Advertisementt

సినీజోష్‌ రివ్యూ: ఒక్క అమ్మాయి తప్ప

Sat 11th Jun 2016 01:51 PM
sandeep kishna new movie okka ammayi thappa,telugu movie okka ammayi thappa,okka ammayi thappa movie review in cinejosh,okka ammayi thappa cinejosh review  సినీజోష్‌ రివ్యూ: ఒక్క అమ్మాయి తప్ప
సినీజోష్‌ రివ్యూ: ఒక్క అమ్మాయి తప్ప
Advertisement
Ads by CJ

అంజిరెడ్డి ప్రొడక్షన్స్‌ 

ఒక్క అమ్మాయి తప్ప 

తారాగణం: సందీప్‌ కిషన్‌, నిత్యమీనన్‌, రవికిషన్‌, 

రాహుల్‌ దేవ్‌, రోహిణి, నళిని, జయప్రకాష్‌, అజయ్‌, 

ఆలీ, సప్తగిరి, పృథ్వీ, తాగుబోతు రమేష్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు 

సంగీతం: మిక్కీ జె.మేయర్‌ 

ఎడిటింగ్‌: గౌతంరాజు 

నిర్మాత: భోగాది అంజిరెడ్డి 

రచన, దర్శకత్వం: రాజసింహ తాడినాడ 

విడుదల తేదీ: 10.06.2016 

భారతదేశం నా మాతృభూమి.. భారతీయులందరూ నా సహోదరులు.. ఈ ప్రతిజ్ఞను పాఠశాలల్లో ప్రతిరోజూ చేయించేవారు. నా సహోదరులు అంటే అందరూ కలిసి మెలిసి వుండాలని దాని ఉద్దేశం. కానీ, మన సినిమాలో హీరో కృష్ణకి చిన్నప్పుడే వేరే అర్థం తెలుసు. అందుకే భారతీయులందరూ నా సహోదరులు అనగానే ఒక్క అమ్మాయి తప్ప అంటాడు. అదే ఈ సినిమా టైటిల్‌. ఆ అమ్మాయే మ్యాంగో. ఆమెకు ఇండియన్‌ ఫ్లాగ్‌ ఇచ్చి ఐ లవ్‌ యూ చెప్తాడు. ఇద్దరం పెళ్ళి చేసుకుందాం అంటాడు. ఇది కేవలం లవ్‌స్టోరీయే అనుకుంటే పొరపాటే. టెర్రరిజం, మత సామరస్యం, దేశభక్తి.. వీటన్నింటితోపాటు లవ్‌ కూడా ఈ సినిమాలో వుంది. మ్యాంగో పెరిగి పెద్దదై నిత్యమీనన్‌గా మారితే, కృష్ణ పెరిగి పెద్దవాడై సందీప్‌ కిషన్‌ అయ్యాడు. చిన్నప్పుడే విడిపోయిన వీరిద్దరూ ఎక్కడ కలుసుకున్నారంటే హై టెక్‌ సిటీ ఫ్లై ఓవర్‌ మీద. కృష్ణ జాతక రీత్యా ఆరోజు బయటకు వెళ్ళొద్దని, వెళ్తే ప్రమాదం తప్పదని ఓ సిద్ధాంతి అతని కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమాలతాడు. కానీ, అది పట్టించుకోకుండా బయల్దేరతాడు కృష్ణ. ఇలా కృష్ణ, మ్యాంగో ఫ్లై ఓవర మీదకు రాగానే ట్రాఫిక్‌ జామ్‌ అవుతుంది. అంతలోనే పెద్ద యాక్సిడెంట్‌ కూడా జరుగుతుంది. గంటల కొద్దీ ట్రాఫిక్‌ జామ్‌ అవడంతో ఈ గ్యాప్‌లో కృష్ణ, మ్యాంగో ప్రేమలో పడిపోతారు. ఆమె తన చిన్నప్పటి మ్యాంగోయేనని కనిపెడతాడు కృష్ణ. కట్‌ చేస్తే పలు బాంబు కేసుల్లో నిందితుడైన అస్లాం(రాహుల్‌ దేవ్‌)ను జైలు నుంచి విడిపించడానికి హైటెక్‌ సిటీ ఫ్లై ఓవర్‌పై మూడు బాంబులు పెట్టిస్తాడు అతని రైట్‌ హ్యాండ్‌ అన్వర్‌(రవికిషన్‌). వాటిని ఆపరేట్‌ చెయ్యడానికి ఓ మనిషిని పంపిస్తాడు. కానీ, ఆ బాంబులు టైమ్‌కి పేలవు. డిజప్పాయింట్‌ అయిన అన్వర్‌ రెండో ప్రయత్నంగా ఆ బాంబుల్ని ఆపరేట్‌ చేసేందుకు కృష్ణను సెలెక్ట్‌ చేసుకుంటాడు. ఫ్లై ఓవర్‌ పక్కనే వున్న బిల్డింగ్‌ నుంచి కృష్ణకి ఫోన్‌ చేసి తన పని చేసి పెట్టాలని, లేకపోతే అతని లవర్‌ని చంపేస్తానని బెదిరిస్తాడు. అన్వర్‌ చెప్పినట్టుగానే కృష్ణ ఆ బాంబులను ఆపరేట్‌ చేశాడా? తన లవర్‌ని కాపాడుకోవడం కోసం లక్షల మందిని చంపడానికి కూడా కృష్ణ వెనుకాడలేదా? ఆ తర్వాత ఫ్లై ఓవర్‌ మీద జరిగిన పరిణామాలేమిటి? అన్వర్‌ ప్లాన్‌ సక్సెస్‌ అయిందా? కృష్ణ, మ్యాంగో.. అన్వర్‌ నుంచి తప్పించుకోగలిగారా? అనేది మిగతా కథ. 

