Advertisementt

సినీజోష్‌ రివ్యూ: మనమంతా

Fri 05th Aug 2016 09:39 PM
telugu movie manamantha,mohan lal in manamantha,chandra sekhar yeleti new movie manamantha,manamantha movie review,manamantha movie review in cinejosh,manamantha movie cinejosh review  సినీజోష్‌ రివ్యూ: మనమంతా
సినీజోష్‌ రివ్యూ: మనమంతా
Advertisement

వారాహి చలన చిత్రం 

మనమంతా 

తారాగణం: మోహన్‌లాల్‌, గౌతమి, విశ్వాంత్‌, 

రైనారావు, అనీషా ఆంబ్రోస్‌, హర్షవర్థన్‌, 

చంద్రమోహన్‌, బ్రహ్మాజీ, పరుచూరి వెంకటేశ్వరరావు, 

ఊర్వశి, వెన్నెల కిశోర్‌, గెస్ట్‌ అప్పియరెన్స్‌: తారకరత్న 

సినిమాటోగ్రఫీ: రాహుల్‌ శ్రీవాత్సవ్‌ 

సంగీతం: మహేష్‌ శంకర్‌ 

ఎడిటింగ్‌: జి.వి.చంద్రశేఖర్‌ 

మాటలు: రవిచంద్ర తేజ 

సమర్పణ: సాయిశివాని 

నిర్మాత: సాయి కొర్రపాటి 

రచన, దర్శకత్వం: చంద్రశేఖర్‌ యేలేటి 

విడుదల తేదీ: 05.08.2016 

నాలుగు ఫైట్లు, ఐదు పాటలు, అక్కడక్కడా కామెడీ.. ఇలా తెలుగు సినిమా అంటే ఫార్ములా సినిమా అనే ముద్ర పడిపోయింది. అయితే అప్పుడప్పుడు కొంతమంది డైరెక్టర్లు కొత్త ఆలోచనలతో, కొత్త కథలతో, కొత్త తరహా సినిమాలు చెయ్యడానికి ట్రై చేస్తుంటారు. వాటిలో కొన్ని ప్రేక్షకాదరణ పొంది కమర్షియల్‌గా పెద్ద హిట్స్‌ అయితే, మరికొన్ని కమర్షియల్‌గా సక్సెస్‌ అవ్వకపోయినా మంచి సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఎప్పుడూ ఫార్ములా జోలికి వెళ్ళకుండా హిట్‌ అయినా, ఫ్లాప్‌ అయినా తమ పంథాని మార్చుకోకుండా సినిమాలు తీసే డైరెక్టర్లు కొందరున్నారు. వారిలో చంద్రశేఖర్‌ యేలేటి ఒకరు. ఇప్పటివరకు అతను చేసిన సినిమాలు తక్కువే అయినా సినిమా, సినిమాకీ వేరియేషన్స్‌ చూపిస్తూ వస్తున్నాడు. చంద్రశేఖర్‌ యేలేటి సినిమా వస్తోందంటే ఒక వర్గం ప్రేక్షులు ఆ సినిమా కోసం ఎదురుచూసే పరిస్థితి వుందంటే అతని సినిమాలు ఏ స్థాయిలో వుంటాయో అర్థం చేసుకోవచ్చు. అలా అందరూ ఎదురుచూసిన సినిమా మనమంతా. దాదాపు 22 సంవత్సరాల తర్వాత మలయాళ హీరో మోహన్‌లాల్‌ తెలుగులో చేసిన సినిమా ఇది. అలాగే మెయిన్‌ క్యారెక్టర్‌లో పూర్తి స్థాయిలో చేసిన మొదటి సినిమా ఇదే. మనమంతా.. ఒన్‌ వరల్డ్‌... ఫోర్‌ స్టోరీస్‌ అనే క్యాప్షన్‌ చూడగానే నాలుగు కథలు ఈ సినిమాలో వుంటాయన్న అవగాహన ప్రేక్షకులకు కలుగుతుంది. అయితే ఆ నాలుగు కథల్ని ఎలా చెప్పాడు? ప్రేక్షకుల్ని ఎలా మెప్పించాడు? అనేది పాయింట్‌. 

