Advertisementt

సినీజోష్‌ రివ్యూ: కృష్ణాష్టమి

Sat 20th Feb 2016 01:06 PM
telugu movie krishnastami,krishnastami movie review,krishnastami movie cinejosh review,sunil new movie krishnastami,dil raju new movie krishnastami,krishnastami review in cinejosh  సినీజోష్‌ రివ్యూ: కృష్ణాష్టమి
సినీజోష్‌ రివ్యూ: కృష్ణాష్టమి
Advertisement
Ads by CJ

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ 

కృష్ణాష్టమి 

తారాగణం: సునీల్‌, నిక్కీ గల్రాని, డింపుల్‌, సప్తగిరి, 

అజయ్‌, ముఖేష్‌ రుషి, అశుతోష్‌ రానా తదితరులు 

సినిమాటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు 

సంగీతం: దినేష్‌ 

ఎడిటింగ్‌: గౌతంరాజు 

కథ: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ 

నిర్మాత: రాజు 

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వాసువర్మ 

విడుదల తేదీ: 19.02.2016 

కమెడియన్‌గా కెరీర్‌ని స్టార్ట్‌ చేసి ఆ తర్వాత హీరోగా మారి ఒకటి, రెండు హిట్స్‌ కొట్టిన సునీల్‌ వరస ఫ్లాపులతో తను కోరుకున్న హీరో స్థానానికి ఎగబాకడానికి నానా తంటాలు పడుతున్నాడు. లేటెస్ట్‌గా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బేనర్‌లో వాసువర్మ డైరెక్షన్‌లో దిల్‌రాజు నిర్మించిన కృష్ణాష్టమి పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఫ్లాప్‌తో డైరెక్టర్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన వాసువర్మ తన రెండో ప్రయత్నాన్ని సూపర్‌హిట్‌ చేసుకోగలిగాడా? రెండు డిజాస్టర్ల తర్వాత హిట్‌ కోసం ఎదురుచూస్తున్న సునీల్‌కి వాసువర్మ ఎలాంటి సినిమాని ఇచ్చాడు? మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ని అందించే సంస్థగా పేరు పొందిన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌కి కృష్ణాష్టమి ఎలాంటి ఫలితాన్నిచ్చింది? దిల్‌ రాజు ఇచ్చిన రెండో అవకాశాన్ని వాసువర్మ సద్వినియోగం చేసుకున్నాడా? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

ఒక సినిమా ప్రేక్షకాదరణ పొందాలంటే కథే ముఖ్యమని, మిగతా ఎలిమెంట్స్‌ అన్నీ ప్రేక్షకుల్ని రెండున్నర గంటల సేపు సీట్లలో కూర్చోబెట్టడానికి మాత్రమే అనే ప్రాథమిక విషయాన్ని ప్రతి దర్శకుడు, ప్రతి నిర్మాతా చెప్తాడు. తను చేసే ప్రతి సినిమాలోనూ కథకే ఎక్కువ ప్రాధాన్యమిస్తానని చెప్పే దిల్‌రాజు జడ్జిమెంట్‌ కూడా కరెక్ట్‌ కాదని చాలా సినిమాలు నిరూపించాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లో సునీల్‌, వాసువర్మ కాంబినేషన్‌లో నిర్మించిన కృష్ణాష్టమి కూడా వచ్చి చేరింది. బలమైన కథ, ఆకట్టుకునే కథనం కొరవడిన ఈ సినిమా చూడడం ఆద్యంతం ప్రేక్షకులకు అగ్నిపరీక్షే. దేశాలు చుట్టొచ్చినా, అందమైన లొకేషన్లలో సీన్స్‌, పాటలు తీసినా కథలో, ట్రీట్‌మెంట్‌లో కొత్తదనం లేకపోతే ఘోర పరాజయాలు తప్పవని కృష్ణాష్టమి మరోసారి నిరూపించింది. 

