శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్
తిక్క
తారాగణం: సాయిధరమ్‌తేజ్, లారిసా బోనేసి,
మన్నారా చోప్రా, రాజేంద్రప్రసాద్, అజయ్,
పోసాని, వెన్నెల కిషోర్, ఆలీ, తాగుబోతు రమేష్,
ముమైత్‌ఖాన్, సప్తగిరి, రఘుబాబు తదితరులు
సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్
సంగీతం: ఎస్.ఎస్.థమన్
ఎడిటింగ్: కార్తీకశ్రీనివాస్
కథ: షేక్ దావూద్ జి.
మాటలు: హర్షవర్థన్, లక్ష్మీభూపాల్
నిర్మాత: డా. సి.రోహిన్‌కుమార్‌రెడ్డి
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సునీల్‌రెడ్డి
విడుదల తేదీ: 13.08.2016
కొంతమంది దర్శకులు తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుంటే, మరికొంత మంది డైరెక్టర్స్ తెలుగు సినిమాను పాతాళానికి తొక్కేస్తున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈరోజు విడుదలైన తిక్క చిత్రం. రోహిన్‌కుమార్‌రెడ్డి లాంటి కొత్త నిర్మాతలు దానికి బలైపోతున్నారు. ఇండస్ట్రీలో టాలెంట్ వున్న రచయితలు, డైరెక్షన్‌లో మంచి స్కిల్స్ వున్న దర్శకులు ఎంతో మంది వున్నారు. అవకాశాల కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్నారు. కానీ, అలాంటి వారిని పక్కన పెట్టి తమని ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీసే దర్శకులనే నమ్ముతున్నారు నిర్మాతలు. సినిమా అంటే ఇలా వుంటుందా? ఇంత ఘోరంగా కూడా సినిమాలు తియ్యొచ్చా? అనే విషయం తెలుసుకోవాలంటే తప్పకుండా తిక్క చిత్రాన్ని చూడాల్సిందే. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ వంటి కమర్షియల్ హిట్స్‌తో హీరోగా తన రేంజ్‌ని పెంచుకుంటూ వెళ్తున్న సాయిధరమ్‌తేజ్‌ని తిక్క చిత్రం ఒక్కసారిగా కిందకి నెట్టేసింది. ఓం వంటి ఫ్లాప్ చిత్రాన్ని రూపొందించిన సునీల్‌రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం ఇంత ఘోరంగా తయారవడానికి కారణాలు ఏమిటి? తిక్క అనే టైటిల్‌కి సరైన జస్టిఫికేషన్ అనిపించేలా ఈ సినిమాని తీర్చిదిద్దడంలో సునీల్‌రెడ్డి ఎంత కష్టపడ్డాడు? సాయిధరమ్‌కి కోలుకోలేని షాక్ ఇచ్చిన ఈ సినిమాలో అసలు ఏం వుంది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
తిక్క సినిమా కథ ఏమిటి? అనేది తెలుసుకోకుండా వుంటేనే మంచిది. ఎందుకంటే ఇందులో కథ అంటూ ఏమీ లేదు. కేవలం వెకిలితనం, ఆడియన్స్‌కి తిక్క పుట్టించే సీన్స్, భయపెట్టే గెటప్స్, సహనాన్ని పరీక్షించే మాటలు.. ఇలా ఆద్యంతం తిక్క తిక్కగా సాగే ఈ చిత్రంలో ప్లస్ పాయింట్స్ ఏం వున్నాయి అని కాగడా పెట్టి వెతికినా ఒక్కటీ కనిపించదు. ఇంత కంగాళీ సినిమాకు అంతకంటే కంగాళీగా ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్ కూడా తోడై ఆడియన్స్‌ని అతలాకుతలం చేసింది. వరసగా మూడు హిట్స్ కొట్టిన సాయిధరమ్‌కి కోలుకోలేని దెబ్బగా మారింది తిక్క.
ఈ సినిమాకి తిక్క అనే టైటిల్ పెట్టడం వెనుక రీజన్ ఏమిటనేది ఎంత ఆలోచించినా అర్థం కాదు. సినిమా స్టార్టింగ్‌లో వచ్చే పొగత్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అనే లైన్ తిక్కగా చెప్పించడం ద్వారా సినిమా ఎంత తిక్కగా వుంటుందో ముందుగానే హింట్ ఇచ్చినట్టయింది. కథగా చెప్పుకోవడానికి ఈ సినిమాలో ఏమీ లేదు. ఇక క్యారెక్టర్ల విషయానికి వస్తే హీరో ఆదిత్య(సాయిధరమ్‌తేజ్) తాగుబోతు, తిరుగుబోతు, పేకాట రాయుడు.. ఇలా చాలా డిగ్రీలు వున్నాయి. ఇక అతని తండ్రి రాజేంద్రప్రసాద్ అంతకంటే పెద్ద తాగుబోతు. ఆ వయసులో అతనికి ఓ గర్ల్ ఫ్రెండ్ కూడా. ఇన్ని చెడ్డ అలవాట్లు వున్న ఆదిత్య అన్ని సినిమాల్లోలాగే హీరోయిన్ అంజలి(లారిసా బోనేసి)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆదిత్యకు వున్న వ్యసనాలన్నింటినీ అంజలి వదిలిస్తుంది. అతని తండ్రిని కూడా మంచి దారిలో పెడుతుంది. కానీ, ఓ బ్యాడ్ మార్నింగ్ అంజలితో ఆదిత్యకు బ్రేకప్ అవుతుంది. ఇక అక్కడి నుంచి తెలుగు ఆడియన్స్ తట్టుకోలేనన్ని మలుపులు తిరిగి కథ సుఖాంతం అవుతుంది.
