భీమవరం టాకీస్
ధనలక్ష్మి తలుపు తడితే
నటీనటులు: ధన్‌రాజ్, మనోజ్ నందం, రణధీర్,
సింధు తులాని, శ్రీముఖి, విజయ్‌సాయి,
అనిల్ కళ్యాణ్, నాగబాబు తదితరులు
సినిమాటోగ్రఫీ: జి.శివకుమార్
సంగీతం: భోలే శావలి
ఎడిటింగ్: శివ వై. ప్రసాద్
సమర్పణ: మాస్టర్ సుక్కురామ్
నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ
రచన, దర్శకత్వం: సాయి అచ్యుత్ చిన్నారి
విడుదల తేదీ: 31.07.2015
కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా 'జబర్దస్త్' ప్రోగ్రామ్‌తో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న ధన్‌రాజ్ ఫస్ట్‌టైమ్ నిర్మాతగా మారి, తుమ్మలపల్లి రామసత్యనారాయణతో కలిసి నిర్మించిన చిత్రం 'ధనలక్ష్మి తలుపు తడితే'. క్రైమ్, కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డబ్బు చుట్టూ తిరిగే కథను తీసుకొని దానికి కామెడీని జోడించి రూపొందించిన ఈ చిత్రం ఎంతవరకు ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసింది? ఫస్ట్‌టైమ్ నిర్మాతగా మారిన ధన్‌రాజ్‌కి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ని అందించింది? అనే విషయాలు తెలుసుకోవడానికి సమీక్షలోకి వెళ్దాం.
కథ: ఓపెన్ చేస్తే అర్థరాత్రి దారి కాచి బైక్ మీద వచ్చే వారిని లిఫ్ట్ అడిగి దారిలో వారిని చంపి డబ్బు, నగలు దోచుకునే శ్రీముఖి, నగరంలోని ప్రముఖుల పిల్లల్ని కిడ్నాప్ చేసి డబ్బు గుంజే రణధీర్(రణధీర్) ఒక గ్యాంగ్. ఎం.పి. వసుంధర(సింధు తులాని) మేనల్లుడ్ని కిడ్నాప్ చేసి ఆమెను కోటి రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తాడు రణధీర్. ఆమె కోటి రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. ఆ డబ్బుని హైవేలోని ఓ మైలు రాయి దగ్గరికి తీసుకు రావాల్సిందిగా చెప్తాడు రణధీర్. శ్రీముఖిని మరోచోట వెయిట్ చెయ్యమని చెప్తాడు. చెప్పిన టైమ్‌కి బాబుని తీసుకొని అనుచరులతో కారులో బయల్దేరతాడు రణధీర్. అయితే దారిలో యాక్సిడెంట్ అవుతుంది. రణధీర్, బాబు మాత్రమే ప్రాణాలతో మిగులుతారు. తీవ్ర గాయాల పాలైన రణధీర్ స్పృహ తప్పి పడిపోతాడు. దిక్కుతోచని బాబు ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే కోడి రవి(ధన్‌రాజ్), పండు(మనోజ్ నందం), చిట్టి(అనిల్ కళ్యాణ్), సత్తి(విజయ్‌సాయి) బెస్ట్ ఫ్రెండ్స్. ఈ నలుగురూ కలిసి తమ చిన్ననాటి స్నేహితుడైన తనీష్(తనీష్) బర్త్‌డే ఫంక్షన్‌కి కారులో బయల్దేరతారు. దారిలో వారికి కిడ్నాప్ అయిన బాబు కనిపిస్తాడు. ఏడుస్తున్న బాబుని ఓదారుస్తుండగా అక్కడికి వచ్చిన వసుంధర బాబుని తీసుకొని కోటి రూపాయలు వున్న సూట్‌కేస్‌ని ఇచ్చి వెళ్ళిపోతుంది. ఆ డబ్బుని చూసి సంతోషం పట్టలేక చిందులు వేసిన నలుగురు స్నేహితుల జీవితాలు ఆ క్షణం నుంచే మలుపు తిరుగుతాయి. ఒక్కసారిగా కోటి రూపాయలు చేతికి వచ్చిన తర్వాత నలుగురి ప్రవర్తనలో ఎలాంటి మార్పులు వచ్చాయి? కోటి రూపాయలు దక్కని రణధీర్ ఏం చేశాడు? రణధీర్ జాడ తెలియని శ్రీముఖి ఏం చేసింది? ఆ కోటి రూపాయలు ఎన్ని చేతులు మారింది? అనేది మిగతా కథ.
ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్: ధన్‌రాజ్, విజయ్‌సాయి, అనిల్ కళ్యాణ్, మనోజ్ నందం వారి వారి క్యారెక్టర్లకు పూర్తి న్యాయం చేశారు. సీరియస్ సన్నివేశాల్లో, కామెడీ సీన్స్‌లో, సెంటిమెంట్ సీన్స్‌లో యాక్షన్ సన్నివేశాల్లో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కిడ్నాపర్‌గా రణధీర్ పెర్‌ఫార్మెన్స్ బాగుంది. కిల్లర్‌గా శ్రీముఖి మంచి నటనను ప్రదర్శించింది. అంతేకాకుండా ఈ సినిమాలో గ్లామరస్ క్యారెక్టర్ ఏదైనా వుందీ అంటే అది శ్రీముఖిదే. ఎం.పి. వసుంధరగా వున్న కాసేపు తన నటనతో మెప్పించింది సింధు తులాని. గెస్ట్ అప్పియరెన్స్‌గా ఒక పాటలో ఒక సీన్‌లో కనిపించిన తనీష్ ఓకే అనిపించాడు. క్లైమాక్స్‌లో సి.ఐ. శ్రీనివాసరావుగా కొంత ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించే ప్రయత్నం చేశాడు నాగబాబు.
టెక్నీషియన్స్: సాంకేతిక నిపుణుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ శివకుమార్, సంగీత దర్శకుడు భోలే శావలి గురించి. స్టార్టింగ్ టు ఎండింగ్ మంచి ఫోటోగ్రఫీ ఇచ్చాడు శివకుమార్. సినిమాలో తక్కువ పాటలే వున్నప్పటికీ మంచి మాస్ బీట్‌తో ఊపు తెచ్చేలా పాటల్ని కంపోజ్ చేశాడు భోలే శావలి. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒక్కోచోట అద్భుతం అనిపించేలా చేసి, కొన్నిచోట్ల లౌడ్‌నెస్ తప్ప క్వాలిటీ లేనట్టుగా అనిపించింది. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేవరకు ఒకే శ్లోకాన్ని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌గా పెట్టడం కూడా ఇబ్బంది కలిగించింది. శివ వై. ప్రసాద్ ఎడిటింగ్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదని ప్రతి సీన్‌లో అర్థమవుతుంది. సినిమాలో తొలగించాల్సిన సన్నివేశాలు చాలా వున్నాయి. కొన్ని కథకు, కథనానికి అవసరం లేని సీన్స్‌తో ఆడియన్స్‌కి బోర్ కొట్టిస్తాయి. 1 గంట 55 నిముషాలు వున్న సినిమాలో అనవసరమైన సీన్స్ తీసేసి స్పీడ్ అనిపించేలా చెయ్యాలంటే సినిమా గంట మాత్రమే మిగులుతుంది. డైరెక్టర్ విషయానికి వస్తే సినిమా టేకాఫ్ బాగానే తీసుకున్నాడు, కొంతవరకు సినిమా స్పీడ్‌గానే వెళ్తున్నట్టు అనిపించినా ఆ తర్వాత డెడ్ స్లో అయిపోవడమే కాకుండా ఆడియన్స్ సహనాన్ని పరీక్షించింది. ఫస్ట్ హాఫ్ అంతా స్లోగానే నడుస్తూ, సెకండాఫ్ పైన ఆడియన్స్‌కి ఎలాంటి ఇంట్రెస్ట్ అవ్వకుండా చేసింది. సెకండాఫ్‌లో అడవి జాతి వారిని చూపించి ఓ 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు. ఇప్పుడు అలాంటి కామెడీని ఎంజాయ్ చేసే పరిస్థితుల్లో ఆడియన్స్ లేరన్న విషయం డైరెక్టర్ దృష్టిలోకి రాలేదనిపిస్తుంది.
విశ్లేషణ: సినిమా స్టార్ట్ అయిన పది నిముషాల వరకు ఒక మంచి సినిమా చూడబోతున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ తర్వాత వచ్చే లాగింగ్ సీన్స్, నవ్వు తెప్పించని కామెడీతో, సాదా సీదా ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ఫస్ట్ హాఫ్ అయిందనిపిస్తుంది. సెకండాఫ్ కూడా అలాంటి ల్యాగింగ్ సీన్స్‌తోనే నడుస్తూ ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా స్పీడ్ అవుతుంది. కోటి రూపాయలు ఎవరి చేతికి వస్తాయి అనే సస్పెన్స్‌ని క్రియేట్ చెయ్యడమే కాకుండా అందులో కొంత కామెడీని కూడా జోడించడంతో ఆడియన్స్ కాసేపు నవ్వుకునే అవకాశం కలిగింది. ఫైనల్‌గా చెప్పాలంటే ఒక డిఫరెంట్ టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా ద్వారా ఆడియన్స్‌ని పూర్తిగా నవ్వుల్లో ముంచెత్తాలన్న డైరెక్టర్ ప్రయత్నం పూర్తిగా సక్సెస్ అవ్వలేదన్నది నిజం. పూర్తి స్థాయి కామెడీ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలన్న దర్శకనిర్మాతల కోరిక కొంత వరకే నెరవేరింది. అయితే ఈ తరహా కామెడీ చిత్రాలను ఆస్వాదించే ప్రేక్షకులకు ఈ సినిమా నవ్వుల్ని అందించే అవకాశం వుంది.
ఫినిషింగ్ టచ్: లిమిటెడ్ ఎంటర్‌టైనర్
సినీజోష్ రేటింగ్: 2.5/5