రత్న సెల్యులాయిడ్స్
దొర
తారాగణం: సత్యరాజ్, శిబిరాజ్, బిందుమాధవి,
రాజేంద్రన్, కరుణాకరన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: యువ
సంగీతం: సిద్ధార్థ విపిన్
మాటలు: శశాంక్ వెన్నెలకంటి
ఎడిటింగ్: వివేక్ హర్షన్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: చిన్నా
నిర్మాత: జక్కం జవహర్‌బాబు
రచన, దర్శకత్వం: ధరణీ ధరన్
విడుదల తేదీ: 01.07.2016
విలన్‌గా తమిళ ఇండస్ట్రీలో ఎంటరై ఆ తర్వాత హీరోగా ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు చేసిన సత్యరాజ్‌కి తెలుగులో హీరోగా అంతగా గుర్తింపు రాకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఈమధ్యకాలంలో బాగానే పేరు తెచ్చుకున్నాడు. రాజమౌళి పుణ్యమాని బాహుబలి చిత్రంలో కట్టప్ప వంటి మెమరబుల్ క్యారెక్టర్ దొరకడంతో అతని కెరీర్ కొత్త టర్న్ తీసుకుంది. తెలుగు, తమిళ సినిమాల్లో బిజీ ఆర్టిస్టు అయిపోయాడు. కట్టప్పని క్యాష్ చేసుకునేందుకు దర్శకనిర్మాతలు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. లేటెస్ట్‌గా ధరణీ ధరన్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన జాక్సన్ దురై అందుకు ఉదాహరణ. తెలుగులో దొరగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పబ్లిసిటీ కోసం సత్యరాజ్‌ని అవసరానికి మించి వాడుకున్నారు. కట్టప్ప ఈజ్ బ్యాక్ అంటూ కట్టప్ప తర్వాత మళ్ళీ అంతటి క్యారెక్టర్ దొర చిత్రంలో చేశాడు అనిపించేంతగా ఊదరగొట్టారు. తీరా ఈరోజు మొదటి షో పడగానే ఈ సినిమాలో సత్యరాజ్‌కి అంత సీన్ లేదులే అని ఆడియన్స్ పెదవి విరిచేయడం విశేషం. ఒక అర్థం పర్థం లేని కథకి స్వాతంత్య్రానికి ముందు బ్యాక్‌డ్రాప్ తీసుకొని దానికి దెయ్యాలను కూడా చేర్చి ఆడియన్స్‌ని అతలాకుతలం చేశాడు డైరెక్టర్.
బ్రిటీష్‌వారు పరిపాలించే రోజుల్లో దొరపురం అనే గ్రామంలో జాక్సన్ దొర ఆగడాల వల్ల సామాన్య ప్రజలు అష్టకష్టాలు పడేవారు. అలాంటి సమయంలో అడవి దొర(సత్యరాజ్) జాక్సన్‌ని మట్టు పెట్టాలని అనుచరులతో కలసి బయల్దేరతాడు. ఎంత స్పీడుగా బయల్దేరతారో అంతే స్పీడుగా అడవి దొర, అతని అనుచరులు జాక్సన్ చేతుల్లో హతమవుతారు. ప్రేతాత్మలుగా మారిన అడవిదొర, అతని అనుచరులు అప్పటి నుంచి అదే బంగాళాలో తిరుగుతుంటారు. ఇదంతా 100 సంవత్సరాల కిందటి మాట. ఆ తర్వాత జాక్సన్ దొర, అతని సైన్యం చనిపోయినా వాళ్ళు కూడా అదే బంగళాలో సంచరిస్తుంటారు. ప్రతిరోజూ రాత్రి 9 కొట్టగానే ఈ ప్రేతాత్మల మధ్య యుద్ధం స్టార్ట్ అవుతుంది. జాక్సన్ చేతుల్లో అడవిదొర, అతని మనుషులు చనిపోతూ వుంటారు. ప్రతిరోజూ ఇదే తంతు జరుగుతూ వుంటుంది. అందుకే రాత్రి 9 దాటిందంటే ఆ ఊరి జనం ఇంటి నుంచి బయటికి రారు. దీనికి సంబంధించిన కంప్లయింట్ రావడంతో ఎస్.ఐ. అయిన సత్య(శిబిరాజ్)ని ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ రెడీ చేయమని దొరపురం పంపిస్తుంది పోలీస్ డిపార్ట్‌మెంట్. దొరపురం వచ్చిన సత్య ఆ ప్రేతాత్మల మిస్టరీని ఎలా ఛేదించాడనేది మిగతా కథ.
