పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్
క్షణం
తారాగణం: అడివి శేష్, అదాశర్మ, అనసూయ,
సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,
రవివర్మ తదితరులు
సినిమాటోగ్రఫీ: షానీల్ డియో
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఎడిటింగ్: అర్జున్ శాస్త్రి, రవికాంత్ పేరెపు
కథ: అడివి శేష్
స్క్రీన్‌ప్లే: అడివి శేష్, రవికాంత్ పేరెపు
మాటలు, స్క్రిప్ట్ గైడెన్స్: అబ్బూరి రవి
సమర్పణ: పెరల్ వి.పొట్లూరి
నిర్మాతలు: పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే
దర్శకత్వం: రవికాంత్ పేరెపు
విడుదల తేదీ: 26.02.2016
తెలుగు సినిమాలు రొటీన్ అయిపోయాయనీ, తెలుగు సినిమాల్లో కొత్త కథలు, కొత్త కాన్సెప్ట్‌లు కొరవడ్డాయని కొత్తదనం కోరుకునే కొంతమంది గగ్గోలు పెడుతుంటారు. అలాంటి వారి కోసం రెగ్యులర్ ఫార్మాట్‌కి భిన్నంగా సినిమాలు తీసి ప్రేక్షకుల్ని మెప్పించాలని కొంతమంది దర్శకనిర్మాతలు ప్రయత్నం చేస్తుంటారు. అయితే రెగ్యులర్ ఫార్మాట్‌కి భిన్నంగా అనగానే అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం, కథ, కథనాలే ప్రధానంగా కనిపించడం మనం చూస్తుంటాం. ఇలాంటి సినిమాలు నిర్మాతకి లాభాలు తెచ్చిపెట్టకపోయినా ఒక మంచి సినిమా నిర్మించాడని నిర్మాతకి, డిఫరెంట్ సినిమా తీశాడని డైరెక్టర్‌కీ పేరు మాత్రం వస్తుంది. అలాంటి కోవలోకే వస్తుంది ఈరోజు విడుదలైన క్షణం చిత్రం. అడివి శేష్ కథ, కథనాలతో రవికాంత్ పేరెపు దర్శకత్వంలో, అబ్బూరి రవి అందించిన స్క్రిప్ట్ గైడెన్స్, మాటలతో రూపొందిన ఈ చిత్రాన్ని పివిపి సినిమా మరియు మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్స్‌పై నిర్మించారు. మరి రొటీన్‌కి భిన్నంగా క్షణం చిత్రంలో ఏముంది? ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు చూడని ఏయే అంశాల్ని రచయిత, డైరెక్టర్ టచ్ చేశారు? రొటీన్‌కి భిన్నంగా వున్న ఈ సినిమా కమర్షియల్‌గా ఎంతవరకు సక్సెస్ అవుతుంది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
అతని పేరు రుషి(అడివి శేష్). అమెరికాలో జాబ్ చేస్తుంటాడు. ప్రేమలో విఫలమైన రుషికి ఓరోజు తన మాజీ ప్రియురాలు శ్వేత(అదాశర్మ) నుంచి ఫోన్ కాల్ వస్తుంది. అర్జెంట్‌గా ఇండియా రమ్మని శ్వేత కాల్ చేస్తుంది. ఇండియాకి వచ్చిన రుషి గాయాలతో వున్న శ్వేతను చూసి షాక్ అవుతాడు. తన బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారని, పోలీసులకు కంప్లయింట్ చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని శ్వేత చెప్పడంతో మరింత ఆశ్చర్యపోతాడు రుషి. ఆ క్షణం నుంచి శ్వేత కూతురు రియాను వెతికే పనిలో పడతాడు రుషి. ఈ ప్రయత్నంలో రుషికి ఎదురైన సమస్యలేమిటి? ఆ సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు? రియాను కిడ్నాప్ చేసింది ఎవరు? కిడ్నాపర్స్ నుంచి రియాను రుషి కాపాడాడా? అనేది మిగతా కథ.
