Advertisementt

సినీజోష్‌ రివ్యూ: కుమారి 21ఎఫ్‌

Sat 21st Nov 2015 02:16 PM
telugu movie kumari 21f,kumari 21f movie review,kumari 21f movie cinejosh review,rajtarun new movie kumari 21f,sukumar movie kumari 21f  సినీజోష్‌ రివ్యూ: కుమారి 21ఎఫ్‌
సినీజోష్‌ రివ్యూ: కుమారి 21ఎఫ్‌
Advertisement

పి.ఎ. మోషన్‌ పిక్చర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ 

కుమారి 21ఎఫ్‌ 

తారాగణం: రాజ్‌ తరుణ్‌, హెబా పటేల్‌, 

నోయల్‌ సీన్‌, నవీన్‌, సుదర్శన్‌, హేమ తదితరులు 

సినిమాటోగ్రఫీ: ఆర్‌.రత్నవేలు 

ఎడిటింగ్‌: అమర్‌రెడ్డి 

సంగీతం: దేవిశ్రీప్రసాద్‌ 

కథ, స్క్రీన్‌ప్లే: సుకుమార్‌ 

మాటలు: పొట్లూరి వెంకీ 

సమర్పణ: సుకుమార్‌ 

నిర్మాతలు: విజయప్రసాద్‌ బండ్రెడ్డి, థామస్‌రెడ్డి, 

దర్శకత్వం: పల్నాటి సూర్యప్రతాప్‌ 

విడుదల తేదీ: 20.11.2015 

కథలు కొన్నే అయినా సినిమాలు ఎన్నో రకాలు. కొంతకాలం యాక్షన్‌ మూవీస్‌ని ఇష్టపడే ప్రేక్షకులు మరికొంత కాలం హార్రర్‌ కామెడీతో రూపొందిన సినిమాలను, ప్రేమకథా చిత్రాలను ఆదరిస్తూ వుంటారు. ఏ ట్రెండ్‌ నిలబడినా, నిలబడకపోయినా లవ్‌స్టోరీలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అయితే ఆ లవ్‌స్టోరీ ఎంత వైవిధ్యంగా చెప్పారు, దానికి ఆడియన్స్‌ ఎంతవరకు కనెక్ట్‌ అయ్యారనేది ఇంపార్టెంట్‌. హార్రర్‌ కామెడీలు, యాక్షన్‌ థ్రిల్లర్లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో ఒక ప్రేమకథా చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించాడు ప్రముఖ దర్శకుడు సుకుమార్‌. సుశాంత్‌తో కరెంట్‌ చిత్రాన్ని రూపొందించిన పల్నాటి సూర్యప్రతాప్‌ దర్శకత్వంలో విజయప్రసాద్‌ బండ్రెడ్డి, థామస్‌రెడ్డిలతో కలిసి సుకుమార్‌ నిర్మించిన చిత్రం కుమారి 21ఎఫ్‌. రాజ్‌తరుణ్‌, హెబా పటేల్‌ జంటగా రూపొందిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేమకథా చిత్రాలను డిఫరెంట్‌గా తీస్తాడన్న పేరున్న సుకుమార్‌ ఈ చిత్రానికి అందించిన కథ, స్క్రీన్‌ప్లే ఎంతవరకు ఆడియన్స్‌కి కనెక్ట్‌ అయింది? సుకుమార్‌ ఆలోచనలని తెరకెక్కించడంలో దర్శకుడు సూర్యప్రతాప్‌ సక్సెస్‌ అయ్యాడా? వరస విజయాలతో ముందుకెళ్తున్న రాజ్‌ తరుణ్‌కి కుమారి 21ఎఫ్‌ చిత్రం ఎలాంటి రిజల్ట్‌ నిచ్చింది? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

ఒకప్పటి ప్రేమకథలు వేరు, అప్పటి ప్రేమకథా చిత్రాల్లో ఆయా దర్శకులు ప్రేమకు చెప్పిన నిర్వచనం వేరు. మారుతున్న సామాజిక పరిస్థితులు, కొత్త పుంతలు తొక్కుతున్న యువతీ యువకుల అభిరుచులకు తగ్గట్టు సినిమాల్లోని ప్రేమకథల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఈ సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం యువత ఆలోచనలు ఎలా వున్నాయి? ప్రేమ విషయంలో, సెక్స్‌ విషయంలో వారికి వున్న క్లారిటీ ఏమిటి? ఈ రెండు విషయాల్లో యూత్‌కి ఎలాంటి మెచ్యూరిటీ కావాలి అనే అంశాలను తీసుకొని ఈ కథను తయారు చేసుకున్నాడు సుకుమార్‌. లవ్‌లో మెచ్యూరిటీ వున్న అమ్మాయి, మెచ్యూరిటీ లేని అబ్బాయి ప్రేమించుకుంటే ఆ ప్రేమ పర్యవసానం ఎలా వుంది? అది ఎన్ని ఆపార్థాలకు దారి తీసింది? ఆ ప్రేమికుల్ని ఎలాంటి మానసిక వ్యధకు లోను చేసింది? అనేది ప్రధానంగా ఈ చిత్రంలో కనిపిస్తుంది. 

కథ విషయానికి వస్తే ఓపెనింగ్‌ సీన్‌లో హీరో సిద్ధు(రాజ్‌ తరుణ్‌)ని పోలీసులు స్టేషన్‌కి తీసుకెళ్తారు. హీరోకి ముగ్గురు ఆవారా ఫ్రెండ్స్‌ వుంటారు. ఆ ముగ్గురూ ఒక అమ్మాయిని రేప్‌ చేసి, హత్య చేసి పారిపోతారు. వారి ఆచూకీ తెలుసుకోవడం కోసం వారి బెస్ట్‌ ఫ్రెండ్‌ అయిన సిద్దూని ఇంటరాగేషన్‌ కోసం పోలీస్‌ స్టేషన్‌కి తీసుకొస్తారు. అక్కడ తన ఫ్లాష్‌ బ్యాక్‌ గురించి మనకు చెప్పడం ప్రారంభిస్తాడు సిద్ధు. చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే ముగ్గురు ఫ్రెండ్స్‌. ఆ డబ్బుతో మందు, విందు, పొందు లతో ఎంజాయ్‌ చేస్తుంటారు. వారికి మందు, విందు ప్రొవైడ్‌ చేస్తుంటాడు సిద్ధు. సిద్ధుకి కేటరింగ్‌ అంటే ఇంట్రెస్ట్‌. సింగపూర్‌లోని ఓ క్రూజ్‌లో జాబ్‌ సంపాదించాలన్నది అతని ఎయిమ్‌. ఇలా వుండగా సిద్ధుకి కుమారి(హెబా పటేల్‌) పరిచయమవుతుంది. లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అన్నట్టుగా తొలిచూపులోనే సిద్ధుని ప్రేమిస్తుంది కుమారి. వెంటనే ఐ లవ్‌యూ కూడా చెప్తుంది. మరికొంత పరిచయంతో ఏకంగా ముద్దు కూడా పెట్టేస్తుంది. అయితే అవన్నీ తనకు ఫస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ అని చెప్తుంటుంది. మోడల్‌గా పనిచేసే కుమారి బార్‌కి వెళ్తుంది, మందు కొడుతుంది. అన్నింటినీ మించి సిద్ధుని లవ్‌ చేస్తుంటుంది. కానీ, అతని ఫ్రెండ్స్‌ మాత్రం మోడల్‌ అంటే ఎంతోమందితో పరిచయాలు వుంటాయని, అంతకుముందు చాలా మందిని లవ్‌ చేసి వుండొచ్చన్న అనుమానాన్ని సిద్ధుకు కలిగిస్తారు. ఈ విషయంలో క్లారిఫికేషన్‌ కోసం ట్రై చేసిన సిద్ధుకి కుమారి క్లాస్‌ పీకుతుంది. తన గతం గురించి ఏమిటనేది ఆలోచించకుండా లవ్‌ చేసే మెచ్యూరిటీ అతనికి రాలేదని చెప్తుంది. అలా వారి మధ్య ఆపార్థాలు చోటు చేసుకుంటాయి. సిద్ధు ఫ్రెండ్స్‌ చెప్పినట్టు కుమారి క్యారెక్టర్‌ మంచిది కాదా? సిద్ధుని కుమారి నిజంగానే లవ్‌ చేసిందా? కుమారి గురించి తెలిసిన తర్వాత కూడా సిద్ధు ఆమెను ఇష్టపడ్డాడా? వారిద్దరి మధ్య అపార్థాలు ఎలా తొలిగిపోయాయి? కుమారి గురించి ముగ్గురు ఫ్రెండ్స్‌ నెగెటివ్‌గా చెప్పడం వెనుక రీజన్‌ ఏదైనా వుందా? చివరికి సిద్ధు, కుమారిల ప్రేమ పెళ్ళి వరకు వెళ్లిందా? అనేది మిగతా కథ. 

ఈ కథలో సిద్ధు, కుమారిల క్యారెక్టరైజేషన్‌లో ఎక్కడా క్లారిటీ అనేది వుండదు. సిద్ధు చాలా మంచి వాడు. సింగపూర్‌లో జాబ్‌ సంపాదిచుకోవాలని ట్రై చేసేవాడు. కానీ, చిల్లర దొంగతనాలు చేసే ముగ్గురు అతనికి బెస్ట్‌ ఫ్రెండ్స్‌. వాళ్ళు దొంగతనం చేసి మూడు, నాలుగు రోజులు అండర్‌ గ్రౌండ్‌లోకి వెళ్ళిపోతే వారికి మందు, విందు పార్సిల్స్‌ తీసుకెళ్ళి వాళ్లని మేపుతుంటాడు. క్యారెక్టరైజేషన్‌లో క్లారిటీ లేకపోయినా పెర్‌ఫార్మెన్స్‌ పరంగా తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేశాడు రాజ్‌తరుణ్‌. ఇక కుమారి క్యారెక్టర్‌ చాలా విచిత్రంగా వుంటుంది. 500కి వస్తావా అని అడిగినందుకు ఒకడ్ని వెంటపడి మరీ కొడుతుంది. అలా అడిగినందుకు కాదు, అంత చీప్‌గా అడిగినందుకు. తన రేట్‌ ఎంత వుంటుందని హీరోని అడుగుతుంది. ఆమె మోడల్‌ కావడంతో మామూలుగా నడిచే నడకని కూడా క్యాట్‌ వాక్‌లా చేస్తుంది. సెక్స్‌ విషయాలు చాలా ఫ్రీగా మాట్లాడేస్తుంటుంది. ఒక అమ్మాయి దగ్గరకు వెళ్తున్నానని హీరో అంటే బాగా డ్రెసప్‌ చేసి కండోమ్స్‌ ఇచ్చి మరీ పంపిస్తుంది. ఈమె క్యారెక్టరైజేషన్‌ని కూడా పక్కన పెడితే పెర్‌ఫార్మెన్స్‌ పరంగా ఓకే అనిపించింది. లుక్స్‌వైజ్‌ హీరోయిన్‌గా హెబా పటేల్‌కి చాలా తక్కువ మార్కులే పడతాయి. సిద్ధు ఫ్రెండ్స్‌గా నటించిన నోయల్‌, నవీన్‌, సుదర్శన్‌లు తమ క్యారెక్టర్ల ద్వారా, డైలాగ్స్‌ ద్వారా అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశారు. సినిమాలో మనకు ఎక్కువగా కనిపించేవి ఈ ఐదు క్యారెక్టర్లే. 