మన హీరో కృష్ణవరప్రసాద్‌(సునీల్‌) అమెరికాలో గేమింగ్‌ ప్రోగ్రామర్‌. అతని తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోతారు. పెదనాన్న(ముఖేష్‌ రుషి), పెద్దమ్మ(పవిత్ర లోకేష్‌)ల దగ్గర 10 సంవత్సరాలు పెరిగిన తర్వాత బలవంతంగా కృష్ణను అమెరికా పంపించేస్తాడు పెదనాన్న. కృష్ణ ఎప్పుడు ఇండియా వస్తానన్నా గ్రహాలు అనుకూలంగా లేవనే సాకుతో అతను రాకుండా చేస్తాడు. అయినా పెదనాన్న మాట లెక్క చేయకుండా ఫ్రెండ్‌ గిరి(సప్తగిరి)తో కలిసి ఇండియా బయల్దేరతాడు. మధ్యలో వాతావరణం అనుకూలించక యూరప్‌లో మూడు రోజులు ఆగిపోవాల్సి వస్తుంది కృష్ణ. ఆ టైమ్‌లో అజయ్‌, అతని కొడుకు పరిచయమవుతారు. అదే టైమ్‌లో పల్లవి(నిక్కీ గల్రాని) ప్రేమలో పడతాడు కృష్ణ. కృష్ణ ఇండియా వస్తే చంపెయ్యాలని కొందరు ఎదురుచూస్తుంటారు. అతను ఇండియా బయల్దేరాడని తెలుసుకొని ఎయిర్‌పోర్ట్‌లోనే వాళ్ళు కాపు కాస్తారు. కృష్ణ ఇండియా వస్తున్నాడని సమాచారం ఇచ్చిన అతని ఇంటి మనిషిని హత్య చేస్తారు ప్రత్యర్థులు. అది అజయ్‌ చూస్తాడు. ఆ తర్వాత కృష్ణ, పల్లవి, అజయ్‌, అతని కొడుకు ఒకేకారులో బయల్దేరతారు. దారిలో కృష్ణపై అటాక్‌ జరుగుతుంది. ఈ అటాక్‌లో గాయపడిన అజయ్‌ కోమాలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు అజయ్‌ కొడుకుని వదిలి రావడానికి చిత్తూరు వెళ్తాడు కృష్ణ. కానీ, అనుకోకుండా కృష్ణ అక్కడ అజయ్‌లా నటించాల్సి వస్తుంది. కృష్ణ పెదనాన్న అతన్ని అమెరికాలోనే వుండిపొమ్మని చెప్పడానికి రీజన్‌ ఏమిటి? కృష్ణను చంపాలనుకుంటున్నదెవరు? అజయ్‌లా నటించాల్సిన అవసరం కృష్ణకు ఎందుకొచ్చింది? తనను ఎందుకు చంపాలనుకుంటున్నారో కృష్ణ తెలుసుకోగలిగాడా? వారి నుంచి అతను ఎలా తప్పించుకున్నాడు? అనేది మిగతా కథ. 

ఒక్క లైనులో చెప్పలేని ఈ కథలో ఎన్నో మలుపులు వున్నాయి. ప్రేక్షకులు జీర్ణించుకోలేని ఎన్నో ట్విస్టులు వున్నాయి. ఇందులో అతిశయోక్తిగా అనిపించే సీన్స్‌కి కొదవలేదు. ప్రతి సీన్‌ చాలా అసహజంగా వుండడమే కాకుండా అసహనం కలిగించేలా వుంటుంది. కృష్ణ వరప్రసాద్‌ పాత్రలో నటించిన సునీల్‌ అక్కడక్కడా కొన్ని సీన్స్‌లో ఫర్వాలేదు అనిపించినా ఎక్కువ సీన్స్‌లో విసుగు పుట్టించాడు. పాటల్లో అతనితో వేయించిన స్టెప్స్‌ కూడా చాలా రొటీన్‌గా వున్నాయి. ఇక ఫైట్స్‌ విషయానికి వస్తే ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసేంత ఎఫెక్టివ్‌గా ఏమీ లేవు. లుక్‌ పరంగా సునీల్‌ని చూడడానికి ప్రేక్షకులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా క్లోజప్‌లో అతన్ని చూడాలంటే మనకు చాలా సహనం అవసరం. హీరోయిన్‌గా నిక్కీ గల్రాని క్యారెక్టర్‌ చాలా విచిత్రంగా వుంటుంది. పవనిజంలాగా పల్లవిజం అనే పేరుతో ఓ బుక్‌ రాస్తుంది. అందులోని విషయాల్ని అప్పుడప్పుడు మిగతా పాత్రల మీదకు, ప్రేక్షకుల మీదకు వదిలి విసిగిస్తుంటుంది. గ్లామర్‌ పరంగా ఓకే అనిపించినా పెర్‌ఫార్మెన్స్‌పరంగా ఆమె గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. మిగతా పాత్రల్లో సప్తగిరి అక్కడక్కడా నవ్వించడానికి ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. సెకండాఫ్‌లో బ్రహ్మానందం నవ్వించడానికి చేసిన ప్రయత్నం కూడా వృధా ప్రయాసే అయింది. అశుతోష్‌ రాణా, ముఖేష్‌ రుషి, అజయ్‌ చేసిన క్యారెక్టర్స్‌ ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. 