కథగా చెప్పుకోవడానికి ఇది బాగానే వుంది. అలాగే ఇందులోని ట్విస్ట్‌లు కూడా ఆడియన్స్‌ని థ్రిల్ చేసినట్టుగానే అనిపిస్తాయి. కొన్ని ట్విస్ట్‌లు కన్విన్సింగ్‌గా వున్నప్పటికీ కొన్ని మరీ అసహజంగా వుండడం వల్ల సాధారణ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవు. పైగా సినిమా స్టార్ట్ అవ్వడమే చాలా స్లోగా స్టార్ట్ అయి స్లో నేరేషన్‌తోనే రన్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అదే స్లో మెయిన్ టెయిన్ చేసిన డైరెక్టర్ సెకండాఫ్‌కి వచ్చే సరికి కాస్త స్పీడ్‌ని పెంచాడు. కథను పరుగులు పెట్టించే ప్రయత్నం చేశాడు. రెండుంపావు గంటల సినిమాలో మనకి స్క్రీన్ మీద ఎక్కువ కనిపించేది రుషి క్యారెక్టరే. ఈ క్యారెక్టర్‌ని అడివి శేష్ పర్‌ఫెక్ట్‌గా చేశాడని చెప్పొచ్చు. ప్రజెంట్ క్యారెక్టర్, ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ మధ్య వున్న వేరియేషన్‌ని బాగా చూపించారు. శ్వేత క్యారెక్టర్‌లో అదా శర్మ ఫర్వాలేదు అనిపించింది. ఇప్పటివరకు అదా చేసిన సినిమాల్లో ఆమెకు పెర్‌ఫార్మెన్స్‌కి ఎక్కువ స్కోప్ ఇచ్చిన సినిమా ఇదే. మిగతా క్యారెక్టర్లు చేసిన ఆర్టిస్టులు వారి వారి పరిధి మేరకు బాగానే చేశారు.
ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమా చెయ్యాలన్న డైరెక్టర్ ఆలోచన బాగానే వున్న దానికి తగిన ప్రొడక్షన్ వేల్యూస్ కూడా వుంటే దాన్ని స్క్రీన్‌మీద చూసి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకి ప్రొడక్షన్ వేల్యూస్ అనేవి మచ్చుకైనా కనిపించవు. విజువల్‌గా గ్రాండ్‌గా చూపించడానికి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. ఒకవిధంగా చెప్పాలంటే రిచ్ లుక్ అనేది కనిపించకుండా సినిమాని చుట్టేసారా అనిపించేలా విజువల్స్ వున్నాయి. దానికి తగ్గట్టుగానే ఎడిటింగ్ కూడా అస్తవ్యస్తంగా అనిపిస్తుంది. అడివి శేష్ రాసిన కథగానీ, డైరెక్టర్ రవికాంత్‌తో కలిసి అతను రాసుకున్న స్క్రీన్‌ప్లేగానీ సాధారణ ప్రేక్షకుడికి అర్థమయ్యేలా లేదు. అలాగే అబ్బూరి రవి రాసిన మాటలు కూడా అంతంత మాత్రంగానే వున్నాయి. పివిపి సినిమాలాంటి గొప్ప బేనర్‌లో ఇలాంటి లో బడ్జెట్ సినిమాని, ప్రొడక్షన్ వేల్యూస్ లేని సినిమాని ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చెయ్యరు.
తెలుగు ప్రేక్షకులకు కావాల్సింది వినోదం. సెంటిమెంట్ సీన్స్‌కి, సెంటిమెంట్ డైలాగ్స్‌కి చప్పట్లు కొట్టే రోజులు పోయాయి. టిక్కెట్ కొనుక్కొని థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకుడికి రెండున్నర గంటల సినిమాలో ఎంతవరకు ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చామనేదే ఇంపార్టెంట్. ఈ సినిమా విషయానికి వస్తే కథ, కథనాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టిన రచయిత, డైరెక్టర్ కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి వెళ్ళలేదు. సీరియస్‌గా సినిమా చూడడం తప్ప ఆడియన్‌కి రిలీఫ్ అనేది సినిమాలో ఎక్కడా కనిపించదు. ఫైనల్‌గా చెప్పాలంటే ఇలాంటి సినిమాలకు టీవీల్లోనే తప్ప థియేటర్‌కి వెళ్ళి చూసేంత సీన్ లేదనేది నిజం.
ఫినిషింగ్ టచ్: ఈ క్షణం గడిస్తే చాలు
సినీజోష్ రేటింగ్: 2/5