ఆర్యత్ సినీ ఎంటర్‌టైన్‌మెంట్స్,
లక్కీ మీడియా
సినిమా చూపిస్త మావ
నటీనటులు: రాజ్ తరుణ్, అవికా గోర్, రావు రమేష్,
ప్రవీణ్, తోటపల్లి మధు, సత్య, కృష్ణ భగవాన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్
సంగీతం: శేఖర్ చంద్ర
మాటలు: బెజవాడ ప్రసన్నకుమార్
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
సమర్పణ: అంజిరెడ్డి ప్రొడక్షన్స్, ఆర్.డి.జి. ప్రొడక్షన్స్ ప్రై. లి.
నిర్మాతలు: బోగాధి అంజిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్,
రూపేష్ డి.గోహిల్, జి.సునీత
రచన, దర్శకత్వం: త్రినాథరావు నక్కిన
విడుదల తేదీ: 14.07.2015
రాజ్ తరుణ్, అవిక గోర్ జంటగా నటించిన 'ఉయ్యాలా జంపాలా' చిత్రం ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మళ్ళీ ఇదే జంటతో 'మేం వయసుకు వచ్చాం' దర్శకుడు త్రినాథరావు నక్కిన రూపొందించిన చిత్రం 'సినిమా చూపిస్త మావ'. బోగాధి అంజిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్, రూపేష్ డి.గోహిల్, జి.సునీత నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'ఉయ్యాలా జంపాలా' వంటి సెన్సిబుల్ మూవీతో పరిచయమైన రాజ్ తరుణ్, అవిక గోర్ ఆ చిత్రానికి పూర్తి భిన్నమైన క్యారెక్టర్స్ ఈ చిత్రంలో చేశారు. ఆ చిత్రంతో ఎక్కువగా క్లాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్న రాజ్ తరుణ్, అవిక గోర్ 'సినిమా చూపిస్త మావ' అనే మాస్ టైటిల్‌తో వచ్చిన ఈ చిత్రంలో ఎలాంటి క్యారెక్టర్స్ చేశారు? ప్రేక్షకుల్ని ఎంతవరకు ఎంటర్‌టైన్ చెయ్యగలిగారు? 'మేం వయసుకు వచ్చాం' వంటి యూత్ సినిమా తర్వాత ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో వచ్చిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించగలిగాడా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథ: ఒక మధ్య తరగతి కుర్రాడు ఒక పెద్దింటి అమ్మాయిని ప్రేమిస్తే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ఎలాంటి సవాళ్ళను ఎదుర్కోవాలి? అనే కాన్సెప్ట్‌తో ఇప్పటివరకు తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అలాంటి కథాంశంతో వచ్చిన సినిమాయే ఇది. మన హీరో పేరు కత్తి(రాజ్ తరుణ్). ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వాడు. ఇంటర్ ఫెయిల్ అయి ఫ్రెండ్స్‌తో కలిసి లైఫ్‌ని ఎంజాయ్ చెయ్యడానికి అలవాటు పడ్డవాడు. మరో పక్క ప్రతి విషయంలోనూ క్వాలిటీ వుండాలన్న ప్రిన్సిపుల్ వున్న వ్యక్తి సోమనాథ్ చటర్జీ(రావు రమేష్). తినే వస్తువుల దగ్గర నుంచి పిల్లల పెంపకం వరకు అన్నీ క్వాలిటీగా వుండాలని కోరుకునే సోమనాథ్ కూతురు, చదువుల సరస్వతి పరిణీత(అవిక గోర్). పరిణీతను ఇష్టపడతాడు కత్తి. ఆమె ప్రేమను సంపాదించడం కోసం అందరు హీరోల లాగే నానా కష్టాలు పడతాడు. చివరికి ఆమెతో ఐలవ్‌యూ చెప్పిస్తాడు. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. కత్తి అంటే మొదటి నుంచీ చులకన భావం వున్న సోమనాథ్ వారిద్దరూ పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడడు. ఎట్టి పరిస్థితుల్లో పరిణీతనే పెళ్ళి చేసుకుంటానని కత్తి పట్టుపట్టడంతో సోమనాథ్ ఒక కండీషన్ పెడతాడు. దానికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా చేసుకుంటారు. సోమనాథ్ పెట్టిన కండీషన్ ఏమిటి? ఆ అగ్రిమెంట్‌లో ఏముంది? కత్తి, పరిణీతల పెళ్ళి జరిగిందా? పరిణీతను పెళ్ళి చేసుకునే క్రమంలో కత్తికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? అనేది మిగతా కథ.
ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్: ఉయ్యాల జంపాల చిత్రంలో సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసిన రాజ్ తరుణ్, అవిక గోర్ ఆ చిత్రానికి భిన్నంగా వుండే క్యారెక్టర్స్ ఈ సినిమాలో చేశారు. కత్తి క్యారెక్టర్‌లో రాజ్ తరుణ్ రెచ్చిపోయి నటించాడు. అయితే కొన్ని సందర్భాల్లో అతని డైలాగ్ మాడ్యులేషన్‌గానీ, బాడీ లాంగ్వేజ్‌గానీ ఓవర్‌గా అనిపించింది. దర్శకుడి లోపమో, హీరో లోపమో తెలీదుగానీ కొన్ని సీన్స్‌లో సరైన ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వలేక ఫేస్ బ్లాంక్‌గా పెట్టినట్టుగా అనిపించింది. పరిణీత క్యారెక్టర్‌కి కొన్ని పరిమితులు వుండడం వల్ల దానికి తగ్గట్టుగానే నటించింది అవిక. ఆమె క్యారెక్టర్‌కి ఫస్ట్ హాఫ్‌లో వున్న ప్రాధాన్యత సెకండాఫ్ లేదనిపిస్తుంది. ఇక సోమనాథ్‌గా రావు రమేష్ పూర్తి స్థాయి నటనను ప్రదర్శించాడు. మిగతా క్యారెక్టర్స్‌లో ప్రవీణ్, తోటపల్లి మధు, కృష్ణభగవాన్, జబర్దస్త్ బ్యాచ్, సత్య అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ద్రౌపది వస్త్రాపహరణం డ్రామాలో ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్ బాగుంది.
టెక్నీషియన్స్: ముందుగా చెప్పుకోవాల్సింది సాయిశ్రీరామ్ ఫోటోగ్రఫీ గురించి. చాలా రిచ్‌గా ప్రతి సీన్ తియ్యడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. రాజ్, తరుణ్, అవికాలను మరింత అందంగా చూపించాడు. శేఖర్ చంద్ర పాటల పరంగా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. పాటల చిత్రీకరణ కూడా అంతంత మాత్రంగానే వుంది తప్ప. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అనుకున్న స్థాయిలో లేదు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో టెక్నీషియన్ మాటల రచయిత ప్రసన్నకుమార్. పాత కథే అయినా, కథనం కూడా ఆల్‌మోస్ట్ పాతదే అయినా మాటల విషయంలో మాత్రం కేర్ తీసుకున్నారు. రెండుంపావు గంటల సినిమాలో మాటలకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన గురించి చెప్పాలంటే ఎంచుకున్న పాయింట్ చాలా పాతదే అయినా కథనం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, డైలాగులు కొత్తగా వుండేలా చూసుకోవడం, సాధారణంగా వున్న సీన్స్ నుంచే కామెడీని పుట్టించే ప్రయత్నం చెయ్యడం వల్ల ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చెయ్యగలిగాడు. సినిమా బాగా రావడానికి నిర్మాతలు బాగా కష్టపడ్డారని క్వాలిటీ చూస్తే అర్థమవుతుంది.
విశ్లేషణ: పనీ పాటా, చదువు సంధ్యలేని కుర్రాడు.. చదువుల సరస్వతి అయిన ఒక గొప్పింటి అమ్మాయిని ప్రేమించడం, వారి ప్రేమకు పెద్దల నుంచి ఆటంకాలు రావడం, వాటన్నింటినీ అధిగమించి ఇద్దరూ పెళ్ళి చేసుకోవడం.. ఇప్పటివరకు ఇలాంటి కథలతో లెక్కకు మించిన సినిమాలే వచ్చాయి. ఈ కథను ఒక్కో డైరెక్టర్ ఒక్కోలా చెప్పడం వల్ల, డైరెక్టర్ చెప్పిన విధానం నచ్చడం వల్ల కొన్ని సినిమాలు విజయం సాధించాయి. ఈ సినిమా విషయానికి వస్తే ఇది పాత కథే అయినా దానికి ఎంటర్‌టైన్‌మెంట్‌ని జోడించడం వల్ల ఆడియన్స్ నవ్వుకునే అవకాశం కలిగింది. హీరో, హీరోయిన్‌ని చూడడం ప్రేమించడం, అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసిపోవడం వంటి సీన్స్‌తో ఫస్ట్ హాఫ్ ఫర్వాలేదు అనిపిస్తుంది. సెకండాఫ్‌కి వచ్చిన తర్వాత హీరో, మావ మధ్య జరిగే అగ్రిమెంట్‌తో కథ మరో మలుపు తిరుగుతుంది. ఈ క్రమంలో ఆడియన్స్‌కి బోర్ ఫీల్ అయ్యే ఛాన్స్ కూడా వచ్చింది. సెకండాఫ్‌లో కృష్ణభగవాన్, జబర్దస్త్ టీమ్‌తో చేసిన కొన్ని సీన్స్ చాలా పేలవంగా అనిపించాయి. టోటల్‌గా ఆడియన్స్‌ని నవ్వించే ప్రయత్నంలో ఈ టీమ్ సక్సెస్ అయిందని చెప్పాలి. కథకి ఒక కన్‌క్లూజన్ ఇవ్వడానికి సెకండాఫ్‌ని కొంత సాగదీసినట్టు కనిపించింది. క్లైమాక్స్‌లో కొంత టెన్షన్ క్రియేట్ చేసి కథను సుఖాంతం చేశాడు డైరెక్టర్. ఫైనల్‌గా చెప్పాలంటే ఈమధ్యకాలంలో ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసే సినిమాలు తక్కువగానే వస్తున్నాయి. వాటిలో 'సినిమా చూపిస్త మావ' కూడా చేరుతుంది.
ఫినిషింగ్ టచ్: పాత కథతో కొత్త ప్రయత్నం
సినీజోష్ రేటింగ్: 2.5/5