డిఫరెంట్‌ కాన్సెప్ట్‌లను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరించారు, ఆదరిస్తున్నారు కూడా. అయితే ఆ కాన్సెప్ట్‌ని ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా చెప్పిన సినిమాలే సక్సెస్‌ అయ్యాయి. సీరియస్‌గా నడిచే కథలో కమెడియన్స్‌తో చేయించే కామెడీ, టీవీ కామెడీ, రేడియో కామెడీ.. ఇలా రకరకాల కామెడీని కూడా జతచేస్తే సినిమాయే కామెడీ అయిపోతుంది. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. సమస్యను ఎంత తీవ్రంగా చూపించినా దాన్ని సరదాగా తీసుకునేలా డైరెక్టర్‌ ఆడియన్స్‌ని ట్యూన్‌ చేశాడు. కాబట్టి సినిమాలో టెర్రరిజం ప్రాబ్లమ్‌ స్టార్ట్‌ అయినప్పటి నుంచి ఏ దశలోనూ ఆడియన్స్‌ టెన్షన్‌ పడరు. ఏం జరిగినా తట్టుకునే శక్తి తమకు వుంది అన్నట్టు ధీమాగా కూర్చుంటారు. పైగా సీరియస్‌గా నడిచే కథలోకి మధ్య మధ్యలో కమెడియన్స్‌ కూడా జొరబడి సినిమాని మరింత కామెడీ చేసి పారేశారు. దాదాపు గంటన్నర సేపు ఫ్లై ఓవర్‌ మీదే సినిమా నడుస్తుందంటే చూసి తట్టుకునే ఓపిక ప్రేక్షకులకు వుంటుందా? 

