Advertisementt

సినీజోష్‌ రివ్యూ: కిల్లింగ్‌ వీరప్పన్‌

Fri 08th Jan 2016 05:35 PM
ramgopal varma latest movie killing veerappan,killing veerappan movie telugu review,killing veerappan movie cinejosh review,hero sivaraj kumar in killing veerappan  సినీజోష్‌ రివ్యూ: కిల్లింగ్‌ వీరప్పన్‌
సినీజోష్‌ రివ్యూ: కిల్లింగ్‌ వీరప్పన్‌
Advertisement
Ads by CJ

జి.ఆర్‌.పిక్చర్స్‌, శ్రీకృష్ణ క్రియేషన్స్‌, జెడ్‌3 పిక్చర్స్‌ 

కిల్లింగ్‌ వీరప్పన్‌ 

తారాగణం: శివరాజ్‌కుమార్‌, సందీప్‌ భరద్వాజ్‌, రాక్‌లైన్‌ వెంకటేష్‌, పరుల్‌ యాదవ్‌, యజ్ఞశెట్టి తదితరులు 

సినిమాటోగ్రఫీ: రామ్మీ 

సంగీతం: రవిశంకర్‌ 

ఎడిటింగ్‌: అన్వర్‌ అలీ 

నిర్మాతలు: బి.వి.మంజునాథ్‌, ఇ.శివప్రకాష్‌, బి.ఎస్‌.సుధీంద్ర 

రచన, దర్శకత్వం: రామ్‌గోపాల్‌వర్మ 

విడుదల తేదీ: 07.01.2016 

20 ఏళ్ళపాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి హత్యలు, కిడ్నాప్‌లు, స్మగ్లింగ్‌ వంటి ఎన్నో నేరాలకు పాల్పడిన వీరప్పన్‌ గురించి తెలియని ఇండియన్‌ వుండడంటే అతిశయోక్తి కాదు. అతన్ని పట్టుకోవడంలో పోలీసులు విఫలం కావడంలో, అతను తెలివిగా తప్పించుకోవడంలో ఎంతో మంది హస్తం వుందనేది తెలిసిన విషయమే. వీరప్పన్‌ వంటి క్రిమినల్‌ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కొందరికి వుంటుంది. అలాగే అంత పెద్ద క్రిమినల్‌ని చివరికి ఎలా మట్టుపెట్టారన్న విషయం తెలుసుకోవాలన్న కుతూహలం మరి కొందరికి వుంటుంది. వీరప్పన్‌ బాల్యం ఏమిటి, నేర ప్రపంచంలోకి అతనెందుకు రావాల్సి వచ్చింది, అతని 52 ఏళ్ళ జీవితం ఎలా గడిచింది అనే విషయాలను పక్కన పెట్టి ఎన్నో ఏళ్ళుగా వీరప్పన్‌ని పట్టుకోవాలని, మట్టు పెట్టాలని చూస్తున్న పోలీసులు చివరికి అతన్ని ఎలా చంపారు? అనే అంశాన్ని మాత్రమే తీసుకొని రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కించిన చిత్రం కిల్లింగ్‌ వీరప్పన్‌. 

పోలీసుల చివరి అస్త్రంగా ఆపరేషన్‌ కొకూన్‌ పేరుతో మొదలు పెట్టిన పోరాటానికి స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ హెడ్‌ అయిన విజయ్‌కుమార్‌ నేతృత్వం వహించాడు. ఆ పాత్రను కన్నడ హీరో డా|| శివరాజ్‌కుమార్‌ పోషించాడు. వీరప్పన్‌కి సంబంధించి అతని చివరి రోజుల్లోని కొన్ని అంశాలను మాత్రమే ఈ చిత్రంలో ప్రస్తావించారు. అతని నేర ప్రపంచానికి సంబంధించిన కొన్ని సంఘటనలను మాత్రమే చూపించారు. సినిమాలో ఎక్కువ భాగం ఎస్‌.టి.ఎఫ్‌కి సంబంధించిన వ్యూహాలు, వీరప్పన్‌ని పట్టుకోవడానికి వాళ్ళు వేసే పథకాలు, వాటి నుంచి వీరప్పన్‌ తప్పించుకొని పారిపోవడం, ఎస్‌.టి.ఎఫ్‌ మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి చివరికి అతన్ని మట్టుపెట్టడం అనేది కథాంశంగా మనకు కనిపిస్తుంది. 

