ధర్మపథ క్రియేషన్స్, బిగ్ బెన్ సినిమాస్
పెళ్ళిచూపులు
తారాగణం: విజయ్ దేవరకొండ, రీతూ వర్మ, నందు, ప్రియదర్శి,
అనీష్ కురువిళ్ళ, కేదార్ శంకర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: నగేష్ బనెల్
సంగీతం: వివేక్ సాగర్
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
నిర్మాతలు: రాజ్ కందుకూరి, యష్ రంగినేని
రచన, దర్శకత్వం: తరుణ్ భాస్కర్
విడుదల తేదీ: 29.07.2016
సినిమా అంటే ఐదు పాటలు వుండాలి, ఆరు ఫైట్స్ వుండాలి, మధ్య మధ్య నవ్వించడానికి కామెడీ వుండాలి. ఈ ఫార్ములానే ఇప్పటికీ చాలా మంది దర్శకనిర్మాతలు నమ్ముకున్నారు. ఈ ఫార్మాట్‌లో తీసిన సినిమాలు సక్సెస్ అవ్వకపోయినా పట్టు వదలని విక్రమార్కుల్లా దాన్నే భుజాన వేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వీళ్ళ సంగతి ఇలా వుంటే కొంతమంది దర్శకులు మాత్రం కొత్త తరహా సినిమాలు తియ్యాలని, ప్రేక్షకులకు కొత్తదనాన్ని పరిచయం చెయ్యాలని ఉవ్విళ్ళూరుతుంటారు. అలాంటి సినిమాలు కొన్ని కమర్షియల్‌గా సక్సెస్ అవుతాయి. మరికొన్ని మంచి సినిమాలుగా మిగిలిపోతాయి. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెళ్ళిచూపులు సినిమా మాత్రం మంచి చిత్రంగానే కాకుండా కమర్షియల్‌గా కూడా సక్సెస్ అయ్యే సినిమా అనిపిస్తుంది. ఎవడే సుబ్రమణ్యం చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించిన విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో హీరోగా నటించగా, కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన రీతూ వర్మ ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ద్వారా తరుణ్ భాస్కర్ అనే ఓ కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. మరి ఈ పెళ్ళిచూపులు చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకునే కొత్తదనం ఏమిటి? కథ, కథనాలు ఆడియన్స్‌కి ఎంతవరకు కనెక్ట్ అయ్యాయి? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
ఎంత కష్టపడినా బి.టెక్ పూర్తి పూర్తి చేయలేకపోయిన ప్రశాంత్(విజయ్ దేవరకొండ) ఏ పనీ చెయ్యడానికి ఇష్టపడడు. అతనికి చదువు అబ్బకపోయినా కుకింగ్ మీద మంచి ఇంట్రెస్ట్ వుంటుంది. కుకింగ్ మీద వీడియోలు చేసి యూ ట్యూబ్‌లో పెట్టి డబ్బు సంపాదించాలనుకుంటాడు. అది వర్కవుట్ కాకపోవడంతో పెళ్ళి చేసుకొని మామగారు ఇచ్చే కట్నం డబ్బుతో లైఫ్‌లో సెటిల్ అవ్వాలనుకుంటాడు. హీరోయిన్ క్యారెక్టర్ పేరు చిత్ర(రీతూ వర్మ). ఎం.బి.