తన ప్రతి సినిమా డిఫరెంట్‌గా వుండాలని కోరుకునే సందీప్‌ కిషన్‌, తను చేసే ప్రతి క్యారెక్టర్‌కి సినిమాలో చాలా ఇంపార్టెన్స్‌ వుండాలనుకునే నిత్యమీనన్‌ తమ తమ క్యారెక్టర్స్‌ని బాగానే చేశారు. విలన్‌గా రవికిషన్‌ ఓకే అనిపించాడు. ఇక మిగతా క్యారెక్టర్స్‌ అన్నీ కామెడీతో నిండినవే. కానీ, మనకు నవ్వే సరిగ్గా రాదు. టెక్నికల్‌గా ఈ సినిమాకి ప్లస్‌ అయిన ఒకే ఒక్కడు ఛోటా కె. నాయుడు. ఫస్ట్‌హాఫ్‌లోని కొన్ని సీన్స్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా తీశాడు. సినిమాటోగ్రఫీలో రిచ్‌నెస్‌ బాగా కనిపించింది. ఎప్పుడైతే సినిమా ఫ్లై ఓవర్‌ మీద ల్యాండ్‌ అయి అక్కడక్కడే తిరుగుతుందో అప్పుడు ఛోటాకి తన ప్రతిభ చూపించే అవకాశం రాలేదు. మిక్కీ జె. మేయర్‌ చేసిన రెండు పాటలు బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్‌ కూడా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఫర్వాలేదనిపించాడు. డైరెక్టర్‌ రాజసింహ గురించి చెప్పాలంటే లవ్‌స్టోరీ, టెర్రరిజం, మత సామరస్యం, దేశభక్తి.. ఇలా కథని కలగా పులగం చేసేసి ఆడియన్స్‌ దేనికి కనెక్ట్‌ అవ్వాలో అర్థం కాకుండా చేశాడు. 

తన ప్రేమను దక్కించుకున్న ఫ్లై ఓవర్‌ మీదే నిలబడి హీరో మనకి ఈ కథంతా చెప్తుంటాడు. కథ హీరో, హీరోయిన్‌ల చిన్నతనం నుండి ప్రారంభమవుతుంది. కొన్ని అనవసరమైన సీన్ల తర్వాత ఓ ట్విస్ట్‌(మనకు తెలిసిందే)తో ఫస్ట్‌ హాఫ్‌ ముగుస్తుంది. సెకండాఫ్‌ స్టార్ట్‌ అయినప్పటి నుంచి హీరో, విలన్‌ ఫోన్‌లో మాట్లాడుకునే సందర్భాలే ఎక్కువగా వుంటాయి. గంటన్నర సేపు ఫ్లై ఓవర్‌ మీదే సినిమా రన్‌ అవడం వల్ల మనం కూడా అక్కడే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన ఫీలింగ్‌ కలుగుతుంది. బ్రేకింగ్‌ న్యూస్‌ అంటూ మధ్య మధ్యలో కనిపించే టీవీ యాంకర్స్‌ మనల్ని రకరకాలుగా హింసిస్తారు. హై టెక్‌ సిటీ ఫ్లై ఓవర్‌మీద ఓ పెద్ద యాక్సిడెంట్‌ జరిగి ట్రాఫిక్‌ జామ్‌ అయినా అక్కడ ఎలాంటి హడావిడి కనిపించదు. ఎవరి క్యారెక్టర్‌ని వారు చేసుకుంటూ వెళ్లిపోతుంటారు. థియేటర్‌ నుంచి బయటికి వచ్చిన తర్వాత ప్రేక్షకులు చెప్పుకోవడానికి ఎక్స్‌ట్రార్డినరీ అనిపించే ఒక్క సీన్‌ కూడా ఇందులో లేదు. ఫైనల్‌గా చెప్పాలంటే కొత్త కాన్సెప్ట్‌ని తీసుకొని ఓ కొత్త తరహా సినిమా చేద్దామనుకున్న రాజసింహ అసలు కథలో కామెడీని కూడా మిక్స్‌ చేయడంతో ఎటూ కాని సినిమాగా ఒక్క అమ్మాయి తప్ప మిగిలిపోయింది. 

ఫినిషింగ్‌ టచ్‌: వృధా ప్రయాసే.. 

సినీజోష్‌ రేటింగ్‌: 2/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