1. ఓ సూపర్‌ మార్కెట్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేసే సాయిరామ్‌(మోహన్‌లాల్‌) 15 సంవత్సరాలుగా అదే సూపర్‌ మార్కెట్‌లో పనిచేస్తూ అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఎదిగాడు. అతనితోపాటు మరో అసిస్టెంట్‌ మేనేజర్‌గా విశ్వనాథ్‌(హర్షవర్థన్‌) పనిచేస్తుంటాడు. ఆ సూపర్‌ మార్కెట్‌ మేనేజర్‌ రిటైర్‌ అవ్వడంతో మేనేజర్‌గా ఈ ఇద్దరిలో ఒకరు సెలెక్ట్‌ అయ్యే అవకాశం వుంది. హెడ్‌ ఆఫీస్‌ నుంచి ఛైర్మన్‌ వచ్చే టైమ్‌కి విశ్వనాథ్‌ని కనపడకుండా చేస్తే మేనేజర్‌ పోస్ట్‌ తనకే వస్తుందన్న స్వార్థంతో ఓ రౌడీకి చెప్పి విశ్వనాథ్‌ని కిడ్నాప్‌ చేయిస్తాడు సాయిరామ్‌. అనుకున్నట్టుగానే విశ్వనాథ్‌ టైమ్‌కి లేకపోవడంతో సాయిరామ్‌ మేనేజర్‌ అయిపోతాడు. సాయిరామ్‌ వెంటనే రౌడీకి ఫోన్‌ చేసి విశ్వనాథ్‌ని వదిలెయ్యమని చెప్తాడు. దానికి ఒప్పుకోని రౌడీ లక్ష యాభై వేలు ఇస్తేనే వదులుతానని, వెంటనే డబ్బు ఎరేంజ్‌ చెయ్యకపోతే అతను చచ్చిపోతాడని బెదిరిస్తాడు. సాయిరామ్‌ షాక్‌ అవుతాడు. 

2. గాయత్రి(గౌతమి) ఓ మధ్య తరగతి ఇల్లాలు. పొదుపుగా ఇంటిని ఎలా నడపాలి అనే దానిపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతుంది. ఏ వస్తువు తక్కువ ధరలో వస్తుందా అని ఎదురుచూస్తుంటుంది. ఆమె చదువుకునే రోజుల్లో కాలేజీ ప్రొఫెసర్‌(గొల్లపూడి మారుతిరావు) ఆమె దగ్గర వంద, రెండొందలు అప్పుగా తీసుకునేవాడు. డబ్బు తీసుకునేటప్పుడు చిరునవ్వుతోనే ఇవ్వాలనే కండీషన్‌ కూడా పెట్టేవాడు. అలాంటి వ్యక్తి చాలా సంవత్సరాల తర్వాత ఓ రోజు గాయత్రికి కనిపిస్తాడు. మళ్ళీ ఎక్కడ డబ్బు అడుగుతాడోనని తప్పించుకొని వచ్చేస్తుంది. అయితే ఆమె దగ్గర ఎప్పుడో తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేద్దామని వచ్చానని చెప్తాడు. మొత్తం ఐదువేలు అయింది ఇచ్చేస్తారా అని అడుగుతుంది. కానీ, ప్రొఫెసర్‌ ఒప్పుకోడు. ఆ ఐదు వేలతో రుణం తీరిపోవడం తనకి ఇష్టం లేదంటాడు. ఆమె చేసిన సాయం వల్లే తన కొడుకు సింగపూర్‌లో పెద్ద కంపెనీ రన్‌ చేస్తున్నాడని చెప్తాడు. అందుకని జీవితాంతం సంతోషంగా వుండాలంటే ఏం కావాలో అది కోరుకోమంటాడు ప్రొఫెసర్‌. ఆ ఆఫర్‌కి పొంగిపోతుంది గాయత్రి. ఏం కోరుకోవాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడుతుంది. 