ఎ. పూర్తి చేసిన చిత్రకి ఆస్ట్రేలియా వెళ్ళి డబ్బు సంపాదించాలనేది డ్రీమ్. అందుకోసం ఎన్ని పెళ్ళి సంబంధాలు వచ్చినా తిప్పి కొడుతుంది. ఇలా వేర్వేరు స్వభావాలు కలిగిన ఈ ఇద్దరు పెళ్ళిచూపుల్లో కలిస్తే ఎలా వుంటుంది? అది కూడా గది డోర్ లాక్ అయిపోయి ఇద్దరూ ఒకే గదిలో గంటకుపైగా గడపాల్సి వచ్చినపుడు వారి ఫీలింగ్స్ ఎలా వుంటాయి? ఆ టైమ్‌లో ఇద్దరి అభిరుచులూ ఎలా షేర్ చేసుకున్నారు? అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. అయితే ఎప్పటిలాగే తనకి ఈ పెళ్ళి ఇష్టం లేదని, తండ్రి మాటను కాదనలేక పెళ్ళిచూపులకు ఒప్పుకున్నానని చెప్తుంది చిత్ర. అలా ఆ సంబంధానికి కూడా నో అంటుంది. ఆ తర్వాత ఒక చిన్న ట్విస్ట్‌తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. పెళ్ళే వద్దనుకున్న మళ్ళీ ప్రశాంత్‌ని కలుస్తుంది చిత్ర. కట్నం డబ్బు కోసం కోటీశ్వరుల సంబంధాన్ని ఓకే చేసుకున్న ప్రశాంత్‌ని చిత్ర ఎందుకు కలిసింది? వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి స్టోరీ నడిచింది? చివరికి ప్రశాంత్, చిత్ర పెళ్ళి చేసుకున్నారా? అనేది మిగతా కథ.
ఇంత కథ చదివాక ఏ సినిమాలో అయినా హీరో, హీరోయిన్ కలుస్తారు కదా అనే డౌట్ అందరికీ వస్తుంది. ఇందులోనూ అదే జరిగినా ఆ మధ్యలో వారిద్దరి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు జరిగాయి? ఏ విధంగా ఇద్దరూ కలుసుకున్నారు? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. సినిమా స్టార్ట్ అయిన పది నిముషాలకే ఓ కొత్త తరహా సినిమా చూస్తున్నామన్న ఫీలింగ్ ప్రతి ఆడియన్‌కీ కలుగుతుంది. నేచురల్‌గా వుండే సీన్స్, ఆరోగ్యకరమైన కామెడీ అందర్నీ ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా హీరో, హీరోయిన్ ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌తో చాలా ఎంటర్‌టైనింగ్‌గా వుంటుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు శేఖర్ కమ్ముల సినిమా ఆనంద్ గుర్తొస్తూ వుంటుంది. సినిమాటిక్ డైలాగ్స్ కాకుండా చాలా నేచురల్ డైలాగ్స్‌తో ప్రతి ఆర్టిస్టూ నవ్వులు పూయిస్తారు. ప్రశాంత్‌గా హీరో విజయ్ దేవరకొండ పెర్‌ఫార్మెన్స్ చాలా నేచురల్‌గా వుంది. డైలాగ్ డెలివరీ కూడా ఆకట్టుకుంది. చిత్రగా రీతూ వర్మ తన క్యారెక్టర్‌కి హండెడ్ పర్సెంట్ న్యాయం చేసింది. డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్...ఇలా ప్రతిదీ పెర్‌ఫెక్ట్‌గా చేసింది అనిపిస్తుంది. ఒక విధంగా ఆనంద్‌లో కమలినీ ముఖర్జీ చేసిన రూప క్యారెక్టర్‌లా చిత్ర క్యారెక్టర్‌ని డిజైన్ చేశాడు డైరెక్టర్. మిగతా ఆర్టిస్టుల్లో హీరో ఫ్రెండ్‌గా నటించిన ప్రియదర్శి తన కామెడీతో అందరి కంటే ఎక్కువ మార్కులు కొట్టేశాడు. తెలంగాణ స్లాంగ్‌లో అతను చెప్పిన ప్రతి డైలాగ్‌కి నవ్వులు వినిపించాయి.
