Advertisementt

సినీజోష్‌ రివ్యూ: కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌

Fri 18th Sep 2015 04:24 AM
telugu movie courier boy kalyan,courier boy kalyan movie review,courier boy kalyan cinejosh review,nithin new movie courier boy kalyan  సినీజోష్‌ రివ్యూ: కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌
సినీజోష్‌ రివ్యూ: కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌
Advertisement
Ads by CJ

గురు ఫిలింస్‌, మల్టీ డైమెన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ 

కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌ 

తారాగణం: నితిన్‌, యామీ గౌతమ్‌, నాజర్‌, అశుతోష్‌ రాణా, 

హర్షవర్థన్‌, సురేఖా వాణి, రవిప్రకాష్‌, సత్యం రాజేష్‌, ఇంటూరి వాసు తదితరులు 

సినిమాటోగ్రఫీ: సత్య పోన్మార్‌ 

ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి 

సంగీతం: కార్తీక్‌, అనూప్‌ రూబెన్స్‌ 

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: సందీప్‌ చౌతా 

రచనా సహకారం: కోన వెంకట్‌, హర్షవర్థన్‌ 

సమర్పణ: గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ 

నిర్మాతలు: గౌతమ్‌ వాసుదేవ మీనన్‌, 

వెంకట్‌ సోమసుందరం, రేష్మ ఘటాల, సునీత తాటి 

రచన-దర్శకత్వం: ప్రేమ్‌సాయి 

విడుదల తేదీ: 17.09.2015 

ఇష్క్‌ చిత్రం నుంచి తను చేసే ప్రతి సినిమాలోనూ వైవిధ్యం వుండేలా జాగ్రత్త పడుతూ డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌తో వచ్చే డైరెక్టర్స్‌ని ఎంకరేజ్‌ చేస్తున్న నితిన్‌ ఈరోజు విడుదలైన కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌ ద్వారా మరో కొత్త దర్శకుడు ప్రేమ్‌సాయిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ సమర్పణలో నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రాన్ని ఒక కొత్త కాన్సెప్ట్‌తో రూపొందించారు? ఏమిటా కాన్సెప్ట్‌? డైరెక్టర్‌ ప్రేమ్‌సాయి ఎంతవరకు ఈ చిత్రానికి న్యాయం చెయ్యగలిగాడు? హీరో నితిన్‌ కెరీర్‌కి ఈ సినిమా ఎంతవరకు ప్లస్‌ అయింది? వంటి విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