3. మహతి(రైనారావు) ఏడో తరగతి చదివే అమ్మాయి. ఈమెకు సేవా గుణం ఎక్కువ. ఎవరు బాధపడుతున్నా చూడలేదు, సాయం చేయకుండా వుండలేదు. అలాంటి మహతికి మురికి వాడలో వుండే వీర్‌శంకర్‌ అనే నాలుగేళ్ళ కుర్రాడు ఫ్రెండ్‌ అవుతాడు. అతన్ని తమ్ముడిలా ప్రేమగా చూసుకుంటుంది. అతన్ని స్కూల్‌లో కూడా చేర్పిస్తుంది. ఓరోజు ఆ అబ్బాయి తప్పి పోతాడు. వీర్‌శంకర్‌ని వెతకడానికి ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్నీ చేస్తుంది మహతి. పిల్లలందరితో వీర్‌శంకర్‌ వివరాలు పేపర్‌పై రాయించి వాటిని అందరికీ పంచుతుంది. కానీ, అతని జాడ కనిపించదు. మరి వీర్‌శంకర్‌ ఎక్కడున్నాడో మహతి కనిపెట్టగలిగిందా? 

4. అతని పేరు అభిరామ్‌(విశ్వాంత్‌) బి.టెక్‌ చదువుకునే కుర్రాడు. క్లాస్‌లో అందరి కంటే ఇంటెలిజెంట్‌ స్టూడెంట్‌. అతనికి చదువు తప్ప మరో ధ్యాస లేదు. అలాంటి అభిరామ్‌ జీవితంలోకి ఐరా(అనీషా ఆంబ్రోస్‌) అనే అమ్మాయి ప్రవేశించింది. దాంతో అతని లైఫ్‌ చదువు ట్రాక్‌ తప్పి లవ్‌ ట్రాక్‌ ఎక్కింది. ఆ అమ్మాయి కోసం తనకెంతో ఇష్టమైన వస్తువుల్ని కూడా వదులుకుంటాడు. ఓరోజు ఆ అమ్మాయికి ఐ లవ్‌ యూ చెప్తాడు. అభిని ఫ్రెండ్‌గానే భావించిన ఐరా సడన్‌గా లవ్‌ ప్రపోజ్‌ చెయ్యడంతో అతన్ని ఛీ కొడుతుంది, వెంటపడి వేధించవద్దని చెప్తుంది. నువ్వు లేకపోతే చచ్చిపోతానని బెదిరిస్తాడు అభి. నీ ఇష్టం వచ్చింది చేసుకొమ్మని వెళ్ళిపోతుంది ఐరా. దాంతో విరక్తి చెందిన అభిరామ్‌ సూసైడ్‌ చేసుకోవడానికి ట్యాంక్‌బండ్‌ చేరుకుంటాడు. 

ఈ నలుగురి సమస్యలకు పరిష్కారం ఏమిటి? అని మనం ఆలోచిస్తున్న టైమ్‌లోనే ఫస్ట్‌ హాఫ్‌ ముగుస్తుంది. ప్రమోషన్‌ కోసం తను కిడ్నాప్‌ చేయించిన విశ్వనాథ్‌ని సాయిరామ్‌ ఎలా విడిపించాడు? జీవితాంతం సంతోషంగా వుండడానికి ఏదైనా కోరుకోమని ప్రొఫెసర్‌ ఇచ్చిన ఆఫర్‌ను గాయత్రి ఎలా స్వీకరించింది? ఏం కావాలని కోరుకుంది? వీర్‌శంకర్‌ ఆచూకీ తెలుసుకోవడానికి చిన్నారి మహతి చేసిన ప్రయత్నాలు ఫలించాయా? చదువును పక్కన పెట్టి అమ్మాయి ప్రేమ కోసం చావడానికైనా సిద్ధపడ్డ అభిరామ్‌ తన నిర్ణయానికి కట్టుబడే వున్నాడా? అనే చిక్కు ప్రశ్నలకు సెకండాఫ్‌లో డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ యేలేటి తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. 

నటుడుగా మోహన్‌లాల్‌ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. జాతీయ స్థాయి ఉత్తమనటుడుగా ఎన్నో అవార్డులు అందుకున్న మోహన్‌లాల్‌ సాయిరామ్‌ పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఒకరకంగా తన పాత్రలో జీవించాడని చెప్పాలి. తన పాత్రకు తనే డబ్బింగ్‌ చెప్పుకొని ఆ క్యారెక్టర్‌కి మరింత అందాన్ని తీసుకొచ్చాడు. మధ్య తరగతి ఇల్లాలిగా గౌతమి కూడా తన పాత్రలో జీవించింది. మధ్యతరగతి గృహిణులకు తమని తాము అద్దంలో చూసుకున్నట్టుగా ఈ క్యారెక్టర్‌ కనిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. మహతిగా చిన్నారి రైనారావు నటన అందరికీ కంటతడి పెట్టిస్తుంది. ప్రతి సీన్‌లో ఆమె నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇప్పటి యువత ఆలోచనలకు అద్దం పట్టేలా అభిరామ్‌ క్యారెక్టర్‌ని అద్భుతంగా డిజైన్‌ చేశారు. విశ్వాంత్‌ ఆ క్యారెక్టర్‌కి పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అయ్యాడు. గొల్లపూడి మారుతిరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, హర్షవర్థన్‌, అనీషా ఆంబ్రోస్‌ తమ తమ క్యారెక్టర్లకు న్యాయం చేశారు. 

