శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
వి క్రియేషన్స్
పోలీస్
తారాగణం: విజయ్, సమంత, ఎమీ జాక్సన్, రాధిక,
ప్రభు, మహేంద్రన్, రాజేంద్రన్, బేబి నైనిక తదితరులు
సినిమాటోగ్రఫీ: జార్జ్ సి.విలియమ్స్
సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్
ఎడిటింగ్: ఆంటోని ఎల్. రూబెన్
మాటలు: సాహితి
నిర్మాత: కలైపులి ఎస్.థాను
రచన, దర్శకత్వం: అట్లీ
విడుదల తేదీ: 15.04.2016
ఇప్పటివరకు ఇండియన్ సినిమాల్లో చాలా పోలీస్ స్టోరీస్ వచ్చాయి. ఏ స్టోరీ తీసుకున్నా ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్‌కి, విలన్‌కి మధ్య పోరాటమే వుంటుంది. కాలాన్ని బట్టి కథల్లో, స్క్రీన్‌ప్లేలో, బ్యాక్‌డ్రాపుల్లో, హీరో క్యారెక్టరైజేషన్స్‌లో మార్పులు వస్తున్నాయి. అంతే తప్ప పోలీస్‌కి, విలన్‌కి పోరాటం కామన్. అలాంటి ఒక కామన్ పాయింట్‌తో తెరకెక్కింది విజయ్ లేటెస్ట్ మూవీ పోలీస్. తమిళ్ తెరి పేరుతో, తెలుగులో పోలీస్ పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమాకి అట్లీ దర్శకుడు. ఒక సున్నితమైన కథాంశంతో అట్లీ రూపొందించిన రాజారాణి తమిళ్‌లోనూ, తెలుగులోనూ ఘనవిజయం సాధించింది. విజయ్‌తో చేసిన పోలీస్ చిత్రాన్ని మాత్రం పూర్తిగా విజయ్ ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకొని తీశాడు. పోలీస్ స్టోరీస్ ఎన్నో చూసేసిన ప్రేక్షకులకు ఈ పోలీస్ చిత్రంలో అట్లీ చూపించిన కొత్తదనం ఏమిటి? రాజారాణి వంటి లవ్ ఎంటర్‌టైనర్‌తో అందర్నీ ఆకట్టుకున్న అట్లీ పోలీస్ స్టోరీతో ప్రేక్షకుల్ని మెప్పించగలిగాడా? పోలీస్ చిత్రంతో విజయ్‌కి తెలుగులో మరో సూపర్‌హిట్ లభించిందా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
అతని పేరు విజయ్‌కుమార్(విజయ్). డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. సిన్సియర్ అండ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయిన విజయ్‌కి, పొలిటీషియన్ అయిన వెంకటరెడ్డి(మహేంద్రన్)కి మధ్య ఓ విషయంలో అగ్గి రాజుకుంటుంది. అది పెరిగి పెద్దదిగా మారుతుంది. వెంకటరెడ్డి వల్ల విజయ్‌కి, అతని ఫ్యామిలీకి నష్టం జరుగుతుంది. ఇదంతా ఫ్లాష్‌బ్యాక్. ప్రజెంట్‌గా హీరో పేరు జోసెఫ్ కురువిళ్ళ. కేరళలోని ఓ చిన్న ఊళ్ళో బేకరి నడుపుతుంటాడు. అతనికి ఓ కూతురు వుంటుంది. ఆమె పేరు నివేదిత(బేబీ నైనిక). నివేదిత చదివే స్కూల్‌లోని మిస్ ఏనీ(ఎమీ జాక్సన్)కి జోసెఫ్, నివేదితలంటే ప్రత్యేకమైన అభిమానం ఏర్పడుతుంది. గొడవలంటే దూరంగా వుండే జోసెఫ్ ఓరోజు ఏనీ వల్ల పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడి పోలీస్ ఆఫీసర్ జోసెఫ్‌ని గుర్తు పడతాడు. ఈ విషయం తెలుసుకున్న ఏనీ.. జోసెఫ్‌ని అతని గతం గురించి చెప్పమని అడుగుతుంది. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సిటీని గడగడలాడించిన విజయ్ ఎందుకు ఓ సాధారణ వ్యక్తిగా జీవితాన్ని గడుపుతున్నాడు? వెంకటరెడ్డివల్ల విజయ్ కోల్పోయింది ఏమిటి? నివేదిత తల్లి ఏమైంది? విజయ్ సాధారణ జీవితం వెనుక అసలు కథ ఏమిటి? అనేది తెరపై చూడాల్సిందే.
విజయ్‌గా, జోసెఫ్‌గా రెండు వేరియేషన్స్ వున్న క్యారెక్టర్‌లో విజయ్ పెర్‌ఫార్మెన్స్ బాగుంది. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, కొడుకుగా, ప్రేమికుడుగా, భర్తగా, తండ్రిగా, ఎదుటివారి కష్టాలను చూసి చలించిపోయే మనిషిగా... ఇలా ప్రతి యాంగిల్‌లోనూ మెప్పించగలిగాడు. విజయ్ భార్య మిత్రగా సమంత ఫర్వాలేదు అనిపిస్తుంది. మిగతా పాత్రల్లో విలన్‌గా చేసిన ప్రముఖ డైరెక్టర్ మహేంద్రన్ పెర్‌ఫార్మెన్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. విజయ్ అసిస్టెంట్‌గా రాజేంద్రన్ అక్కడక్కడా కామెడీ చేసే ప్రయత్నం చేశాడు. ఎమీ జాక్సన్ క్యారెక్టర్‌కి అంతగా ఫిఫరెన్స్ ఇవ్వలేదు. ఆ క్యారెక్టర్‌ని ఎవరు చేసినా ఒకటే అనిపించేలా వుంది. విజయ్‌కి తల్లిగా రాధిక ఆకట్టుకుంటుంది. విజయ్ కూతురు నివేదితగా నటించిన బేబీ నైనిక చెప్పే డైలాగ్స్ అక్కడక్కడ ఓవర్ అనిపించినా ఓకే అనిపిస్తుంది.
టెక్నికల్ యాస్పెక్ట్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఈ సినిమాకి టెక్నికల్ సపోర్ట్ చాలా వుంది. మొదట చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ జార్జ్ సి. విలియమ్స్ గురించి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పర్‌ఫెక్ట్ లైటింగ్‌తో అద్భుతమైన విజువల్స్ తీశాడు. ముఖ్యంగా పాటలను చాలా రిచ్‌గా విజువలైజ్ చెయ్యడంలో జార్జ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. ఇక జి.వి.ప్రకాష్ కుమార్ చేసిన పాటల్లో రెండు పాటలు మాత్రమే బాగున్నాయి. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో రణగొణ ధ్వనులు మాత్రమే ఎక్కువగా వినిపించాయి. డైరెక్టర్ అట్లీ ఎడిటింగ్ విషయంలో మరికొంత జాగ్రత్తలు తీసుకొని సినిమాని కొంత ట్రిమ్ చేసి వుంటే బాగుండేది. డైరెక్టర్ అట్లీ గురించి చెప్పాలంటే బాషా, నరసింహనాయుడు తరహా కథనే తీసుకొని విజయ్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకునేలా తీసే ప్రయత్నం చేశాడు. అతను విజయ్‌తో తీసిన ప్రతి సీన్ ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకొనే తీసినట్టు అనిపిస్తుంది. ఈ సినిమాలో హీరో పోలీస్ ఆఫీసర్ అని ఆడియన్స్‌కి ముందే తెలుసు కాబట్టి సినిమా స్టార్టింగ్‌లో విజయ్ కళ్ళజోడు పెట్టుకొని వేరే గెటప్‌లో కనిపించడం, అతనికి ఒక పాప కూడా వుండడంతో సినిమా అంతా ఫ్లాష్ బ్యాక్‌లోనే వుందనేది అందరికీ అర్థమవుతుంది. సినిమా స్టార్ట్ అయ్యాక అసలు కథలోకి వెళ్ళడానికి అరగంటకుపైగా టైమ్ తీసుకోవడం ప్రేక్షకుల్ని విసిగిస్తుంది. పైగా ఫస్ట్ హాఫ్‌లో ప్రతి సీన్‌లో, పాటల్లో తమిళ ఫ్లేవర్ కనిపిస్తుంది. అసలు కథలోకి వెళ్ళే ప్రాసెస్‌లో అనవసరమైన సీన్స్ బోల్డెన్ని వస్తాయి. ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయిన తర్వాత అన్ని సినిమాల్లోలాగే హీరోకి విలన్ నుంచి కష్టాలు మొదలవుతాయి. విలన్ వల్ల హీరో ఫ్యామిలీ నష్టపోతుందని ఊహిస్తూనే ఆడియన్స్ సినిమా చూస్తుంటారు.
ఒక సాధారణమైన పోలీస్ స్టోరీయే కదా అని థియేటర్‌లోకి వెళ్ళిన ఆడియన్స్‌కి మొదటి అరగంట ఇదేం సినిమా అనే ఫీలింగ్ కలిగినా ఒక్కసారి స్టోరీలోకి ఎంటర్ అయిన తర్వాత పాత కథలాగే అనిపించినా విజువల్స్ గ్రాండ్‌గా వుండడం, ఒక సాఫ్ట్‌వేర్ అమ్మాయిని రేప్ చేసి చంపిన విలన్ కొడుకుని చంపడం, అనాధ పిల్లల్ని రౌడీల నుంచి కాపాడడం వంటి సీన్స్ ఆకట్టుకుంటాయి. తమిళ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని చెప్పాలంటే ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏదైనా వుందీ అంటే అది విజయ్ మాత్రమే. అతను స్టైల్స్‌కి అక్కడ విజిల్స్ పడతాయి కానీ, ఇక్కడ అతనికి అంతగా ఫాలోయింగ్ లేకపోవడం వల్ల మన ప్రేక్షకులు అసహనంగా ఫీల్ అవుతారు. ఫైనల్‌గా చెప్పాలంటే మనం చూసిన రొటీన్ పోలీస్ స్టోరీయే అయినా ఒకసారి చూద్దాంలే అనుకుని వెళ్ళేవారు మాత్రం నిర్భయంగా వెళ్ళొచ్చు.
ఫినిషింగ్ టచ్: రొటీన్ పోలీస్ స్టోరీ
సినీజోష్ రేటింగ్: 2.5/5