Advertisementt

సినీజోష్‌ రివ్యూ: రన్‌

Wed 23rd Mar 2016 07:22 PM
telugu movie run,sandeep kishan new movie run,run movie review,run movie review in cinejosh,run movie cinejosh review,run movie director ani kannekanti  సినీజోష్‌ రివ్యూ: రన్‌
సినీజోష్‌ రివ్యూ: రన్‌
Advertisement
Ads by CJ

ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై. లిమిటెడ్‌ 

రన్‌ 

తారాగణం: సందీప్‌ కిషన్‌, అనీషా ఆంబ్రోస్‌, 

బాబీ సింహా, ప్రవీణ్‌, పోసాని, మధునందన్‌, 

బ్రహ్మాజీ, కాశీ విశ్వనాథ్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: బి.రాజశేఖర్‌ 

సంగీతం: సాయికార్తీక్‌ 

ఎడిటింగ్‌: ఎం.ఆర్‌.వర్మ 

కథ: అల్ఫోన్స్‌ పుతేరిన్‌ 

మాటలు: ప్రవీణ్‌ 

సమర్పణ: ఎ టి.వి. రామబ్రహ్మం సుంకర 

నిర్మాతలు: సుధాకర్‌ చెరుకూరి, కిశోర్‌ గరికపాటి, అజయ్‌ సుంకర 

దర్శకత్వం: అని కన్నెగంటి 

విడుదల తేదీ: 23.03.2016 

వేరే భాషలో హిట్‌ అయిన సినిమాలను తెలుగులో తీసేసి ఇక్కడ కూడా హిట్‌ కొట్టెయ్యాలన్న ఆరాటం మన దర్శకనిర్మాతల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. కథలో కొత్తదనం, కదం తొక్కే కథనంతో ఆడియన్స్‌ని సీట్లలో కూర్చోబెట్టే సత్తా వున్న కథలు తెలుగులోనూ వున్నాయి. రీమేక్‌ అయితే మినిమం గ్యారెంటీ వుంటుందని మన దర్శకనిర్మాతలు ఆ దిశగా ఆలోచిస్తుంటారు. ఒక భాషలో హిట్‌ అయిన సినిమాని మన నేటివిటీకి, మన హీరోలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చెయ్యడం వల్ల రిజల్ట్‌ కూడా తేడాగానే వుంటుంది. తమిళ్‌లో సూపర్‌హిట్‌ అయిన నేరం చిత్రాన్ని సందీప్‌ కిషన్‌ హీరోగా అని కన్నెగంటి దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై. లిమిటెడ్‌ బేనర్‌పై నిర్మించారు. ఒకటి, రెండు సినిమాలు చేసి డైరెక్టర్‌గా తనని తాను ప్రూవ్‌ చేసుకోలేకపోయిన అని కన్నెగంటి, ఈమధ్యకాలంలో సక్సెస్‌ అనే మాట కూడా వినని సందీప్‌ కిషన్‌ కాంబినేషన్‌లో రన్‌ పేరుతో రీమేక్‌ అయిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ ప్రేక్షకుల్ని విపరీతంగా ఎంటర్‌టైన్‌ చేసిన ఈ కథ తెలుగు ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుంది? డైరెక్టర్‌గా అనికి, హీరోగా సందీప్‌ కిషన్‌కి రన్‌ హెల్ప్‌ అవుతుందా? కమర్షియల్‌గా ఈ సినిమా నిర్మాతలకు ఎంతవరకు వర్కవుట్‌ అవుతుందనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

ఈ సినిమాలో హీరో చెప్పినట్టుగా టైమ్‌ రెండు విధాలుగా వుంటుంది. ఒకటి గుడ్‌ టైమ్‌, రెండు బ్యాడ్‌ టైమ్‌. దీన్నే ప్రేక్షకుల వ్యూలో చెప్పాలంటే థియేటర్‌కి వెళ్ళిన ఆడియన్స్‌ టైమ్‌ బాగుంటే మంచి సినిమా చూస్తారు, వారి టైమ్‌ బాగోకపోతే రన్‌ లాంటి సినిమా చూస్తారు. ఈ సినిమాలో ప్రతి సీన్‌ ఆడియన్స్‌కి నీరసం వచ్చేలా వుంటుంది. ఈ సినిమాకి రన్‌ అనే టైటిల్‌ కాకుండా వాక్‌ అని పెట్టి వుంటే బాగుండేది. సినిమా స్టార్ట్‌ అయినప్పటి నుంచి ఎండ్‌ అయ్యే వరకు చాలా స్లోగా నడుస్తుంది. దానికి తగ్గట్టుగానే ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌ కూడా వుంటుంది. 

వడ్డీ రాజా(బాబీ సింహా) అందరికీ అప్పులు ఇస్తుంటాడు. ఆ డబ్బు వసూలు చేయడానికి కాల్‌ మనీ తరహాలో అప్పు తీసుకున్న వారి భార్యనో, కూతురినో టార్చర్‌ పెడుతుంటాడు. తన అక్క పెళ్లి కోసం వడ్డీరాజా దగ్గర లక్ష రూపాయలు మూడు నెలల్లో తిరిగి ఇచ్చేస్తానని తీసుకుంటాడు సంజయ్‌(సందీప్‌ కిషన్‌). సంజయ్‌కి వడ్డీరాజా ఇచ్చిన గడువు రోజు రానే వస్తుంది. సాయంత్రం 5 గంటలలోగా అతని అప్పు తీర్చాలి. తన ఫ్రెండ్‌ మణి(ప్రవీణ్‌) దగ్గర లక్ష రూపాయలు తీసుకొని వడ్డీ రాజాకి ఇవ్వడానికి బయల్దేరతాడు సంజయ్‌. తన గురించి ఆడియన్స్‌కి చెప్పుకునే ప్రాసెస్‌లో తన ప్రేమ గురించి కూడా చెప్తాడు సంజయ్‌. అమూల్య(అనీషా ఆంబ్రోస్‌) అనే అమ్మాయిని అతను ప్రేమిస్తాడు. ఆమె తండ్రి పెళ్ళికి ఒప్పుకోవడంలేదని అమూల్య ఇంటి నుంచి పారిపోయి వచ్చి ఓ చోట అతని కోసం వెయిట్‌ చేస్తుంటుంది. వడ్డీరాజాకి డబ్బు ఇవ్వడానికి బయల్దేరిన సంజయ్‌ నుంచి ఒక దొంగ డబ్బు కొట్టేసి పారిపోతాడు. 5 గంటలు కొట్టడానికి అవ్వడానికి మరో రెండు గంటల టైమ్‌ మాత్రమే వుంటుంది. ఆ రెండు గంటల్లో వడ్డీరాజాకి సంజయ్‌ డబ్బు ఇవ్వగలిగాడా? ఇంటి నుంచి పారిపోయి వచ్చిన అమూల్యని సంజయ్‌ కలుసుకోగలిగాడా? ఆ రెండు గంటల్లో ఈ కథ ఎన్ని మలుపులు తిరిగింది? చివరికి ఏమైంది? అనేది తెరపై చూడాల్సిందే. 

ఇందులో సందీప్‌ కిషన్‌ చేసిన సంజయ్‌ క్యారెక్టర్‌ ఎవ్వరినీ ఆకట్టుకోదు. దానికి తగ్గట్టుగానే అతని డైలాగులు, ఎక్స్‌ప్రెషన్స్‌ చాలా నీరసాన్ని తెప్పిస్తాయి. తీసుకున్న అప్పు తీర్చడమే లక్ష్యంగా హీరో క్యారెక్టర్‌ వుంటుంది. అది కూడా లక్ష రూపాయలు. పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్‌ లేని క్యారెక్టర్‌ సంజయ్‌ది. ఇక వడ్డీరాజాగా బాబీ సింహ తమిళ్‌లో చేసిన క్యారెక్టర్నే తెలుగులోనూ చేశాడు. పద్మావతి అనే డిఫరెంట్‌ పేరుతో బ్రహ్మాజీ కనిపిస్తాడు. ప్రతి ఒక్కరితోనూ సెల్ఫీలు దిగే సిల్లీ పోలీస్‌ ఆఫీసర్‌గా బ్రహ్మాజీ కాస్త నవ్వించే ప్రయత్నం చేశాడు. తన కూతురు కిడ్నాప్‌ అయిందని, వెంటనే కిడ్నాపర్‌ని పట్టుకోమని పోలీసుల్ని విసిగించే శ్రీనివాసులు పాత్రలో కాశీ విశ్వనాథ్‌ నవ్వించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. ప్రవీణ్‌, మధునందన్‌, పోసాని చేసిన క్యారెక్టర్స్‌ చాలా సాదా సీదాగా వున్నాయి. 

టెక్నికల్‌గా ఎలాంటి హంగులూ, ఆర్భాటాలు లేని సినిమా ఇది. ఫోటోగ్రఫీ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాకపోతే డబ్బు కొట్టేసిన దొంగను హీరో ఛేజ్‌ చేసే సీన్‌లో మాత్రం కెమెరా పనితనం కనిపిస్తుంది. సాయికార్తీక్‌ మ్యూజిక్‌ విషయానికి వస్తే పాటల్లోగానీ, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌లో కానీ ఎక్కడా క్వాలిటీ కనిపించదు. ఇప్పటివరకు సాయికార్తీక్‌ చేసిన సినిమాల్లో బ్యాడ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇదే కావచ్చు. ఎం.ఆర్‌.వర్మ ఎడిటింగ్‌ వర్క్‌ ఫర్వాలేదు. సినిమాలో ప్రొడక్షన్‌ వేల్యూస్‌ అనేవి అస్సలు కనిపించవు. ఒక షార్ట్‌ ఫిల్మ్‌ని తీసినట్టుగా ఈ సినిమాని తీసేశారు. డైరెక్టర్‌ గురించి చెప్పాల్సి వస్తే తమిళ్‌లో సూపర్‌హిట్‌ అయిన కథని తెలుగుకి అనుగుణంగా ట్రాన్స్‌ఫార్మ్‌ చెయ్యడంలో అని సక్సెస్‌ అవ్వలేకపోయాడు. 1 గంట 45 నిముషాల సినిమాని మూడు గంటల సినిమాగా ఆడియన్స్‌ ఫీల్‌ అయ్యారంటే అది డైరెక్టర్‌ గొప్పతనమే. స్క్రీన్‌ప్లేలోగానీ, మాటల్లోగానీ ఎక్కడా కొత్తదనం కనిపించదు. ఈ కథలో లవ్‌ ట్రాక్‌ వున్నా దానికి ఎక్కువ ప్రిఫరెన్స్‌ ఇవ్వలేదు. సెకండాఫ్‌ అంతా హీరోయిన్‌ని ఒక కారు డిక్కీలోనే వుంచేసి ఆడియన్స్‌ని కథ వెంట పరుగులు పెట్టించాలని చూసినా అది వర్కవుట్‌ అవ్వలేదు. 

ఓ ఫైన్‌ మార్నింగ్‌ స్టార్ట్‌ అయ్యే కథని సాయంత్రం 5 గంటల వరకు రన్‌ చెయ్యడానికి హీరో తన ఫ్లాష్‌ బ్యాక్‌, తన లవ్‌ ట్రాక్‌ని చెప్పుకోవడానికి కొంత టైమ్‌, తను అప్పు ఎందుకు చెయ్యాల్సి వచ్చింది అనేది చెప్పడానికి మరి కొంత టైమ్‌, మధ్యలో ఇన్‌స్పెక్టర్‌ పద్మావతి కామెడీ.. ఇలా ఫస్ట్‌ హాఫ్‌ అంతా చాలా స్లోగా రన్‌ అవుతుంది. ఇంటర్వెల్‌లో ఒక పెద్ద ట్విస్ట్‌ ఇచ్చాననే భ్రమతో ఫస్ట్‌ హాఫ్‌ని ముగించాడు డైరెక్టర్‌. సెకండాఫ్‌లో షరా మామూలే కథని క్లైమాక్స్‌కి తెచ్చేందుకు నానా తంటాలు పడినా ఏ దశలోనూ నెక్స్‌ట్‌ ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఆడియన్స్‌ కలగదు. సినిమా ఎప్పుడు కంప్లీట్‌ అవుతుంది, ఎప్పుడు థియేటర్‌లో నుంచి బయటికి వెళ్ళాలి అనేది తప్ప మరో ఆలోచన లేని ఆడియన్స్‌ సినిమా ఎండ్‌ అవ్వగానే బయటికి రన్‌ చేస్తారు. ఫైనల్‌గా చెప్పాలంటే ఏ క్లాస్‌ ఆడియన్స్‌నీ ఆకట్టుకోని, ఎంటర్‌టైన్‌ చెయ్యని సినిమా ఇది. షార్ట్‌ ఫిల్మ్‌కి ఎక్కువ.. సినిమాకి తక్కువ అనిపించే రన్‌ సినిమాకి కమర్షియల్‌గా రన్‌ ఎలా వుంటుందో చూడాలి. 

ఫినిషింగ్‌ టచ్‌: రన్‌ కాదు వాక్‌ 

సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