Advertisementt

సినీజోష్‌ రివ్యూ: శంకరాభరణం

Sat 05th Dec 2015 10:21 AM
nikhil new movie sankarabharanam,telugu movie sankarabharanam review,sankarabharanam cinejosh review,sankarabharanam director uday nandanavanam,nanditha in sankarabharanam  సినీజోష్‌ రివ్యూ: శంకరాభరణం
సినీజోష్‌ రివ్యూ: శంకరాభరణం
Advertisement
Ads by CJ

ఎం.వి.వి. సినిమా 

శంకరాభరణం 

తారాగణం: నిఖిల్‌, నందిత, అంజలి, రావు రమేష్‌, 

సంపత్‌రాజ్‌, సుమన్‌, సప్తగిరి, రఘుబాబు, పృథ్వి తదితరులు 

సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్‌ 

ఎడిటింగ్‌: ఛోటా కె.ప్రసాద్‌ 

సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు 

కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్‌ 

సమర్పణ: కోన వెంకట్‌ 

నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ 

దర్శకత్వం: ఉదయ్‌ నందనవనం 

విడుదల తేదీ: 4.12.2015 

హ్యాపీడేస్‌ తర్వాత కొన్ని పనికిరాని సినిమాలు చేసి పరాజయాలు చవి చూసిన హీరో నిఖిల్‌ ఆ సినిమాలు నేర్పిన గుణపాఠంతో ఆచి తూచి అడుగులు వేస్తూ స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్‌ సూర్య వంటి డిఫరెంట్‌ సినిమాలు చేసి సక్సెస్‌లు అందుకున్నాడు. తాజాగా గీతాంజలి వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన టీమ్‌తో నిఖిల్‌ చేసిన సినిమా శంకరాభరణం. హిందీలో ఐదేళ్ళ క్రితం రిలీజ్‌ అయిన సూపర్‌హిట్‌ చిత్రం ఫస్‌ గయారే ఒబామా చిత్రం ఆధారంగా ఈ శంకరాభరణం రూపొందింది. హిందీలో సూపర్‌హిట్‌ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎలాంటి బ్యాక్‌డ్రాప్‌లో చేశారు? తెలుగు నేటివిటీకి అనుగుణంగా సినిమా వుందా? కోన వెంకట్‌ చేసిన కథ, స్క్రీన్‌ప్లే, మాటలు సినిమాకి ఎంతవరకు హెల్ప్‌ అయ్యాయి? డిఫరెంట్‌ కథాంశాలను ఎన్నుకుంటూ సినిమాలు చేస్తున్న నిఖిల్‌కి శంకరాభరణం ఎలాంటి రిజల్ట్‌నిచ్చింది? అనే విషయాలు తెలుసుకోవడానికి సమీక్షలోకి వెళ్దాం. 

కళాతపస్వి కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో రూపొందిన కళాఖండం, క్లాసిక్‌ మూవీ ఆనాటి శంకరాభరణం. తెలుగు ప్రేక్షకులు తమ గుండెల్లో పదిలంగా దాచుకున్న ఆ చిత్రాన్ని కె.వి.(కె.విశ్వనాథ్‌) సినిమా మీద తనకి వున్న భక్తితో, ప్రేక్షకులకి పది కాలాల పాటు గుర్తుండిపోవాలన్న శ్రద్ధతో తెరకెక్కించారు. ఆ సినిమా విడుదలై 35 సంవత్సరాలు దాటిపోయింది. అలాగే కె.వి.(కోన వెంకట్‌) నేతృత్వంలో రూపొందిన ఈ శంకరాభరణంతో శంకరాభరణం అనే టైటిల్‌కి కాలం చెల్లిపోయింది. అప్పటి శంకరాభరణం చిత్రానికి ఆ టైటిల్‌ పెట్టడంలో ఓ అర్థం వుంది. కానీ, ఈ చిత్రానికి ఆ టైటిల్‌ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఎన్ని టార్చిలైట్లు వేసి వెతికినా కారణం కనిపించదు. కేవలం ఆ టైటిల్‌ని ఖూనీ చేయడానికే ఈ సినిమాకి శంకరాభరణం అనే టైటిల్‌ పెట్టినట్టుగా అనిపిస్తుంది. 

కథ విషయానికి వస్తే తెలుగు సినిమా అయినా బీహార్‌ బ్యాక్‌డ్రాప్‌లోనే సినిమా అంతా వుంటుంది. బీహార్‌లోని ఓ ప్రాంతంలో కిడ్నాప్‌లనే వృత్తిగా చేసుకొని బ్రతికే కొన్ని గ్యాంగ్‌లు వుంటాయి. వారు చేసే కిడ్నాప్‌లకు హోం మినిస్టర్‌ పాండే(సంపత్‌రాజ్‌) అండదండలు కూడా వుంటాయి. ఒకవిధంగా చెప్పాలంటే కొన్ని కిడ్నాప్‌లు అతనే చేయిస్తుంటాడు. కట్‌ చేస్తే అమెరికా. డాలర్లలో పుట్టి పెరిగిన గౌతమ్‌(నిఖిల్‌) అమ్మాయిలతో తిరుగుతూ లైఫ్‌ని చాలా జాలీగా ఎంజాయ్‌ చేస్తుంటాడు. తండ్రి కోటీశ్వరుడు. ఎంతో కష్టపడి తండ్రి సంపాదించిన డబ్బుతో ఎంజాయ్‌ చెయ్యాలనుకునే కొడుకు. కానీ, ఆ కొడుక్కి ఓ సమస్య వచ్చి పడింది. తండ్రిని వ్యాపారంలో పార్టనర్స్‌ మోసం చేయడంతో రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో అప్‌సెట్‌ అయిన తండ్రి(సుమన్‌) ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. గౌతమ్‌ దాన్ని అడ్డుకుంటాడు. ఫ్యామిలీ మెంబర్స్‌కి సమస్యను వివరిస్తాడు గౌతమ్‌ తండ్రి. రెండు మిలియన్‌ డాలర్లు అంటే 12 కోట్ల రూపాయలు కడితే ప్రాబ్లమ్‌ సాల్వ్‌ అవుతుందని చెప్తాడు తండ్రి. తన పేరు మీద బీహార్‌లో వున్న శంకరాభరణం ప్యాలెస్‌ని అమ్మేసి డబ్బు తీసుకు రమ్మని కొడుకు గౌతమ్‌ని ఇండియా పంపిస్తుంది రజోదేవి(సితార). ఇండియాకి వచ్చిన గౌతమ్‌కి ఆ ప్యాలెస్‌లో తమ బంధువులే వుంటున్నారని తెలిసి వాళ్ళని ఖాళీ చేయించి ప్యాలెస్‌ని అమ్మకానికి పెట్టాలని చూస్తాడు. మరో పక్క ఒక ఎన్నారై బీహార్‌కి వచ్చాడని కిడ్నాప్‌ గ్యాంగ్‌లకు తెలుస్తుంది. అతన్ని కిడ్నాప్‌ చెయ్యడానికి ఆ గ్యాంగ్‌లు స్కెచ్‌లు వేస్తుంటాయి. అమెరికా నుంచి వచ్చిన గౌతమ్‌ని చూసి అతని బంధువులు ఎలా రియాక్ట్‌ అయ్యారు? తన బంధువులను ఒప్పించి గౌతమ్‌ ఆ ప్యాలెస్‌ని అమ్మగలిగాడా? అవకాశం కోసం పొంచి వున్న కిడ్నాపర్లు గౌతమ్‌ని కిడ్నాప్‌ చేశారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే. 