దెయ్యాల విచిత్ర చేష్టల వల్ల భయపెడుతూ, మధ్య మధ్యలో కామెడీ కూడా చేస్తూ ఆ మిస్టరీని ఛేదించే ఎస్.ఐ.గా శిబిరాజ్ ఎక్స్‌ట్రార్డినరీగా పెర్‌ఫార్మ్ చేయకపోయినా ఓకే అనిపించాడు. అతనికి జోడీగా బిందుమాధవి హీరోయిన్‌గా వున్నానంటే వున్నాను అనిపించింది. సెకండాఫ్‌లో ఎంటర్ అయ్యే సత్యరాజ్ క్యారెక్టర్‌కి ఎలాంటి ప్రత్యేకత లేదు. సెకండాఫ్‌లో కూడా అతను కనిపించే సీన్స్ చాలా తక్కువ. బాహుబలిలో కట్టప్ప లాంటి క్యారెక్టర్ చేసిన తర్వాత సత్యరాజ్ చెయ్యకూడని పాత్ర ఇది. అతని క్యారెక్టర్ గానీ, పెర్‌ఫార్మెన్స్ గానీ ఆడియన్స్‌పై ఎలాంటి ఇంపాక్ట్ చూపించదు. సినిమాలో కనిపించే క్యారెక్టర్స్, మనకు తెలిసిన ఆర్టిస్టులు చాలా తక్కువ కావడంతో పెర్‌ఫార్మెన్స్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.
యువ ఫోటోగ్రఫీ ఫర్వాలేదు అనిపించాడు తప్ప ఇలాంటి హార్రర్ థ్రిల్లర్ కోసం ఎక్స్‌ట్రార్డినరీగా అతని స్కిల్స్‌ని వాడలేదని చెప్పాలి. సిద్ధార్థ విపిన్ మ్యూజిక్ సోసోగానే వుంది. చిన్నా తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో అక్కడక్కడా ఆకట్టుకున్నా టోటల్‌గా అతని మ్యూజిక్ కూడా రొటీన్‌గానే వుంది. ఇక డైరెక్టర్ ధరణీధరన్ గురించి చెప్పుకోవాలంటే రెగ్యులర్‌గా వచ్చే హార్రర్ సినిమాలకు భిన్నంగా ఒక కొత్త కాన్సెప్ట్, ఒక కొత్త బ్యాక్‌డ్రాప్ తీసుకొని వెరైటీగా చెయ్యాలనుకున్న అతని ప్రయత్నం ఫలించలేదు. పైగా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. దొర బంగళాలో ఏదో జరుగుతోంది, అదేమిటో కనిపెట్టమని హీరోని ఆ ఊరికి పంపించేంత వరకు ఏదో కొత్త తరహా సినిమా చూడబోతున్నామన్న ఆసక్తి ఆడియన్స్‌లో కలుగుతుంది. ఆ ఆసక్తినే సెకండాఫ్ వరకు నడిపించడానికి నానా తంటాలు పడ్డాడు డైరెక్టర్. సెకండాఫ్‌లో సత్యరాజ్ అసలు విషయం రివీల్ చేసిన తర్వాత ఓస్ ఇంతేనా.. అని సరిపెట్టుకొని సినిమా క్లైమాక్స్‌కి ఎప్పుడొస్తుందో అని క్షణమొక యుగంలా గడిపేస్తారు ఆడియన్స్. ఒక సాదా సీదా క్లైమాక్స్‌తో సినిమా ఎండ్ అవ్వడంతో ఆడియన్స్ అంతా వడి వడిగా బయటికి వచ్చేస్తారు. ధరణి ఎంచుకున్న కథలోగానీ, కథనంలోగానీ కొత్తదనం లేకపోవడం, భయపెట్టేందుకు చూపించిన సీన్సే పదే పదే చూపించడం వల్ల భయం సంగతి పక్కన పెడితే ఇదేం గొడవరా నాయనా అని తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. శశాంక్ వెన్నెలకంటి రాసిన మాటలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
కట్టప్ప ఈజ్ బ్యాక్ అంటూ పబ్లిసిటీలో సత్యరాజ్‌ని ఎక్కువగా వాడడం, పోస్టర్స్‌ని కూడా హాలీవుడ్ మూవీ రేంజ్‌లో డిజైన్ చేయించడంతో ఈ సినిమాపై కాస్తో కూస్తో ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. కానీ, సినిమాలో అంత సీన్ లేదనే విషయం మొదటి షో పడగానే ఆడియన్స్‌కి అర్థమైపోతుంది. సత్యరాజ్ పేరు పబ్లిసిటీకి ప్లస్ అయింది తప్ప సినిమాలో మాత్రం కాదు. ఎంచుకున్న కథ, దాని కోసం తీసుకున్న బ్యాక్‌డ్రాప్ సినిమాకి ప్లస్ అవుతుందని డైరెక్టర్ అనుకున్నాడు. కానీ, సినిమాకి అదే మైనస్ పాయింట్‌గా మారింది. సత్యరాజ్ ప్రేతాత్మగా మారడానికి కారణమైన ఫ్లాష్‌బ్యాక్ కూడా పేలవంగా వుండడం, అతని క్యారెక్టర్ అంతగా హైలైట్ అవ్వకపోవడం సినిమాని దెబ్బ తీసింది. ఫైనల్‌గా చెప్పాలంటే హార్రర్ థ్రిల్లర్స్‌కి ఎక్కువ మార్కెట్ వున్నప్పటికీ అందులో దొర చిత్రాన్ని ఆడియన్స్ మినహాయిస్తారనేది మాత్రం వాస్తవం.
ఫినిషింగ్ టచ్: కట్టప్ప ఈజ్ బ్యాడ్
సినీజోష్ రేటింగ్: 2/5