గీతా ఆర్ట్స్
సరైనోడు
తారాగణం: అల్లు అర్జున్, శ్రీకాంత్, ఆది పినిశెట్టి,
రకుల్ ప్రీత్‌సింగ్, కేథరిన్ త్రెస, జయప్రకాష్, సాయికుమార్,
సుమన్, బ్రహ్మానందం, అంజలి(స్పెషల్ సాంగ్) తదితరులు
సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ
సంగీతం: ఎస్.ఎస్.థమన్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
మాటలు: ఎం.రత్నం
సమర్పణ: అల్లు రామలింగయ్య
నిర్మాత: అల్లు అరవింద్
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
విడుదల తేదీ: 22.04.2016
బోయపాటి శ్రీను సినిమా అనగానే గుర్తొచ్చేవి భారీ ఎమోషన్స్, పీక్స్‌లో వుండే మాస్ ఎలిమెంట్స్, హై ఎండ్‌లో వుండే హీరోయిజం.. ఇక అల్లు అర్జున్ సినిమాలకు మాస్‌లోనే కాదు యూత్‌లో, ఫ్యామిలీ ఆడియన్స్‌లో గట్టి ఫాలోయింగ్ వుంది. నందమూరి బాలకృష్ణతో సింహా, లెజెండ్, ఎన్టీఆర్‌తో దమ్ము వంటి పవర్‌ఫుల్ మూవీస్ చేసిన బోయపాటి శ్రీను ఫస్ట్ టైమ్ మెగా కాంపౌండ్‌లోని హీరో అల్లు అర్జున్‌తో సరైనోడు చిత్రాన్ని చేశాడు. గీతా ఆర్ట్స్ బేనర్‌లో అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సరైనోడు బోయపాటి మార్క్ సినిమానా? అల్లు అర్జున్ మార్క్ మూవీనా? ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇది ఎలాంటి సినిమా అయింది? ఈ ఫస్ట్ కాంబినేషన్‌ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
బోయపాటి శ్రీను సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది మితిమీరిన హింస, అంతులేని ఎమోషన్. ఈ రెండింటినీ బేస్ చేసుకొని అతని గత సినిమాలు రూపొందాయి. ఆ కోవలోకే అల్లు అర్జున్‌తో చేసిన లేటెస్ట్ మూవీ సరైనోడు చేరుతుంది. బోయపాటి గత చిత్రాలు బలమైన కథ, కథనాలతో అందర్నీ ఆకట్టుకున్నాయి. అయితే ఈ సరైనోడులో అవి లోపించాయి. ఏ సీన్‌కి ఆ సీనే అన్నట్టుగా వుండే అతుకుల కథ, దానికి తగ్గట్టుగా సినిమాని సాగదీసి లెంగ్త్ పెంచేందుకు అన్నట్టుగా సాగే కథనం. వీటితో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేందుకు శత విధాలా ప్రయత్నించాడు బోయపాటి. మిలటరీలో కొన్నాళ్ళు పనిచేసి అక్కడి కంటే సొసైటీలోనే తనకు పని ఎక్కువగా వుందని గుర్తించిన గణ(అల్లు అర్జున్) సిటీలో జరిగే అన్యాయాలను ఎదుర్కొని శత్రువుల పని పట్టడమే పనిగా పెట్టుకుంటాడు. రోజుకు రెండు గొడవలు లేనిదే అతనికి నిద్ర పట్టదు. తండ్రి ఉమాపతి(జయప్రకాష్) పెద్ద హోదాలో వున్నప్పటికీ గణ మాత్రం అందరి సమస్యలను నెత్తినేసుకొని తండ్రికి సమస్యలు తెచ్చిపెడుతుంటాడు. కొడుకు పెళ్ళి చెయ్యాలని డిసైడ్ అయిన ఉమాపతి అతని స్నేహితుడు జె.పి.(సాయికుమార్) కూతుర్ని చూసి రమ్మని బాబాయ్ శ్రీపతి(శ్రీకాంత్)తో ఊరికి పంపిస్తాడు ఉమాపతి. సాయికుమార్‌కి, సి.