హిందీలో హిట్‌ అయిన కథను దిగుమతి చేసుకొని దానికి బీహార్‌ బ్యాక్‌డ్రాప్‌ని జోడించి ఇది మన సినిమా కాదు, ఇది మన నేటివిటీ కాదు అని చెప్పడానికి కోన వెంకట్‌ చేసిన కృషి ప్రతి సీన్‌లో కనిపిస్తుంది. సీన్‌ తర్వాత సీన్‌లా వస్తుంటుందే తప్ప సినిమాలో ఎక్కడా ఫ్లో అనేది వుండదు. ఈ కథకు శంకరాభరణం అనే టైటిల్‌ పెట్టడం వెనుక ఉద్దేశం ఏమిటో కనిపించదు. శంకరాభరణం అనేది ఒక ప్యాలెస్‌ అని చూపిస్తారు. తీరా చూస్తే అది ఔట్‌డోర్‌లో వేసిన ఒక ఇంటి సెట్‌లా అనిపిస్తుందే తప్ప బుద్ధున్నవాడెవడూ దాన్ని ప్యాలెస్‌ అనడు. దానికి తగ్గట్టుగానే సినిమాలో హీరోకి ఆ ప్యాలెస్‌ అడ్రస్‌ చూపిస్తానని చెప్పి ఒకడు అక్కడికి తీసుకొస్తాడు. ప్యాలెస్‌ ఏమిటి ఇలా వుంది అని ఒక నిముషం పాటు షాక్‌ అవుతూ చూస్తాడు హీరో. కామెడీ కోసం కోన వెంకట్‌ అలా చెప్తున్నాడులే అసలు ప్యాలెస్‌ వేరే వుంటుంది అనుకుంటున్న మనకు అదే నిజమైన ప్యాలెస్‌ అని కన్‌ఫర్మ్‌ చేయడంతో అసలు కామెడీ అప్పుడు మొదలవుతుంది. అనాథ శరణాలయంలా అక్కడ లెక్కకు మించి మనుషులు కనిపిస్తారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పెర్‌ఫార్మ్‌ చేసేస్తూ మన సహనాన్ని పరీక్షిస్తుంటారు. మధ్య మధ్యలో కొన్ని సెంటిమెంట్‌ సీన్స్‌తో, సెంటిమెంట్‌ డైలాగ్స్‌తో కూడా నవ్విస్తారు. ఇదిలా వుంటే ఆ ప్యాలెస్‌లో మరదలు వరసయ్యే హ్యాపీ(నందిత) గౌతమ్‌ని ప్రేమిస్తుంది. హ్యాపీ క్యారెక్టర్‌ ఎంటర్‌ అయిన తర్వాత సినిమా మరీ బోర్‌గా తయారవుతుంది. గౌతమ్‌ని ఒక గ్యాంగ్‌ కిడ్నాప్‌ చేయడంతో ఫస్ట్‌ హాఫ్‌ ఎండ్‌ అవుతుంది. ఇక సెకండాఫ్‌లో అన్ని సినిమాల్లోలాగే విలన్లను బకరాలను చేసి హీరో ఆడుకుంటూ వుంటాడు. అతను ప్లాన్‌ చేసినట్టుగానే కిడ్నాప్‌ గేమ్‌ స్టార్ట్‌ అవుతుంది. ఒకరి తర్వాత ఒకరు వంతులవారీగా కిడ్నాప్‌ చేసుకుంటూ వుంటారు. ఆ మధ్యలో హీరో తన తెలివితేటలతో అందర్నీ బకరాలను చేస్తూ వారి దగ్గర నుంచి డబ్బు వసూలు చేస్తుంటాడు. చివరికి ఒక సాధారణమైన క్లైమాక్స్‌తో అందరికీ శుభం పలుకుతాడు హీరో. 

బీహార్‌లో కిడ్నాప్‌ గ్యాంగ్‌లంటూ కథను మొదలు పెట్టడమే సినిమాకి పెద్ద మైనస్‌గా మారింది. మన నేటివిటీ వుండదు, అందరూ బీహార్‌ గెటప్‌లలోనే తిరుగుతుంటారు. నిజానికి అదే కిడ్నాప్‌ కథను మన నేటివిటీలో తీసి వుంటే సినిమా మరోలా వుండేది. అయితే స్క్రీన్‌ప్లేలో వున్న చాలా మైనస్‌ల వల్ల మన నేటివిటీలో తీసినా జనానికి ఎక్కేది కాదేమో. ఈ సినిమా చూస్తున్నప్పుడు రవితేజ చేసిన ఫ్లాప్‌ మూవీ కిక్‌2 మనకు స్ఫురిస్తుంది. అర్థం లేని సీన్స్‌, నవ్వు రాని కామెడీ, అతిగా అనిపించే సెంటిమెంట్‌ సీన్స్‌. ఫీల్‌ కలిగించని లవ్‌ సీన్స్‌, విసుగు పుట్టించే హీరోయిన్‌ ఓవరాక్షన్‌..ఇలా సినిమాకి అన్నీ బాగా తోడయ్యాయి. పైగా రెండున్నర గంటల సమయంలో సాధారణ ప్రేక్షకుడు ఒక సినిమాలో ఇన్ని భరించాలంటే చాలా కష్టమనే చెప్పాలి. 