సాంకేతికపరంగా చూస్తే రాహుల్‌ శ్రీవాత్సవ్‌ ఫోటోగ్రఫీ ఎంతో నేచురల్‌గా అనిపిస్తుంది. కళ్ళకు ఇబ్బంది కలిగించే హడావిడి లేకుండా చాలా ప్లెజెంట్‌గా ప్రతి సీన్‌ని తెరకెక్కించాడు. మహేష్‌ శంకర్‌ చేసిన పాటలు బాగానే వున్నాయి. కథతోపాటే రన్‌ అయ్యే పాటలు కావడంతో కథనానికి అడ్డంకిగా మారలేదు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా కథకి తగ్గట్టుగా బాగా చేశాడు. నాలుగు కథల్ని ఒకేసారి చూపిస్తుండడం వల్ల ఫస్ట్‌ హాఫ్‌లో ఒక్కోచోట ఎడిటింగ్‌లో జర్క్‌ వచ్చిన ఫీలింగ్‌ కలిగింది. అయితే సెకండాఫ్‌లో అలాంటి సమస్య కనిపించలేదు. 

చంద్రశేఖర్‌ యేలేటి ఎంతో కష్టపడి ఈ కథ రాసుకున్నాడని సినిమా చూసిన వారందరికీ అర్థమవుతుంది. ప్రతి క్యారెక్టర్‌కీ ఇంపార్టెన్స్‌ ఇస్తూ ఎక్కడా అసహజత్వం అనేది కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. ఫస్ట్‌ హాఫ్‌ చూసి బయటికి వచ్చిన ఆడియన్స్‌కి సెకండాఫ్‌లో ఏం జరుగుతుందోననే క్యూరియాసిటీని క్రియేట్‌ చేశాడు. నిత్య జీవితంలో మనకి ఎదురయ్యే క్యారెక్టర్స్‌తోనే ఈ అద్భుతాన్ని చేశాడు చంద్రశేఖర్‌. చాలా నేచురల్‌గా వుండే డైలాగ్స్‌ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్‌ అవుతాయి. రెగ్యులర్‌గా మన సినిమాల్లో వుండే కామెడీ, పాటలు, డాన్సులు, ఫైట్స్‌ ఈ సినిమాలో లేకపోయినా అవి లేని లోటు మనకు ఎక్కడా కనిపించకుండా కథతోపాటే మనల్ని ముందుకు తీసుకెళ్ళడంలో చంద్రశేఖర్‌ హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడు. కథల్లోని ఎమోషన్‌ని, సెంటిమెంట్‌ని క్యారీ చెయ్యడంలో శభాష్‌ అనిపించుకున్నాడు. ఇప్పటి వరకు చంద్రశేఖర్‌ చేసిన సినిమాల్లో ది బెస్ట్‌ మూవీ ఇదేనని చెప్పొచ్చు. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ సినిమాకి ఎంచుకున్న కథల్ని బట్టి ఫస్ట్‌ హాఫ్‌ స్లో నేరేషన్‌ అనిపిస్తుంది. ఈ నాలుగు కథలని క్లైమాక్స్‌కి తెచ్చే ప్రాసెస్‌లో సెకండాఫ్‌ స్పీడ్‌గా వున్నట్టు అనిపిస్తుంది. రెగ్యులర్‌ ఫార్మాట్‌ సినిమాలు చూసే వారికి ఈ సినిమా అంతగా నచ్చకపోయినా కొత్తదనం కోరుకునే వారికి, కొత్త తరహా సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా కనెక్ట్‌ అవుతుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: మనసుని తట్టిలేపే ఫీల్‌గుడ్‌ మూవీ 

సినీజోష్‌ రేటింగ్‌: 3.25/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement