Advertisementt

సినీజోష్‌ రివ్యూ: సౌఖ్యం

Thu 24th Dec 2015 09:41 PM
telugu movie soukhyam,soukhyam movie review,soukhyam movie cinejosh review,gopichand new movie soukhyam,ravikumar chowdary new movie soukhyam,regina in soukhyam  సినీజోష్‌ రివ్యూ: సౌఖ్యం
సినీజోష్‌ రివ్యూ: సౌఖ్యం
Advertisement

భవ్య క్రియేషన్స్‌ 

సౌఖ్యం 

తారాగణం: గోపీచంద్‌, రెజీనా, షావుకారు జానకి, 

జె.పి., బ్రహ్మానందం, రఘుబాబు, ముఖేష్‌ రుషి, 

ప్రదీప్‌ రావత్‌, పృథ్వీ, పోసాని, కృష్ణభగవాన్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: ప్రసాద్‌ మురెళ్ళ 

సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ 

ఎడిటింగ్‌: గౌతంరాజు 

కథ-మాటలు: శ్రీధర్‌ సీపాన 

స్క్రీన్‌ప్లే: కోన వెంకట్‌, గోపీమోహన్‌ 

నిర్మాత: వి.ఆనందప్రసాద్‌ 

దర్శకత్వం: ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి 

విడుదల తేదీ: 24.12.2015 

గోపీచంద్‌, ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి కాంబినేషన్‌లో 11 ఏళ్ళ క్రితం వచ్చిన యజ్ఞం అప్పట్లో సంచలన విజయం సాధించింది. అప్పటివరకు విలన్‌ క్యారెక్టర్స్‌ చేసిన గోపీచంద్‌ని యజ్ఞం చిత్రంతో మాస్‌ హీరోగా నిలబెట్టాడు చౌదరి. ఆ తర్వాత చౌదరి చేసిన సినిమాలు అనుకున్నంత సక్సెస్‌ని సాధించలేకపోయాయి. రీసెంట్‌గా డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేతో అతను చేసిన పిల్లా నువ్వు లేని జీవితం మంచి విజయాన్ని సాధించింది. ఇక లక్ష్యం చిత్రం నుంచి మూడక్షరాల సెంటిమెంట్‌తో చివరలో ం తో ఎండ్‌ అయ్యే టైటిల్స్‌తో సినిమాలు చేస్తూ విజయాలు సాధిస్తున్న గోపీచంద్‌ మరోసారి అలాంటి టైటిల్‌తో చేసిన సినిమా ఇది. గోపీచంద్‌, ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి కాంబినేషన్‌లో భవ్య క్రియేషన్స్‌ బేనర్‌లో వి.ఆనందప్రసాద్‌ నిర్మించిన సౌఖ్యం కథపరంగా, కథనం పరంగా, ఎంటర్‌టైన్‌మెంట్‌ పరంగా ఆడియన్స్‌కి ఎంతవరకు సౌఖ్యంగా వుందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

ప్రతివారం రిలీజ్‌ అయ్యే కొత్త సినిమాల కోసం కొంతమంది ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. సినిమా అంటే మనకి వున్న ప్రేమ అలాంటిది. చూడబోయే సినిమాలో తమకు నచ్చే అంశాలు వుండాలని, రెండున్నర గంటల సేపు ఎంటర్‌టైన్‌ అవ్వాలని ప్రేక్షకులు కోరుకుంటారు. కానీ, అలాంటి సినిమాలు అందించడంలో ఎంత మంది డైరెక్టర్లు సక్సెస్‌ అవుతున్నారు? సినిమాని సినిమాలా తియ్యాలని డైరెక్టర్లు ఆలోచిస్తున్నారు. కానీ, ప్రేక్షకులు మాత్రం సినిమా నేచురల్‌గా వుండాలని, లాజిక్స్‌ మిస్‌ అవ్వకూడదని కోరుకుంటున్నారు. రొటీన్‌ సినిమాలు కాకుండా డైరెక్టర్స్‌ నుంచి డిఫరెంట్‌ సబ్జెక్ట్‌తో, డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌తో, డిఫరెంట్‌ థాట్స్‌తో సినిమాలు వస్తాయని ఆశిస్తున్నారు. అలాంటి సినిమాల కోసం ఎన్నో సినిమాలు చూస్తున్నారు, ఆయా డైరెక్టర్ల, రైటర్ల పైత్యానికి బలవుతున్నారు. తమకి వచ్చిందే డైరెక్టర్లు తీస్తున్నారు తప్ప ప్రేక్షకులకు నచ్చింది తియ్యలేకపోతున్నారు. ఎన్ని తరాలు మారినా, టెక్నాలజీ ఎంతగా అందుబాటులోకి వచ్చినా తమ మూసధోరణి మాత్రం మార్చుకోలేమని తమ సినిమాలతో బల్లగుద్ది మరీ చెప్తున్నారు దర్శకులు, రచయితలు. 

ప్రపంచంలో ఎవ్వరికీ లేని తెలివితేటలు మన తెలుగు సినిమా హీరోకి వుంటాయి. ఎంతమంది ఆజానుబాహులు ఎదురొచ్చినా వారిని మట్టి కరిపిస్తాడు, బంతిలా నేలకేసి కొడతాడు, గోడకేసి బాదుతాడు. రాష్ట్రాన్ని గడగడ లాడించే గూండా అయినా, ఢిల్లీలో వుండి చక్రం తిప్పే మినిస్టర్‌ని అయినా బకరా చెయ్యగల సత్తా మన హీరోకి వుంటుంది. ఏ సినిమాలో అయినా తొలి చూపులోనే హీరోయిన్‌ని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి కోసం ఎంత రిస్క్‌ అయినా తీసుకుంటాడు. పాపం కొన్ని వందల సినిమాల నుంచి అదే రిస్క్‌ తీసుకుంటూనే వున్నాడు. మనం చూస్తూనే వున్నాం. ఈమధ్య సినిమాలోని విలన్‌ని, తోటి క్యారెక్టర్లనే కాదు ప్రేక్షకుల్ని కూడా బకరాలను చెయ్యడం మొదలెట్టాడు మన హీరో. ఇందులో హీరోది కానీ, హీరోగా నటించిన ఆర్టిస్టుది కానీ ఎలాంటి తప్పు లేదు. ఆ క్యారెక్టర్‌ని క్రియేట్‌ చేసినవారు, ఆ క్యారెక్టర్‌ చుట్టూ కథని అల్లినవారు, ఆ కథకు ఒక స్క్రీన్‌ప్లేని, మాటల్ని సమకూర్చినవారు, వీటన్నింటినీ కలిపి ఆర్టిస్టులతో పెర్‌ఫార్మ్‌ చేయించి సినిమాగా మలిచిన డైరెక్టర్‌ ఆ బాధ్యతను తీసుకోవాలి. ఇప్పుడొస్తున్న చాలా సినిమాలను గమనిస్తే ప్రేక్షకులు వట్టి దద్దమ్మలు, వారికి ఏది చూపించినా చూస్తారు, ఎలాంటి సీన్‌కైనా చప్పట్లు కొడతారు, ఎంత వెకిలి కామెడీ చేసినా నవ్వేస్తారు అనే ధోరణి మన డైరెక్టర్లలో కనిపిస్తోంది. 

పైన మనం చర్చించిన విషయాలన్నీ ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిన సౌఖ్యం చిత్రంలో వున్నాయి. టైటిల్‌ చివర సున్న వచ్చేలా సెంటిమెంట్‌ పెట్టుకున్న గోపీచంద్‌కి ఈ సినిమా నిజంగానే సున్నాని మిగిల్చింది. అలాగే నిర్మాతకు కూడా ఒక పెద్ద సున్నా మిగుల్తుంది. ఏమాత్రం కొత్తదనం లేని కథని ఎంచుకొని దానితో రెండున్నర గంటలపాటు ప్రేక్షకుల్ని కుర్చీలకు కట్టేసి హింసించాలని చూసే ఇలాంటి డైరెక్టర్లు, రైటర్లు వున్నంత కాలం తెలుగు సినిమా గతి ఇలాగే వుంటుందని సౌఖ్యం మరోసారి నిరూపించింది. ఇలాంటి సినిమాలు గతంలో చాలా వచ్చాయి. దానికి తగ్గట్టుగానే ప్రేక్షకులు తిప్పి కొట్టారు. అయినా మన హీరోలకు, దర్శకనిర్మాతలకు చీమ కుట్టినట్టు కూడాలేదు. అన్నీ దులిపేసుకొని ఆ పాత చింతకాయ పచ్చడినే మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నారు తప్ప కొత్తగా ఆలోచించే ప్రయత్నం చెయ్యడం లేదు. సౌఖ్యం అనే పేరుతో వచ్చిన ఈ పాత చింతకాయ పచ్చడిలో కూడా కథగా చెప్పుకోవడానికి ఏమీ లేదు, అలాగే కథనంలో కూడా కొత్తదనం లేదు, నాసి రకం మాటలతో, పనికిరాని సన్నివేశాలతో, వెగటు పుట్టించే కామెడీతో, వామ్మో అనిపించే సెంటిమెంట్‌తో రెండున్నర గంటల సేపు ప్రేక్షకుల్ని చీల్చి చెండాడింది సౌఖ్యం. 

ఇందులో ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌ గురించి చెప్పుకోవడానికి శూన్యం. ఆల్రెడీ చూసేసిన క్యారెక్టర్లే కావడంతో మనకి ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది. అయితే హీరోయిన్‌ రెజీనా మాత్రం గ్లామరస్‌గా కనిపించింది. కథ, కథనాలతో విసిగి వేసారుతున్న ప్రేక్షకులకు పాటల్లో కాసేపు తన గ్లామర్‌తో రిలీఫ్‌నిచ్చింది. 

ఇక టెక్నీషియన్స్‌ గురించి చెప్పుకోవాలంటే ప్రసాద్‌ మురెళ్ళ ఫోటోగ్రఫీ ఎక్స్‌లెంట్‌గా వుంది. అది తప్ప టెక్నికల్‌గా సినిమాకి ప్లస్‌ అయిన డిపార్ట్‌మెంట్‌ ఏదీ లేదు. అనూప్‌ రూబెన్స్‌ మ్యూజిక్‌ సినిమాకి ఏ విధంగానూ హెల్ప్‌ అవ్వలేదు. పాటలు వినసొంపుగా లేవు. ప్రసాద్‌ మురెళ్ళ ఫోటోగ్రఫీ వల్ల పాటల్ని విజువల్‌గా చూడగలిగార తప్ప ఆడియోపరంగా చాలా వీక్‌గా వున్నాయి. ఈ పాటలు కూడా ఆల్రెడీ మనం వినేశాం అనే ఫీలింగ్‌ని కలిగిస్తాయి. కథ, కథనాలు ఎలా వున్నాయో దానికి తగ్గట్టుగానే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఏమాత్రం బాగాలేదు. శ్రీధర్‌ సీపాన రాసిన కథ, మాటల గురించి చెప్పాలంటే ఎప్పుడో బి.సి.ల కాలంనాటి కథతో, నాసిరకం మాటలతో రెడీ చేసిన ఈ కథ రవికుమార్‌చౌదరికి, నిర్మాత ఆనందప్రసాద్‌కి, హీరో గోపీచంద్‌కి ఎలా నచ్చిందనే విషయం ఎవరికీ అర్థం కాదు. దానికి తగ్గట్టు ఈమధ్య తమ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్న కోన వెంకట్‌, గోపీమోహన్‌లు ఒక కథని ఎంత చెత్తగా మార్చవచ్చో తమ స్క్రీన్‌ప్లేతో చూపించారు. గోపీచంద్‌తో చేసిన యజ్ఞం తర్వాత సరైన హిట్‌ లేని రవికుమార్‌చౌదరి చాలా గ్యాప్‌ తర్వాత పిల్లా నువ్వు లేని జీవితం చిత్రంతో మంచి హిట్‌ కొట్టాడు. ఆ సినిమాలో కొత్త కథ అంటూ ఏమీ లేకపోయినా స్క్రీన్‌ప్లేతో చేసిన మ్యాజిక్‌ బాగా వర్కవుట్‌ అయింది. ఆ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, సోలోగా రాసుకున్న చౌదరి సౌఖ్యం సినిమా విషయానికి వచ్చేసరికి అతి జాగ్రత్తతో మరో ముగ్గురితో కలిసి మంచి పనికిరాని చెత్త కథను తయారు చేసుకున్నాడు. యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం పెద్ద హిట్‌ అవ్వడంతో ఆ సెంటిమెంట్‌ కొద్దీ ఈ సినిమాలో కూడా హీరో పేరు శ్రీను, హీరోయిన్‌ పేరు శైలజ అనే పెట్టుకున్నాడు. సినిమాలో విషయం లేనప్పుడు ఈ పేర్ల సెంటిమెంట్‌ ఎలా వర్కవుట్‌ అవుతుంది? సౌఖ్యం విషయంలో అదే జరిగింది. ప్రేక్షకులంతా ఈ సినిమాని హాహాకారాలు చేస్తూ చూశారు. సినిమా పూర్తవకుండానే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని పరుగులు తీసినంత పనిచేశారు. 

ఫైనల్‌గా చెప్పాలంటే గోపీచంద్‌ చేసిన పరమ రొటీన్‌ సినిమా ఇది. గోపీచంద్‌తో యజ్ఞం వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని తీసిన రవికుమార్‌ చౌదరి సౌఖ్యంతో అతనికి మంచి ఫ్లాప్‌ మూవీ ఇచ్చాడని చెప్పొచ్చు. తన కథని నమ్ముకొని సినిమా తీసి వుంటే చౌదరికి ఇలాంటి నాసిరకం సినిమా వచ్చి వుండేది కాదు. తను చేసే సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులేసే గోపీచంద్‌ మరోసారి ఫ్లాపులో కాలేశాడు. ఏరకంగా చూసినా సౌఖ్యం ఆడియన్స్‌ని మెప్పించే సినిమా కాదు. ఈ సినిమా చూసే బదులు గోపీచంద్‌ ఇంతకుముందు చేసిన సినిమాలను మరోసారి చూడడం ఉత్తమం అని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ భావిస్తారు. మేకింగ్‌ పరంగా ఆనందప్రసాద్‌ ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుడా తీసినప్పటికీ కథ, కథనాల పరంగా, టేకింగ్‌ పరంగా క్వాలిటీ అనేది లేకపోవడం వల్ల ఈ సినిమా ఏ సెంటర్స్‌లోనూ కమర్షియల్‌గా వర్కవుట్‌ అవ్వదని చెప్పొచ్చు. 

ఫినిషింగ్‌ టచ్‌: దీనికంటే నరకం సౌఖ్యం 

సినీజోష్‌ రేటింగ్‌: 1.75/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement