కొన్ని సినిమాలు మనం కేవలం వాటి ప్రమోషన్ల వల్ల చూడాలనుకొంటాం. అలా ట్రైలర్ చూసి షాకై వెళ్లి చూసిన చిత్రమే.. 'తిత్లీ'. 'తిత్లీ' అంటె సీతాకోక చిలుక. అంతర్జాతీయంగా ఎన్నో ప్రశంసలు అందుకొన్న ఈ చిత్రాన్నిఇద్దరు గొప్ప, విభిన్న దర్శకులైన దిభాకర్ బెనర్జీ, ఆదిత్య చోప్రా ప్రొడ్యూస్ చేసారు. దర్శకుడు కను భేల్ ఎవరో కాదు.. దిభాకర్ బెనర్జీ అసిస్టెంట్ మరియు 'లవ్ సెక్స్ దోఖా' (LSD) సహ రచయిత. ఇతనికి ఇదే మొదటి చిత్రం. డిల్లీలోని యదార్థ సంఘటనల ఆధారంగా నిర్మించిన ఈ సినిమాకు శరత్ కఠారియా, కను భాల్ రచయితలు.
ఇక క్లుప్తంగా కథ విషయానికి వద్దాం.. డిల్లీలోని దిగువ మధ్య తరగతి కుటుంబం తిత్లీది. ఇద్దరు అన్నయ్యలు, తండ్రితో కలసి చిన్న ఇంటిలో నివసిస్థుంటాడు. అతని పెద్ద అన్నయ్య కోపానికి తట్టుకోలేక అతని వదిన ఆమె కూతురితో సహా వెళ్లిపోతుంది. తిత్లీ అతని ఫ్యామిలీ బిజినెస్ అయిన నేరాలని ద్వేషించి ఇంట్లో నుండి వెళ్లిపోయి ప్రశాంతంగా బిజినెస్ చేయాలనుకొంటాడు. కానీ వెళ్లలేక నిస్సహాయంగా సోదరులకు సహాయం చేస్తూనే, తన ప్రయత్నాలను తను చేస్తూ, అతని పెద్దన్నయ్యకు తెలసి అతని చేతిలో చావు దెబ్బలు తింటాడు. ఇక ఇలా లాభం లేదని అన్నయ్యలు ఇద్దరూ కలసి
తమ్మునికి పెళ్లి చేస్తారు. అప్పుడు తమ్ముడు ఇంటి పట్టునే ఉండటమేకాక, తమ బిజినెస్ లో ఓమహిళ ఉంటే మరింత కలసి వస్తుందని వారి భావన. కాని ఇంటికి వచ్చిన కొత్త పెళ్లికూతురు పైకి కనిపించినంత అమాయకురాలేం కాదని త్వరగానే అర్థమవుతుంది. ఆమె తన స్వప్రయోజనాల కొరకే తనకు ఇష్ఠం లేకపోయినా ఈ పెళ్లి చేసుకొందని తిత్లీకి మొదటి రాత్రే అర్థం అవుతుంది. మరుసటి రోజే వీరి అసలు స్వరూపం తెలిసిన తిత్లీ భార్య.. వీరి నేరాలను చూసి షాకై గజగజ వణికిపోయి ఇంట్లో నుండి అర్ధరాత్రి పారిపోతుండగా.. తిత్లీ ఆమెని వారించి, తన ఉధ్దేశ్యం కూడా ఈ నరకం నుండి పారిపోవడమేనని, కాని ఇది సమయం కాదని వారించి.. ఇద్దరూ కలసి ఓ ఒప్పందం కుదుర్చుకొని, తిరిగి వారి ఇంటికి వచ్చి చక్కగా కలసి ఉంటారు. తిత్లీ తన భార్య ఓ వివాహితుడైన ప్రేమికుని వద్దకు తీసుకెళ్లమని కోరినా ఏ ఫీలింగ్ లేకుండా వారిధ్దరిని కలుపుతాడు. కానీ తిత్లీకి అతను మోసగాడని త్వరగా అర్థమవుతుంది. కానీ తన లక్ష్యం తన భార్యతో డీల్ కుదుర్చుకొన్న డబ్బుని తీసుకొని ఈ నరకం నుండి బయటపడటం.. అందుకే పట్టనట్టు ఉంటాడు. కానీ అనుకోని సంఘటలు ఒకదాని వెంట ఒకటి జరిగి అతన్ని ఉక్కిరి బిక్కి చేస్తాయి..
క్లుప్తంగా మనం సినిమా చూస్తున్నంత సేపు ఒక జీవితాన్నిచూస్తున్నట్టు ఫీలై మనం షాకవుతాం, డిస్టర్బ్ అవుతాం. ఎందుకంటె ముఖ్యంగా ప్రధాన పాత్ర పోషించిన షషాంక్ అరోరా (తిత్లీ),రణవీర్ షోరే, శివానీ రఘవంశీ మరియు మిగితా అంతా.. తమ తమ నటనతో మరిపిస్తారు. రణవీర్ షోరే కాకుండా మిగితా అంతా కొత్త వారే. స్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నిచాలా సహజంగా, కొత్తగా ఉంటాయి. ఎడిటింగ్,కెమెరా పనితనం చాలా బాగున్నాయి. చివరగా డైరెక్టర్ తనకు తెలిసిన అతని డిల్లీ సంఘటనలని చాలా రియలిస్టిక్ గా తీయడమే కాకుండా.. నటులతో సహజ నటనని రాబట్టుకొన్నాడు. స్వేచ్చగా ఎగరి వెళ్లిపోవాలనుకొన్న సీతాకొక చిలుక స్టోరీని కొత్త డైరెక్టర్ అయిన కను భేల్ బాగా చెప్పాడు. చిత్రం చూసి మనం ఇంటికి చేరుకొన్నా, చాలా సంఘటనలు, పాత్రలు మనని చాలా ఇబ్బంది పెడతాయి. అసలు ఇలాంటి విష పూరిత ఫ్యామిలీలు సభ్య సమాజంలో ఇంత నార్మల్ గా ఎలా ఉంటాయి.., ఒక్క పాజిటివ్ పాత్ర లేకుండా.. తమ తమ కోరికల కోసం ఎంతగా దిగజారుతారో..ఈ ముసుగు మనుషులని చూసి మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. సినిమాలను బాగా చూసే సినీ ప్రేమికులు తప్పక చూడవలసిన చిత్రం ఇది. అతిగా వున్న హింసా సన్నివేశాలు ఓ వర్గపు ప్రేక్షకులకు నచ్చక పోవచ్చు.
Chiiti