హంసవాహిని టాకీస్
సాహసం సేయరా డింభకా
నటీనటులుః శ్రీ, హమీదా, సమత, ఆలీ, షకలక శంకర్
పూర్ణిమ, జ్యోతి తదితరులు
సినిమాటోగ్రఫీః యోగి, శివ కె.నాయుడు
ఎడిటింగ్ః మార్తాండ్ కె.వెంకటేష్
నిర్మాతః ఎం.ఎస్.రెడ్డి
రచన, దర్శకత్వంః తిరుమలశెట్టి కిరణ్
విడుదల తేదీః 24.07.2015
ప్రస్తుతం టాలీవుడ్‌లో హార్రర్ కామెడీ చిత్రాలకు గిరాకీ బాగా వుందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ప్రతివారం రిలీజ్ అయ్యే సినిమాల్లో ఒకటి, రెండు ఈ తరహా సినిమాలే వుంటున్నాయి. అలా ఈవారం వచ్చిన మరో హార్రర్ కామెడీ చిత్రం సాహసం సేయరా డింభకా. ఈరోజుల్లో చిత్రంతో హీరోగా పరిచయమైన శ్రీ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. హంసవాహిని టాకీస్ పతాకంపై తిరుమలశెట్టి కిరణ్ దర్శకత్వంలో ఎం.ఎస్.రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాహసం సేయరా డింభకా చిత్రంలో హీరో చేసిన సాహసం ఏమిటి? ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏమేర భయపెట్టింది? ఎంతవరకు నవ్వించింది? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథః ఈ చిత్రంలో మన హీరో పేరు బాలరాజు(శ్రీ). అతను ఓ విషయంలో ఫేమస్. అదేమిటంటే ప్రతి చిన్న విషయానికీ భయపడతాడు, మిగతా వారిని కంగారు పెడతాడు. అతనికి ఎలాంటి సమస్య వచ్చినా అతని ఫ్రెండ్ రాంబాబుని ఫోన్‌లో సలహా అడుగుతుంటాడు. అతని మరదలు కృష్ణవేణి(హమీద) అతన్ని ప్రేమిస్తుంటుంది. అతన్నే పెళ్ళి చేసుకోవాలని డిసైడ్ అవుతుంది. అమాయకుడైన బాలరాజు ఈ విషయాలు పట్టించుకోడు. కొడుకుని ప్రయోజకుడ్ని చేయాలని తల్లి(పూర్ణిమ) కలలు కంటూ వుంటుంది. అతనికి ఉద్యోగం ఇప్పించమని తన అన్నయ్యను అడుగుతుంది. తన కూతుర్ని పెళ్ళి చేసుకోను అని మాటిస్తేనే ఉద్యోగం ఇప్పిస్తానంటాడు. అలా మాట తీసుకొని బాలరాజుకి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో బీట్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం ఇప్పిస్తాడు. అసలే భయస్తుడైన బాలరాజు తల్లి బలవంతం మీద ఆ ఉద్యోగంలో చేరతాడు. రోజూ అడవిలోకి వెళ్తున్న బాలరాజుకి వాసంతి(సమత) పరిచయమవుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి అడవిలోనే వుండే వాసంతికి బాలరాజు అంటే ఇష్టం ఏర్పడుతుంది. అతన్నే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. అదే విషయం బాలరాజుకి చెప్తుంది. ఈ విషయంలో కూడా తన ఫ్రెండ్ రాంబాబు సలహా తీసుకుంటాడు బాలరాజు. ఊరి నుంచి వచ్చిన రాంబాబు వాసంతి ఫ్యామిలీతో పెళ్ళి విషయం మాట్లాడతాడు. ఆ టైమ్‌లో ఓ విషయం రివీల్ అవుతుంది. బాలరాజుని ప్రేమిస్తున్నది అమ్మాయి కాదుని, ఓ ఆత్మ అని, ఆమె ఫ్యామిలీ అంతా ఆత్మలేనని రాంబాబు తెలుసుకుంటాడు. అయితే ఆ విషయం బాలరాజుకి చెప్పడు. వాసంతి ఆత్మ అన్న విషయం రాంబాబు చెప్పకపోవడానికి కారణం ఏమిటి? అసలు ఆత్మ బాలరాజుని ఎందుకు ప్రేమిస్తోంది. వాసంతి ఫ్లాష్‌బ్యాక్ ఏమిటి? బాలరాజుని ప్రేమించిన కృష్ణవేణి ఏమైంది? ఆత్మల వల్ల బాలరాజు, రాంబాబు ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు? చివరికి ఈ సమస్య నుంచి బాలరాజు, రాంబాబు ఎలా బయటపడ్డారు? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్ః భయస్తుడుగా, అమాయకుడుగా బాలరాజు పాత్రను శ్రీ పర్‌ఫెక్ట్‌గా చేశాడు. తన క్యారెక్టర్ ద్వారా ఆడియన్స్‌ని నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక ఈ సినిమా అంతటికీ మెయిన్ హైలైట్‌గా చెప్పుకోవాల్సింది రాంబాబు క్యారెక్టర్ గురించి. ఈ క్యారెక్టర్ను షకలక శంకర్ ఎక్స్‌లెంట్‌గా చేశాడు. అతని క్యారెక్టర్ వున్నంత సేపు నవ్వించే ప్రయత్నం చేశాడు. సెకండాఫ్‌లో ఎంటర్ అయ్యే రాంబాబు క్యారెక్టర్ సినిమాకి చాలా ప్లస్ అయింది. వాసంతిగా నటించిన సమత తన అందచందాలతోపాటు మంచి పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. సినిమాలో అనవసరమైన సీన్స్‌లో నటించిన జ్యోతి, జబర్దస్త్ అప్పారావు తమ శక్తి మేరకు ప్రేక్షకుల్ని విసిగించారు. హీరో తల్లిగా పూర్ణిమ ఫర్వాలేదనిపించింది.
టెక్నీషియన్స్ః సాంకేతిక నిపుణుల పనితీరు గురించి చెప్పాలంటే యోగి, శివ కె.నాయుడు ఫోటోగ్రఫీ ఫర్వాలేదనిపించారు. శ్రీవసంత్ చేసిన పాటలు అంతంత మాత్రంగానే వున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం అక్కడక్కడా ఓకే అనిపించాడు. ప్రముఖ ఎడిటర్ అయిన మార్తాండ్ కె.వెంకటేష్ చేసిన ఎడిటింగ్ కొంతవరకు సినిమాకి ప్లస్ అయింది. ఇక డైరెక్టర్ తిరుమలశెట్టి కిరణ్ గురించి చెప్పాలంటే ఈ సినిమా కోసం తీసుకున్న పాయింట్ చాలా చిన్నది. అయితే దాని చుట్టూ ఆసక్తికరమైన కథని, కథనాన్ని అల్లుకోవడంలో సక్సెస్ అవ్వలేకపోయాడు. ఇదే పాయింట్‌ని మరికాస్త పకడ్బందీగా చేసుకొని సరైన ఆర్టిస్టుల్ని, టెక్నీషియన్స్‌ని తీసుకొని టేకింగ్ పరంగా మరికాస్త జాగ్రత్తలు తీసుకొని వుంటే సినిమా మరోలా వుండేది. షకలక శంకర్ చేసిన క్యారెక్టర్ లాంటివి సినిమాలో ఇంకా వుండి వుంటే ఆడియన్స్‌ని మరింత ఎంటర్‌టైన్ చెయ్యడానికి వీలు కలిగేది. ఇది పేరుకి హార్రర్ మూవీ అయినా ఆడియన్స్‌ని భయపెట్టే సన్నివేశాలుగానీ, థ్రిల్ చేసే సీన్స్‌గానీ ఇందులో లేవు. ఈ విషయంలో కూడా డైరెక్టర్ తగిన జాగ్రత్తలు తీసుకొని వుండాల్సింది.
విశ్లేషణః పాతాళభైరవి చిత్రంలోని సీన్‌తో స్టార్ట్ అయ్యే ఈ సినిమా ఆ తర్వాత అదే సినిమాలోని ఓ ఫైట్ జరుగుతుండగా టైటిల్స్ పడతాయి. హీరో ఎంట్రీ ఇచ్చిన దగ్గర్నుంచి ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యే వరకు సినిమా చాలా స్లోగా రన్ అవ్వడమే కాకుండా అనసరమైన సీన్స్, నవ్యు తెప్పించని కామెడీ సీన్స్‌తో నడిచిపోతుంది. ఫస్ట్ హాఫ్ చూసి నీరసపడిపోయిన ఆడియన్స్‌కి సెకండాఫ్ కాస్త ఊరటనిస్తుంది. షకలక శంకర్ ఎంటర్ అయిన తర్వాత సినిమా కాస్త స్పీడ్ అవ్వడమే కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్ కూడా బాగుంటుంది. వాసంతి అనే ఆత్మ బాలరాజుని ఎందుకు ప్రేమిస్తుంది అనే విషయాన్ని డైరెక్టర్ కన్విన్సింగ్‌గానే చెప్పాడు. ఈ విషయంలో క్యూరియాసిటీతో ఎదురుచూసే ఆడియన్స్‌కి వాసంతి ఫ్లాష్‌బ్యాక్ చూసిన తర్వాత క్లారిటీ వస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే షకలక శంకర్ కామెడీ సీన్స్ ఆడియన్స్‌ని బాగా నవ్విస్తాయి. అయితే ఒక హార్రర్ కామెడీ మూవీలో వుండాల్సిన హార్రర్ ఎలిమెంట్స్ వుండాల్సిన స్థాయిలో లేకపోవడం, జ్యోతి, అప్పారావు బృందం చేసిన కామెడీ సీన్స్ ఎబ్బెట్టుగా వుండడం, ఇలాంటి సినిమాలో ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేసే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల టైటిల్ చూసి ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్ళే ఆడియన్స్ నిరుత్సాహపడతారు. ఫైనల్‌గా చెప్పాలంటే ఎన్నో హార్రర్ కామెడీ చిత్రాలను ఆదరించిన ఆడియన్స్‌కి ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నిస్తుంది.
ఫినిషింగ్ టచ్ః ఫస్టాఫ్ వీక్- సెకండాఫ్ ఓకే
సినీజోష్ రేటింగ్ః 2.5/5