ఒకప్పుడు కన్నడ సూపర్‌స్టార్‌ రాజ్‌కుమార్‌ను వీరప్పన్‌ కిడ్నాప్‌ చేసి కొన్నిరోజులపాటు తనవద్దే వుంచుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే వీరప్పన్‌ గురించి తీసిన సినిమాలో రాజ్‌కుమార్‌ తనయుడు శివరాజ్‌కుమార్‌ ఒక ప్రధాన పాత్ర పోషించడం విశేషమనే చెప్పాలి. ఎస్‌టిఎఫ్‌ ఆఫీసర్‌గా శివరాజ్‌కుమార్‌ అద్భుతమైన నటనని ప్రదర్శించాడు. కొన్ని సీన్స్‌లో అతని పెర్‌ఫార్మెన్స్‌ ఒళ్ళు గగుర్పొడిచేలా వుంది. వీరప్పన్‌ని పట్టుకోవాలన్న కసిని అతన్ని కళ్ళల్లో పెర్‌ఫెక్ట్‌గా చూపించగలిగాడు. ఇక వీరప్పన్‌గా నటించిన సందీప్‌ భరద్వాజ్‌ హావభావాలను, బాడీలాంగ్వేజ్‌ని గమనిస్తే వీరప్పన్‌నే మళ్ళీ చూస్తున్నామా ఫీలింగ్‌ కలుగుతుంది. వీరప్పన్‌ క్రూరత్వాన్ని, కన్నింగ్‌నెస్‌ని భరద్వాజ్‌ అద్భుతంగా తన పెర్‌ఫార్మెన్స్‌తో చూపించగలిగాడు. మిగతా పాత్రల్లో పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌గా నటించిన పరుల్‌ యాదవ్‌, వీరప్పన్‌ భార్య ముత్తులక్ష్మీగా యజ్ఞశెట్టి ఫర్వాలేదనిపించారు. 

టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్‌లో మొదట చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్‌ రామ్మీ గురించి. రామ్‌గోపాల్‌వర్మ ఈ చిత్రాన్ని ఎలా చూపించాలనుకున్నాడు, ఎలాంటి ఫ్రేమ్స్‌ పెట్టాలనుకున్నాడు, కెమెరాని ఎలా పరిగెట్టించాలనుకున్నాడు, ఆర్టిస్టుల ఫేస్‌ల నుంచి ఎలాంటి ఎక్స్‌ప్రెషన్‌ని క్యాచ్‌ చెయ్యాలనుకున్నాడు వంటి విషయాలను క్షుణ్ణంగా అర్థం చేసుకున్న రామ్మీ తన కెమెరా పనితనాన్ని హండ్రెడ్‌ పర్సెంట్‌ చూపించాడు. అయితే కెమెరాని పరిగెట్టించడం అనే విషయం సినిమాకి చాలా పెద్ద మైనస్‌ అయిందని చెప్పాలి. కొన్ని సందర్భాల్లో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసిన కెమెరా మూమెంట్‌, కొన్ని సీన్స్‌లో అదే పెద్ద తలనొప్పిగా మారింది. కళ్ళకు విపరీతమైన స్ట్రెయిన్‌ కలిగించే కెమెరా మూమెంట్స్‌తో విసుగు పుట్టించాడు వర్మ. పోలీసులకు వీరప్పన్‌ మనుషులు తారసపడినపుడు జరిగే కాల్పుల్లో ఎవరు ఎవరిని కాలుస్తున్నారో, అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలీని కన్‌ఫ్యూజన్‌ని కెమెరా క్రియేట్‌ చేసింది. అలాగే మరికొన్ని సందర్భాల్లో కూడా అర్థం లేని విధంగా కెమెరాను అటూ ఇటూ తిప్పడం కూడా ఆడియన్స్‌ని ఇబ్బంది పెట్టింది. ఇక మ్యూజిక్‌ విషయానికి వస్తే తన ప్రతి సినిమాకీ ముఖ్యంగా ఇలాంటి క్రైమ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ వున్న సినిమాకి మ్యూజిక్‌ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకొనే వర్మ ఈ సినిమాకి కూడా కాసింత ఎక్కువ జాగ్రత్తే తీసుకున్నట్టు తెలుస్తుంది. సినిమాలోని కొన్ని సీన్స్‌ మ్యూజిక్‌ వల్ల బాగా ఎలివేట్‌ అయ్యాయి. అయితే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మోతాదుకి మించి వుండడంతో చాలా చోట్ల రణగొణ ద్వనిలా వినిపిస్తుంది. ఇక రామ్‌గోపాల్‌వర్మ గురించి చెప్పాలంటే తెలుగు సినిమా చరిత్రలో తన కంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న వర్మ ఈ సినిమాతో తన మునుపటి ఫామ్‌ని తెచ్చుకున్నాడా అనిపిస్తుంది. కథను చెప్పే విషయంలోగానీ, స్క్రీన్‌ప్లే విషయంలోగానీ, కెమెరా, మ్యూజిక్‌, సౌండ్స్‌...ఇలా అన్ని యాస్పెక్ట్స్‌లో కాస్త ఎక్కువ శ్రద్ధే పెట్టినట్టు సినిమా చూస్తే తెలుస్తుంది. అయితే వీరప్పన్‌ ఎలాంటి వాడు, అతని తెలివితేటలు ఏమిటి? రెండు రాష్ట్రాల పోలీసులు కూడా పట్టుకోలేనంత చాకచక్యం అతనిలో ఏముంది? ఈ విషయంలో అతనికి సహాయం చేస్తున్నవారెవరు? ఇరవై ఏళ్ళు పోలీసుల కళ్ళు గప్పి తన దందాను ఎలా కొనసాగించాడు? అనే అంశాలను వర్మ ప్రస్తావించలేదు. కేవలం ఆపరేషన్‌ కొకూన్‌ ద్వారా వీరప్పన్‌ని ఒక పథకం ప్రకారం ఎలా మట్టుపెట్టారు అనే అంశాన్ని మాత్రమే తీసుకున్నాడు. సినిమాలోని ఎక్కువ భాగం పోలీస్‌ ఆపరేషన్‌, ఇంటరాగేషన్‌, వీరప్పన్‌ని పట్టుకోవడానికి పోలీసులు వేసే ప్లాన్స్‌ గురించి చెప్పడానికే సరిపోయింది తప్ప వీరప్పన్‌ పాత్రను ఎలివేట్‌ చేసే సీన్స్‌ ఎక్కువ కనిపించలేదు. 

వీరప్పన్‌ ఎంట్రీ, అతను చేసిన కొన్ని నేరాలు, మధ్య మధ్య శివరాజ్‌కుమార్‌ అతన్ని పట్టుకోవడానికి రచించే వ్యూహాలతో ఫస్ట్‌హాఫ్‌ రన్‌ అవుతుంది. వీరప్పన్‌ భార్య ద్వారా అతని ఆచూకీ తెలుసుకోవడానికి పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ అయిన శ్రేయను పంపడం, తద్వారా వీరప్పన్‌ని తమ ఉచ్చులోకి లాగాలని పోలీసులు ప్రయత్నించడం, ఆ ప్రయత్నంలో పోలీసులు విఫలం కావడంతో ఫస్ట్‌హాఫ్‌ ముగుస్తుంది. వీరప్పన్‌ని పట్టుకోవడానికి లేదా అతన్ని అడవి నుంచి బయటికి తీసుకు రావడానికి ఎన్ని ప్లాన్స్‌ వెయ్యాలో అన్నీ వేసిన తర్వాత పోలీస్‌ జాబ్‌కి గుడ్‌బై చెప్పి వ్యాపారం చేసుకుంటున్న కుమార్‌ అనే ఆఫీసర్‌ సహాయంతో వీరప్పన్‌ని అడవి బయటికి తీసుకొచ్చి ఒక పథకం ప్రకారం పోలీసులు చుట్టిముట్టి అతన్ని హతమార్చడంతో సినిమా ఎండ్‌ అవుతుంది. ఎంతో ఆసక్తికరంగా సినిమా మొదలవడం, మధ్య మధ్య ఎస్‌టిఎఫ్‌ చేసే కొన్ని ఆపరేషన్స్‌, వీరప్పన్‌ భార్యతో పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ స్నేహం వంటి సీన్స్‌ కొంత ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఆ తర్వాత అదే రొటీన్‌గా మారి మధ్యలో కాస్త బోర్‌ కొట్టిస్తుంది. సెకండాఫ్‌కి వచ్చేసరికి వీరప్పన్‌ని పట్టుకొనే క్రమంలో పోలీసులు వేసే ఎత్తులు కొంత సేపు బోర్‌ కొట్టిస్తాయి. ఇక ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌కి చేరిన తర్వాత సినిమా స్పీడ్‌ అవుతుంది. రెండున్నర గంటల సినిమాలో కొన్ని బోరింగ్‌ సీన్స్‌ వున్నప్పటికీ కొన్ని మెరుపుల్లాంటి సీన్స్‌ కూడా వున్నాయి. ఓవరాల్‌గా వర్మ లేటెస్ట్‌ మూవీ కిల్లింగ్‌ వీరప్పన్‌ ఫర్వాలేదు అనిపిస్తుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: కొంత కిల్లింగ్‌.. మరికొంత థ్రిల్లింగ్‌ 

సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