Advertisementt

సినీజోష్‌ రివ్యూ: జేమ్స్‌బాండ్‌

Fri 24th Jul 2015 08:37 AM
telugu movie james bond,james bond movie review,jamesbond cinejosh review,allari naresh,sakshi chowdary  సినీజోష్‌ రివ్యూ: జేమ్స్‌బాండ్‌
సినీజోష్‌ రివ్యూ: జేమ్స్‌బాండ్‌
Advertisement
Ads by CJ

ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై. లిమిటెడ్‌

జేమ్స్‌బాండ్‌ 

నటీనటులు: అల్లరి నరేష్‌, సాక్షి చౌదరి, ఆశిష్‌ విద్యార్థి, 

చంద్రమోహన్‌, జయప్రకాష్‌రెడ్డి, ఆలీ, రఘుబాబు, పోసాని,

కృష్ణభగవాన్‌, సప్తగిరి తదితరులు  

కథ: ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌

మాటలు: శ్రీధర్‌ సీపాన

సినిమాటోగ్రఫీ: దాము నర్రావుల 

సంగీతం: సాయి కార్తీక్‌

ఎడిటింగ్‌: ఎం.ఆర్‌.వర్మ

నిర్మాత: రామబ్రహ్మం సుంకర

దర్శకత్వం: మచ్చ సాయికిశోర్‌

విడుదల తేదీ: 24.07.2015

అల్లరి నరేష్‌... ఈ పేరు చెప్పగానే మనకి గుర్తొచ్చేది కామెడీ సినిమాలు. ఒకప్పుడు లెక్కకు మించి కామెడీ సినిమాలు చేసి ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తిన రాజేంద్రప్రసాద్‌ తర్వాత ఆ ప్లేస్‌ని భర్తీ చేయడానికి వచ్చిన అల్లరి నరేష్‌ అనుకున్నట్టుగానే తన సినిమాల ద్వారా ఆడియన్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని పంచాడు. అయితే ఈమధ్యకాలంలో  వచ్చిన అల్లరి నరేష్‌ సినిమాలు చాలా వరకు అపజయాల్నే చవి చూశాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌లో సాయికిషోర్‌ మచ్చ దర్శకత్వంలో రూపొందిన ‘జేమ్స్‌బాండ్‌’(నేను కాదు నా పెళ్ళాం) చిత్రంతో మళ్ళీ నవ్వుల్ని పండిరచడానికి వచ్చాడు. డిఫరెంట్‌ టైటిల్‌, డిఫరెంట్‌ ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ సినిమా ఎంతవరకు ఆడియన్స్‌ని నవ్వించింది? అల్లరి నరేష్‌ మార్క్‌ కామెడీని ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేశారా? కెరీర్‌ పరంగా ఈ సినిమా అల్లరి నరేష్‌కి ఎంతవరకు హెల్ప్‌ అవుతుంది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.

కథ: ప్రతి చిన్న విషయానికీ భయపడిపోయే తండ్రి(చంద్రమోహన్‌), ఆ తండ్రికి వున్న భయాన్ని వారసత్వం తీసుకున్న కొడుకు నాని(అల్లరి నరేష్‌). అతని భయాన్ని చూసి పెళ్ళి చేసుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రారు. కట్‌ చేస్తే దుబాయ్‌లోని మాఫియా డాన్‌ బడా(ఆశిష్‌ విద్యార్థి) తమ్ముడ్ని, అతని అనుచరుల్ని తన బుల్లెట్లకు బలి చేస్తుంది లేడీ డాన్‌ బుల్లెట్‌ అలియాస్‌ పూజ(సాక్షి చౌదరి). అలా కథలోకి ఎంటర్‌ అయిన బుల్లెట్‌ దుబాయ్‌లో పెద్ద డాన్‌. కొన్ని కారణాల వల్ల అర్జెంట్‌గా ఇండియా రావాల్సి వస్తుంది. తన తల్లి కోసం ఒక కండీషనల్‌ హజ్బెండ్‌ని సెట్‌ చేసుకోవాలనుకుంటుంది. పెళ్ళి చూపులకొచ్చిన వారంతా ఆమె పెట్టే కండీషన్స్‌ విని పారిపోతుంటారు. అలాంటి టైమ్‌లో మన హీరో నాని పూజని పెళ్ళి చేసుకుంటాడు. భయస్తుడైన నాని ఫెరోషియస్‌గా వుండే పూజని ఎలా పెళ్ళి చేసుకున్నాడు? సడన్‌గా ఇండియా వచ్చిన పూజ పెళ్ళి చేసుకోవాని ఎందుకు డిసైడ్‌ అయింది? పెళ్ళి చేసుకోవడానికి పూజ పెట్టిన కండీషన్స్‌ ఏమిటి? పెళ్ళి తర్వాత పూజ ఒక డాన్‌ అనే విషయం నాని తెలుసుకున్నాడా? చివరికి వీరిద్దరి పెళ్ళి కథ సుఖాంతమైందా? అనేది మిగతా కథ. 

