లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్
ఉపేంద్ర 2
నటీనటులు: ఉపేంద్ర, క్రిస్టీనా అకీవా, పరుల్ యాదవ్,
షాయాజీ షిండే తదితరులు
సినిమాటోగ్రఫీ: అశోక్ కశ్యప్
సంగీతం: గురుకిరణ్
మాటలు: శశాంక్ వెన్నెలకంటి
ఎడిటింగ్: శ్రీ
సమర్పణ: భవ్య
నిర్మాత: నల్లమలుపు శ్రీనివాస్
రచన, దర్శకత్వం: ఉపేంద్ర
విడుదల తేదీ: 14.07.2015
దర్శకుడుగా, హీరోగా ఉపేంద్రకు ఒక ప్రత్యేక స్థానం వుంది. అతను చేసే సినిమాలన్నీ రొటీన్‌కి భిన్నంగా వుండడం, అతను చెప్పే పాయింట్ ఆలోచన రేకెత్తించేదిగా వుండడం, అతని గెటప్‌లుగానీ, చెప్పే డైలాగ్స్‌గానీ కొత్తగా వుండడం వల్ల అతనికి యూత్‌లో, మాస్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అప్పట్లో 'ఎ', 'ఉపేంద్ర', 'రా' వంటి సినిమాలు చూసి ఆడియన్స్ వెర్రెత్తిపోయారు. సినిమాలు ఇలా కూడా తీస్తారా? హీరోలు ఇలా కూడా నటిస్తారా? అన్న రేంజ్‌లో ఉపేంద్ర తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. 1999లో వచ్చిన 'ఉపేంద్ర' కన్నడలోనూ, తెలుగులోనూ శతదినోత్సవ చిత్రంగా నిలిచింది. దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్‌గా కన్నడలో 'ఉపేంద్ర-2' చిత్రాన్ని తనే నిర్మించాడు ఉపేంద్ర. సీక్వెల్‌గా వచ్చిన 'ఉపేంద్ర-2' చిత్రాన్ని ఎలాంటి పాయింట్‌తో తెరకెక్కించాడు? ఉపేంద్ర చిత్రాన్ని మించిన స్థాయిలో 'ఉపేంద్ర-2' వుందా? ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథ: కథ చెప్పుకోవడానికి గానీ, కథనం గురించి గొప్పగా చెప్పుకోవడానికి గానీ ఈ సినిమాలో ఏమీ లేదు. 'ఉపేంద్ర' చిత్రంలో నేనుగా నటించిన ఉపేంద్ర ఇందులో నువ్వుగా నటించాడు. గతం గురించి ఆలోచించేవారు, భవిష్యత్ గురించి ఆలోచించేవారికే ఎక్కువ బాధలు వుంటాయని, ఈ క్షణంలో జరిగే వాటిని చూసేవాడు, అనుభవించేవాడు మాత్రమే గొప్పవాడు అవుతాడని ఓ ఫ్రొఫెసర్ తన స్టూడెంట్స్‌కి చెప్తాడు. వర్తమానం గురించి మాత్రమే ఆలోచించేవారు వుంటారా? అని ఒక స్టూడెంట్ లక్ష్మీ(క్రిస్టీనా అకీవా) అడిగిన ప్రశ్నకు 'నువ్వు' అనే వ్యక్తి వున్నాడని చెప్తాడు ప్రొఫెసర్. ఆ 'నువ్వు' కోసం వెతుకుతూ వుంటుంది లక్ష్మీ. పెద్దగా ప్రయత్నం చేయకుండానే ఆమెకు నువ్వు కనిపిస్తాడు. కళ్ళ ముందు ఏం జరిగినా చలించని నువ్వు అంటే లక్ష్మీ ఇష్టపడుతుంది. అతన్ని ప్రేమిస్తుంది. అతన్నే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఇదిలా వుంటే దుబాయ్‌లో వుండే సలీమ్ అనే డాన్, స్పెషల్ బ్యూరో ఆఫీసర్లు నువ్వు కోసం వెతుకుతుంటారు. నువ్వు అనే వాడు ఒక సన్యాసిగా కాలం వెళ్ళబుచ్చడానికి కారణం వేల కోట్ల ఆస్తి వున్న మందాకిని. అసలు మందాకిని ఎవరు? ఆమె కారణంగా నువ్వు సన్యాసిగా ఎందుకు మారాడు? మాఫియా డాన్, సి.బి.ఐ. ఆఫీసర్లు నువ్వు కోసం వెతకడానికి కారణం ఏమిటి? అనేది మిగతా కథ.
ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్: ఇందులో ఉపేంద్ర నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తాడు. అలాంటి గెటప్స్ ఇంతకుముందు అతని సినిమాల్లో చూసినవే కావడం వల్ల అవి కొత్తగా అనిపించవు. ఉపేంద్ర అంటే కొత్తగా డైలాగ్స్ చెప్తాడు, ఎవరూ ఊహించని లాజిక్స్ మాట్లాడతాడు. అలాంటి వాటి కోసం ఎదురుచూసే ఆడియన్స్‌కి మాత్రం నిరాశే ఎదురవుతుంది. ఎప్పుడూ నవ్వుతూ సాఫ్ట్‌గా కనిపించే క్యారెక్టర్‌లో అందరికీ బోరు కొట్టిస్తాడు. పెర్‌ఫార్మెన్స్ పరంగా అతను కొత్తగా చేసింది ఏమీ లేదు. లక్ష్మీ క్యారెక్టర్‌లో క్రిస్టీనా అకీవా కనిపించినంత సేపూ తన గ్లామర్‌తో అలరించింది. ఆమె క్యారెక్టర్‌కి కూడా కొంత ఇంపార్టెన్స్ వుండడం వల్ల దానికి కూడా న్యాయం చేసింది. పరుల్ యాదవ్ కనిపించిన కొన్ని సీన్స్‌లో ఫర్వాలేదు అనిపించింది. మందాకినిగా నటించిన ప్రియాంక ఉపేంద్రది పెర్‌పార్మెన్స్‌కి ఏమాత్రం స్కోప్ లేని క్యారెక్టర్. మాఫియా డాన్‌గా నటించిన శోభరాజ్, స్పెషల్ బ్యూరో ఆఫీసర్‌గా చేసిన శోభరాజ్‌ల పెర్‌ఫార్మెన్స్ పరమ రొటీన్‌గా వుంది.
టెక్నీషియన్స్: అశోక్ కశ్యప్ అందించిన ఫోటోగ్రఫీ బాగానే వుంది. వున్నంతలో రిచ్‌గానే చూపించే ప్రయత్నం చేశాడు. గురుకిరణ్ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా రణగొణ ధ్వనుల్లా అనిపించిందే తప్ప ఎక్కడా వినసొంపుగా లేదు. ఎడిటింగ్ విషయానికి వస్తే సినిమా అంతా ముక్కలు ముక్కలుగా వుంటుందే తప్ప ఎక్కడా ఒక ఫ్లోలో సినిమా వెళ్తున్నట్టుగా అనిపించదు. సడన్‌గా వచ్చే సీన్ అంతే సడన్‌గా ఎండ్ అయిపోతుంది. డైరెక్టర్ ఉపేంద్ర గురించి చెప్పాలంటే ఎవరికీ అర్థంకాని ఒక పాయింట్‌ని తీసుకొని ఏదో చెప్పాలన్న ప్రయత్నంలో ఆడియన్స్‌ని కన్‌ఫ్యూజ్ చేసి చివరికి ఏమీ చెప్పలేక చేతులెత్తేశాడు. భవిష్యత్తుపై ఎలాంటి ఆశలేని 'నువ్వు'ని చూపిస్తూ ఫస్ట్ హాఫ్ అంతా అలాగే నడిపించి, అతని చేత ఎన్నో నీతి వాక్యాలు చెప్పించి సెకండాఫ్‌కి వచ్చే సరికి అతన్ని నాలుగు క్యారెక్టర్స్‌లో చూపించి నువ్వు అనేది ఏ క్యారెక్టరో అర్థం కాకుండా వాళ్ళతో రకరకాల విన్యాసాలు, డైలాగులు చెప్పించి ప్రేక్షకులు జుట్టు పీక్కునేలా చేశాడు. కొన్ని సీన్స్ చూపిస్తూనే అది కలగా, ఒకరు ఊహించుకునేదిగా చెప్పడంతో ఏ సీన్ నిజంగా జరుగుతోందో, ఏది కల్పనో అర్థం కాక