శ్రీస్రవంతి మూవీస్
నేను.. శైలజ
తారాగణం: రామ్, కీర్తి సురేష్, సత్యరాజ్, నరేష్, ప్రిన్స్,
రోహిణి, ప్రదీప్ రావత్, ధన్య బాలకృష్ణ, శ్రీముఖి,
ప్రగతి, సుడిగాలి సుధీర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి
సంగీతం: దేవిశ్రీప్రసాద్
ఎడిటింగ్: ఎ.శ్రీకరప్రసాద్
నిర్మాత: స్రవంతి రవికిషోర్
రచన, దర్శకత్వం: కిశోర్ తిరుమల
విడుదల తేదీ: 01.01.2016
రెగ్యులర్‌గా యాక్షన్ విత్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ చేసే రామ్ ఈసారి లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌ని టచ్ చేస్తూ చేసిన సినిమా నేను.. శైలజ. రీసెంట్‌గా వచ్చిన రామ్ సినిమా శివమ్‌కి మాటలు రాసిన కిశోర్ తిరుమల ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఒక డిఫరెంట్ మూవీ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌కి మరింత దగ్గరవ్వాలని రామ్ చేసిన ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అయింది? ఈ సినిమా ద్వారా దర్శకుడుగా పరిచయమైన కిశోర్ సినిమాని ఎంత కొత్తగా చూపించగలిగాడు? రామ్‌ని కొత్తగా ప్రజెంట్ చెయ్యడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యాడు? 2015 జనవరి 1న రిలీజ్ అయిన స్రవంతి మూవీస్ చిత్రం రఘువరన్ బి.టెక్ సాధించిన విజయంతో సంవత్సరం ప్రారంభమైంది. అదే బేనర్‌లోఈ జనవరి 1న విడుదలైన నేను.. శైలజ చిత్రానికి ప్రేక్షకులు ఎలాంటి ఫలితాన్ని అందించారు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
ఈ సినిమాలోని కథ కొత్తది కాదు, పాత్రలూ కొత్తవి కావు. కథనం కొంతవరకు సినిమా కొత్తగా వుంది అని చెప్పేలా వుంది. ఓపెన్ చేస్తే బీచ్‌లో మన హీరో హరి(రామ్) ఒక బీర్ బాటిల్‌తో కూర్చొని వుంటాడు. అతను మందు తాగడానికి గల కారణాలు ఏమిటో తెలుసుకోవడానికి తన కథ వినమంటాడు. చిన్నతనంలో తన క్లాస్‌మేట్ అయిన శైలజని ప్రేమిస్తాడు హరి. తండ్రి ప్రేమకు నోచుకోని శైలజ ఎప్పుడూ ముభావంగా వుంటుంది. హరి పరిచయంతో ఆమెలో ఆనందం అనేది మొదలవుతుంది. ఆ వయసులోనే హరి చెప్పిన ఐ లవ్‌యూని కాదంటుంది. ఆ ఊరి నుంచి హరి ఫ్యామిలీ వచ్చేస్తుంది. హరి పెరిగి పెద్దయ్యే వరకు ఎవరో ఒకరికి ఐలవ్‌యూ చెప్తూనే వుంటాడు. కానీ, అందరూ అతన్ని ఫ్రెండ్‌లా భావిస్తారే తప్ప ఎవ్వరూ ప్రేమించరు. కానీ, ఒకసారి లవ్ ఎట్ ఫస్ట్‌సైట్‌లా శైలజ(కీర్తి సురేష్) కనిపిస్తుంది. అనుకోకుండా హరి చేసిన కొన్ని మంచి పనుల వల్ల శైలజను ఇంప్రెస్ చేస్తాడు. దాంతో ఇద్దరూ ఫ్రెండ్స్‌గా మారిపోతారు. అలా వాళ్ళిద్దరూ మరింత క్లోజ్ అవుతారు. ఫైనల్‌గా ఓరోజు ఆమెకు ప్రపోజ్ చెయ్యడానికి రెడీ అవుతాడు హరి. ఆమెను బీచ్‌కి రమ్మని ఈలోపు బీర్ కొడుతుంటాడు. బీచ్‌కి వచ్చిన శైలజ అతని ప్రపోజల్‌ని రిజెక్ట్ చేస్తుంది. తాము ఫ్రెండ్స్ మాత్రమేనని, లవర్స్ కాదని తేలుస్తుంది. ఆల్‌మోస్ట్ ప్రేమలో పడిపోయినట్టు కనిపించిన శైలజ.. హరి చేసిన లవ్ ప్రపోజల్‌ని ఎందుకు కాదంది? హరిని హర్ట్ చేయడం వెనుక ఏదైనా కారణం వుందా? శైలజ చెప్పినదానికి హరి ఎలా రియాక్ట్ అయ్యాడు? శైలజ ప్రేమను పొందడానికి హరి ఏం చేశాడు? అనేది మిగతా కథ.
