Advertisementt

సినీజోష్‌ రివ్యూ: జ్యోతిలక్ష్మీ

Sat 13th Jun 2015 06:50 AM
telugu movie jyothi laksmi review,puri jagannath,charmi,sunil kashyap  సినీజోష్‌ రివ్యూ: జ్యోతిలక్ష్మీ
సినీజోష్‌ రివ్యూ: జ్యోతిలక్ష్మీ
Advertisement

సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లిమిటెడ్‌, 

శ్రీశుభశ్వేత ఫిలింస్‌

జ్యోతిలక్ష్మీ

నటీనటులు: ఛార్మికౌర్‌, సత్య, వంశీ, సాండీ, 

అజయ్‌ ఘోష్‌, చైతన్య, ప్రియదర్శిని రామ్‌ తదితరులు

కథ: మల్లాది వెంకటకృష్ణమూర్తి

సినిమాటోగ్రఫీ: పి.జి.వింద

సంగీతం: సునీల్‌ కశ్యప్‌

ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌

సమర్పణ: ఛార్మి కౌర్‌

నిర్మాతలు: శ్వేతలానా, వరుణ్‌, తేజ, సి.వి.రావు

స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌

విడుదల తేదీ: 12.06.2015

‘జ్యోతిలక్ష్మీ’.. ఈ పేరు వినగానే పాతరోజుల్లో ఐటమ్‌గర్ల్‌, తుపాకీ పట్టే రౌడీరాణి గుర్తొస్తుంది. కొత్త తరహా కథలతో సినిమాలు తీస్తూ ట్రెండ్‌కి భిన్నంగా వెళ్ళాలని ఆలోచించే పూరి జగన్నాథ్‌కి జ్యోతిలక్ష్మీ టైటిల్‌తో ఓ సినిమా చెయ్యాలనిపించింది. మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన ‘మిసెస్‌ పరాంకుశం’ అనే ఒకప్పటి నవల ఆధారంగా ఈ ‘జ్యోతిలక్ష్మీ’ చిత్రాన్ని తెరకెక్కించాడు పూరి. టైటిల్‌ పాత్రలో ఛార్మి నటించడమే కాకుండా కొంత నిర్మాణ బాధ్యతలు కూడా వేసుకొని చిత్రాన్ని సమర్పించింది. నటి జ్యోతిలక్ష్మీ పుట్టినరోజైన ఈరోజు(12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక వేశ్య ప్రధాన పాత్రలో సాగే ఈ కథని ప్రేక్షకుల్ని మెప్పించేలా పూరి ఎలా తెరకెక్కించాడు? జ్యోతిలక్ష్మీ పాత్రకు ఛార్మి ఎంతవరకు న్యాయం చేసింది? అసలు ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు పూరి ఏం చెప్పదలుచుకున్నాడు? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.

కథ: ఓపెన్‌ చేస్తే అది ఒక వ్యభిచార గృహం. ఆ కంపెనీని నడిపే నారాయణ్‌ పట్వారి(అజయ్‌ ఘోష్‌), అతని అనుచరులు అక్కడ చేసే అకృత్యాల సీన్‌. కట్‌ చేస్తే హీరో సత్య(సత్య), అతని ఫ్రెండ్‌ సాండీ(సాండీ) ఎంట్రీ. సాఫ్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసే సత్య అతని ఫ్రెండ్‌ సాండీతో అమ్మాయిల కోసం డిస్కస్‌ చేస్తాడు. రెగ్యులర్‌గా అమ్మాయిలతో టచ్‌లో వుండే సాండీ సడన్‌గా తన ఫ్రెండ్‌ ఈ టాపిక్‌ తేవడంతో షాక్‌ అవుతాడు. తనకి ఒక అమ్మాయి కావాలని అడుగుతాడు సత్య. వెంటనే బ్రోకర్‌ భద్రం ప్రత్యక్షమవుతాడు. తనకి తెలిసిన టెక్నాలజీని అంతా ఉపయోగించి చాలామంది అమ్మాయిల్ని ఫోన్‌లోనే చూపించే ప్రయత్నం చేస్తాడు భద్రం. ఇవేవీ నచ్చని సత్య అమ్మాయిని లైవ్‌గానే చూడాలని పట్టుపడతాడు. అయితే ఏ అమ్మాయిని చూసినా నచ్చలేదని చెప్తుంటాడు సత్య. ఫైనల్‌గా గంగాబాయి కంపెనీలో జ్యోతిలక్ష్మీ(ఛార్మి)ని చూసి తనకి కావాల్సిన అమ్మాయి అదేనని ఫిక్స్‌ అవుతాడు. అప్పటి నుంచి రోజూ జ్యోతిలక్ష్మీని బుక్‌ చేసుకుంటూ వుంటాడు. ఆమెతో మాట్లాడి, ఆమెతో పాటలు పాడిరచుకొని వచ్చేస్తుంటాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత తను ఆమెను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నట్టు జ్యోతిలక్ష్మీతో చెప్తాడు. షాక్‌ అయిన జ్యోతిలక్ష్మీ మొదట ఒప్పుకోదు. కొన్నిరోజుల తర్వాత అతనితో లేచిపోవడానికి సిద్ధపడుతుంది. గంగాబాయి కంపెనీ మనుషులకు మస్కా కొట్టి ఇద్దరూ తప్పించుకుంటారు. ఆ తర్వాత పెళ్ళి చేసుకుంటారు. పెళ్ళి తర్వాత ఇద్దరి మధ్య ఏం జరిగింది? గంగాబాయి కంపెనీని నడిపే నారాయణ్‌ పట్వారీ ఎలా రియాక్ట్‌ అయ్యాడు? సత్య, జ్యోతిలక్ష్మీలకు ఎలాంటి ప్రాబ్లమ్స్‌ క్రియేట్‌ చేశాడు? వారిని జ్యోతిలక్ష్మీ ఎలా ఎదుర్కొంది? తనలా ఆ కూపంలోకి నెట్టబడ్డ అమ్మాయిల కోసం జ్యోతిలక్ష్మీ ఏం చేసింది? అనేది మిగతా కథ. 

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: జ్యోతిలక్ష్మీగా టైటిల్‌ క్యారెక్టర్‌లో ఛార్మి పెర్‌ఫార్మెన్స్‌ ఓకే అనిపించింది. కొన్ని సీన్స్‌లో బాగా చేసినట్టు అనిపిస్తే, మరికొన్ని సీన్స్‌లో ఓవర్‌ యాక్షన్‌ చేసినట్టుగా అనిపించింది. టైటిల్‌ సాంగ్‌లో ఛార్మి డాన్స్‌ ఆకట్టుకుంది. అలాగే మిగతా సాంగ్స్‌లో తన ఎక్స్‌ప్రెషన్స్‌ బాగున్నాయి. క్లైమాక్స్‌లో ఛార్మి చెప్పే డైలాగ్స్‌, ఆమె మాడ్యులేషన్‌ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సీరియస్‌గా డైలాగ్స్‌ చెప్తున్నప్పటికీ నొక్కి నొక్కి మరీ చెప్పడంతో అవి కామెడీగా అనిపించాయి. ఇక హీరో సత్య తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేశాడు. అతని పెర్‌ఫార్మెన్స్‌గానీ, డైలాగ్‌ డెలివరీ బాగున్నాయి. అతని ఫ్రెండ్‌గా నటించిన సాండీ మంచి టైమింగ్‌తో చెప్పిన డైలాగ్స్‌ నవ్వించాయి. అజయ్‌ ఘోష్‌ చేసిన నారాయణ్‌ పట్వారి క్యారెక్టర్‌కి బాగా సూట్‌ అయ్యాడు. ఇన్‌స్పెక్టర్‌గా నటించిన ప్రియదర్శిని రామ్‌ కూడా ఫర్వాలేదనిపించాడు. 