కథ: మన హీరో పేరు కళ్యాణ్‌(నితిన్‌). డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన కళ్యాణ్‌ ఏదో ఒక ఉద్యోగం చెయ్యాలని ట్రై చేస్తుంటాడు. తన స్నేహితుడైన రాజేష్‌ కొరియర్‌ బాయ్‌గా పనిచేస్తుంటాడు. ఒకరోజు రాజేష్‌ బదులుగా కళ్యాణ్‌ ఓ కవర్‌ డెలివరి ఇవ్వడానికి ఖాదీ భవన్‌కి వెళ్తాడు. అక్కడ పనిచేసే కావ్య(యామీ గౌతమ్‌)ను మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమె కోసం కొరియర్‌ బాయ్‌గా అవతారమెత్తి ప్రతిరోజూ ఒక కవర్‌ని క్రియేట్‌ చేసి డెలివరి కోసం ఆమె దగ్గరకు వెళ్తుంటాడు. అలా వెంట పడి ఆమె కూడా తనని ప్రేమించేలా చేసుకుంటాడు. కట్‌ చేస్తే అశుతోష్‌ రాణా ఒక పెద్ద సైంటిస్ట్‌. మహిళ గర్భం దాల్చిన మొదటి దశలోనే ఆమెకు అబార్షన్‌ అయ్యేలా చేసి స్టెమ్‌ సెల్స్‌ని సేకరించి వాటి అవసరం వున్న ధనికులకు పంపిస్తుంటారు. ఈ మెడికల్‌ స్కామ్‌లో సిటీలోని మిగతా డాక్టర్లను కూడా చేర్చుకొని ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మమేషన్‌ కోసం వచ్చే పేషెంట్లకు డాక్టర్లే ఒక రకమైన టాబ్లెట్స్‌ ఇచ్చి అబార్షన్‌ అయ్యేలా చేస్తుంటారు. ఈ స్కామ్‌ని ఉధృతం చేసేందుకు ప్లాన్‌ వేస్తాడు అశుతోష్‌. ఈ విషయాన్ని తెలుసుకున్న వార్డు బోయ్‌ మాణిక్యం(ఇంటూరి వాసు) సంఘ సంస్కర్త అయిన సత్యమూర్తి(నాజర్‌)కి హాస్పిటల్‌లో జరుగుతున్న స్కామ్‌ గురించి వివరిస్తూ ఒక లెటర్‌ రాస్తాడు. దానితోపాటు ఆ డాక్టర్లు పేషెంట్లకు ఇచ్చే టాబ్లెట్స్‌ కూడా జతచేసి కొరియర్‌ ద్వారా పంపిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న డాక్టర్లు మాణిక్యాన్ని చంపేస్తారు. ఆ కొరియర్‌ సత్యమూర్తికి చేరేలోపే దాన్ని దక్కించుకోవాలని ట్రై చేస్తారు. ఆ కొరియర్‌ డెలివరీ చేసే బాధ్యత కళ్యాణ్‌పై పడుతుంది. మరి కళ్యాణ్‌ సవ్యంగా ఆ కొరియర్‌ని సత్యమూర్తికి చేర్చగలిగాడా? అశుతోష్‌ రాణా మనుషులు ఆ కొరియర్‌ డెలివరీ కాకుండా అడ్డుకోగలిగారా? ఈ స్కామ్‌ విషయం కళ్యాణ్‌కి తెలిసిందా? ఆ డాక్టర్ల ఆట కట్టించగలిగాడా? అనేది మిగతా కథ. 

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: కొరియర్‌ బాయ్‌గా నితిన్‌ పెర్‌ఫార్మెన్స్‌ బాగుంది. తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చెయ్యగలిగాడు. ఫైట్లుగానీ, డాన్సులుగానీ ఎప్పటిలాగే చేశాడు. హీరోయిన్‌ యామీ గౌతమ్‌ క్యారెక్టర్‌కి ఈ సినిమాలో ఎలాంటి ప్రాధాన్యత లేదు. కేవలం పాటల కోసం, లవ్‌ ట్రాక్‌ కోసం ఆమె క్యారెక్టర్‌ని క్రియేట్‌ చేసారు. దానికి తగ్గట్టుగానే పాటల్లోనూ, కొన్ని సీన్స్‌లోనూ కనిపించే యామీకి పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్‌ లేదు. సత్యం రాజేష్‌, హర్షవర్థన్‌ ఫస్ట్‌ హాఫ్‌లో కాస్త కామెడీ చేసే ప్రయత్నం చేశారు. ఇక అశుతోష్‌రాణా, నాజర్‌ క్యారెక్టర్లు ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌గా ఎస్టాబ్లిష్‌ కాకపోవడం వల్ల వాళ్ళ పెర్‌ఫార్మెన్స్‌ కూడా లిమిటెడ్‌గానే అనిపిస్తుంది. కథను మలుపు తిప్పే వార్డు బాయ్‌ మాణిక్యం క్యారెక్టర్‌లో వాసు ఇంటూరి ఓకే అనిపించాడు. 

టెక్నీషియన్స్‌: ఈ సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ఫోటోగ్రఫీ రిచ్‌గానే కనిపించింది. సత్య పోన్మార్‌ సీన్స్‌ని బాగా చూపించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా పాటల్లో అతని ఫోటోగ్రఫీ చాలా ఎఫెక్టివ్‌గా కనిపించింది. కార్తీక్‌, అనూప్‌ రూబెన్స్‌ మ్యూజిక్‌ ఫర్వాలేదు అనిపించింది. సందీప్‌ చౌతా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా లౌడ్‌గా వుంటూ ఇబ్బంది పెట్టింది. డైరెక్టర్‌ ప్రేమ్‌సాయి వర్క్‌ గురించి చెప్పాలంటే స్టెమ్‌ సెల్స్‌ అనే కొత్త పాయింట్‌తో సినిమా తియ్యాలన్న ఆలోచన మెచ్చుకోదగిందే. కానీ, ఆ పాయింట్‌ చుట్టూ కథ అల్లుకోవడంలో మాత్రం అతను హండ్రెడ్‌ పర్సెంట్‌ ఫెయిల్‌ అయ్యాడు. ఇంతకుముందు మెడికల్‌ స్కామ్‌ల గురించి చాలా సినిమాలు వచ్చాయి. అయితే వాటి కథ, కథనాల వల్ల కొన్ని సినిమాలు విజయం సాధించాయి. ఈ సినిమా విషయానికి వస్తే స్టెమ్‌ సెల్స్‌ కోసం కొందరు డాక్టర్లు ఎలాంటి అమానుషానికి పాల్పడుతున్నారనే విషయాన్ని ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా చెప్పలేకపోయాడు. దానికి తోడు ఫస్ట్‌ హాఫ్‌ అంతా హీరో ప్రేమ కథ, చిన్న చిన్న కామెడీ సీన్స్‌తో నెట్టుకొచ్చేసి ఫస్ట్‌ హాఫ్‌ కంప్లీట్‌ అయ్యే టైమ్‌లో అసలు కథలోకి హీరోని తీసుకొచ్చాడు. కేవలం 1 గంట 44 నిముషాల సినిమాలో కూడా ఎన్నో బోర్‌ కొట్టించే సన్నివేశాలు వుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సెకండాఫ్‌లో హీరో కొరియర్‌ని విలన్‌ మనుషులకు అందకుండా తప్పించుకునే సీన్స్‌, వారిని ఎదుర్కొనే సీన్స్‌ మాత్రం ఎఫెక్టివ్‌గా తియ్యగలిగాడు డైరెక్టర్‌. 

విశ్లేషణ: ఒక కొత్త కథతో సినిమా చెయ్యాలనుకోవడం, ఒక కొత్త డైరెక్టర్‌ని పరిచయం చెయ్యడం అనే విషయాల్లో హీరో నితిన్‌ని అభినందించాలి. పాయింట్‌ కొత్తదే అయినా దాన్ని ఎగ్జిక్యూట్‌ చెయ్యడంలో, కథలో ఆడియన్స్‌ని ఇన్‌వాల్వ్‌ చెయ్యడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ కాకపోవడంతో అది సినిమా రిజల్ట్‌ మీద పడింది. పాయింట్‌ చాలా చిన్నది. దాని కోసం ఒక లవ్‌ట్రాక్‌ని క్రియేట్‌ చేసి దాన్ని ఫస్ట్‌ హాఫ్‌ వరకు నడిపించి సెకండాఫ్‌లో అసలు కథలోకి రావడం, అవసరం లేకపోయినా పాటల్ని జొప్పించడం వంటి వాటివల్ల ఫస్ట్‌ హాఫ్‌లోనే ఆడియన్స్‌కి నీరసం వచ్చేస్తుంది. విలన్‌ని ఎదుర్కొనే ప్రాసెస్‌లో హీరో చేసే కొన్ని సాహసాలు, ఛేజ్‌లు, ఫైట్స్‌తో సెకండాఫ్‌ కాస్త స్పీడ్‌గానే అనిపిస్తుంది. థియేటర్‌ నుంచి బయటికి వచ్చిన ఆడియన్స్‌కి ఓవరాల్‌గా సినిమాలో ఏమీ లేదు అనే ఫీలింగ్‌ కలుగుతుంది. ఫైనల్‌గా చెప్పాలంటే కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌ అనే డిఫరెంట్‌ టైటిల్‌తో వచ్చిన ఈ సినిమాలో డిఫరెంట్‌గా కనిపించే స్టెమ్‌ సెల్స్‌ తప్ప ఏదీ కొత్తగా అనిపించదు. నితిన్‌ పెర్‌ఫార్మెన్స్‌తో సినిమాని నడిపించినా కథలోగానీ, కథనంలో గానీ బలం లేకపోవడం వల్ల ఇది ఒక ఏవరేజ్‌ సినిమాగా నిలుస్తుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: పాయింట్‌ ఓకే. డెలివరీ బ్యాడ్‌ 

సినీజోష్‌ రేటింగ్‌: 2.25/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