Advertisementt

సినీజోష్‌ రివ్యూ: శివమ్‌

Fri 02nd Oct 2015 01:42 PM
telugu movie shivam,hero ram new movie shivam,shivam movie reveiw,shivam movie cinejosh review,heroing rashi kanna,music director devisri prasad  సినీజోష్‌ రివ్యూ: శివమ్‌
సినీజోష్‌ రివ్యూ: శివమ్‌
Advertisement
Ads by CJ

శ్రీ స్రవంతి మూవీస్‌ 

శివమ్‌ 

తారాగణం: రామ్‌, రాశి ఖన్నా, వినీత్‌కుమార్‌, అభిమన్యు సింగ్‌, 

శ్రీనివాసరెడ్డి, పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, 

నరేష్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: రసూల్‌ ఎల్లోర్‌ 

ఎడిటింగ్‌: మధు 

సంగీతం: దేవిశ్రీప్రసాద్‌ 

మాటలు: కిశోర్‌ తిరుమల 

సమర్పణ: కృష్ణ చైతన్య 

నిర్మాత: స్రవంతి రవికిషోర్‌ 

రచన, దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి 

విడుదల తేదీ: 02.10.2015 

దేవదాసుతో హీరోగా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన రామ్‌ ఇప్పటివరకు 12 సినిమాలు చేశాడు. ఈ 12 సినిమాల్లో 4 సినిమాలు మాత్రమే కమర్షియల్‌గా సక్సెస్‌ అయ్యాయి. కందిరీగ తర్వాత హిట్‌ లేని రామ్‌కి పండగ చేస్కో మంచి హిట్‌ అయి అతనికి ఉత్సాహాన్నిచ్చింది. తాజాగా స్రవంతి మూవీస్‌ బేనర్‌లో శ్రీనివాసరెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ స్రవంతి రవికిషోర్‌ నిర్మించిన శివమ్‌తో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రామ్‌. ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న రామ్‌ ఎనర్జీని కొత్త దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఏవిధంగా ఉపయోగించుకున్నాడు? మంచి సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన స్రవంతి మూవీస్‌ బేనర్‌కి శివమ్‌ ఎలాంటి రిజల్ట్‌నిచ్చింది? శివమ్‌ చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన శ్రీనివాసరెడ్డి రామ్‌కి మరో సూపర్‌హిట్‌ని ఇవ్వగలిగాడా? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

కథ: ప్రేమించుకున్నవారు పెళ్ళి చేసుకోవాలి, కలిసి బ్రతకాలి. ప్రేమ విఫలమైందని చనిపోవడం కరెక్ట్‌ కాదని నమ్మేవాడు మన హీరో శివ(రామ్‌). ప్రేమించుకొని పెళ్ళి చేసుకోలేని జంటలకు పెళ్ళి చేయడం కోసం ఎంత రిస్కయినా తీసుకుంటాడు. ఇక సినిమా ఓపెన్‌ చేస్తే చాలా సినిమాల్లోలాగే ఇష్టంలేని పెళ్ళి చేసుకోబోతున్న సెంట్రల్‌ మినిస్టర్‌ కూతురుకి, ఆమె ప్రేమించిన అబ్బాయితో పెళ్ళి చేసేందుకు శివ రిస్క్‌ చేసి పెళ్ళి మంటపం నుంచి అమ్మాయిని ఎత్తుకొచ్చేస్తాడు. ఆ పెళ్ళి జరిపించి మినిస్టర్‌ మనుషులకి దొరక్కుండా ట్రైన్‌లో జంప్‌ అయిపోతాడు. ఒక డ్రామా కోసం ఊరి బయట పొలాల్లో రిహార్సల్‌ చేస్తున్న హీరోయిన్‌ తనూజ(రాశిఖన్నా)ను ట్రైన్‌లో నుంచి చూసి లవ్‌లో పడతాడు శివ. ట్రైన్‌ నుంచి జంప్‌ చేసి ఆమె వెంటపడతాడు. ఇది జరగడానికి ముందు ఒక జంక్షన్‌లో ట్రైన్‌ ఆగినపుడు సిగరెట్‌ తాగడానికి బయటికి వచ్చిన శివకి, ఆ ఊరి జనాన్ని భయభ్రాంతులను చేసే భోజిరెడ్డి(వినీత్‌కుమార్‌) కొడుకుతో సిగరెట్‌ వెలిగించుకునే లైటర్‌ కోసం పెద్ద ఫైట్‌ జరుగుతుంది. తన కొడుకుని కొట్టినవాడిని పట్టుకోవడం కోసం మనుషుల్ని పంపిస్తాడు భోజిరెడ్డి. తనూజతో ఐ లవ్‌ యూ చెప్పించుకునేందుకు కర్నూలులో సెటిల్‌ అవుతాడు శివ. ఇదిలా వుంటే శివ కోసం అభి(అభిమన్యు సింగ్‌) గ్యాంగ్‌ కూడా వెతుకుతుంటుంది. మరో పక్క శివ వల్ల ఇబ్బందులు పడ్డ ప్రభ(బ్రహ్మానందం), శివ బిహేవియర్‌ నచ్చని అతని తండ్రి(పోసాని కృష్ణమురళి) శివని చంపాలని బయల్దేరతారు. తనని చంపాలని ట్రై చేస్తున్న గ్యాంగ్‌ల నుంచి శివ ఎలా తప్పించుకున్నాడు? తనూజతో ఐలవ్‌యూ చెప్పించుకోగలిగాడా? ప్రేమ జంటలకు పెళ్ళిళ్ళు చెయ్యడానికి శివ ఎందుకంత రిస్క్‌ తీసుకుంటున్నాడు? ఎన్నో ప్రేమ పెళ్ళిళ్ళు చేసిన శివ తన లవ్‌ని సక్సెస్‌ చేసుకోగలిగాడా? అనేది మిగతా కథ. 

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: ఈ సినిమాలో రామ్‌ చేసిన శివ క్యారెక్టర్‌ తరహా క్యారెక్టర్లు గతంలో అతనే కొన్ని సినిమాల్లో చేసేశాడు. ఈ క్యారెక్టర్‌ వాటికి కొనసాగింపుగా వుంటుందే తప్ప అతని క్యారెక్టర్‌లోగానీ, క్యారెక్టరైజేషన్‌లోగానీ ఎక్కడా కొత్తదనం అనేది కనిపించలేదు. అతని పెర్‌ఫార్మెన్స్‌ విషయానికి వస్తే ఆ తరహా క్యారెక్టర్‌ అతనికి కొట్టిన పిండే కాబట్టి ఎక్కడా ఇబ్బంది లేకుండా చాలా ఈజ్‌తో చేశాడు. పాటల్లో మంచి స్టెప్స్‌ వేశాడు. రౌడీలను కొడితే గాల్లో ఎగిరి అవతల పడే ఫైట్స్‌ అందరు హీరోలు చేస్తున్నారు, రామ్‌ కూడా అదే చేశాడు. కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌లో, హీరోయిన్‌ ప్రేమను పొందాలని తపించే ప్రేమికుడుగా కొన్ని సీన్స్‌లో ఫర్వాలేదనిపించాడు. హీరోయిన్‌ రాశి ఖన్నాకి కథతో సంబంధం వున్న క్యారెక్టరే అయినప్పటికీ ఆమె క్యారెక్టర్‌లోగానీ, క్యారెక్టరైజేషన్‌లో గానీ క్లారిటీ అనేది లేదు. అందువల్ల ఆమె పాటలకు, కొన్ని గ్లామరస్‌ సీన్స్‌కి మాత్రమే పరిమితమైపోయింది. భోజిరెడ్డిగా వినీత్‌కుమార్‌ మరోసారి విక్రమార్కుడు సినిమాని చూపించాడు. ఆ సినిమాలోని డైలాగ్‌ మాడ్యులేషన్‌తోనే భోజిరెడ్డి క్యారెక్టర్‌ చేయించాడు డైరెక్టర్‌. దానికి తగ్గట్టుగా రవిశంకర్‌తోనే డబ్బింగ్‌ చెప్పించడం, విక్రమార్కుడు సినిమాలో చెప్పిన డైలాగ్స్‌లాంటివే ఇందులోనూ చెప్పించడంతో విక్రమార్కుడు మళ్ళీ చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది. పవర్‌ఫుల్‌ విలన్‌గా చాలా సినిమాల్లో కనిపించిన అభిమన్యు సింగ్‌ ఇందులోనూ విలనే అయినప్పటికీ అతని విలనీ కామెడీగా అనిపిస్తుంది. ఇక బ్రహ్మానందం, పోసాని, శ్రీనివాసరెడ్డి, జబర్దస్త్‌ బ్యాచ్‌, ఫిష్‌ వెంకట్‌, ప్రభాస్‌ శ్రీను సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు నవ్వించేందుకు తమ శాయశక్తులా ప్రయత్నించారు. 

