మేడియవాల్ స్టోరీ టెల్లర్స్
బొమ్మల రామారం
తారాగణం: తిరువీర్, సంకీర్తన, ప్రియదర్శి, విమల్‌కృష్ణ,
మోహన్ భగత్, గుణకర్, శివ తదితరులు
సినిమాటోగ్రఫీ: బి.వి.అమర్‌నాథ్‌రెడ్డి
సంగీతం: కార్తీక్ కొడకండ్ల
ఎడిటింగ్: శివశ్రీనివాస్
నిర్మాత: పుదారి అరుణ
రచన, దర్శకత్వం: నిశాంత్ పుదారి
విడుదల తేదీ: 12.08.2016
బొమ్మల రామారం అనే టైటిల్‌లోనే సినిమా ఏమిటనేది అర్థమైపోతుంది. బొమ్మల రామారం ఊరిలోని రాజకీయాలు, సామాజిక స్థితిగతులు ప్రధానాంశాలుగా ఈ సినిమా రూపొందింది. ఆధిపత్యం కోసం, అధికారం కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే యుద్ధమే బొమ్మల రామారం. నిశాంత్ పుదారి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ద్వారా 40 మంది కొత్త ఆర్టిస్టులు పరిచయమవుతున్నారు. మరి ఈ సినిమా కథ, కథనాలు ఎలా వున్నాయి? పూర్తి గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ నిశాంత్ ఆడియన్స్‌కి కనెక్ట్ చెయ్యగలిగాడా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
అతని పేరు రామన్న(ప్రియదర్శి). తండ్రి ఎమ్మెల్యే. తండ్రి చనిపోయినా ఆస్తి తన పేరు మీద రాయించుకోవడం కోసం రెండు రోజులైనా ఊళ్ళో వారికి తెలియకుండా వుంచుతాడు. శవం వేలి ముద్రతో ఆస్తి తనకి వచ్చేలా చేసుకుంటాడు. తండ్రి తర్వాత ఆ ఊళ్ళో తనే దొర కావాలని, బై ఎలక్షన్స్‌లో ఆ నియోజక వర్గ ఎమ్మెల్యేగా తనే వుండాలని కోరుకుంటాడు. అదే ఊళ్ళో వుండే తన ప్రత్యర్థి సింబన్న కూడా ఎలక్షన్స్‌లో నిలబడడానికి నిర్ణయించుకుంటాడు. అలా వారి మధ్య వైరం పెరుగుతుంది. ఇదిలా వుంటే దుబాయ్ వెళ్ళాలని కలలు కనే సూరి అనే వ్యక్తిని తన పనులు చేయించుకోవడం కోసం నియమించుకుంటాడు రామన్న. బై ఎలక్షన్స్‌లో సింబన్నపై రామన్న గెలుస్తాడు. ఆ ఊరికి రెవిన్యూ ఆఫీసర్‌గా వచ్చిన కార్తీక్‌ని రామన్నే చంపించి ఆ నేరాన్ని సూరి పైకి నెట్టేస్తాడు. జైలుకి వెళ్ళి బెయిల్‌పై వస్తాడు సూరి. కార్తీక్ ప్రేయసి అయిన సంగమిత్ర.. రామన్నను కోర్టుకీడ్చాలని డిసైడ్ అవుతుంది. ఇది తెలిసిన రామన్న ఆమెను కిడ్నాప్ చేయిస్తాడు. రామన్నకు తెలియకుండా అతని మనుషులు ఆమెను రేప్ చేస్తారు. సంగమిత్రను ప్రేమించిన సూరి... రామన్నపై పగ పెంచుకుంటాడు. ఎలక్షన్స్‌లో సంగమిత్రను ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయిస్తాడు. దీనిపై రామన్న ఎలా స్పందించాడు? సంగమిత్ర ఎమ్మెల్యేగా గెలిచిందా? పగతో రగిలిపోతున్న సూరి తన ప్రతీకారాన్ని ఎలా తీర్చుకున్నాడు? అనేది మిగతా కథ.