ఎం. కొడుకైన వైరం ధనుష్(ఆది పినిశెట్టి)కి పొలం విషయంలో సమస్య ఏర్పడుతుంది. సాయికుమార్‌ని తన దారిలోకి తెచ్చుకునేందుకు అతని కూతురు జాను(రకుల్ ప్రీత్)ని కిడ్నాప్ చేస్తాడు ధనుష్. జానుని చూసుకోవడానికి వచ్చిన గణకి ఈ విషయం తెలిసి ధనుష్ మనుషులతో తలపడతాడు. అందర్నీ చితకబాది జానుని విడిపిస్తాడు. ఇది తెలుసుకున్న ధనుష్ సాయికుమార్‌తోపాటు అతని బంధువుల్ని, అతని అనుచరుల్ని చంపేస్తాడు. జాను తప్పించుకొని గణ దగ్గరికి వస్తుంది. తన మనుషుల్ని చావ బాదింది గణ అని తెలుసుకొని అతనిపై ప్రత్యక్ష పోరుకి సిద్ధమవుతాడు ధనుష్. ఇది ఒక కథ. ఓ కోటీశ్వరుడి కొడుకు ఒక అమ్మాయిని రేప్ చేసేందుకు ట్రై చేస్తాడు. అతను కొట్టిన దెబ్బలకు ఆ అమ్మాయి చనిపోతుంది. చనిపోయినా సరేలా అమ్మాయిని అతను వదిలిపెట్టడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ ఊరి ఎమ్మెల్యే హన్సితరెడ్డి(కేథరిన్ త్రెస)ని ఆశ్రయిస్తారు. కోర్టుకు వెళ్ళినా ఆ తల్లిదండ్రులకు న్యాయం జరగదు. దీంతో ఆ ఇద్దరూ కోర్టు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటారు. ఆ అమ్మాయి చావుకు కారణమైన కోటీశ్వరుడి కొడుకు కాలు విరిచేస్తాడు గణ. ఇది మరో కథ. ఈ కేసులో కూడా పరోక్షంగా ధనుష్ హస్తం వుంటుంది. ఇలా నేరాలు చేసుకుంటూ, మనుషుల్ని చంపుకుంటూ వెళ్ళే ధనుష్‌ని గణ ఎలా ఎదుర్కొన్నాడు? తన వాళ్ళని కోల్పోయి తన సహాయం కోరి వచ్చిన జానుకి గణ న్యాయం చెయ్యగలిగాడా? అనేది మిగతా కథ.
బోయపాటి రాసుకున్న ఈ కథలో బలం లేదు. హీరో దూకుడుకి అర్థం లేదు. అలాగే విలన్ ధనుష్ విచక్షణా రహితంగా అందర్నీ చంపుకుంటూ వెళ్ళడమే పనిగా పెట్టుకోవడం విడ్డూరంగా అనిపిస్తుంది. సమాజంలో జరిగే అన్యాయాలనూ, అరాచకాలనూ అడ్డుకోవడమే హీరో పని. ఎన్నో సంవత్సరాలుగా మనం ఇలాంటి సినిమాలనే చూస్తున్నాం. అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను చేసిన సరైనోడు కూడా అలాంటి సినిమానే. కథలోగానీ, కథనంలోగానీ, పాటల్లోగానీ, ఎంటర్‌టైన్‌మెంట్‌లోగానీ, యాక్షన్ సీక్వెన్స్‌లలో గానీ ఇసుమంతైనా కొత్తదనం లేని సినిమా అంటే ఇదేనని నిస్సందేహంగా చెప్పొచ్చు. అంతేకాకుండా ఇందులో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే కొన్ని కామెడీ సీన్స్, ఓ పట్టాన జీర్ణించుకోలేని లవ్ సీన్స్, చిరాకు తెప్పించే యాక్షన్ సీక్వెన్స్‌లు చాలా వున్నాయి. జీన్స్‌లో అయినా, చీరల్లో అయినా ఎక్స్‌పోజింగ్ చేసే ఎమ్మెల్యేని హీరో ప్రేమించడం, ఆమె చుట్టూ తిరిగి పాటలు పాడడం చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.
ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ఇందులో లెక్కకు మించిన నటీనటులు వున్నారు. విలన్‌గా నటించిన ఆది పినిశెట్టి తప్ప మిగతా వాళ్ళంతా ఏదో చేశాంలే అన్నట్టుగా కనిపిస్తారు తప్ప తమ తమ క్యారెక్టర్స్‌లో ఇన్‌వాల్వ్ అయి చేసినట్టుగా అనిపించదు. అల్లు అర్జున్ పెర్‌ఫార్మెన్స్‌లోగానీ, డాన్సుల్లోగానీ, ఫైట్స్‌లోగానీ అతని పాత సినిమాలను చూస్తున్న ఫీలింగ్‌నే కలిగించినా అతని హీరోయిజమ్ ఆకట్టుకుంటుంది. హీరోగా సక్సెస్‌లో వున్న ఆది పినిశెట్టి ఇందులో విలన్‌గా చేశాడు.. ఈ సినిమాలో ఇది తప్ప మరో విశేషం లేదనే చెప్పాలి. రకుల్ ప్రీత్, కేథరిన్‌లను వీలైనంత గ్లామర్‌గా చూపించే(పాటల్లో మాత్రమే) ప్రయత్నం జరిగింది. తన క్యారెక్టర్‌కి తగ్గట్టుగానే అప్పుడప్పుడు వచ్చి నవ్వించడానికి ట్రై చేశాడు బ్రహ్మానందం.