తిక్క అనేది టైటిల్‌లోనే కాదు, ఇందులో నటించిన ఆర్టిస్టుల గెటప్పుల్లోనూ కనిపిస్తుంది. రాజేంద్రప్రసాద్‌ని ఆడ, మగ కానట్టు వుండే ఓ గెటప్‌లో సెట్ చేస్తే, ఆలీకి లేని బట్టతలను బలవంతంగా పెట్టారు. ఇక పోలీస్ ఆఫీసర్ అయిన పోసాని పిచ్చి పిచ్చి డాన్సులు చేసి పిచ్చెక్కిస్తుంటాడు. తాగుబోతు రమేష్ కళ్ళను విచిత్రంగా పెట్టి భయపెడుతుంటాడు. రఘుబాబు సగం తెలుగు, సగం తమిళ్‌లో మాట్లాడుతూ గందరగోళం సృష్టిస్తుంటాడు. ఇక హీరో సంగతి సరేసరి.. ఒక్కోసారి ఏడుస్తూ, ఒక్కోసారి పిచ్చిగా మాట్లాడుతూ రకరకాల విన్యాసాలు చేస్తుంటాడు. సగటు ప్రేక్షకుడికి ఒకే సినిమాలో ఇన్ని రకాల తిక్కను చూపిస్తే ఎలా తట్టుకుంటాడు? ఇక పెర్‌ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే సినిమాలోని ఏ ఒక్క ఆర్టిస్టునీ ఈ విషయంలో అప్రిషియేట్ చెయ్యలేం. ఎందుకంటే వారితో డైరెక్టర్ అంత దరిద్రంగా చేయించాడు.
టెక్నికల్ ఎస్సెట్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే కె.వి.గుహన్ ఫోటోగ్రఫీ బాగుంది. కథ, కథనాలు కూడా బాగుండి వుంటే అతని ఫోటోగ్రఫీ బాగా హైలైట్ అయ్యేది. అయితే పాటల పిక్చరైజేషన్ మాత్రం ఫర్వాలేదు అనిపిస్తుంది. థమన్ చేసిన పాటలు ఓకే అనిపించాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతంత మాత్రంగానే వుంది. హర్షవర్థన్, లక్ష్మీభూపాల్ రాసిన మాటలు అస్తవ్యస్తంగానే కాకుండా అసహనాన్ని కలిగించేవిగా కూడా వున్నాయి. ఇక డైరెక్టర్ సునీల్‌రెడ్డి గురించి చెప్పాలంటే ఈ సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు, అతను అనుకున్న కాన్సెప్ట్‌తో ఆడియన్స్‌ని ఎలా ఎంటర్‌టైన్ చెయ్యాలనుకున్నాడు అనేది ఎంత ఆలోచించినా అర్థం కాదు. సాయిధరమ్‌తేజ్‌కి ఏం చెప్పి ఈ సినిమా ఓకే చేయించుకున్నాడు, ఈ కథలో ఏం నచ్చి తేజు ఒప్పుకున్నాడు అనేది కూడా మిస్టరీయే.
మూడు హిట్ సినిమాలు చేసిన హీరోని పెట్టుకొని, డబ్బుకు వెనకాడకుండా ఎంత ఖర్చు పెట్టడానికైనా రెడీ అయిన నిర్మాత అందుబాటులో వుండగా సునీల్‌రెడ్డి ఓ పిచ్చి కథను తీసుకొని అంతే పిచ్చిగా దాన్ని స్క్రీన్‌పైకి తీసుకొచ్చి జనం మీదకు వదిలాడు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్క్రీన్ మీద పెట్టిన ఖర్చు కనిపిస్తుంది. డబ్బును నీళ్ళలా ఖర్చు పెట్టారని ఆ రిచ్‌నెస్ చూస్తే అర్థమవుతుంది. సినిమా స్టార్ట్ అయిన పది నిముషాలకే ఇది డెఫినెట్‌గా తిక్క సినిమాయే అని ఆడియన్స్‌కి అర్థమైపోతుంది. ఇలాంటి అర్థం పర్థం లేని సినిమాని రెండు గంటల ఇరవై నిముషాలు చూసి భరించాలంటే మానవాతీత శక్తులున్న వారికి మాత్రమే సాధ్యమవుతుంది తప్ప మానవ మాత్రులకు కాదు. ఫైనల్‌గా చెప్పాలంటే తిక్క అనే సినిమా చూసిన తర్వాత ఎంత చెత్త సినిమా చూసినా బాగుందే అనిపిస్తుంది. దీన్నిబట్టి తిక్క ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు.
ఫినిషింగ్ టచ్: పేరుకి తగ్గట్టే.. ఇది తిక్క సినిమా
సినీజోష్ రేటింగ్: 1/5