టెక్నీషియన్స్‌: ఈ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్స్‌లో కెమెరామెన్‌ పి.జి. వింద, ఆర్ట్‌ డైరెక్టర్‌ విఠల్‌ కొసనం గురించి ముందుగా చెప్పుకోవాలి. పి.జి. విందా కెమెరా వర్క్‌ చాలా బాగుంది. అయితే ఫస్ట్‌ హాఫ్‌లో వున్న గ్రాండియర్‌ని సెకండాఫ్‌లో కూడా కంటిన్యూ చెయ్యలేకపోయాడు వింద. సినిమాటోగ్రఫీ పరంగా సెకండాఫ్‌ చీప్‌గా అనిపించింది. ఇక ఆర్ట్‌ డైరెక్టర్‌ వర్క్‌ గురించి చెప్పాలంటే జ్యోతిలక్ష్మీ టైటిల్‌ సాంగ్‌లో ఆర్ట్‌ డైరెక్టర్‌ పనితనం బాగా కనిపించింది. ఆ తర్వాత అదే హౌస్‌లో వచ్చే సీన్స్‌లో కూడా ఆర్ట్‌ వర్క్‌ కొట్టొచ్చినట్టు కనిపించింది. అయితే ఇవేవీ సెకండాఫ్‌లో వచ్చే మిగతా సీన్స్‌లో మనకు కనిపించవు. ప్రతి సీన్‌ చాలా నార్మల్‌గా అనిపిస్తుంది. సునీల్‌ కశ్యప్‌ మ్యూజిక్‌ బాగుంది. పాటలన్నీ క్యాచీగా వుండడమే కాకుండా పూరి స్టైల్‌లోనే వున్నాయి. ఈ పాటల్ని విజువల్‌గా కూడా ఫర్వాలేదనిపించారు. ఏ పాటనూ రిచ్‌గా తీసినట్టు అనిపించదు. సునీల్‌ చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగుంది. ఇక డైరెక్టర్‌ విషయానికి వస్తే 30 సంవత్సరాల క్రితం మల్లాది రాసిన నవలను ఆధారం చేసుకొని ఇప్పటి ట్రెండ్‌కి అనుగుణంగా సినిమా తియ్యాలనుకున్న పూరి ప్రయత్నం విఫలమైందని చెప్పాలి. ఈ సినిమా ద్వారా ఆడియన్స్‌కి ఏం చెప్పాలనుకున్నాడో క్లారిటీ లేదు. ఒక వేశ్యను హీరో ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు, ఆమెతోనే జీవితాంతం వుండాలనుకున్నాడు. అంతవరకు బాగానే వుంది. ఇదంతా ఫస్ట్‌ హాఫ్‌లో జరిగే కథ. సెకండాఫ్‌లో హీరోయిన్‌ వైపు నుంచి వచ్చే సమస్యల్ని హీరో లేదా హీరోయిన్‌ ఎలా ఎదుర్కొంది అనే టాపిక్‌ వుంటుందని ఎక్స్‌పెక్ట్‌ చేసే ఆడియన్స్‌ని నిరాశ పరిచాడు పూరి. కథను మరో కోణంలోకి తీసుకెళ్ళి ఆడియన్స్‌ ఏమాత్రం భరించలేని విషయాలను వారిపై రుద్దే ప్రయత్నం చేశాడు. వేశ్యా వృత్తిలోకి ఏ అమ్మాయీ కావాలని రాదు అని చెప్పే జ్యోతిలక్ష్మీ తను ఆ వృత్తిలోకి రావడం వెనుక కారణాలు ఏమిటి? ఏ పరిస్థితుల ప్రోద్భలం వల్ల వేశ్యగా మారాల్సి వచ్చిందనే విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. నారాయణ్‌ పట్వారీ కంపెనీని మూయించడానికి జ్యోతిలక్ష్మీ చేసే ప్రయత్నాలు, అందులో భాగంగా చెప్పే డైలాగ్స్‌ ఆడియన్స్‌కి ఏమాత్రం రుచించవు. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండిరగ్‌ వరకు చూసిన ఆడియన్స్‌కి కథను ఎక్కడో ఎత్తుకొని, ఎటో తీసుకెళ్ళి చివరికి ఎటు వెళ్ళాలో తెలీక చతికిలపడ్డట్టు అనిపిస్తుంది. 