ఎన్నారైగా నిఖిల్‌ పెర్‌ఫార్మెన్స్‌ చాలా కృతకంగా వుంది తప్ప ఎక్కడా నేచురల్‌గా అనిపించదు. కొన్ని సీన్స్‌లో అతను చెప్పే డైలాగ్స్‌ కూడా మనకు అర్థం కావు. హీరోయిన్‌ నందిత చేసిన క్యారెక్టర్‌కి ఏమాత్రం ప్రాధాన్యత లేదు. అయినా తన శక్తికి మించి ఓవరాక్షన్‌ చేసే ప్రయత్నం చేసింది. పైగా సప్తగిరితో నందిత నడిపిన లవ్‌ ట్రాక్‌ చూస్తే ఆడియన్స్‌కి చిర్రెత్తుతుంది. ఇక మరో విచిత్రమైన కిడ్నాపర్స్‌ గ్యాంగ్‌ ఓనర్‌ మున్ని క్యారెక్టర్‌లో అంజలి ఆడియన్స్‌ మీద విరుచుకుపడింది. మగవాడంటే పడని మున్నీ ఆడవాళ్ళతోనే గ్యాంగ్‌ రన్‌ చేస్తుంటుంది, పృథ్విలాంటి వాళ్ళని గ్యాంగ్‌ రేప్‌ చేయిస్తుంటుంది. తన డైలాగ్స్‌తో, అర్థంలేని పాటతో, డాన్సులతో తన శక్తి మేరకు విసిగించే ప్రయత్నం చేసింది అంజలి. ఇక ఫ్యామిలీ క్యారెక్టర్స్‌లో ఎవరిదీ సరైన క్యారెక్టరైజేషన్‌ కాదు. హీరో ప్యాలెస్‌లోని అందర్నీ అమెరికా తీసుకెళ్తానని చెప్పడంతో ఆడ, మగ తేడా లేకుండా ఫుల్‌గా తాగేసి కుటుంబ పెద్ద అయిన రావు రమేష్‌ని చంపడానికి ప్లాన్‌ చేస్తారు. ఇక అమెరికాలో వున్న రావు రమేష్‌ చెల్లెలు సితార క్యారెక్టరైజేషన్‌ కూడా చాలా దరిద్రంగా వుంటుంది. తన అన్నయ్య ఇంట్లో పెళ్ళి జరుగుతుంటే పెళ్ళి లేదు, దినం లేదు పని కంప్లీట్‌ చేసుకొని వచ్చెయ్యమని కొడుక్కి చెప్తుంది. తన అన్నయ్య మీద, ఫ్యామిలీ మెంబర్స్‌ మీద ఆమెకు ఎలాంటి ఫీలింగ్స్‌ లేవు అన్నట్టుగా చూపించారు. మరోసారి పృథ్వికి ఈ సినిమాలో మంచి క్యారెక్టర్‌ పడిందనడం కంటే మంచి డైలాగ్స్‌ కుదిరాయని చెప్పొచ్చు. సెకండాఫ్‌లో పృథ్వి ఎంటర్‌టైన్‌మెంట్‌ లేకపోతే సినిమా మరింత బోర్‌గా మారేది. సినిమా చూస్తుంటే ఇండస్ట్రీలో వున్న ఆర్టిస్టులంతా ఈ సినిమాలోనే వున్నారా అనిపించేలా ఇందులో నటీనటులు కూడా ఎక్కువే. 