సుకుమార్‌ చిత్రానికి రత్నవేలు ఫోటోగ్రఫీ ఎంత ప్లస్‌ అవుతుందో ఇంతకుముందే చూశాం. ఈ సినిమాలో కూడా అది కనిపిస్తుంది. మంచి లైటింగ్‌ స్కీమ్స్‌తో అద్భుతమైన ఫోటోగ్రఫీని అందించాడు రత్నవేలు. దేవిశ్రీప్రసాద్‌ ఎప్పటిలాగే సుకుమార్‌కి సూపర్‌హిట్‌ సాంగ్స్‌ ఇచ్చాడు. వాటిని విజువల్‌గా కూడా బాగానే తీశారు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా సిట్యుయేషన్‌కి తగ్గట్టు, మూడ్‌కి తగ్గట్టు బాగా చేశాడు దేవి. పొట్లూరి వెంకీ రాసిన మాటలు కొన్ని చోట్ల బాగున్నాయి అనిపిస్తాయి, మరికొన్ని సీన్స్‌లో చిరాకు తెప్పిస్తాయి. సుకుమార్‌ కథ, కథనాల గురించి చెప్పుకోవాలంటే అతని నుండి ఇలాంటి బోల్డ్‌ సబ్జెక్ట్‌ ఎవ్వరూ ఎక్స్‌పెక్ట్‌ చెయ్యరు. అమ్మాయికి ఎంతమంది బాయ్‌ ఫ్రెండ్స్‌ వున్నా, ఎంత మందితో తిరిగినా గతాన్ని మర్చిపోయి ఆ అమ్మాయిని లవ్‌ చెయ్యడమే మెచ్యూరిటీ అని చెప్పే ప్రయత్నం చేశాడు సుకుమార్‌. ఇలాంటి కథకు ఒక మంచి క్లైమాక్స్‌ని రాసుకున్నాడు. సుకుమార్‌ ఆలోచనలని యథాతధంగా తెరకెక్కించాడు దర్శకుడు సూర్యప్రతాప్‌. సుకుమార్‌ అందించిన చక్కని స్క్రీన్‌ప్లేని చాలా అద్భుతంగా ఎగ్జిక్యూట్‌ చేశాడు దర్శకుడు. యూత్‌కి నచ్చే డైలాగ్స్‌, యూత్‌ మెచ్చే సీన్స్‌తో వారిని ఎట్రాక్ట్‌ చెయ్యడంలో సుకుమార్‌, సూర్యప్రతాప్‌ సక్సెస్‌ అయ్యారు. 

కొన్ని ఇంట్రెస్టింగ్‌ సీన్స్‌, కొన్ని ఫన్నీ సీన్స్‌, మరికొన్ని సిల్లీ సీన్స్‌తో, కొన్ని ఎ డైలాగ్స్‌, ఎ సీన్స్‌తో ఫస్ట్‌ హాఫ్‌ ఫర్వాలేదులే అనిపించి, సెకండాఫ్‌కి వచ్చేసరికి మళ్ళీ అలాంటి సీన్స్‌తోనే కాలయాపన చేసిన తర్వాత ప్రీ క్లైమాక్స్‌ నుంచి సినిమా స్పీడ్‌ అందుకుంటుంది. అందరికీ నచ్చే మంచి క్లైమాక్స్‌తో సినిమా ముగుస్తుంది. అయితే ఈ సినిమా ద్వారా సుకుమార్‌ ప్రేక్షకులకు ఏదైనా మంచి విషయం చెప్పదలుచుకున్నాడా? అంటే అది ఒక్కటే మనం చూసినవి, విన్నవి అన్నీ నిజాలు కాదు అని. ఆ ప్రయత్నంలో యూత్‌ కోరుకునే కొన్ని మసాలా ఎలిమెంట్స్‌ని కూడా జొప్పించాడు. ఈ సినిమా కేవలం యూత్‌కి మాత్రమే నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ సినిమాని చూసే సాహసం చెయ్యరు. ఫైనల్‌గా చెప్పాలంటే ప్రేమ, సెక్స్‌ విషయాల్లో ప్రస్తుతం యువత ఆలోచనలు ఎలా వున్నాయనేది ఒక కథగా చెప్పే ప్రయత్నం చేశారు రచయిత, దర్శకుడు. యూత్‌కి నచ్చే అన్ని ఎలిమెంట్స్‌ వున్న కారణంగా కమర్షియల్‌గా ఈ సినిమాకి వర్కవుట్‌ అయ్యే అవకాశాలు ఎక్కువ. 

ఫినిషింగ్‌ టచ్‌: యూత్‌కి మాత్రమే నచ్చే సినిమా 

సినీజోష్‌ రేటింగ్‌: 3/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement