Advertisementt

సినీజోష్‌ రివ్యూ: నాన్నకు ప్రేమతో

Thu 14th Jan 2016 05:35 PM
ntr new movie nannaku prematho,nannaku prematho movie reveiw,nannaku prematho cinejosh review,sukumar new movie nannaku prematho,nannaku prematho movie released  సినీజోష్‌ రివ్యూ: నాన్నకు ప్రేమతో
సినీజోష్‌ రివ్యూ: నాన్నకు ప్రేమతో
Advertisement
Ads by CJ

రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 

శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి 

నాన్నకు ప్రేమతో 

నటీనటులు: ఎన్టీఆర్‌, రకుల్‌ ప్రీత్‌, రాజేంద్రప్రసాద్‌, 

జగపతిబాబు, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, 

మధుబాల, ఆశిష్‌ విద్యార్థి తదితరులు 

సినిమాటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి 

సంగీతం: దేవిశ్రీప్రసాద్‌ 

ఎడిటింగ్‌: నవీన్‌ నూలి 

నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ 

రచన, దర్శకత్వం: సుకుమార్‌ 

విడుదల తేదీ: 13.01.2016 

టాలీవుడ్‌లో కొత్త తరహా చిత్రాలు తియ్యడంలో, కొత్త కాన్సెప్ట్‌లను ఆడియన్స్‌కి పరిచయం చెయ్యడంలో సుకుమార్‌ స్పెషలిస్ట్‌ అనిపించుకున్నాడు. అలాగే మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌ చెయ్యడంలో, అన్ని క్లాస్‌ల ఆడియన్స్‌ని మెప్పించడంలో తనకంటూ ఒక స్పెషల్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్న హీరో ఎన్టీఆర్‌. మరి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లోనూ, ఎన్టీఆర్‌ అభిమానుల్లోనూ కొంత ఎక్సైట్‌మెంట్‌తోపాటు కొంత భయం కూడా వుంటుంది. ఎందుకంటే మహేష్‌తో సుకుమార్‌ చేసిన ఇంటలెక్చువల్‌ మూవీ 1 నేనొక్కడినే టేకింగ్‌ పరంగా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ కామన్‌ ఆడియన్‌కి ఆ సినిమా రీచ్‌ అవ్వకపోవడం, కమర్షియల్‌గా సక్సెస్‌ కాకపోవడంతో వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే ఎక్స్‌పెక్టేషన్స్‌ కూడా డివైడ్‌గానే వుంటాయి. ఎన్టీఆర్‌ హీరోగా సుకుమార్‌ డైరెక్షన్‌లో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించిన నాన్నకు ప్రేమతో చిత్రంపై సినిమా రిలీజ్‌ వరకు అలాంటి ఎక్స్‌పెక్టేషన్సే వున్నాయి. తను ఎంతో ఇష్టపడి తీసిన 1 నేనొక్కడినే నేర్పిన పాఠంతో సుకుమార్‌ ఈ సినిమా కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు? మాస్‌ ఇమేజ్‌ వున్న ఎన్టీఆర్‌ని ఈ సినిమాలో ఎలా చూపించాడు? వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్‌ మూవీ ఎంతవరకు ఆడియన్స్‌కి రీచ్‌ అయింది? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

