శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్
రైట్ రైట్
తారాగణం: సుమంత్ అశ్విన్, పూజ ఝవేరి,
ప్రభాకర్, నాజర్, పావని, ధన్‌రాజ్, షకలక శంకర్,
జీవా, రాజా రవీంద్ర తదితరుల
సినిమాటోగ్రఫీ: శేఖర్ వి. జోసఫ్
సంగీతం: జె.బి.
ఎడిటింగ్: ఎస్.బి.ఉద్దవ్
కథ: సుజీత్
మాటలు: డార్లింగ్ స్వామి
సమర్పణ: వత్సవాయి వెంకటేశ్వర్లు
నిర్మాత: జె.వంశీకృష్ణ
దర్శకత్వం: మను
విడుదల తేదీ: 10.06.2016
తూనీగ తూనీగతో హీరోగా ఎంటర్ అయిన సుమంత్ అశ్విన్ అంతకుముందు ఆ తరువాత, కేరింత, కొలంబస్ వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరవ్వాలని ట్రై చేశాడు. క్యూట్ లవ్ స్టోరీలకు మాత్రమే సూట్ అయ్యే అతని బాడీ లాంగ్వేజ్‌కి పూర్తి భిన్నమైన క్యారెక్టర్ లేటెస్ట్‌గా వచ్చిన రైట్ రైట్ చిత్రంలో చేశాడు. మలయాళంలో ఆర్డినరీ పేరుతో విడుదలైన చిత్రాన్ని మను దర్శకత్వంలో జె.వంశీకృష్ణ రైట్ రైట్ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఇప్పటివరకు సుమంత్ అశ్విన్ చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక ఎత్తు అని చెప్పాలి. మరి ఈ కొత్త క్యారెక్టర్‌తో సుమంత్ అశ్విన్ ప్రేక్షకులకు దగ్గర కాగలిగాడా? బాహుబలిలో కాళకేయగా ఓ మెరుపు మెరిసిన ప్రభాకర్‌కి ఈ చిత్రం ఎలాంటి పేరు తెచ్చింది? మలయాళంలో సూపర్‌హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో ఎలాంటి టాక్ సంపాదించుకుంది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
మలయాళంలో పెట్టిన ఆర్డినరీ అనే టైటిల్‌కి తగ్గట్టుగా ఇది నిజంగానే ఓ ఆర్డినరీ కథ. గతంలో ఇలాంటి ట్విస్టులు వున్న సినిమాలు ఎన్నో వచ్చాయి. వాటినే అటు తిప్పి ఇటు తిప్పి మలయాళంలో ఆర్డినరీ పేరుతో తీశారు. అయితే అక్కడ కలెక్షన్స్ మాత్రం ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చాయి. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ఈ కథ ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. మరి రైట్ రైట్ ఎంతవరకు తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయింది అనేది చెప్పాలంటే పెదవి విరవక తప్పదు. ఒక చిన్న కథను చెప్పడానికి రెండు గంటలు సమయం తీసుకొని ప్రేక్షకుల్ని సీట్లలో కూర్చోబెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. అసలు కథలోకి వెళ్ళడానికి డైరెక్టర్ నానా తిప్పలు పడడమే కాకుండా ప్రేక్షకుల్ని అష్ట కష్టాల పాలు చెయ్యాల్సి వచ్చింది. నిజానికి ఈ సినిమా ఫస్ట్ హాఫ్‌లో కథ ఏమీ లేదనే చెప్పాలి. అసలు కథంతా సెకండాఫ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయాలు, అనవసరమైన కామెడీ, లెంగ్త్‌ని పెంచే సీన్లు, సందర్భం లేని పాటలతో గడిచిపోతుంది. సెకండాఫ్ మాత్రం మంచి గ్రిప్‌తో స్టోరీ రన్ అవుతుంది.
రవి(సుమంత్ అశ్విన్) ఓ బస్ కండక్టర్. ఆ బస్ డ్రైవర్ శేషు(ప్రభాకర్). ఇద్దరి మధ్య మంచి అనుబంధం వుంటుంది. ఓరోజు శేషు బాగా తాగి వుండడంతో అతని బదులు రవి బస్‌ని డ్రైవ్ చేస్తాడు. హఠాత్తుగా దేవా అనే వ్యక్తి బస్‌కి అడ్డం రావడం, అతనికి దెబ్బలు తగిలి పడిపోవడం జరిగిపోతుంది. అటుగా వెళ్తున్న ఓ వాహనంలో దేవాని ఎక్కించి హాస్పిటల్‌లో చేర్పించమని డ్రైవర్‌కి చెప్పి గుట్టు చప్పుడు కాకుండా ఇంటికి వచ్చేస్తారు రవి, శేషు. దేవాకి చెందిన బ్యాగ్‌ని కూడా తమతోపాటు తెస్తారు. అందులో ఓ ఫోటో చూసి షాక్ తింటారు ఇద్దరూ. ఆ ఊరి పెద్ద మనిషి విశ్వనాథ్(నాజర్) కొడుకే దేవా. మరో వారం రోజుల్లో విశ్వనాథ్ మేనకోడలుతో దేవా పెళ్ళి జరగాల్సి వుంది. మరుసటి రోజు దేవా డెడ్ బాడీని ఓ లోయలో వున్నట్టు పోలీసులు తెలుసుకుంటారు. హాస్పిటల్‌లో వుండాల్సిన దేవా ఎలా చనిపోయాడు? లోయలోకి ఎలా వచ్చాడు? దేవా చనిపోవడానికి తనే కారణమని రవి పోలీసులకు చెప్పాడా? యాక్సిడెంట్ వల్లే దేవా చనిపోయాడా? ఇది యాక్సిడెంటా? మర్డరా? అనేది సెకండాఫ్ చూస్తేనే తెలుస్తుంది.