టెక్నికల్‌గా చూసుకుంటే రిషి పంజాబీ ఫోటోగ్రఫీ అద్భుతంగా వుంది. ప్రతి సీన్‌ని చాలా కేర్ తీసుకొని చేసినట్టుగా తెలుస్తుంది. మ్యూజిక్ విషయానికి వస్తే థమన్ చాలా రెగ్యులర్ సాంగ్స్ చేశాడు. ఇబ్బంది పెట్టే కథ, కథనాల మధ్యలో పాటల రూపంలో ఇబ్బంది పెట్టడానికి తప్ప థమన్ మ్యూజిక్ ఉపయోగపడలేదు. అయితే రీరికార్డింగ్ ఫర్వాలేదు అనిపించాడు. సినిమాకి పెద్ద మైనస్‌గా చెప్పాలంటే స్లో మోషన్. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఫైట్‌నూ స్లో మోషన్‌లో చేసి ప్రేక్షకులకు చుక్కలు చూపించారు. రెండు గంటల నలభై నిముషాల సినిమాలో ఈ స్లో మోషన్‌ను తీసేస్తే ఓ 20 నిముషాల టైమ్ తగ్గేది. ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి. ఓ పాటలో వేసిన సెట్స్ చాలా బాగున్నాయి. బోయపాటి గత చిత్రాలతో పోలిస్తే ఈ సరైనోడు చిత్రాన్ని సరిగ్గా తియ్యలేకపోయాడని చెప్పాలి. సినిమాకి సంబంధించిన ఏ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోలేదని చూసిన ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. మితిమీరిన హింస వల్ల ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఈ సినిమా ఆకట్టుకునే అవకాశాలు తక్కువ.
తప్పు చేసిన వారిని చితగ్గొట్టడమే పనిగా పెట్టుకున్న హీరో సినిమా ప్రారంభంలోనే క్లైమాక్స్‌ని తలపించే ఓ లెంగ్తీ ఫైట్ చేస్తాడు. ఆ తర్వాత అసలు కథ ప్రారంభమవుతుంది. గొడవల్లో బిజీగా వుండే హీరో ఆటవిడుపుగా ఆ ఊరి ఎమ్మెల్యేని చూసి లవ్‌లో పడడం, ఆమెను ఒప్పించడానికి పాటలు పాడడం, దానికి ఆ ఎమ్మెల్యే విసుక్కోకుండా అతన్ని భరించడం, మధ్యలో కొన్ని కామెడీ సీన్స్ ఇలా ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవుతుంది. సెకండాఫ్‌కి వచ్చే సరికి విలన్ ధనుష్‌ని ఎదుర్కోవడం, అతని ఎత్తులకు హీరో పై ఎత్తులు వేయడం క్లైమాక్స్‌లో ఓ భారీ ఫైట్‌లో విలన్‌ని చంపడంతో సినిమా ముగుస్తుంది. ఇందులో అల్లు అర్జున్ హీరోయిజమ్‌పై ఎక్కువ దృష్టి పెట్టాడు డైరెక్టర్. ట్రైలర్‌లో చెప్పినట్టుగా.. మాస్.. ఊర మాస్ అనే డైలాగ్ సినిమా మొత్తానికి వర్తిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో కొంత కామెడీ వర్కవుట్ అయింది. అలాగే విలన్ ధనుష్‌గా ఆది పినిశెట్టిని బాగా బిల్డప్ చేశారు. బన్ని మాస్ లుక్ బాగుంది. ఇవన్నీ సినిమాకి ప్లస్ పాయింట్స్ అయితే బోయపాటి సినిమాల్లో వుండే హై ఎమోషన్స్ ఈ సినిమాలో లేకపోవడం, కథలో విషయం లేకపోవడం, లెక్కకు మించిన ఫైట్స్.. అదీ స్లో మోషన్‌లో చూపించడం, మితిమీరిన హింస, సినిమాకి ఏమాత్రం హెల్ప్ అవ్వని పాటలు, ఎమ్మెల్యేతో హీరో లవ్‌లో పడే సీన్స్ సినిమాకి పెద్ద మైనస్‌లుగా మారాయి. ప్రతి సినిమాలోనూ తన గ్లామర్‌తో, పెర్‌ఫార్మెన్స్‌తో సినిమాకి ఎంతో కొంత హెల్ప్ అయ్యే రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో గ్లామర్‌గా కనిపించకపోగా, ఆమె క్యారెక్టర్ వల్ల సినిమాకి ఎలాంటి ఉపయోగం జరగలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే ఇది బోయపాటి సినిమా కాదు, అలాగని అల్లు అర్జున్ సినిమా కూడా కాదు. రెగ్యులర్‌గా కమర్షియల్ మూవీస్ చూసి ఎంజాయ్ చేసే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం వుందేమోగానీ కొత్తదనం కోరుకునే ఆడియన్స్‌ని మాత్రం ఈ సరైనోడు డిజప్పాయింట్ చేస్తాడు.
ఫినిషింగ్ టచ్: ఇది బోయపాటి సినిమా కాదు, బన్ని సినిమా కూడా కాదు.
సినీజోష్ రేటింగ్: 2.5/5