ఆకలి, నిద్ర, సెక్స్‌.. ఈ మూడూ ప్రతి జీవికి అవసరమే. కానీ, మనిషి మాత్రమే ఎమోషన్‌ అనే ఫీలింగ్‌తో వేరుగా వున్నాడు అని చెప్పడంతో ఈ కథ స్టార్ట్‌ అవుతుంది. మనిషికి ఏదైనా అనుకోనిది జరిగినపుడు ఎమోషనల్‌గా ఫీల్‌ అవుతాడు. దాని ప్రభావం తను చేసే తర్వాతి పనిపైన పడుతుంది. కాబట్టి ఎప్పటి ఎమోషన్‌ని అప్పుడే క్లియర్‌ చేసేసుకోవాలి అనే థింకింగ్‌తో వుండే మన హీరో అభిరామ్‌(ఎన్టీఆర్‌)కి ఇద్దరు అన్నయ్యలు. ఇద్దరు అన్నయ్యల కంటే తండ్రిని ఎక్కువ ఇష్టపడతాడు అభి. నవ్వు లేకుండా తన తండ్రి మొహం ఎప్పుడూ చూడలేదని చెప్పే అభికి తండ్రి సుబ్రహ్మణ్యం(రాజేంద్రప్రసాద్‌) హెల్త్‌ కండీషన్‌ సీరియస్‌ అనే ఫోన్‌ వస్తుంది. అన్నయ్యల దగ్గర వున్న తండ్రిని చూడడానికి వెళ్తాడు అభి. తన తండ్రికి వచ్చిన డిసీజ్‌ వల్ల అతను నెలరోజుల కంటే ఎక్కువ బ్రతికే అవకాశం లేదని తెలుసుకుంటాడు. ఆ టైమ్‌లో బాధపడుతున్న తండ్రిని చూసి పెద్ద కొడుకైన రాజీవ్‌ కనకాల ఓదారుస్తాడు. అందరం మంచి పొజిషన్‌లో వున్నామని, తను రేంజ్‌ రోవర్‌ కారులో తిరుగుతున్నానని, ఒక తమ్ముడు సొంత ఇల్లు కొనుక్కున్నాడని.. ఇలా తండ్రిని హ్యాపీ మూడ్‌లోకి తీసుకు రావాలని ట్రై చేస్తాడు. అప్పుడు తండ్రి చెప్పిన మాటలు విని ముగ్గురు కొడుకులూ షాక్‌ అవుతారు. తన పేరు సుబ్రహ్మణ్యం కాదని, రమేష్‌ చంద్ర ప్రసాద్‌ అని చెప్తాడు. చిన్నప్పుడు మీరంతా 24 బెడ్‌రూమ్‌లు వుండే పెద్ద ప్యాలెస్‌లో వుండేవారని, ఫెరారి కారులో తిరిగేవారని, అవన్నీ పోయి తను రోడ్డున పడడానికి కృష్ణమూర్తి(జగపతిబాబు) అనే వ్యక్తి కారణమని చెప్తాడు. ఆ తర్వాత తన పేరుని సుబ్రహ్మణ్యంగా మార్చుకొని కష్టపడి ఈ స్థితికి వచ్చానని చెప్తాడు. జనం దృష్టిలో తనను మోసగాడిగా చూపించి తన పతనానికి కారణమైన కృష్ణమూర్తిపై పగ తీర్చుకోవాలని, అతని సర్వ నాశనమైపోయిన రోడ్డున పడడం తను చూడాలన్న తన చివరి కోరికను కొడుకులకు చెప్తాడు. పెద్ద కొడుకు లాయర్‌ కావడంతో దీనిమీద కేసు ఫైల్‌ చేస్తానని, కృష్ణమూర్తిని కోర్టుకీడుస్తానని చెప్తాడు. కానీ, వారికి వున్నది 30 రోజులే గడువు. ఈ 30 రోజుల్లో కృష్ణమూర్తి ఆస్తిని కరిగించి, తన తండ్రిని ఎలా మోసం చేశాడో అతన్ని కూడా అలాగే మోసం చేసి అతనికి తగిన శాస్తి చెయ్యాలని బయల్దేరతాడు చిన్న కొడుకు అభి. యూరప్‌లోనే పెద్ద బిజినెస్‌ మాగ్నెట్‌ అయిన కృష్ణమూర్తి అప్పాయింట్‌మెంట్‌ కావాలంటే 300 రోజులు వెయిట్‌ చెయ్యాల్సి వుంటుంది. అలాంటిది అభి అతన్ని ఎలా కలిశాడు? కృష్ణమూర్తిపై పగ తీర్చుకోవడానికి ఎలాంటి ఎత్తులు వేశాడు? దానికి కృష్ణమూర్తి ఎలా రియాక్ట్‌ అయ్యాడు? చివరికి అభి తండ్రి చివరి కోరికను తీర్చాడా? అనేది మిగతా కథ. 