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: అల్లరి నరేష్‌ గతంలో చేసిన చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రంలో అతని క్యారెక్టర్‌కి అంత ప్రాధాన్యత లేదనిపిస్తుంది. పైగా అతనికి ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌గా పెర్‌ఫార్మ్‌ చేసే అవకాశం కూడా తక్కువగా వుంది. జేమ్స్‌బాండ్‌ అనే టైటిల్‌ పెట్టి హీరోయిన్‌ క్యారెక్టర్‌నే హైలైట్‌ చెయ్యడం వల్ల అల్లరి నరేష్‌ క్యారెక్టర్‌కి ప్రాధాన్యత తగ్గింది. అయితే అతని క్యారెక్టర్‌కి వున్న పరిధిలో పెర్‌ఫార్మెన్స్‌ ఫర్వాలేదనిపించాడు. అతని గత చిత్రాల్లోలాగా ఈ చిత్రంలో అతను చేసిన కామెడీ అంతగా పండలేదు. ఇక టైటిల్‌ రోల్‌ చేసిన సాక్షి చౌదరి లేడీ డాన్‌గా మంచి పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చింది. డాన్‌గా ఆమె వాక్‌, లుక్స్‌, యాక్షన్‌ సీక్వెన్సెస్‌లో ఆమె టైమింగ్‌ బాగుంది. అదేవిధంగా ఒక భార్యగా కూడా తన పెర్‌ఫార్మెన్స్‌ ఫర్వాలేదనిపించింది. అయితే నిండుగా డ్రెస్‌ వేసుకుంటే తప్ప చాలీ చాలని దుస్తుల్లో ఆమెను చూడడం కష్టమే. విలన్‌గా నటించిన ఆశిష్‌ విద్యార్థి క్యారెక్టర్‌లో కొత్తదనం ఏమీ లేదు. అతని పెర్‌ఫార్మెన్స్‌ కూడా దానికి తగ్గట్టుగానే వుంది. మిగతా క్యారెక్టర్లలో జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, కారుమంచి రఘు, పృథ్వి, కృష్ణ భగవాన్‌, పోసాని చేసిన కామెడీ బాగుంది. నవ్వించడానికి సప్తగిరి చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఇక ప్రీ క్లైమాక్స్‌లో వచ్చిన ఆలీ వున్న కాసేపు నవ్వించాడు. 

టెక్నీషియన్స్‌: సినిమాలో ఆడియన్స్‌ అక్కడక్కడా కాస్త నవ్వుకున్నారంటే దానికి ముఖ్య కారకుడు మాటల రచయిత శ్రీధర్‌ సీపాన. సీన్‌కి తగ్గట్టుగా అతను రాసిన మాటు చాలా చోట్ల పేలాయి. అయితే కొన్ని డైలాగుల్లో ప్రాస కోసం ప్రాకులాడడం ఎబ్బెట్టుగా అనిపించింది. ఇక దాము ఫోటోగ్రఫీ చాలా రిచ్‌గా వుంది. ఫారిన్‌లో తీసిన సీన్స్‌, ఇండియాలో తీసిన సీన్స్‌ అందంగా వున్నాయి. సాయికార్తీక్‌ చేసిన పాటల్లో రెండు పాటలు బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం క్వాలిటీగా అనిపించింది. డైరెక్టర్‌ సాయికిషోర్‌ గురించి చెప్పాంటే ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ రెడీ చేసిన కథని శ్రీధర్‌ రాసిన కామెడీ డైలాగ్స్‌తో నెట్టుకొచ్చేయాలని చూశాడు తప్ప కథని కొత్తగా ప్రజెంట్‌ చేసే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు. సినిమాలోని అందరి క్యారెక్టర్ల ఇంట్రడక్షన్‌తో ఫస్ట్‌ హాఫ్‌ ఫర్వాలేదు అనిపించినా సెకండాఫ్‌కి వచ్చేసరికి కథ ముందుకు వెళ్ళకుండా నిడివి పెంచేందుకు చాలా ప్రయత్నాలు  చేశాడు. దాంతో సెకండాఫ్‌లో ల్యాగ్‌ రావడమే కాకుండా అనవసరమైన సీన్స్‌, అసందర్భంగా వచ్చే కామెడీ సీన్స్‌తో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. ఒక సాదా సీదా క్లైమాక్స్‌తో సినిమాని ఎండ్‌ చేశాడు. కథనానికి తగ్గట్టుగానే సినిమాలో అక్కడక్కడా వచ్చే సీన్స్‌ అతికించినట్టుగా అనిపిస్తాయి తప్ప ఒక ఫ్లోలో వెళ్తున్నట్టుగా వుండవు. శ్రీను వైట్ల శిష్యుడు అవ్వడం వల్ల సాయికిషోర్‌ కూడా సెకండాఫ్‌లో అదే బాటలో వెళ్ళాడు. కామెడీ సీన్స్‌తో, డైలాగ్స్‌తో కథని అక్కడక్కడే తిప్పే ప్రయత్నం చెయ్యడం వల్ల ఆడియన్స్‌ బోర్‌ ఫీలవుతారు. మేకింగ్‌ విషయానికి వస్తే ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండిరగ్‌ వరకు రిచ్‌గా చూపించే ప్రయత్నం చేశారు.

ప్లస్‌ పాయింట్స్‌:

డైలాగ్స్‌

కామెడీ

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌

మైనస్‌ పాయింట్స్‌:

కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడం

సెకండాఫ్‌లో ల్యాగ్‌

డైరెక్షన్‌

విశ్లేషణ: కామెడీలో ఇప్పటివరకు అల్లరి నరేష్‌ అన్ని రకాల సినిమాలు చేసేశాడు. ఈరోజు వచ్చిన ‘జేమ్స్‌బాండ్‌’ ఆ సినిమాల్లో ఒకటిగా అనిపిస్తుందే తప్ప హీరో క్యారెక్టరైజేషన్‌లో ఎక్కడా కొత్తదనం కనిపించదు. ఇక డాన్‌గా దుబాయ్‌ని గడగడలాడిరచిన బుల్లెట్‌ కేవలం కొన్ని సీన్లలోనే భర్తను ప్రేమించే భార్యగా మారిపోవడం చాలా చప్పగా అనిపిస్తుంది. ఈ సినిమాకి జేమ్స్‌బాండ్‌ అనే టైటిల్‌  ఎందుకు పెట్టారో అర్థం కాదు. కథనం విషయానికి వస్తే ఫస్ట్‌ హాఫ్‌ స్పీడ్‌గా, గ్రిప్పింగ్‌గా అనిపించినా సెకండాఫ్‌కి వచ్చేసరికి ఆ స్పీడ్‌ తగ్గిపోయి ఎప్పుడు క్లైమాక్స్‌ వస్తుందా అని ఎదురుచూసే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మధ్య మధ్య కమెడియన్స్‌ చేసే కామెడీ, వాళ్ళు చెప్పే డైలాగ్స్‌ మనల్ని నవ్విస్తాయి. అదే టైమ్‌లో కొన్ని చోట్ల నవ్వించే ప్రయత్నం చేసిన కమెడియన్స్‌ సక్సెస్‌ కాలేకపోయారు. ఈమధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాల్లాగే సెకండాఫ్‌కి ఆర్టిస్టుందర్నీ ఒక చోట చేర్చి కామెడీ చేసే ప్రయత్నం చేశారు. ఫైనల్‌గా చెప్పాంటే కామెడీపరంగా అక్కడక్కడా బాగుంది అనిపించినా కంటెంట్‌ పరంగా సినిమాలో చెప్పుకోదగ్గ విషయం లేదు. సినిమా చూస్తున్న ఆడియన్స్‌కి నెక్స్‌ట్‌ ఏం జరగబోతుందనేది చాలా వరకు అర్థమైపోతుంది. ఈమధ్యకాలంలో వచ్చిన అల్లరి నరేష్‌ సినిమాల వరసలో ‘జేమ్స్‌బాండ్‌’ కూడా నిలుస్తుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: అల్లరి తగ్గిన నరేష్‌ సినిమా

సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