హరిగా రామ్ పెర్‌ఫార్మెన్స్ చాలా సెటిల్డ్‌గా వుంది. అతని గత సినిమాల్లో పెర్‌ఫార్మెన్స్ పరంగా కనిపించే అతి ఈ సినిమాలో లేదు. ప్రేమికుడిగా, భగ్న ప్రేమికుడిగా, తన ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకునే కుర్రాడిగా మంచి మార్కులు కొట్టేసాడు. డాన్సుల్లో, ఫైట్స్‌లో, డైలాగ్స్‌లో రెగ్యులర్‌గానే అనిపించిన రామ్ కొన్ని ఎమోషన్ సీన్స్‌లో మాత్రం కొత్తగా కనిపించాడు. ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన కీర్తి సురేష్ లుక్స్ పరంగా బాగానే వున్నా తన క్యారెక్టరైజేషన్ కారణంగా చాలా సీన్స్‌లో బ్లాంక్ ఫేస్‌తో కనిపిస్తుంది. పదే పదే హీరోయిన్‌ని అలా చూడడం ఆడియన్స్‌కి ఇబ్బంది కలిగించే విషయమే. హీరోయిన్ తండ్రిగా సత్యరాజ్ పెర్‌ఫార్మెన్స్ కూడా బాగుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో ఆకట్టుకునేలా నటించాడు. ప్రదీప్ రావత్ ఫస్ట్‌టైమ్ కామెడీ టచ్ వున్న క్యారెక్టర్‌ని ఈ సినిమాలో చేశాడు. కొన్నిచోట్ల తన కామెడీతో ఆడియన్స్‌ని నవ్వించే ప్రయత్నం చేశాడు. మిగతా పాత్రల్లో నరేష్, ధన్య బాలకృష్ణ, రోహిణి, ప్రగతి, ప్రిన్స్ ఓకే అనిపించారు.
ఈ సినిమాకి బాగా ప్లస్ అయిన డిపార్ట్‌మెంట్స్ సినిమాటోగ్రఫీ, మ్యూజిక్. కొన్ని సీన్స్ డల్‌గా, కొన్ని బ్రైట్‌గా కనిపించినా చాలా సన్నివేశాలు సమీర్‌రెడ్డి ఫోటోగ్రఫీ వల్ల బాగా ఎలివేట్ అయ్యాయి. పాటల్ని కూడా సమీర్ బాగా పిక్చరైజ్ చేశాడు. సినిమా రిలీజ్‌కి ముందే ఆడియో హిట్ అవ్వడం, పాటల పిక్చరైజేషన్ కూడా బాగుండడంతో దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాతో మ్యూజికల్ హిట్ కొట్టాడు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దేవిశ్రీప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి బాగా హైప్ తీసుకొచ్చింది. కథ, కథనం, మాటలు, దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకున్న కిశోర్ తిరుమల గురించి చెప్పాలంటే చాలా పాత కథని సెలెక్ట్ చేసుకున్నాడు. దానికి కథనం అనే పాలిష్ వెయ్యాలని చూశాడు. అయితే అది ఫస్ట్ హాఫ్ వరకే అది వర్కవుట్ అయింది. ఫస్ట్ హాఫ్‌లో కూడా మనం ఎన్నో సినిమాల్లో చూసేసిన సీన్స్ కోకొల్లలుగా కనిపిస్తాయి. హీరో, హీరోయిన్ల లవ్‌కి సంబంధించిన సీన్స్‌తో, ఇద్దరికీ సంబంధించిన ఒక ట్విస్ట్‌తో ఫస్ట్ హాఫ్ ముగించిన డైరెక్టర్ సెకండాఫ్‌లో ఒక కొత్త కథ చెప్పే ప్రయత్నం చేశాడు. అప్పటివరకు హీరో, హీరోయిన్‌కి సంబంధించిన ప్రేమకథను చూపించి సెకండాఫ్‌కి వచ్చేసరికి తండ్రీ, కూతురు మధ్య సెంటిమెంట్, హీరోయిన్ తండ్రికి, హీరోయిన్ తాతయ్యల మధ్య ఎమోషన్.. ఇలా సినిమాని ప్రీ క్లైమాక్స్ వరకు లాక్కొచ్చి అక్కడ ఒక డ్రామా ప్లే చేయడం ద్వారా, అందర్నీ కట్టిపడేసే ఎమోషనల్ సీన్స్ ద్వారా ఓకే అనిపించుకున్నాడు డైరెక్టర్. ఈ ప్రాసెస్‌లో సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ వరకు చాలా బోరింగ్‌గా సాగుతుంది. చాలా అనవసరమైన సీన్స్, నెక్స్‌ట్ ఏం జరగబోతోందో ఆడియన్స్ ఊహించే విధంగా వుండే సీన్స్‌తో క్లైమాక్స్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేలా చేశాడు.
ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడడం, ఆమెను ఇంప్రెస్ చెయ్యడానికి చాలా మంచి పనులు చెయ్యడం(అయితే ఇందులో అవన్నీ అనుకోకుండానే జరుగుతాయి) ద్వారా హీరోయిన్‌ని ఇంప్రెస్ చేసిన హీరో ఆమెకు దగ్గరై సరిగ్గా ఐలవ్‌యూ చెప్పే టైమ్‌కి తను ప్రేమించలేదని, అతనికి తను ఫ్రెండ్ మాత్రమేనని చెప్పడం, దాని వెనుక పెద్ద కారణాలు వుండడం ఇవన్నీ రొటీన్ కథలాగే అనిపిస్తుంది. అయితే సీన్స్ పరంగా కొన్ని కొత్తగా అనిపించాయి. అలా ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించుకున్న డైరెక్టర్ సెకండాఫ్ నుంచి ఆడియన్స్‌కి బోర్ కొట్టించడం మొదలుపెడతాడు. ప్రీ క్లైమాక్స్ వరకు సెకండాఫ్‌లో చెప్పుకోవడానికి ఏమీ లేదు. కామెడీ కోసం సెపరేట్‌గా కమెడియన్స్ జోలికి వెళ్ళకుండా వున్న ఆర్టిస్టులతోనే అక్కడక్కడా కామెడీ చేయించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్లో నేరేషన్ సినిమాకి పెద్ద మైనస్ అయింది. చాలా సీన్స్ లెంగ్తీగా వుండడం, కొన్ని కథకు అవసరం లేని సీన్స్ పెట్టడం వల్ల డైరెక్టర్ కొత్తగా తీసే ప్రయత్నం చేసినా చాలా సందర్భాల్లో సక్సెస్ అవ్వలేకపోయాడు. ఫైనల్‌గా చెప్పాలంటే సినిమాలో చాలా మైనస్‌లు వున్నప్పటికీ ఈమధ్యకాలంలో ఆడియన్స్‌ని ఆకట్టుకునే ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ లేకపోవడం ఈ సినిమాకి ప్లస్ అయ్యే అవకాశం వుంది.
ఫినిషింగ్ టచ్: ఓకే.. శైలజ
సినీజోష్ రేటింగ్: 2.75/5