సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రై. లిమిటెడ్
శౌర్య
తారాగణం: మంచు మనోజ్, రెజీనా, ప్రకాష్‌రాజ్, నాగినీడు,
సుబ్బరాజు, శ్రావణ్, షాయాజీ షిండే, బ్రహ్మానందం తదితరులు
సినిమాటోగ్రఫీ: మల్హర్‌భట్ జోషి
సంగీతం: కె.వేద
ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్
కథ: దశరథ్, కిశోర్ గోపు
స్క్రీన్‌ప్లే: కిశోర్‌గోపు
రచన: గోపీమోహన్
సమర్పణ: బేబి త్రిష
నిర్మాత: మల్కాపురం శివకుమార్
కథ, దర్శకత్వం: దశరథ్
విడుదల తేదీ: 04.03.2016
యాక్షన్, మాస్, కామెడీ, థ్రిల్లర్స్ చేస్తూ తనకంటూ ఓ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని విశ్వప్రయత్నం చేసే మంచు మనోజ్ అవన్నీ పక్కన ఓ డీసెంట్ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలని చేసిన ప్రయత్నం శౌర్య. మంచు మనోజ్ ఫస్ట్ మూవీ శ్రీ కి దర్శకత్వం వహించిన దశరథ్ రెండో చిత్రంగా శౌర్య చిత్రాన్ని చేశాడు. ప్రస్తుతం ఆడియన్స్ ఎలాంటి సినిమాలను ఇష్టపడుతున్నారు? ఏ జోనర్ మూవీస్ అయితే ఎగబడి చూస్తున్నారు? అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక యునీక్ సబ్జెక్ట్‌తో శౌర్య చిత్రాన్ని చేశామని చెప్తున్నారు చిత్ర యూనిట్. మరి ప్రేక్షకుల్ని అంతగా థ్రిల్ చేసే ఎలిమెంట్స్ శౌర్యలో ఏం వున్నాయి? ఇప్పటివరకు చెయ్యని డిఫరెంట్ క్యారెక్టర్‌లో మనోజ్‌ని ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకున్నారు? సూర్య వర్సెస్ సూర్య వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని నిర్మించిన మల్కాపురం శివకుమార్‌కి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిచ్చింది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
బయో టెక్నాలజీకి సంబంధించిన 300 కోట్ల ప్రాజెక్ట్‌ను ఓకే చేయించుకోవడానికి తన ఫ్రెండ్‌తో కలిసి ఒక ట్రిక్ ప్లే చేయడం ద్వారా శౌర్య(మంచు మనోజ్) క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. అయితే ఆ ప్రాజెక్ట్‌లో తను వర్క్ చేయడం లేదని, తన లవర్ నేత్ర(రెజీనా)తో కలిసి కోటి లింగాల వెళ్ళి అక్కడ ఓ రాత్రి జాగారం చెయ్యాల్సి వుందని ఫ్రెండ్‌తో చెప్పి నేత్రతో కలిసి కోటిలింగాల బయల్దేరతాడు. అక్కడ జాగారం చేస్తున్న టైమ్‌లో శౌర్యకు తెలియకుండానే నేత్రపై హత్యా ప్రయత్నం జరుగుతుంది. శౌర్యే ఆ హత్య చేశాడని పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. తను ఎంతగానో ప్రేమించిన నేత్రను తానెందుకు చంపుతానని, ఆ పని ఎవరు చేసారో తనకు తెలియదని పోలీసులకు చెప్తాడు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చెయ్యడానికి స్పెషల్ పోలీస్ ఆఫీసర్ కృష్ణప్రసాద్(ప్రకాష్‌రాజ్) రంగంలోకి దిగుతాడు. ఈలోగా ట్రీట్‌మెంట్ జరుగుతుండగానే నేత్ర చనిపోతుంది. ఆమె చనిపోతూ 635 అనే నెంబర్ రాసి చనిపోతుంది. తర్వాత శౌర్యను కోర్టులో హాజరు పరుస్తారు. అక్కడ మాత్రం నేత్రను తానే చంపానని చెప్తాడు. ఎంతో ప్రాణంగా ప్రేమించిన నేత్రను శౌర్య ఎందుకు చంపాడు? నేత్ర ఇచ్చిన 635 అనే క్లూ దేనికి సంబంధించింది? నేత్రను నిజంగానే శౌర్య చంపాడా? అసలు నేత్రను చంపాలనుకున్నదెవరు? తర్వాత ఈ కేసు ఎన్ని మలుపులు తిరిగింది? అనేది తెరపై చూడాల్సిందే.