కథగా చెప్పుకుంటే ఇది రెండు ముక్కల్లో అయిపోతుంది. కానీ, ఈ చిన్న పాయింట్ చుట్టూ అల్లిన కథలు సినిమాకి ఏమాత్రం ఉపయోగపడేవి కావు. మధ్య మధ్యలో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అన్నట్టు వచ్చే కొన్ని సీన్స్ ప్రేక్షకులకు విసుగును పుట్టిస్తాయి. ఇవి చాలవన్నట్టు 1940లో ఓ ఆశ్రమం అన్నట్టుగా ఒక సెటప్ వుంటుంది. అందులో ఉమాదేవి అనే అమ్మాయి వుంటుంది. బ్లాక్ అండ్ వైట్ హీరోయిన్‌లా డ్రెసప్ చేసుకునే ఆ అమ్మాయికి ఓ అసిస్టెంట్ కూడా వుంటాడు. అప్పుడప్పుడు ఆ ఇంటి ముందే రకరకాల నాటకాలు ప్రదర్శిస్తుంటారు. అవి ఎవరో చూడడానికి కాదు, వాళ్ళ కోసమే. కథకు అస్సలు సంబంధం లేని క్యారెక్టర్ ఉమాదేవిది. ఇక సంగమిత్ర అనే క్యారెక్టర్ పక్షుల సౌండ్స్‌ని రీసెర్చ్ చేసే గవర్నమెంట్ ఆఫీసర్. ఆమెకి ఇద్దరు అసిస్టెంట్లు. అప్పుడప్పుడూ కనిపించే ఓ దుబాయ్ రిటర్న్‌డ్... ఇలా కథను పక్కన పెట్టేసి అనవసరమైన సీన్స్‌తో కాలయాపన చేస్తూ సినిమాని ముందుకు నడిపించాలని చూశాడు డైరెక్టర్. రామన్న అనే వ్యక్తి చాలా క్రూరుడు అన్నట్టుగా బిల్డప్ ఇస్తారు. కానీ, ఆ బిల్డప్ అతని కార్యకలాపాల్లో కనిపించదు. ఎప్పుడూ సైలెంట్‌గా రామన్న క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా ప్రేక్షకులకు నీరసం వచ్చేస్తుంది. రామన్నగా నటించిన ప్రియదర్శి ఆ క్యారెక్టర్‌కి అస్సలు సూట్ అవ్వలేదు. ఇటీవల విడుదలై సక్సెస్ అయిన పెళ్ళిచూపులు చిత్రంలో కౌషిక్‌గా మంచి క్యారెక్టర్ చేసి అందర్నీ నవ్వించిన ప్రియదర్శి ని రామన్న క్యారెక్టర్‌లో ఊహించుకోవడం ఆడియన్స్‌కి కష్టమైన పనే. ఇక మిగతా క్యారెక్టర్స్‌లో ఎవరి పేరు ఏమిటి అనేది చెప్పడం చాలా కష్టం. అందరూ గడ్డాలు పెంచుకొని వుంటారు. ఏ క్యారెక్టర్ పేరు ఏమిటో వాళ్ళ నోటితో చెప్తే తప్ప మనకి అర్థం కాదు. ఇందులో నటించిన వారంతా కొత్తవారైనా పెర్‌ఫార్మెన్స్ బాగానే చేశారు. వారిని ఆ విషయంలో తప్పు పట్టలేం. వారి వారి లిమిట్స్‌లో తమ క్యారెక్టర్లకు పూర్తి న్యాయం చేశారు. కానీ, కథ, కథనాల్లోనే పూర్తి లోపం వుండడం వల్ల వారి పెర్‌ఫార్మెన్స్ ఎక్కడా హైలైట్ అవ్వలేదు. దానికి తగ్గట్టు మధ్యలో వచ్చే పాటలు మరింత డిస్ట్రబ్ చేస్తాయి. ఈ సినిమాలో చెప్పుకోదగిన విషయం ఏదైనా వుందీ అంటే అది పి.సుశీలతో పాట పాడించడం. చాలా కాలం తర్వాత సుశీల పాట వినే అవకాశం ఈ సినిమా వల్ల కలిగింది.
ఈ సినిమాకి టెక్నికల్ ఎస్సెట్స్ అంటూ ఏమీ లేవు. ఫోటోగ్రఫీ నేచురల్‌గానే వున్నా అది సినిమాకి ఏమాత్రం ఉపయోగపడలేదు. సుశీల పాట తప్ప మిగతా పాటలన్నీ అంతంత మాత్రమే. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వున్నంతలో ఫర్వాలేదు అనిపించాడు. ఈ సినిమాకి ఎడిటింగ్ పెద్ద మైనస్ అయింది. ఒక ఫ్లో అనేది లేకుండా, ఒక సీన్‌కి, మరో సీన్‌కి సంబంధం లేకుండా ఏ సీన్‌కి ఆ సీనే అన్నట్టుగా వుంటుంది. డైరెక్టర్ గురించి చెప్పాలంటే నిశాంత్ రాసుకున్న కథ పూర్తి స్థాయిలో లేదు. ఒక చిన్న పాయింట్‌ని తీసుకొని దానికి పనికిరాని, కథకు సంబంధం లేని సీన్స్ అన్నింటినీ తగిలించి అతుకుల బొంతలా చేశాడు. కంటిన్యుటీ అనేది ఎక్కడా కనిపించదు. ఏ సీన్‌కి ఆ సీనే అన్నట్టుగా వుంటుంది. ఎమోషన్స్ పీక్స్‌లో వుండాల్సిన ఈ కథలో అవి ఒక స్థాయి వరకే పరిమితమైపోయాయి. క్లైమాక్స్ వరకు చూసిన తర్వాత కూడా ఈ సినిమా ద్వారా డైరెక్టర్ ఏం చెప్పదలుచుకున్నాడనేది అర్థం కాదు. ఫైనల్‌గా చెప్పాలంటే కథలోగానీ, కథనంలోగానీ ఏమాత్రం కొత్తదనం లేని ఈ సినిమా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఫినిషింగ్ టచ్: ప్రేక్షకుల సహనానికి పరీక్ష
సినీజోష్ రేటింగ్: 1.5/5