ఈ సినిమాకి ప్లస్‌ అయిన అంశాలు ఏమైనా వున్నాయీ అంటే అది ఫోటోగ్రఫీ, మ్యూజిక్‌ మాత్రమే. ఛోటా కె.నాయుడు సినిమాని ఆద్యంతం కలర్‌ఫుల్‌గా, రిచ్‌గా చూపించడానికి ట్రై చేశాడు. ఈ సినిమాతో సంగీత దర్శకుడుగా పరిచయమైన దినేష్‌ చేసిన మూడు పాటలు ఫర్వాలేదు అనిపిస్తాయి. కథ, కథనాల్లో విషయంలేని కారణంగా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కి అంత ఇంపార్టెన్స్‌ ఇచ్చినట్టు కనిపించలేదు. 2 గంటల 50 నిముషాల సినిమాని 2 గంటల 15 నిముషాలకు ఎడిట్‌ చేశారని తెలిసింది. అయినా రెండున్నర గంటల సినిమా చూసిన ఫీలింగే మనకు కలుగుతుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ ఎంతో కష్టపడి రెడీ చేసుకున్న ఈ కథలో ఫ్రెష్‌నెస్‌ అనేది ఏమీ వుండదు. మర్యాద రామన్న చిత్రంలో పాత కక్షల కారణంగా సునీల్‌ని చంపాలని విలన్‌ ట్రై చేస్తాడు. అయితే విలన్‌ ఇంట్లోనే సునీల్‌ తిష్ట వేస్తాడు. ఇందులోనూ పగ, ప్రతీకారంతో రగిలిపోయే అశుతోష్‌ రాణా ఇంట్లోనే అజయ్‌ పేరుతో సెటిల్‌ అవుతాడు కృష్ణ. ఈ కథలో అజయ్‌ చెప్పే సంతోషం కథ, హీరోయిన్‌ పల్లవికి కృష్ణ చెప్పే 1 నేనొక్కడినే కథలు కూడా వుంటాయి. ఈ సినిమాకి కృష్ణాష్టమి అనే టైటిల్‌ పెట్టుకున్నందుకు స్టార్టింగ్‌లో ఓసారి, క్లైమాక్స్‌లో ఓసారి ఆ పండగను మనకు చూపించేస్తారు తప్ప టైటిల్‌కి జస్టిఫికేషన్‌ అంటూ ఏమీ వుండదు. ఈ కథను పోలిన కథలు గతంలో చాలా వచ్చాయి. అయితే దాన్ని కొత్తగా ప్రజెంట్‌ చెయ్యడంలో డైరెక్టర్‌ ఫెయిల్‌ అయ్యాడు. దానికి తగ్గట్టుగానే మాటలు కూడా చాలా సాదా సీదాగానే అనిపిస్తాయి. పగలు, ప్రతీకారాలు మానుకోవాలని క్లైమాక్స్‌లో హీరో ఎంతో ఎమోషనల్‌గా చెప్పే డైలాగ్స్‌ కూడా ఏమాత్రం ఆకట్టుకోవు. 

ఇండియా అంటే ఎంతో ప్రేమ వున్న హీరో అమెరికాను, ఇండియాను పోలుస్తూ ఒక పాట పాడడంతో సినిమా స్టార్ట్‌ అవుతుంది. పెదనాన్న చెప్పినా వినకుండా హీరో ఇండియా బయల్దేరడం, మధ్యలో మూడు రోజులు ఒక చోట హాల్ట్‌ చెయ్యడం, హీరోయిన్‌ని హీరో లవ్‌లో పడెయ్యడానికి రకరకాల ప్లాన్స్‌ వెయ్యడం వంటి సీన్స్‌తో అసలు ఈ సినిమా కథ ఏమిటి? అనే ప్రశ్న ప్రేక్షకుల్లో మొదలవుతుంది. హీరోని చంపడానికి విలన్‌ గ్యాంగ్‌ వెంట పడడంతో విషయమంతా సెకండాఫ్‌లో వుంటుందనుకునే ఆడియన్స్‌కి నిరాశతోపాటు నీరసం కూడా వస్తుంది. సినిమాని సాగదీయడానికి సెకండాఫ్‌లో సెకండ్‌ హీరోయిన్‌తో చేసే రొమాన్స్‌, హీరోయిన్‌ కూడా విలన్‌ ఇంటికే వచ్చి చేరతారు. కమెడియన్స్‌ని కూడా అక్కడికే చేర్చి కామెడీ చేయించే ప్రయత్నం చేశారు. సినిమా అన్న తర్వాత క్లైమాక్స్‌ కంపల్సరీ కాబట్టి చివరి 20 నిముషాలు దానిపై దృష్టి పెట్టి కొన్ని సెంటిమెంట్‌ సీన్స్‌తో, హీరోతో చెప్పించిన కొన్ని ఎమోషనల్‌ డైలాగ్స్‌తో అప్పటి వరకు పగతో రగిలిపోయే విలన్‌ గ్యాంగ్‌ ప్రేమమూర్తులుగా మారిపోవడంతో సినిమా ఎండ్‌ అవుతుంది. ఫైనల్‌గా చెప్పాలంటే రొటీన్‌ సినిమాలను ఇష్టపడేవారికి కూడా ఈ సినిమా నచ్చే అవకాశం లేదు. ఈ సినిమాలో ప్లస్‌ పాయింట్స్‌ కంటే మైనస్‌ పాయింట్సే ఎక్కువ వుండడంతో రెండు గంటల పదిహేను నిముషాల సినిమాలో ఏ నిముషం కూడా ఆడియన్స్‌ కథలో ఇన్‌వాల్వ్‌ అవ్వరు. మొత్తానికి కృష్ణాష్టమి అందర్నీ నిరాశ పరిచే రొటీన్‌ సినిమా. 

ఫినిషింగ్‌ టచ్‌: కృష్ణ.. కృష్ణా! 

సినీజోష్‌ రేటింగ్‌: 2/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