టెక్నికల్‌గా చూస్తే సాయిశ్రీరామ్‌ ఫోటోగ్రఫీ బాగుంది. ఇదే బేనర్‌లో వచ్చిన గీతాంజలికి సాయి దీని కంటే మంచి ఫోటోగ్రఫీ చేశాడని చెప్పాలి. ప్రవీణ్‌ లక్కరాజు మ్యూజిక్‌ ఏ దశలోనూ ఆకట్టుకోదు. పాటలు అస్తవ్యస్తంగా వున్నాయి. దానికి తగ్గట్టుగానే పిక్చరైజేషన్‌ కూడా గందరగోళంగా వుంటుంది తప్ప విజువల్‌గా అస్సలు ఎంజాయ్‌ చెయ్యలేం. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా చాలా నాసిరకంగా అనిపిస్తుంది. ఇక కోన వెంకట్‌ రాసుకున్న కథలోగానీ, స్క్రీన్‌ప్లేలోగానీ, మాటల్లోగానీ ఎక్కడా నావెల్టీ అనేది కనిపించదు. ఎక్కడా ఫ్యామిలీ ఎటాచ్‌మెంట్స్‌గానీ, లవ్‌ ఫీల్‌గానీ, సెంటిమెంట్‌ వర్కవుట్‌ చెయ్యడంగానీ వుండదు. సీన్‌ ఎంత సీరియస్‌గా వున్నా దానికి కామెడీ డైలాగ్స్‌ జోడించే ప్రయత్నం చేశాడు. పైగా కిడ్నాప్‌కి గురైన ఒక హీరో క్యారెక్టర్‌, అతన్ని డైరెక్ట్‌ చేసే ఒక డైరెక్టర్‌ క్యారెక్టర్‌ని క్రియేట్‌ చేసి శ్రీను వైట్లని ఇన్‌డైరెక్ట్‌గా విమర్శించాడని అందరికీ డైరెక్ట్‌గానే అర్థమైంది. 

ఒక డిఫరెంట్‌ సినిమా చూడబోతున్నామని ఎంటర్‌ అయ్యే ఆడియన్స్‌కి సినిమా స్టార్టింగ్‌ నుంచే బోరింగ్‌ స్టార్ట్‌ అవుతుంది. కిడ్నాపర్స్‌ గురించి ఇంట్రడక్షన్‌, ఒక పాటతో హీరో ఎంట్రీ, ఆ తర్వాత హీరో ఇండియా రావడం, ఆ తర్వాత సినిమాని నడిపేందుకు చేసిన కొన్ని కామెడీ సీన్స్‌ తర్వాత ఒక ట్విస్ట్‌తో ఫస్ట్‌ హాఫ్‌ ఎండ్‌ అవుతుంది. ఇక సెకండాఫ్‌లో హీరోని కిడ్నాప్‌ చేసే కార్యక్రమాలు ఒకదాని వెంట ఒకటి జరుగుతుంటాయి. ప్రీ క్లైమాక్స్‌ నుంచి సినిమా కాస్త ఫర్వాలేదు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్‌ నుంచి క్లైమాక్స్‌ వరకు ప్రతి సీన్‌లో పృథ్వీ చెప్పే డైలాగ్స్‌ అందరికీ నవ్వు తెప్పిస్తాయి. ఒక నార్మల్‌ క్లైమాక్స్‌తో సినిమా ఎండ్‌ అవుతుంది. మూడు సూపర్‌హిట్‌ చిత్రాల తర్వాత నిఖిల్‌ చేసిన శంకరాభరణం ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం అనేది పక్కన పెడితే వారి సహనాన్ని పరీక్షించిన సినిమా అని చెప్పాలి. ఆడియన్స్‌కి కనెక్ట్‌ అవ్వని సబ్జెక్ట్‌, ఆకట్టుకోని బ్యాక్‌డ్రాప్‌, ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే సన్నివేశాలతో అతుకుల బొంతలా, కలగూర గంపలా తయారైన ఈ సినిమా చూడాలంటే ప్రేక్షకులకు బోలెడంత ఓపిక కావాలి. 

ఫినిషింగ్‌ టచ్‌: ప్రేక్షకుల సహనానికి పరీక్ష

సినీజోష్‌ రేటింగ్‌: 2.25/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