ఎన్టీఆర్‌ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో డాన్సులు, ఫైట్స్‌, కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌లో నటించినా ఈ చిత్రంలోని అభి క్యారెక్టర్‌ విషయానికి వస్తే చాలా సెటిల్డ్‌గా పెర్‌ఫార్మ్‌ చెయ్యాల్సిన అవసరం ఏర్పడింది. అయితే పెర్‌ఫార్మెన్స్‌ పరంగా ఎన్టీఆర్‌ కొత్తగా చేసింది ఏమీ లేదనేది సినిమా చూసినవారందరికీ అర్థమవుతుంది. ఇందులో కామెడీ చెయ్యాల్సిన అవసరం లేదు, ఓవర్‌ యాక్షన్‌ చెయ్యాల్సిన పని లేదు. ఆ క్యారెక్టర్‌కి అవసరమైన పెర్‌ఫార్మెన్స్‌ ఇస్తే చాలు. ఎన్టీఆర్‌ చేసింది కూడా అదే. సినిమాలో ఎక్కడా మనకి ఎన్టీఆర్‌ ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్‌ కనిపించదు. అలాగే ఎన్టీఆర్‌ ట్రై చేసిన కొత్త గెటప్‌ కూడా సినిమాకి ఎంత మాత్రం ఉపయోగపడలేదు. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌కి రెగ్యులర్‌ సినిమాలో హీరోయిన్‌కి ఇచ్చే ప్రిఫరెన్స్‌ కూడా ఇందులో ఇవ్వలేదు. ఫస్ట్‌ హాఫ్‌లో కొన్ని సీన్స్‌లో, పాటల్లో కనిపించిన రకుల్‌ సెకండాఫ్‌కి వచ్చే సరికి విలన్‌ కూతురిగా, లేడీ విలన్‌గా హీరో ఎత్తుల్ని చిత్తు చేయడానికి ట్రై చేస్తుంటుంది. కేవలం పాటల్లో ఎన్టీఆర్‌తో కలిసి స్టెప్పులేయడానికి తప్పితే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది వర్కవుట్‌ అవ్వలేదు. తండ్రిగా నటించిన రాజేంద్రప్రసాద్‌ క్యారెక్టర్‌కి పెర్‌ఫార్మెన్స్‌ చేసే అవకాశాలు తక్కువ. ఇక డిగ్నిఫైడ్‌ విలన్‌గా జగపతిబాబు పెర్‌ఫార్మెన్స్‌ బాగుంది. హీరో, విలన్‌ మధ్య జరిగే సీన్స్‌లో జగపతిబాబు ఎక్స్‌ప్రెషన్స్‌గానీ, డైలాగ్స్‌గానీ ఆకట్టుకునేలా వున్నాయి. పెద్దకొడుకుగా రాజీవ్‌ కనకాల ఓకే అనిపించుకున్నాడు. రెండో కొడుకుగా అవసరాల శ్రీనివాస్‌ అవసరం లేని క్యారెక్టర్‌ చేశాడు. రెండు సీన్స్‌లో మాత్రమే కనిపించిన మధుబాల అంతగా ఆకట్టుకోలేకపోయింది. 

టెక్నికల్‌గా చూసుకుంటే విజయ్‌చక్రవర్తి ఫోటోగ్రఫీ బాగుంది. సినిమా అంతా ఫారిన్‌లోనే తియ్యడం వల్ల ఫ్రెష్‌గా అనిపిస్తుందే తప్ప విజువల్‌గా ఎక్కడా కొత్తదనం అనేది కనిపించదు. దేవి మ్యూజిక్‌ విషయానికి వస్తే ఆడియోపరంగా పాటలు బాగానే వున్నట్టు అనిపించినా విజువల్‌గా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దేవి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఫర్వాలేదు అనిపిస్తుంది. డైరెక్టర్‌ సుకుమార్‌ గురించి చెప్పాలంటే అతను రాసుకున్న కథ కొత్తదేమీ కాదు. కానీ, ట్రీట్‌మెంట్‌ కొత్తగా వుండాలని, బ్యాక్‌డ్రాప్‌ కొత్తగా వుండాలని ట్రై చేశాడు. కథలోగానీ, కథనంలోగానీ చాలా లోపాలు కనిపిస్తాయి. ప్రపంచంలోనే పెద్ద బిజినెస్‌ టైకూన్స్‌ ఎవరైనా తమ పెట్టుబడుల్ని రకరకాల బిజినెస్‌లలో ఇన్‌వెస్ట్‌ చేస్తారే తప్ప ఏ ఒక్కదాంట్లోనే డబ్బు పెట్టేసి కంప్యూటర్‌లో బ్యాంక్‌ బ్యాలెన్స్‌ చూసుకుంటూ కూర్చోరు. కానీ, ఈ సినిమాలో విరుద్ధంగా సుబ్రహ్మణ్యం, కృష్ణమూర్తి ఒక్క దెబ్బతో ఆస్తి మొత్తం కోల్పోయి రోడ్డున పడతారు. అలాగే కృష్ణమూర్తి భార్య మధుబాలను డ్రగ్‌ కేసులో ఇరికించి జైలుకి పంపిస్తాడు. దానివల్ల అతనికి వచ్చిన లాభమేమిటనే విషయంలో క్లారిటీ లేదు. ఇక మన సినిమాలో హీరో మహా తెలివిగలవాడు. చేతులు పట్టుకొని హీరోయిన్‌ కన్న కల ఏమిటో చెప్పెయ్యగలడు. హీరోయిన్‌ కిడ్నాప్‌ అయితే రోడ్డు మీద దొరికిన చిన్న చిన్న ఆధారాలతో ఆమె ఎక్కడుందో కనుక్కోగలడు. ఇలాంటివి సినిమాలో మనకి కోకొల్లలుగా కనిపిస్తాయి. తండ్రికి విలన్‌ చేసిన అన్యాయానికి కొడుకు పగ తీర్చుకోవడం అనే కథతో సినిమా పుట్టిన దగ్గర నుంచి చాలా సినిమాలు వచ్చాయి. కొత్త బ్యాక్‌డ్రాప్‌ తప్ప ఈ కథలో కొత్తదనం ఏమీ లేదు. 