విశ్లేషణ: సినిమా స్టార్ట్‌ అయిన తర్వాత హీరో ఒక అమ్మాయి కోసం వెతకడం, జ్యోతిలక్ష్మీ పరిచయం కావడం, వేశ్యగా వున్న ఆమెను ప్రేమించానని చెప్పడం, ఆమెను ఒప్పించి పెళ్ళి చేసుకోవడం వరకు సినిమా ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తుంది. పెళ్ళి తర్వాత శోభనం విషయంలో ఇద్దరికి గొడవ రావడం, కండోమ్‌ ప్రస్తావన తీసుకు రావడం, అది హీరో అక్కతో డిస్కస్‌ చేయడం వంటి సీన్స్‌ చిరాకు పుట్టించేవిగా వున్నాయి. ఫస్ట్‌ హాఫ్‌ కొన్ని ఇంట్రెస్టింగ్‌ సీన్స్‌తో, కొన్ని కామెడీ డైలాగ్స్‌తో ఫర్వాలేదనిపిస్తుంది. సెకండాఫ్‌ స్టార్ట్‌ అయినప్పటి నుంచి ప్రేక్షకుల సహనానికి పరీక్ష మొదలవుతుంది. తమ కంపెనీ నుంచి పారిపోయిన జ్యోతిలక్ష్మీ కనిపించినా ఆమెను పట్టుకోవడానికి విలన్‌ తాత్సారం చేస్తుంటాడు. ఇక బ్రోతల్‌ కేసులో పట్టుపడ్డ అమ్మాయిల వివరాలు మాత్రమే చెప్తారు కానీ, పట్టుబడ్డ పారిశ్రామిక వేత్త పేరు మాత్రం బయటకు రాదు. అలాంటి వారిని పట్టుకునేందుకు జ్యోతిలక్ష్మీ తన సహచరులతో కలిసి స్పై కెమెరాలతో వీడియోలు తీయించడం వారందర్నీ ఒక చోట చేర్చి మీటింగ్‌ పెట్టడం, వారితో గడిపిన అమ్మాయిలకు సెటిల్‌మెంట్‌ చేయమని వారిని బెదిరించడం లాంటి సీన్స్‌ అన్నీ సినిమాటిక్‌గా కూడా లేకపోవడంతో క్లైమాక్స్‌ అంతా రసాభాస అయిపోయింది. థియేటర్‌ నుంచి బయటికి వచ్చినవారికి మనం ఏ సినిమాకి వెళ్ళాం, చివరిలో ఏం చూసి బయటికి వచ్చాం అనే విషయంలో ఎలాంటి క్లారిటీ వుండదు. ఈ విషయంలో డైరెక్టర్‌కి క్లారిటీ లేనట్టే, చూసిన ఆడియన్స్‌కి కూడా క్లారిటీ మిస్‌ అయింది. ఇక ప్రొడక్షన్‌ వేల్యూస్‌ గురించి చెప్పాలంటే సినిమాలో కొంత ఫోటోగ్రఫీ వర్క్‌, కొంత ఆర్ట్‌ వర్క్‌తో ఫస్ట్‌ హాఫ్‌లో కొంత రిచ్‌నెస్‌ కనిపించినా ఆ తర్వాత ఎక్కడా ఆ ఫ్లేవర్‌ కనిపించదు. చాలా హడావిడిగా ఏదో ఒకటిలే అని తీసేసినట్టుగానే అనిపిస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే పూరి జగన్నాథ్‌, ఛార్మి ఎంతో కాన్ఫిడెన్స్‌తో, ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో చేసిన ‘జ్యోతిలక్ష్మీ’ చిత్రంలో కథపరంగా, కథనం పరంగా ఆకట్టుకునే అంశాలు ఏమీ లేవు. అయితే పూరి జగన్నాథ్‌ సినిమాల టాక్‌ ఎలా వున్నా తప్పకుండా ఆడియన్స్‌ పూరికి ఎలాగూ వుంటారు. అలాగే జ్యోతిలక్ష్మీ అనే ఒక డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో ఛార్మి నటించింది కాబట్టి ఈ సినిమాకి ఓపెనింగ్స్‌పరంగా అవి ప్లస్‌ అయ్యే అవకాశం వుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: పూరి, ఛార్మిల డిఫరెంట్‌ ఎటెమ్ట్‌.

సినీజోష్‌ రేటింగ్‌: 2.75/5

- హరా జి. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement