ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్
కంచె
తారాగణం: వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్, నికితిన్ ధీర్,
శ్రీనివాస్ అవసరాల, పోసాని, గొల్లపూడి తదితరులు
సంగీతం: చిరంతన్ భట్
సినిమాటోగ్రఫీ: వి.ఎస్.జ్ఞానశేఖర్
ఎడిటింగ్: సూరజ్ జగ్‌తాప్, రామకృష్ణ అర్రం
మాటలు: సాయిమాధవ్ బుర్రా
సమర్పణ: బిబో శ్రీనివాస్
నిర్మాతలు: సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్‌రెడ్డి
రచన, దర్శకత్వం: క్రిష్
విడుదల తేదీ: 22.10.2015
వైవిధ్య భరిత చిత్రాలు, రొటీన్‌కి భిన్నంగా వుండే సినిమాలు, ఆలోచింపజేసే సినిమాలు తీస్తాడని దర్శకుడు క్రిష్ పేరు వుంది. తన ప్రతి సినిమాలోనూ కమర్షియల్ ఎలిమెంట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా తను ఏదైతే చెప్పదలుచుకున్నాడో దానిమీదే దృష్టి పెట్టి సినిమాలు తీసే క్రిష్ మరోసారి తన పంథాలో, తన ఆలోచనలకు అనుగుణంగా తీసిన సినిమా కంచె. రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఒక సైనికుడి కథను తీసుకొని దానికి ప్రేమకథను, సామాజిక అంశాలను కూడా జోడించి చేసిన సినిమా ఇది. ఈ సినిమా ట్రైలర్స్‌లోని వార్ ఎపిసోడ్స్ చూసిన తర్వాత ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిన మాట వాస్తవం. అయితే ఆ అంచనాలను క్రిష్ అందుకోగలిగాడా? కంచె చిత్రం ద్వారా ప్రేక్షకులకు క్రిష్ ఏం చెప్పదలుచుకున్నాడు? ప్రేక్షకుల్ని ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకోగలిగింది? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథ: దూపాటి హరిబాబు(వరుణ్‌తేజ్) ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు. దేవరకొండ అనే గ్రామంలో జీవనం సాగిస్తుంటుంది ఆ కుటుంబం. అదే ఊరిలోని రాచకొండ సంస్థానానికి చెందిన సీత(ప్రగ్యా జైస్వాల్), హరిబాబు చెన్నపట్నంలో చదువుకుంటూ వుంటారు. వీళ్ళద్దరి మధ్య ఓ లవ్ స్టోరీ నడుస్తుంటుంది. కట్ చేస్తే ఇటలీలో రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటీష్ తరఫున రాయల్ ఇండియన్ ఆర్మీకి చెందిన 75 వేల మంది పాల్గొంటారు. అందులో దేవరకొండ గ్రామం నుంచి వచ్చిన కల్నల్ ఈశ్వరప్రసాద్(నికితిన్ ధీర్) కెప్టెన్ దూపాటి హరిబాబు కూడా వుంటారు. వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. హరిబాబుని ఎప్పటికైనా చంపాలని ఈశ్వరప్రసాద్ ఎదురుచూస్తుంటాడు. వారిమధ్య ఎప్పుడూ ఏదో విధంగా ఘర్షణ జరుగుతూ వుంటుంది. అసలు ఈశ్వరప్రసాద్ ఎవరు? వీళ్ళిద్దరి మధ్యా వున్న శత్రుత్వం ఏమిటి? హరిబాబు, సీతల ప్రేమకు అడ్డంకిగా నిలిచిందెవరు? దేవరకొండ గ్రామంలోని సామాజిక పరిస్థితులు ఏమిటి? రెండవ ప్రపంచ యుద్ధంలో ఏం జరిగింది? హరిబాబు, ఈశ్వరప్రసాద్ తిరిగి గ్రామానికి వచ్చారా? అనేది మిగతా కథ.