మహేష్‌తో సుకుమార్‌ చేసిన 1 నేనొక్కడినే ఇంటలెక్చువల్‌ సినిమా అనీ, అది అందరికీ అర్థం కాని సినిమా అని అది రిలీజ్‌ అయిన తర్వాత అంతా అన్నారు. అయితే అదే సినిమా టి.వి.లో వచ్చిన తర్వాత ఓకే ఫర్వాలేదు అన్నారు. అది ఒక కొత్త కాన్సెప్ట్‌తో చేసిన సినిమా అయినా ప్రతి సీన్‌కి తర్వాతైనా క్లారిటీ ఇచ్చాడు. కానీ, ఈ సినిమాలో క్లారిటీ లేని సీన్స్‌ చాలా వున్నాయి. సినిమాలోని ఫస్ట్‌ హాఫ్‌ని తీసుకుంటే తన తండ్రికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకునేందుకు బయల్దేరిన అభి ముందుగా విలన్‌ కూతురైన దివ్య(రకుల్‌ప్రీత్‌)ని లైన్‌లో పెడతాడు. లవ్‌ చేస్తున్నట్టు చెప్తాడు. ఆమెను ఇంప్రెస్‌ చెయ్యడానికి రకరకాల ట్రిక్కులు ప్లే చేస్తాడు. ఎలాగైతే విలన్‌ని కలిసి అతన్ని జీరో చేస్తానని ఛాలెంజ్‌ చేస్తాడు. అలా ఫస్ట్‌ హాఫ్‌ కాస్త ఫర్వాలేదు అనిపించేలా వుంటుంది. సెకండాఫ్‌కి వచ్చేసరికి హీరో తన తండ్రిపై పగ తీర్చుకోవడానికే ఇదంతా చేస్తున్నాడని తెలుసుకొని అతన్ని ఛీ కొడుతుంది. దాంతో హీరో తన పగను పక్కన పెట్టి తన ప్రేమ, పగ రెండూ నిజమేనని ఆమెను ప్రాధేయ పడతాడు. తన ప్రేమ నిజమైందని ప్రూవ్‌ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. దీంతో సెకండాఫ్‌లో కథ పక్కదారి పట్టింది. జైలులో వున్న తల్లిని హీరోయిన్‌ కలుసుకునేలా ప్లాన్‌ చేస్తాడు. మధ్య మధ్య పాటలు కూడా వస్తుండడంతో అసలు కథ పక్కన పడేసారనిపిస్తుంది. ఇక ప్రీ క్లైమాక్స్‌లో అసలు కథలోకి వచ్చి హీరో తెలివిగా విలన్‌కి బుద్ధి చెప్పడం, దాన్ని టి.వి. ద్వారా తండ్రికి చూపించడంతో తృప్తిగా కన్ను మూస్తాడు తండ్రి. సుకుమార్‌ తను అనుకున్న కథతో, కాన్సెప్ట్‌తో వెళ్ళిపోవడం, ఎంటర్‌టైన్‌మెంట్‌ అనేది అస్సలు లేకపోవడం, పాటలు కూడా విజువల్‌గా అంతంత మాత్రంగానే వుండడం, ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే అంశాలు కూడా లేకపోవడంతో సగటు ప్రేక్షకులని ఈ సినిమా ఆకట్టుకునే అవకాశాలు తక్కువ. ఎ సెంటర్స్‌ ఆడియన్స్‌కే అంతంత మాత్రంగా అర్థమయ్యే ఈ సినిమా బి, సి సెంటర్స్‌ ఆడియన్స్‌కి రీచ్‌ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఫైనల్‌గా చెప్పాలంటే సుకుమార్‌ చేసిన గత సినిమా ఈ సినిమా కంటే బెటర్‌గా వుందని చెప్పుకునే స్థాయిలో నాన్నకు ప్రేమతో వుంది. ఈ పండగ సీజన్‌లో నాలుగు సినిమాలు రిలీజ్‌ అవుతుండడం వల్ల కమర్షియల్‌గా ఈ సినిమాకి ఎంతవరకు వర్కవుట్‌ అవుతుందనేది చెప్పడం కష్టమే. 

ఫినిషింగ్‌ టచ్‌: మరో కొత్త ప్రయత్నం చేసిన సుకుమార్‌ 

సినీజోష్‌ రేటింగ్‌: 2.75/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