కొత్తగా అనిపించినా సెకండాఫ్‌కి వచ్చేసరికి కొన్ని చోట్ల అది కామెడీగా తయారైంది. 

పెర్‌ఫార్మెన్స్‌ పరంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది విక్రమ్‌ గురించి మాత్రమే. అఖిలన్‌ వినోద్‌గా, లవ్‌గా రెండు విభిన్నమైన పాత్రల్ని సమర్థవంతంగా పోషించడంలో విక్రమ్‌ హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడు. అఖిలన్‌లోని ఫెరోషియస్‌నెస్‌, రొమాంటిక్‌ యాంగిల్‌, ఆడ, మగ కాని లవ్‌ హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌ అందర్నీ ఆకట్టుకుంటాయి. క్యారెక్టర్స్‌ కోసం విక్రమ్‌ ఎంతటి రిస్క్‌ అయినా చేస్తాడని ఈ సినిమా మరోసారి ప్రూవ్‌ చేసింది. సినిమాలోని మిగతా ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. 

టెక్నికల్‌గా చూస్తే ఆర్‌.డి.రాజశేఖర్‌ ఫోటోగ్రఫీ ఎక్స్‌లెంట్‌గా వుంది. హేరిస్‌ జయరాజ్‌ చేసిన పాటల్లో మొదటి పాట మాత్రమే ఆకట్టుకునేలా వుంది. ఇక బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు సూపర్బ్‌ అనిపిస్తుంది. అద్భుతమైన సెట్స్‌ వెయ్యడంలో ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ కృషి కనిపిస్తుంది. డైరెక్టర్‌ ఆనంద్‌ శంకర్‌ గురించి చెప్పాలంటే స్పీడ్‌ డ్రగ్‌ అనే పాయింట్‌ కొత్తది, హీరోగా, విలన్‌గా ఒకరే చెయ్యడం, అది కూడా తేడాగా వుండే ఓ క్యారెక్టర్‌ విలన్‌ అవ్వడం అనేది కొత్తగా అనిపిస్తుంది. సినిమాలోని ఓపెనింగ్‌ షాట్‌ అద్భుతం అనిపిస్తుంది. ఇక ఫస్ట్‌ హాఫ్‌ అంతా అదే ఫీలింగ్‌ కలుగుతుంది. ఎప్పుడైతే సెకండాఫ్‌ స్టార్ట్‌ అవుతుందో అప్పటి నుంచి కథ ఎటూ కదలక ఆడియన్స్‌కి తెగ బోర్‌ కొడుతుంది. ఫస్ట్‌ హాఫ్‌లో హీరోని, విలన్‌ని ఎంత గొప్పగా చూపించాడో సెకండాఫ్‌లో వాళ్ళిద్దరి సీన్స్‌ అంత సిల్లీగా అనిపిస్తాయి. 2 గంటల 35 నిముషాల సినిమాలో ట్రిమ్‌ చెయ్యాల్సినవి చాలా వున్నాయి. ముఖ్యంగా కథ ముందుకు వెళ్ళకుండా టైమ్‌ పాస్‌ చేసే కొన్ని సీన్స్‌ని కత్తిరిస్తే సినిమా కొంత స్పీడ్‌ అయ్యే అవకాశం వుంది. విక్రమ్‌ పెర్‌ఫార్మెన్స్‌, టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్‌, టేకింగ్‌, ప్రొడక్షన్‌ వాల్యూస్‌ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌ అయితే, రెండున్నర గంటల సినిమాలో స్క్రీన్‌మీద ఎప్పుడూ విక్రమ్‌ చేసిన రెండు క్యారెక్టర్లే కనిపించడం, సెకండాఫ్‌ బోర్‌ కొట్టించడం, ఎంటర్‌టైన్‌మెంట్‌ అస్సలు లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్‌గా మారింది. ఫైనల్‌గా చెప్పాలంటే కేవలం విక్రమ్‌ కోసం ఈ సినిమా చూడొచ్చు. కథ, కథనాల్లో ఎన్నో లొసుగులున్నా, ఫస్ట్‌హాఫ్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించి, సెకండాఫ్‌ బోర్‌ కొట్టించడం వల్ల సినిమా చూసి బయటికి వచ్చే ఆడియన్స్‌కి సినిమా ఓకే అనే ఫీలింగ్‌ కలుగుతుంది తప్ప ఎక్స్‌ట్రార్డినరీగా ఫీల్‌ అవ్వరు. 

ఫినిషింగ్‌ టచ్‌: స్పీడంతా ఫస్ట్‌ హాఫే! 

సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