Advertisementt

సినీజోష్‌ రివ్యూ: జక్కన్న

Fri 29th Jul 2016 08:18 PM
sunil new movie jakkanna,telugu movie jakkanna,jakkanna movie review,jakkanna review in cinejosh,jakkanna cinejosh review  సినీజోష్‌ రివ్యూ: జక్కన్న
సినీజోష్‌ రివ్యూ: జక్కన్న
Advertisement
Ads by CJ

ఆర్‌.పి.ఎ. క్రియేషన్స్‌ 

జక్కన్న 

తారాగణం: సునీల్‌, మన్నారా చోప్రా, కబీర్‌సింగ్‌, నాగినీడు, 

పృథ్వీ, సత్యప్రకాష్‌, సప్తగిరి, రఘు కారుమంచి తదితరులు 

సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్‌ 

సంగీతం: దినేష్‌ 

ఎడిటింగ్‌: ఎం.ఆర్‌.వర్మ 

మాటలు: భవానీ ప్రసాద్‌ 

నిర్మాత: ఆర్‌.సుదర్శన్‌రెడ్డి 

రచన, దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ళ 

విడుదల తేదీ: 29.07.2016 

కామెడీ అంటే సునీల్‌, సునీల్‌ అంటే కామెడీ. ఇది ఒకప్పటి మాట. కమెడియన్‌ నుంచి హీరోగా టర్న్‌ అయిన తర్వాత సునీల్‌ కామెడీని మర్చిపోయాడు. ఆమధ్య మర్యాదరామన్నలో రాజమౌళి.. సునీల్‌తో కామెడీ చేయించాడు. అయితే అది రాజమౌళి ఎకౌంట్‌లోకి, సినిమా ఎకౌంట్‌లోకి వెళ్ళిపోయింది తప్ప సునీల్‌ లెక్కలోకి రాలేదు. సునీల్‌ ఈమధ్యకాలంలో హీరోగా చేసిన సినిమాల్లో హీరోయిజం మాత్రమే చూపించే ప్రయత్నం చేశాడు తప్ప కామెడీ మీద కాన్‌సన్‌ట్రేట్‌ చెయ్యలేదు. లేటెస్ట్‌గా అతను చేసిన జక్కన్న... బ్యాక్‌ టు ఎంటర్‌టైన్‌ అని టైటిల్‌లోనే వేసుకున్నాడు. తన నుంచి ఆడియన్స్‌ కామెడీనే కోరుకుంటున్నారని చాలా ఆలస్యంగా తెలుసుకున్న సునీల్‌ జక్కన్న సినిమాతో మళ్ళీ కామెడీ పంచన చేరాడు. హీరోయిజమ్‌ని పక్కన పెట్టి మళ్ళీ నవ్వించడానికి వెనక్కి వచ్చిన సునీల్‌ని ఆడియన్స్‌ ఎలా రిసీవ్‌ చేసుకున్నారు? మునుపటిలా అతని కామెడీని ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసారా? సునీల్‌కి జక్కన్న ఎలాంటి పేరుని తెచ్చింది? అనేది సమీక్షలోకి వెళ్ళి తెల్సుకుందాం. 

ప్రాస అనేది కొన్ని సందర్భాల్లోనే నవ్వు తెప్పిస్తుంది. అలాంటిది సినిమా మొత్తం ప్రాసలతో నిండిపోతే హాస్యం కాస్తా అపహాస్యం అవుతుంది. చివరికి కామెడీ అంటేనే రోత పుట్టేలా చేస్తుంది. జక్కన్న విషయంలో కూడా అదే జరిగింది. ఆడియన్స్‌ని నవ్వించడానికి రైటర్‌ భవానీ ప్రసాద్‌ ప్రాసలనే నమ్ముకున్నట్టున్నాడు. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ప్రాస డైలాగులను వరసపెట్టి ప్రేక్షకుల మీదకు సంధించాడు. ఇక డైరెక్టర్‌ వంశీ కృష్ణ ఆకెళ్ళ ఒక సిల్లీ కథను తీసుకొని సునీల్‌తో కామెడీ చేయించాలని చూశాడు. మరో పక్క పృథ్వీ రొటీన్‌ డైలాగ్స్‌తో, సప్తగిరి విచిత్రమైన వేషధారణతో ఆడియన్స్‌ని నవ్వించేందుకు ట్రై చేశారు. 

కథ విషయానికి వస్తే చిన్నప్పుడు క్లాస్‌లో విన్న చీమ, పావురం కథతో ఇన్‌స్పైర్‌ అయిన గణేష్‌(సునీల్‌) తనకి ఎవరైనా హెల్ప్‌ చేస్తే వాళ్ళు తట్టుకోలేనంత సాయం చేసి విసిగిస్తుంటాడు. అలా పెరిగి పెద్దయిన గణేష్‌ ఒక వ్యక్తి కోసం వైజాగ్‌లో అడుగు పెడతాడు. ఆ వ్యక్తి బైరాగి(కబీర్‌సింగ్‌). బైరాగి కథేమిటంటే వైజాగ్‌లో అతను కింగ్‌. కానీ, ఈ కింగ్‌ ఎవరికీ కనిపించడు, అసలు అతను ఎలా వుంటాడో కూడా ఎవరికీ తెలీదు. ఎన్నో హత్యలు చేశాడు. కానీ, పోలీసులకు మాత్రం చిక్కలేదు. బైరాగిని చూసిన వాడు ప్రాణాలతో వుండడు. అలాంటి బైరాగి కోసం గణేష్‌ వచ్చాడు. హీరో కాబట్టి వైజాగ్‌ వచ్చీ రావడంతోనే హీరోయిన్‌ సహస్ర(మన్నారా చోప్రా) ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను పొందడానికి రకరకాల విన్యాసాలు చేస్తాడు. మధ్య మధ్యలో రిలీఫ్‌ కోసం బైరాగి కోసం వెతుకుతుంటాడు. అసలు గణేష్‌... బైరాగి కోసం ఎందుకు వెతుకుతున్నాడు? అతనికి, బైరాగికి వున్న సంబంధం ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

సునీల్‌ గతంలో కమెడియన్‌గా చేసిన పెర్‌పార్మెన్స్‌నే ఈ సినిమాలోనూ కంటిన్యూ చెయ్యాలని ట్రై చేశాడు. డైలాగ్‌ డెలివరీగానీ, బాడీ లాంగ్వేజ్‌గానీ అప్పట్లాగే వుండేలా జాగ్రత్త పడ్డాడు. కానీ, అతను చెప్పే ప్రాస డైలాగ్స్‌కి నవ్వు రాకపోగా విసుగు పుడుతుంది. డాన్సుల్లో, ఫైట్స్‌లో ఓకే అనిపించినా కామెడీ పరంగా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. హీరోయిన్‌ మన్నారా చోప్రా కండలు తిరిగిన హీరోగా అనిపిస్తుందే తప్ప ఆమె గ్లామర్‌గానీ, పెర్‌ఫార్మెన్స్‌గానీ ఏ దశలోనూ ఆకట్టుకోదు. పైగా ఒక్కో సీన్‌లో ఒక్కోలా కనిపించడం ఆమె స్పెషాలిటీయా అనిపిస్తుంది. బైరాగిగా కబీర్‌ సింగ్‌ ఎప్పటిలాగే ఓకే అనిపించాడు. అయితే ఒక సీన్‌లో అతను రియల్‌ గడ్డంతో కనిపిస్తే మరో సీన్‌లో పెట్టుడు గడ్డంతో కనిపిస్తాడు. ఈ విషయంలో సరైన జాగ్రత్త తీసుకోలేదు. మిగతా క్యారెక్టర్స్‌లో కాస్తో కూస్తో అప్పుడప్పుడు నవ్వించింది పృథ్వీ, సప్తగిరి, రఘు కారుమంచి. 