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా ఎంతో ప్లెజెంట్‌గా అనిపించడంలో సినిమాటోగ్రాఫర్ నగేష్ పాత్ర చాలా వుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతి ఫ్రేమ్‌ని ఎంతో ఆహ్లాదకరం చిత్రించడంలో నగేష్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. వివేక్ సాగర్ మ్యూజిక్ కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి తగ్గట్టుగానే ఫ్రెష్‌గా అనిపిస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ఎండింగ్‌లో వచ్చే ఆలాపన ఒక ఫ్రెష్ ఫీల్‌ని కలిగిస్తుంది. ఇక డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ మంచి గ్రిప్పింగ్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా వుంటూ ఒక ఫ్రెష్ ఫీల్‌ని కలిగించేలా తియ్యడంలో సక్సెస్ అయ్యాడు. సెకండాఫ్‌కి వచ్చేసరికి ఫస్ట్‌హాఫ్‌కి పూర్తి విరుద్ధంగా వుంటుంది. కథ ముందుకు వెళ్ళకపోవడం, స్లో నేరేషన్‌తో చాలా సందర్భాల్లో బోర్ కొట్టించాడు. హీరో, హీరోయిన్ కలిసి ఫుడ్ ట్రక్ అనే బిజినెస్‌ని స్టార్ట్ చెయ్యడం, దాన్ని సక్సెస్ చెయ్యడం ఆ బిజినెస్‌లో సిటీలోనే నెంబర్‌వన్ అయిపోవడం జరిగిపోతుంది. ఆ బిజినెస్ చెయ్యడం ద్వారా తన బిజినెస్ స్కిల్స్‌ని తనకి కాబోయే మామగారికి చెప్పాలని హీరో, ఆ బిజినెస్ ద్వారా వచ్చిన డబ్బులతో ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలని హీరోయిన్ ప్లాన్ చేసుకుంటారు. ఫుడ్ ట్రక్ బిజినెస్‌ని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్ అంతా ఆడియన్స్‌కి బోర్ కొట్టించేలా వుంటుంది. హీరోయిన్ గురించి ఆమె తండ్రి దగ్గరకు వచ్చి హీరో పెద్ద పెద్ద మాటలు చెప్పి తమ కూతురిపై నమ్మకాన్ని పెంచే సీన్ చాలా అసహజంగా వుంటుంది. ఏ బాధ్యతా లేని కుర్రాడు అలాంటి జీవిత సత్యాల్ని చెప్పడం కొంచెం కామెడీగా అనిపిస్తుంది. పెళ్ళిచూపులు అనే పాత టైటిల్‌తో డైరెక్టర్ కొత్త పాయింట్ తీసుకున్నప్పటికీ ఫస్ట్‌హాఫ్ చేసినంత గ్రిప్పింగ్‌గా సెకండాఫ్ చెయ్యలేకపోయాడు. స్లో నేరేషన్‌తో చాలా సీన్స్‌లో బోర్ కొట్టించాడు. క్లైమాక్స్ చాలా సాదా సీదాగా వున్నా ఓకే అనిపిస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే ఒక కొత్త పాయింట్‌తో రూపొందిన పెళ్ళిచూపులు చిత్రాన్ని చూసిన ఆడియన్స్ ఫస్ట్‌హాఫ్‌ని చాలా ఎక్స్‌ట్రార్డినరీగా, సెకండాఫ్‌ని చాలా ఆర్టినరీగా ఫీల్ అవుతారు. అయితే ఓవరాల్‌గా సినిమా ఓకే అనే ఫీలింగ్‌తో థియేటర్ నుంచి బయటికి వస్తారు. ఈ సినిమా మల్టీప్లెక్స్ ఆడియన్స్‌ని ఎక్కువ ఆకట్టుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. బి, సి సెంటర్స్ ఆడియన్స్ ఫస్ట్ హాఫ్‌ని ఎంజాయ్ చేసినంతగా సెకండాఫ్‌ని ఎంజాయ్ చెయ్యలేరు.
ఫినిషింగ్ టచ్: ఫస్టాఫ్ ఎక్స్‌ట్రార్డినరీ.. సెకండాఫ్ ఆర్డినరీ
సినీజోష్ రేటింగ్: 3/5