టెక్నీషియన్స్‌: టెక్నీషియన్స్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రసూల్‌ ఎల్లోర్‌ ఫోటోగ్రఫీ, పీటర్‌ హెయిన్స్‌ ఫైట్స్‌, దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌ గురించి. ఎన్నో సినిమాలకు చక్కని ఫోటోగ్రఫీని అందించిన రసూల్‌ ఈ చిత్రాన్ని కూడా ఆద్యంతం అందంగా చూపించడంలో తన ప్రతిభ కనబరిచాడు. రామ్‌, రాశిఖన్నాలను మరింత అందంగా చూపించాడు. ముఖ్యంగా విదేశాల్లో చిత్రీకరించిన పాటలు చాలా కలర్‌ఫుల్‌గా అనిపిస్తాయి. దేవిశ్రీప్రసాద్‌ చేసిన పాటల్లో రెండు పాటలు మాత్రమే ఆకట్టుకునేలా వున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ని మాత్రం సినిమాతోపాటు పరిగెత్తించాడు. అతని బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌వల్ల కొన్ని సీన్స్‌ బాగా ఎలివేట్‌ అయ్యాయి. ఇక అందరు టెక్నీషియన్స్‌ కంటే ఎక్కువ కష్టపడింది మాత్రం పీటర్‌ హెయిన్సే. సినిమాలో లెక్కకు మించిన ఫైట్స్‌ వున్నాయి, కొన్ని ఛేజ్‌లు వున్నాయి. ప్రతి ఫైట్‌ని డిఫరెంట్‌ చెయ్యాలని ట్రై చేశాడు. పీటర్‌ కంపోజ్‌ చేసిన ఫైట్స్‌కి రామ్‌ కష్టం కూడా తోడైంది. దాంతో ఫైట్స్‌ బాగా వచ్చాయి. ఎడిటింగ్‌ విషయానికి వస్తే రెండు గంటల నలభై ఎనిమిది నిముషాల సినిమాలో 48 నిముషాల సినిమాని కళ్ళు మూసుకొని కట్‌ చేసెయ్యవచ్చు. ఫస్ట్‌ హాఫ్‌లో, సెకండాఫ్‌లో ఆడియన్స్‌కి బోరు కొట్టే సన్నివేశాలు కోకొల్లలుగా వున్నాయి. స్క్రిప్ట్‌ సైడ్‌ వస్తే కిషోర్‌ తిరుమల, శ్రీనివాసరెడ్డి కలిసి రాసిన మాటలు ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. సాదా సీదా డైలాగ్స్‌తో కథను నడిపించారు. డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి రాసుకున్నది చాలా చిన్న కథ. దాన్ని పెంచడం కోసం అనవసరమైన సీన్స్‌ని జతచేసి, సినిమా నిడివి పెంచేందుకు కథకు అవసరం లేని సీన్స్‌ని ఇరికించి రెండు గంటల యాభై నిముషాల సినిమాను రెడీ చేశాడు డైరెక్టర్‌. ఇక హీరో క్యారెక్టరైజేషన్‌లో కొత్తదనం అంటూ ఏమీ లేదు. ప్రేమ పెళ్ళిళ్ళు చేయించడానికి హీరో చెప్పిన ఫ్లాష్‌ బ్యాక్‌ ఏమాత్రం ఆకట్టుకోదు. హీరోయిన్‌ చేత ఐలవ్‌యూ చెప్పించుకోవడానికి హీరో వెంపర్లాడడం, దానికి ప్రతిసారీ హీరోయిన్‌ నో చెప్పడం ఆడియన్స్‌కి విసుగు పుట్టిస్తుంది. హీరోని చంపాలని విలన్‌ గ్యాంగ్స్‌ చూడడం సహజమే. కానీ, కొడుకుని చంపాలని తండ్రి ట్రై చెయ్యడం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌కి వచ్చేసరికి హీరో ఎంత గొప్పవాడో తండ్రే హీరోయిన్‌కి చెప్పడం కామెడీగా అనిపిస్తుంది. అప్పటివరకు కొడుకుని చంపాలని ఎందుకనుకున్నాడో మాత్రం క్లారిటీ లేదు. తను చెప్పాలనుకున్న పాయింట్‌ చాలా చిన్నది కావడంతో దాని చుట్టూ అల్లుకున్న కథ, క్యారెక్టర్లు, సిట్యుయేషన్స్‌ చాలా పేలవంగా వుండడంతో ఒక మంచి సినిమా చూశామన్న ఫీలింగ్‌ ఆడియన్స్‌కి కలగదు. 