రాంప్రసాద్‌ ఫోటోగ్రఫీ బాగున్నప్పటికీ కథ, కథనాల్లో విషయం లేకపోవడంవల్ల ఫోటోగ్రఫీని ఆడియన్స్‌ ఎంజాయ్‌ చెయ్యలేరు. దినేష్‌ చేసిన రెండు పాటలు బాగున్నాయనిపిస్తుంది. సునీల్‌, మన్నారా చోప్రాలపై తీసిన పాటలన్నీ ఫారిన్‌లో తీశారు. అలాగే అన్ని పాటల్లోనూ ఒకే గ్రూప్‌ డాన్సర్స్‌ కనిపించడం విచిత్రంగా అనిపిస్తుంది. ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బాగానే వున్నాయి. నిర్మాత ఆర్‌.సుదర్శన్‌రెడ్డి పెట్టిన ఖర్చు స్క్రీన్‌పై కనిపిస్తుంది. డైరెక్టర్‌ వంశీ కృష్ణ ఆకెళ్ళ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఏమాత్రం ఎఫెక్టివ్‌గా లేని కథ, ఎంతమాత్రం ఇంట్రెస్ట్‌ కలిగించని కథనం సినిమాకి పెద్ద మైనస్‌. ఎప్పుడో చిన్నప్పుడు తనకి హెల్ప్‌ చేసిన విలన్‌కి సాయం చెయ్యడం కోసం వైజాగ్‌ రావడం, నలభై ఏళ్ళ విలన్‌ని అతనికి తెలియకుండానే పోలీస్‌ ఆఫీసర్‌ని చెయ్యడం మన సినిమాల్లోనే సాధ్యమవుతుందని మరోసారి నిరూపించాడు డైరెక్టర్‌. కథ, కథనాల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోని డైరెక్టర్‌ మాటల విషయాన్ని పూర్తిగా రైటర్‌కే వదిలేసినట్టు అనిపిస్తుంది. ఈ సినిమాల్లో వున్నన్ని ప్రాస డైలాగ్స్‌ ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ లేవని ఘంటాపథంగా చెప్పొచ్చు. వాటన్నింటినీ తట్టుకొని క్లైమాక్స్‌ వరకు ఆడియన్స్‌ సీట్లలో కూర్చోవాలంటే శక్తికి మించిన పనే. 

చిన్నప్పటి కథతో రెగ్యులర్‌ ఫార్మాట్‌లోనే స్టార్ట్‌ అయ్యే ఈ సినిమా ఆ ఫార్మాట్‌లోనే ఓ ఇంట్రడక్షన్‌ సాంగ్‌, ఆ తర్వాత హీరోయిన్‌ని చూడడం, ఆమె వెంట పడడం జరిగిపోతాయి. మధ్యలో హీరో వైజాగ్‌ ఎందుకు వచ్చాడో దాన్ని కాసేపు చూపించడం, తర్వాత హీరోయిన్‌తో ఓ పాట. సినిమా అంతా ఇలాగే నడుస్తుంది. మధ్య, మధ్యలో కమెడియన్స్‌ వచ్చి నవ్వించడానికి ట్రై చేస్తుంటారు. ఫస్ట్‌ హాఫ్‌ కాస్త ఫర్వాలేదు అనిపించినా సెకండాఫ్‌ మాత్రం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ఈ సినిమాకి జక్కన్న అనే టైటిల్‌ ఎందుకు పెట్టారన్నది ఎవ్వరికీ అర్థం కాదు. పేరు గణేష్‌, నిక్‌నేమ్‌ జక్కన్న అని హీరో తన ఇంట్రడక్షన్‌లో చెప్పుకుంటాడు. ఆ తర్వాత సినిమా అంతా అతన్ని గణేష్‌ అనే పిలుస్తారు. టైటిల్‌ జస్టిఫికేషన్‌ కోసం అన్నట్టు చివరిలో నాగినీడుతో రెండు మాటలు చెప్పించి సినిమా పూర్తయిందనిపిస్తారు. ఫైనల్‌గా చెప్పాలంటే బలహీనమైన కథ, కథనాలు, విసిగించే ప్రాస డైలాగ్స్‌తో స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే ఈ సినిమాని చూడాలంటే శక్తిని కూడగట్టుకోవాల్సిందే. 

ఫినిషింగ్‌ టచ్‌: ప్రాసలతో ఆడియెన్స్ పరేషాన్.

సినీజోష్‌ రేటింగ్‌: 2.25/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