కొట్టుమిట్టాడుతున్న ప్రేక్షకుడ్ని ఎండ్ టైటిల్స్ వెక్కిరిస్తాయి. ఏం చెప్పాలనుకున్నాడో ఉపేంద్రకి క్లారిటీ లేదు. ఎలాంటి సినిమా చూశాం, ఎలా ఎంటర్‌టైన్ అయ్యామనేది ఆడియన్‌కి క్లారిటీ లేదు. హీరో క్యారెక్టర్‌లో రకరకాల వేరియేషన్స్ చూపించడం, ఆడియన్స్‌కి ఏం జరుగుతోందో అర్థం కాకుండా తియ్యడం చాలా కష్టం. అలా తీసిన సినిమాని ప్రాణాలకు తెగించి ప్రేక్షకులకు చివరి వరకూ చూడడం అన్నింటినీ మించిన కష్టం. గతంలో ఉపేంద్ర తీసిన సినిమాల్లో వెర్రి ఎంత వున్నా, ఎంతో కొంత మెసేజ్, ఎంటర్‌టైన్‌మెంట్ వుండేది. ఉపేంద్ర చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన 'ఉపేంద్ర-2' విషయంలో డైరెక్టర్‌గా ఉపేంద్ర హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయ్యాడని చెప్పాలి.
విశ్లేషణ: సినిమా మంచి ఊపుతో ప్రారంభమవుతుంది. ఉపేంద్ర మార్క్ సీన్స్‌తో ఫర్వాలేదు బాగానే వుంది అనుకుంటున్న తరుణంలో 'నువ్వు' క్యారెక్టర్ ఎంటర్ అవ్వగానే సినిమా ఒక్కసారిగా స్లో అయిపోతుంది. ఉపేంద్ర అంటే డిఫరెంట్ గెటప్స్, డైలాగ్స్ ఎక్స్‌పెక్ట్ చేసే ఆడియన్స్‌కి తెల్ల షర్ట్, తెల్ల లుంగీతో నవ్వుతూ సన్యాసిలా కనిపించే ఉపేంద్రని చూడగానే నీరసం ఆవహిస్తుంది. దానికి తగ్గట్టుగానే సీన్స్ కూడా నీరసంగా నడుస్తూ వుంటాయి. అలా ఫస్ట్ హాఫ్ అయిందనిపిస్తుంది. సెకండాఫ్‌లో ఏదో ట్విస్ట్ వుంది, అసలు కథంతా సెకండాఫ్‌లోనే అని థియేటర్‌లోకి వచ్చే ఆడియన్స్‌కి అసలు సిసలైన వ్యధ మొదలవుతుంది. ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇస్తూ ఏం జరుగుతోందో ఆలోచించుకునే అవకాశం కూడా లేకుండా కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉపేంద్ర పైశాచికానందాన్ని పొందినట్టుగా అనిపిస్తుంది. సినిమా మొదలైన పది నిముషాలు తప్ప ఏ దశలోనూ ఆడియన్స్ థ్రిల్ అయిన సందర్భాలు లేవు. ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందిరా దేవుడా! అని అందరూ ఎదురు చూసేలా చేసిందీ 'ఉపేంద్ర-2'. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ సినిమా ఏ సెక్షన్ ఆడియన్స్‌కీ నచ్చదు. ఉపేంద్రకి వున్న ఫాలోయింగ్ వల్ల ఓపెనింగ్స్ బాగానే వచ్చినప్పటికీ సినిమా చూసిన ఏ ఒక్కరూ బాగుందని మొహమాటానికి కూడా చెప్పరు అనడంలో అతిశయోక్తి లేదు.
ఫినిషింగ్ టచ్: 'ఉపేంద్ర 2' టూ బ్యాడ్, టూ వరస్ట్
సినీజోష్ రేటింగ్: 2/5