విశ్లేషణ: హీరోకి తిరుగులేదు. ఎంతమందినైనా అవలీలగా మట్టి కరిపించగలడు, గాల్లో ఎగిరిపోయేలా తన్నగలడు. నరరూప రాక్షసుడైన విలన్‌ని కూడా బకరా చెయ్యగలడు, తన మాటలతో, మంచి పనులతో హీరోయిన్‌ని ఆకట్టుకోగలడు. హీరో ప్లాన్‌ వేశాడంటే ఒక్క పాయింట్‌ కూడా మిస్‌ అవకుండా అంతా అతనికి అనుకూలంగానే జరుగుతుంది. ఫైనల్‌గా హీరోయే విన్నర్‌.. ఇదీ ఇప్పటి మన సినిమాల్లో జరుగుతున్నది. సినిమా అంటేనే లాజిక్‌ చూడకూడదంటారు. అలాగని నమ్మలేని నిజాల్ని సినిమాల్లో చూపిస్తే తట్టుకొనే ఓపిక, ఆదరించే సద్గుణం ఇప్పటి ప్రేక్షకుల్లో కొరవడింది. ఎంత సినిమా అయినా కొంత సహజత్వాన్ని ఆశించే ప్రేక్షకులను శివమ్‌ నిరాశ పరుస్తుంది. సినిమా స్టార్ట్‌ అయినప్పటి నుంచి హీరోని రౌడీలు వెంబడిస్తుంటారు. ఎప్పటికప్పుడు వాళ్ళని బకరాల్ని చేసి తప్పించుకుంటూ వుంటాడు. సినిమా అంతా అలా వెంబడిస్తూనే వుంటారు, ఒక కన్‌క్లూజన్‌కి రావడానికి చాలా టైమ్‌ తీసుకున్నాడు డైరెక్టర్‌. ఫస్ట్‌ హాఫ్‌లో రౌడీలు వెంబడించడం, మధ్యలో కొంత గ్యాప్‌ ఇచ్చి హీరోయిన్‌తో హీరో లవ్‌లో పడే సీన్స్‌, ఆమెని లవ్‌ చేస్తున్న నలుగురు లవర్స్‌ని తప్పించే ట్రాక్‌తో ఫస్ట్‌ హాఫ్‌ బోర్‌గా ముగుస్తుంది. సెకండాఫ్‌ కూడా అదే తరహాలో కొనసాగి క్లైమాక్స్‌కి చేరుతుంది. ప్రతి పది నిముషాలకు ఒక ఫైట్‌, దాని తర్వాత మరో పది నిముషాలకు ఒక ఫైట్‌. ఇలా సినిమా అంతా ఒకేలా వుంటుంది. ఏ దశలో కూడా నెక్స్‌ట్‌ ఏం జరగబోతోందన్న క్యూరియాసిటీ ఆడియన్స్‌కి కలగదు. ఇలాంటి కథ, కథనాలతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చేశాయి. ఈ సినిమా విషయానికి వస్తే కథ చెప్పే విధానంలో కూడా కొత్తదనం లేకపోవడంతో పాత సినిమానే చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఫైనల్‌గా చెప్పాలంటే ఏమాత్రం కొత్తదనం లేని కథ, కథనాలతో వచ్చిన శివమ్‌ ఆడియన్స్‌ని ఆకట్టుకునే అవకాశాలు చాలా తక్కువ. అలాగే కమర్షియల్‌గా ఈ సినిమా వర్కవుట్‌ అవడం కూడా కష్టమే. 

ఫినిషింగ్‌ టచ్‌: బోరు కొట్టించే కథ, కథనమ్‌ 

సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