ఒక ప్రేమ కథ, ఒక ఊరి కథ, రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన ఎపిసోడ్స్. ఓ పక్క యుద్ధం జరుగుతూ వుంటుంది. మధ్య మధ్య హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ వస్తుంటాయి. ఈ కథ ద్వారా క్రిష్ ఏం చెప్పదలుచుకున్నాడు? అసలు కంచె ఏమిటి? ఇద్దరు మనుషుల మధ్య కంచె వుందంటాడు, రెండు దేశాల మధ్య కంచె వుందంటాడు, రెండు కులాల మధ్య కంచె వుందంటాడు. కులాల కుమ్ములాట గురించి చెప్పాలనుకున్నాడా? రెండవ ప్రపంచ యుద్ధంలో భారత సైన్యం చూపించిన ధైర్య సాహసాల గురించి చెప్పదలుచుకున్నాడా? ప్రేమలోని గొప్పతనాన్ని చెప్పాలనుకున్నాడా? అనేది సినిమా చూసిన ఎవ్వరికీ అర్థం కాని విషయం. అయితే ఒక విషయం మాత్రం చెప్పొచ్చు. ఇద్దరు మనుషుల మధ్య కంచె అనేది వుంది, రెండు కులాల మధ్య కంచె వుంది, అలాగే రెండు దేశాల మధ్య కూడా అదే కంచె వుంది. వాటిని పక్కన పెట్టి అందరూ కలిసి వుండాలన్న మెసేజ్ సినిమాలో వున్నట్టు కనిపిస్తుంది. అయితే ఆ విషయాన్ని చెప్పేందుకు ఎంచుకున్న కథ, కథనాలు ఆకట్టుకునేలా లేవు. దానికి తగ్గట్టు ప్రతి సన్నివేశాన్నీ బలమైన, బరువైన డైలాగ్స్‌తో రక్తి కట్టించాలని చూసిన క్రిష్ ప్రయత్నం విఫలమైంది. కథలో క్లారిటీలేదు. చెప్పాలనుకున్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పలేకపోయాడు. అలాగే హీరో, హీరోయిన్‌ల మధ్య నడిచే ప్రేమ సన్నివేశాలు చాలా నాటకీయంగా వుంటాయి తప్ప ఎక్కడా సహజత్వం అనేది గోచరించదు. వాళ్ళు చెప్పే డైలాగ్స్ కూడా పుస్తకాల్లో చదువుకోవడానికి బాగుంటాయి తప్ప ప్రేక్షకులకు ఏమాత్రం రుచించవు. రాయల్ ఇండియన్ ఆర్మీ జర్మనీ సైన్యానికి లొంగిపోయిన తర్వాత కల్నల్ ఈశ్వరప్రసాద్‌ని బందీగా తీసుకెళ్ళిపోతారు. అతన్ని రక్షించుకోవడానికి హీరో బృందం బయల్దేరుతుంది. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు, ఎంతోమందితో యుద్ధం. ఇదంతా కథకు సంబంధం లేకుండా ఒకదాని వెంట ఒక సీన్ వచ్చేస్తుంటుంది. ఆ సీన్స్‌లో కొన్ని ఎమోషన్స్, కొంత సెంటిమెంట్‌ని పండించే ప్రయత్నం చేసినా ఇదెక్కడి గొడవ అనిపిస్తుందే తప్ప ఏ ఒక్కటీ రక్తి కట్టదు. ఇంతా చేస్తే హీరో చివరికి సాధించింది ఏమిటంటే తన సహచరుల్ని, తన శత్రువు ఈశ్వరప్రసాద్‌లను పడవల ద్వారా స్వదేశానికి పంపడం. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు మనకు ప్రతి సన్నివేశం చాలా చిన్నదిగానే అనిపిస్తుంది. కానీ, దాని కోసం బరువైన మాటలు, లోతైన భావాలు జోడించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్.
దూపాటి హరిబాబుగా వరుణ్‌తేజ్ ఎంతవరకు కష్టపడాలో అంత కష్టపడ్డాడు. డైరెక్టర్ చెప్పింది చెప్పినట్టు చేసాడు. అయితే వరుణ్‌తేజ్ హీరోగా ఎలివేట్ అయ్యే ఒక్క సన్నివేశం కూడా సినిమాలో లేకపోవడం గమనార్హం. స్టోరీ ప్రకారం సినిమా నడుస్తుంటుంది తప్ప హీరోకి తన హీరోయిజాన్ని చూపించుకునే అవకాశం ఎక్కడా వుండదు. ఇక ఈశ్వరప్రసాద్‌గా చేసిన నికితిన్ ధీర్ ఓకే అనిపించాడు. సీతగా ప్రగ్యా జైస్వాల్ లుక్స్ వైజ్‌గా ఓకే కానీ పెర్‌ఫార్మెన్స్ పరంగా ఎక్కడా నేచురాలిటీ కనిపించదు. మిగతా ఆర్టిస్టులు కూడా బాగానే చేశారు. సినిమాలో కనిపించే క్యారెక్టర్లు తక్కువ కావడంతో సినిమా మొత్తం వారినే చూడాలన్నా ప్రేక్షకులకు బోరే కదా.
క్రిష్ అనుకున్న కథని, కథనాన్ని తెరపై ఆవిష్కరించడానికి సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టాడు. ప్రతి సీన్‌ని కొత్తగా చూపించాలన్న తాపత్రయం కనిపించింది. చిరంతన్ ఇచ్చిన మ్యూజిక్ గురించి చెప్పాలంటే పాటల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా భారీ స్థాయిలో ఇచ్చాడు. కొన్ని సీన్స్‌కి కొంతైనా గ్రాండియర్ వచ్చిందంటే దానికి జ్ఞానశేఖర్ ఫోటోగ్రఫీ, చిరంతన్ పనితనమే కారణం. క్రిష్ గురించి చెప్పాలంటే ఈ సినిమా మొత్తంలో వార్ ఎపిసోడ్‌ని మాత్రం ఇప్పటివరకు తెలుగులో ఎవరూ అలా తియ్యలేకపోయారు అనేంతగా కష్టపడి తీశాడు. వార్ ఎపిసోడ్స్ వరకు అతని టేకింగ్ హాలీవుడ్ రేంజ్‌లోనే వుంది. అయితే ఆ ఎపిసోడ్ నిడివి కూడా ఎక్కువ కావడంతో కొంత బోర్ కూడా కొట్టింది. రెండు గంటల సినిమా మనకు రెండున్నర గంటల సేపు చూస్తున్నట్టు అనిపిస్తుంది.
ఫస్ట్ హాఫ్ కొన్ని లవ్‌సీన్స్, కొంత వార్ ఎపిసోడ్‌తో కాస్త ఫర్వాలేదు అనిపిస్తుంది. ఎలాంటి ట్విస్ట్ లేకుండా ఫస్ట్ హాఫ్ చాలా నార్మల్‌గా ముగుస్తుంది. సెకండాఫ్‌కి వచ్చే సరికి కథని అక్కడక్కడే తిప్పుతూ కథకు సంబంధం లేని సీన్స్‌తో, అంతగా అవసరం లేని బ్యాక్‌గ్రౌండ్ సాంగ్‌తో క్లైమాక్స్ వరకు కష్టం మీద లాక్కొచ్చాడు క్రిష్. అతను ఫైనల్‌గా చెప్పాలనుకున్నది ఈశ్వరప్రసాద్‌ని, తన సహచరుల్ని కాపాడడం కోసం తన ప్రాణాలు కూడా అర్పించాడు హరిబాబు అని. అతను చనిపోయాడని చెప్తున్నా చూస్తున్న ఆడియన్స్‌కి ఎలాంటి ఫీల్ కలగదు. చివరికి ఊరికి వచ్చి హరిబాబు తండ్రితో ఈ విషయాన్ని చెప్పి సెల్యూట్ చేస్తాడు ఈశ్వరప్రసాద్. అదికూడా చాలా డ్రమెటిక్‌గా వుంటుందే తప్ప మనకు ఎలాంటి ఫీలింగ్‌ను కలిగించదు.
ముకుందతో హీరోగా పరిచయమైన వరుణ్‌తేజ్‌కి ఆ సినిమా ఎంత నిరాశ పరిచిందో అందరికీ తెలిసిందే. క్రిష్‌లాంటి డైరెక్టర్ చేస్తున్న కంచె తనకు మరింత మంచి పేరు తెస్తుందని ఆశించిన వరుణ్‌కి మరోసారి నిరాశ తప్పలేదు. మంచి హీరోగా, మంచి కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకోవాలని కలలు కంటున్న వరుణ్‌ని తమకోసమే సినిమాలు తీసుకునే డైరెక్టర్స్ వెనక్కి లాగేస్తున్నారు. సాధారణ ప్రేక్షకులకు అర్థంకాని కథలతో, మాటలతో సినిమాలు తీస్తూ వరుణ్‌లాంటి అప్ కమింగ్ హీరోల పాలిట శాపాలుగా మారుతున్నారు. ఫైనల్‌గా చెప్పాలంటే కంచె అనే సినిమా మేధావి వర్గానికి తప్ప సాధారణ ప్రేక్షకులకు ఇసుమంత కూడా అర్థంకాదనేది సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోయినా ఎమోషన్, ఫీల్ మిస్ అయిన సినిమా కంచె.
ఫినిషింగ్ టచ్: పాపం.. వరుణ్‌తేజ్
సినీజోష్ రేటింగ్: 1.5/5