ఒక సినిమాని ప్రేక్షకులు ఆదరించాలన్నా, ఆ సినిమాకి కాసుల వర్షం కురవాలన్నా మొదట కావాల్సింది బలమైన కథ. ప్రేక్షకుల్ని ఆ కథలో లీనం చేసే కథనం. ఈ రెండూ లేకుండా కేవలం ఆడియన్స్ మెదడుకు పని కల్పిస్తూ 10 నిముషాలకు ఓ ట్విస్టు ఇస్తే వాళ్ళు తట్టుకోలేరు. తాము రాసుకున్న కథలోని హీరోకి అనుగుణంగా, హీరోయిన్‌కి అనుగుణంగా కథ చెప్పుకుంటూ వెళ్ళిపోవడం, మధ్య మధ్యలో ట్విస్ట్ అనే షాక్ ఇవ్వడం వల్ల అసలు ఏం జరుగుతోంది అనే ప్రశ్న ప్రేక్షకులు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. దుర్మార్గులైన ఒక ఎం.పి., ఒక ఎమ్మెల్యే చేసిన దారుణాలను బయట పెట్టడానికి ఆడే పెద్ద గేమ్ ఈ సినిమాలో కనిపిస్తుంది. నేచురాలిటీకి ఏమాత్రం దగ్గరగా లేని కథ, కథనాలు, ప్రేక్షకులు జీర్ణించుకోలేని హీరో, హీరోయిన్‌ల దయాగుణం ఫస్ట్ హాఫ్‌లో విపరీతంగా విసిగిస్తుంది. హీరో చాలా గొప్పవాడు అని చెప్పేందుకు డైరెక్టర్ చేసిన ప్రయత్నాలన్నీ కామెడీగా కొట్టి పారేసేంత సిల్లీగా వుంటాయి. తన ఉనికిని కాపాడు కోసం కూతుళ్ళను చంపుతున్న కన్న తండ్రుల్ని ఈమధ్య సినిమాల్లో చూస్తున్నాం. దాన్ని ఈ సినిమాలో కూడా కొనసాగించారు. అలాంటి వాస్తవ సంఘటనలు సమాజంలో జరిగి వుండొచ్చు. సినిమా విషయానికి వస్తే ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే ఆడియన్స్ విలన్ రాక్షసత్వాన్ని, అతను సృష్టించే వయొలెన్స్‌ని కూడా ఎంజాయ్ చెయ్యగలరు. కొన్ని వాస్తవ సంఘటనల్ని సినిమాల్లో చూపించినా రిసీవ్ చేసుకోలేరు. అలాంటివి చూసినపుడు సినిమాలో ఇది అవసరమా అనే ప్రశ్న ఆడియన్స్ మనసుల్లో మెదులుతుంది.
ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే శౌర్య క్యారెక్టర్‌లో మంచు మనోజ్ అస్సలు సూట్ అవ్వలేదని చెప్పాలి. అతని లుక్‌గానీ, బాడీ లాంగ్వేజ్‌గానీ మాస్ క్యారెక్టర్స్ చెయ్యడానికి, యాక్షన్ సీక్వెన్స్‌లు చెయ్యడానికి, ఎంటర్‌టైన్‌మెంట్ చెయ్యడానికి పనికి వస్తుంది కానీ టక్ చేసి కళ్ళజోడు పెట్టుకొని డీసెంట్‌గా బిహేవ్ చేసే ఇలాంటి క్యారెక్టర్‌కి పనికిరాదు. ఆ విషయం సినిమా స్టార్ట్ అయిన 5 నిముషాల్లోనే ఆడియన్స్‌కి అర్థమైపోతుంది. పైగా మనోజ్ డైలాగ్స్ చెప్పడానికి కూడా ఇబ్బంది పడిన సందర్భాలు సినిమాలో చాలా కనిపిస్తాయి. ఇక రెజీనా కొంత గ్లామర్, కొంత పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్ వున్న క్యారెక్టర్ ఈసినిమాలో చేసింది. స్పెషల్ ఆఫీసర్‌గా ప్రకాష్‌రాజ్ తనకు కొట్టిన పిండిలాంటి క్యారెక్టర్‌ని అవలీలగా చేశాడు. అయితే ఏ సందర్భంలోనూ అతని డైలాగ్స్‌గానీ, అతని పెర్‌ఫార్మెన్స్‌గానీ ఆహా అనిపించేలా లేదు. హీరోయిన్‌కి బావగా ప్రభాస్ శ్రీనుని కేవలం నవ్వించడానికే పెట్టుకున్నారు. అయితే అది అంతగా వర్కవుట్ అవ్వలేదు. ఇక బ్రహ్మానందం క్యారెక్టర్‌తో కొన్ని సీన్స్‌లో కామెడీ చేయించాలనుకొని ఘోరంగా ఫెయిల్ అయ్యాడు డైరెక్టర్. ఇక మిగతా క్యారెక్టర్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
మల్హర్‌భట్ ఫోటోగ్రఫీ ఫర్వాలేదు అనిపించింది. ఆర్టిస్టుల్ని బ్రైట్‌గా చూపించడంలో లొకేషన్స్‌ని అందంగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు కానీ కెమెరా వర్క్‌లో కొత్తదనం అనేది ఎక్కడా కనిపించదు. మ్యూజిక్ డైరెక్టర్ వేద చేసిన పాటల్లో రెండు పాటలు బాగున్నాయనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే అనిపించుకున్నాడు. కొత్తదనం వుందని దశరథ్, కిషోర్ రాసుకున్న కథలో కొత్తదనం కంటే కన్‌ఫ్యూజన్ ఎక్కువగా వుందని, అలాగే స్క్రీన్‌ప్లే ఆడియన్స్‌ని ఇబ్బంది పెడుతుందని వాళ్ళకి తెలిసినట్టు లేదు. వీరిద్దరూ కాక ఈ సినిమాకి గోపీమోహన్ రచన కూడా తోడవడంతో కథను ఒక దారికి తెచ్చినట్టు కనిపిస్తుంది. కథా గమనానికి అడ్డుపడే సీన్స్ సినిమాలో చాలా వున్నాయి. దానికి తగ్గట్టుగానే ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవుతున్న టైమ్‌లో కూడా కథలో చెప్పాలనుకున్న పాయింట్ ఏమిటనేది ఆడియన్స్‌కి అర్థం కాదు. సినిమా నిడివి కేవలం రెండు గంటలే అయినా మూడు గంటల సినిమా చూసిన ఫీల్ ఆడియన్స్‌కి కలుగుతుంది. దీన్ని బట్టి సినిమా ఎంత స్లో నేరేషన్‌తో నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు.
ఒక పెద్ద ప్రాజెక్ట్‌ని ఓకే చేసుకోవడంతో ఎంట్రీ ఇచ్చే హీరో ఆ తర్వాత హీరోయిన్‌తో కలిసి కోటి లింగాల వెళ్ళడం అక్కడ జాగారం చెయ్యడం, హీరోయిన్‌పై హత్యా ప్రయత్నం జరగడం, ఆ తర్వాత మహిళా సంఘాలు, మీడియా, పోలీసుల హడావిడితో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఫస్ట్ హాఫ్ ఎండింగ్‌లో థ్రిల్ కంటిన్యూస్ అని వేశారు. సెకండాఫ్ మొత్తం వెతికినా ఆ థ్రిల్ ఎక్కడుందో ప్రేక్షకులకు అర్థం కాదు. ఈ సినిమా పబ్లిసిటీలో కూడా ఎ థ్రిల్లింగ్ లవ్‌స్టోరీ అని వేస్తున్నారు. రచయితగానీ, దర్శకుడుగానీ థ్రిల్ అని భావించిన ఏ సీన్ కూడా ఆడియన్స్‌ని థ్రిల్ చెయ్యలేకపోగా అసహనానికి గురి చేసింది. సినిమాలో ఫ్లాష్ బ్యాక్‌లు ఎక్కువగా వుండడం, సినిమాని క్లైమాక్స్‌కి తీసుకురావడానికి సెకండాఫ్‌లో అవసరంలేని కామెడీ సీన్స్‌తో కాలయాపన చేయడంతో క్లైమాక్స్ ఎప్పుడొస్తుందా? అని ఆడియన్స్ ఎదురుచూసేలా చేశాయి. సినిమాలో హీరో చేసే ఒక్క యాక్షన్ సీన్ కూడా లేకపోవడం, ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేసే ఎంటర్‌టైన్‌మెంట్‌గానీ, థ్రిల్‌గానీ లేకపోవడం పెద్ద మైనస్ అయింది. ఫైనల్‌గా చెప్పాలంటే ఒక డిఫరెంట్ మూవీ చూద్దామని వచ్చే ఆడియన్స్‌ని శౌర్య డిజప్పాయింట్ చేస్తాడు.
ఫినిషింగ్ టచ్: ఏమిటిది ఆర్యా!
సినీజోష్ రేటింగ్: 2/5