రైట్ రైట్ అనే టైటిల్ ఈ మర్డర్ మిస్టరీకి అస్సలు సరిపడలేదు. పైగా ఈ చిత్రంలో కండక్టర్ క్యారెక్టర్‌కి సుమంత్ అశ్విన్ సూట్ అవ్వలేదు. పెర్‌ఫార్మెన్స్ పరంగా అతనికి మంచి మార్కులే ఇవ్వొచ్చుగానీ అతనితో ఆ క్యారెక్టర్ చేయించడం మాత్రం రాంగ్ అనే చెప్పాలి. ప్రస్తుతం అతని ఏజ్‌కి లవ్ స్టోరీలు, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్ మాత్రమే సూట్ అవుతాయి. ఎప్పుడో పది సంవత్సరాల తర్వాత చెయ్యాల్సిన క్యారెక్టర్ కావడం వల్ల అతన్ని కండక్టర్ క్యారెక్టర్‌లో ఊహించుకోవడం కష్టం. ఇక సినిమాకి ఎంతో హెల్ప్ అవుతుందని భావించి కాళకేయ ప్రభాకర్‌ని తీసుకొచ్చారు. అయితే అతని వల్ల సినిమాకి ఎలాంటి ఉపయోగం జరగలేదన్నది నిజం. పెర్‌ఫార్మెన్స్ పరంగా కూడా ప్రభాకర్ అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. మిగిలిన క్యారెక్టర్స్‌లో ఊరి పెద్దగా నాజర్ చేసిన క్యారెక్టర్ చాలా రొటీన్‌గా వుంటుంది. అలాంటి క్యారెక్టర్స్ గతంలో చాలా సినిమాల్లో చేసేశాడు. హీరోయిన్ పూజ ఝవేరి క్యారెక్టర్ కేవలం పాటలకు మాత్రమే పరిమితమైపోయింది. ధన్‌రాజ్, షకలక శంకర్ తమ కామెడీతో ప్రేక్షకుల్ని నవ్వించేందుకు విఫలయత్నం చేశారు.
ఈ సినిమాకి టెక్నికల్‌గా ప్లస్ అయ్యే అంశాల్లో ఫోటోగ్రఫీని మొదట చెప్పుకోవాలి. శేఖర్ వి. జోసఫ్ ప్రకృతి అందాలను కను విందు చేసేలా చిత్రీకరించాడు. సినిమా ఎలా వున్నా ప్రతి సీన్‌ని అందంగా చూపించే ప్రయత్నం చేయడంతో కాస్త ప్లెజెంట్‌గా అనిపిస్తుంది. జె.బి. సంగీతం విషయానికి వస్తే ఓ రెండు పాటలు ఫర్వాలేదు అనిపించాడు. అయితే పిక్చరైజేషన్ దానికి తగ్గట్టుగా లేదనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో రణగొణ ధ్వనులు తప్ప మంచి మ్యూజిక్‌ని మనం ఎంజాయ్ చెయ్యలేం. ఎస్.బి.ఉద్దవ్ ఎడిటింగ్ ఫర్వాలేదు. మలయాళంలో మంచి హిట్ అయిన ఈ యూనివర్సల్ సబ్జెక్ట్‌తో సినిమాని ఆకట్టుకునేలా రెండు గంటల సేపు నడిపించడంలో డైరెక్టర్ మను సక్సెస్ అవ్వలేకపోయాడు. సెకండాఫ్‌ని గ్రిప్పింగ్‌గా తీసినప్పటికీ ఫస్ట్ హాఫ్ మాత్రం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. డార్లింగ్ స్వామి మాటలు ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. చాలా సాదా సీదాగా వున్న డైలాగ్స్ ఏ దశలోనూ మనకు కనెక్ట్ అవ్వవు. మేకింగ్ విషయానికి వస్తే కేవలం ఫోటోగ్రఫీ తప్ప స్క్రీన్ మీద రిచ్‌నెస్ అనేది ఎక్కడా కనిపించదు.
పోలీస్ కావాలని కలలు కన్న హీరో రవి చివరికి బస్ట్ కండక్టర్‌గా చేరిపోయి, డ్రైవర్ శేషుతో కలిసి డ్యూటీ చెయ్యడం, మధ్యలో హీరోయిన్ ప్రేమలో పడడం, ఊరిలో జరిగే ఉత్సవం వంటి సీన్స్‌తో ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్లోగా నడిచిపోతుంది. ఒక ట్విస్ట్‌తో ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతుంది. సెకండాఫ్‌లో స్లో నేరేషన్ అనేది లేకుండా సినిమాని స్పీడ్‌గా నడిపించగలిగాడు డైరెక్టర్. సెకండాఫ్ కథలో విషయం వుండడంతో నెక్స్‌ట్ జరగబోయే సీన్ ఊహించలేం. మంచి సస్పెన్స్ మెయిన్‌టెయిన్ చెయ్యడం వల్ల సినిమా ఎండింగ్ వరకు ఆడియన్స్ సీట్లలో కూర్చోగలుగుతారు. సినిమాకి ఎంతో కొంత బలం చేకూరుతుందీ అంటే అది సెకండాఫ్ వల్లే. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్స్, ఫార్ములా సినిమాలు, డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో వచ్చే సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా మింగుడు పడడం కష్టమే. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ బస్ జర్నీ చాలా సాదా సీదాగా అనిపిస్తుంది. కమర్షియల్‌గా ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది తెలుసుకోవాలంటే కొంత కాలం వెయిట్ చెయ్యాల్సిందే.
ఫినిషింగ్ టచ్: అక్కడ రైటే.. ఇక్కడే రాంగ్
సినీజోష్ రేటింగ్: 2.25/5