శ్రీసాయిరామ్ క్రియేషన్స్
ఎంతవాడు గానీ..
నటీనటులు: అజిత్‌కుమార్, అనుష్క, త్రిష,
అరుణ్ విజయ్, వివేక్, ఆశిష్ విద్యార్థి, సుమన్ తదితరులు
సంగీతం: హేరిస్ జయరాజ్
సినిమాటోగ్రఫీ: డాన్ మాకార్థుర్, ఎస్.ఆర్.కదిర్
ఎడిటింగ్: ఆంటోని
మాటలు: ఘంటసాల రత్నకుమార్
సమర్పణ: ఎ.ఎం.రత్నం
నిర్మాత: ఎస్.ఐశ్వర్య
రచన, దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ మీనన్
విడుదల తేదీ: 22.05.2015
గౌతమ్ మీనన్ అంటే ఏ జోనర్ సినిమా అయినా తనదైన శైలిలో అందర్నీ ఆకట్టుకునేలా తియ్యగల దర్శకుడుగా మంచి పేరుంది. చెలి, ఏమాయ చేసావె వంటి రొమాంటిక్ లవ్‌స్టోరీస్ చేసినా, ఘర్షణ, రాఘవన్ వంటి క్రైమ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్ తీసినా ప్రేక్షకులను సినిమా చివరి వరకు కూర్చోబెట్టగల విజువల్స్‌తో, టేకింగ్‌తో మెస్మరైజ్ చేస్తాడు. తాజాగా అజిత్ హీరోగా, అనుష్క, త్రిష హీరోయిన్లుగా తమిళ్‌లో రూపొందించిన ‘ఎన్నయ్ అరిందాళ్’ చిత్రం తమిళ్‌లో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని ‘ఎంతవాడుగానీ’ పేరుతో తెలుగులో విడుదల చేశారు ఎ.ఎం.రత్నం. ఈరోజు విడుదలైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పించింది? గౌతమ్ మీనన్ మ్యాజిక్ తెలుగులో ఎంతవరకు వర్కవుట్ అయిందనే విషయాలు తెలుసుకోవడానికి సమీక్షలోకి వెళ్దాం.
కథ: డ్యూటీని ప్రాణంగా ప్రేమించే ఒక పోలీసాఫీసర్ కథ ఇది. చంద్రముఖి(అనుష్క)కి కొంతమంది దుండగుల వల్ల ప్రాణాపాయం వుందని తెలుసుకున్న సత్యదేవ(అజిత్) ఆమెకు తెలియకుండా ఆమెను కాపాడుతూ వుంటాడు. అమెరికా నుంచి ఫ్లైట్‌లో వస్తున్న చంద్రముఖిని పక్క సీట్‌లోనే వున్న సత్యదేవ పరిచయం చేసుకుంటాడు. అతనికి ఒక పాప కూడా వుందని చెప్తాడు. సత్యని తొలిచూపులోనే ప్రేమిస్తుంది చంద్రముఖి. ఇండియా వచ్చిన తర్వాత సత్యని కలవడానికి ప్రయత్నిస్తుంది చంద్రముఖి. ఆ టైమ్‌లో చంద్రముఖిని చంపడానికి ప్లాన్ చేసిన కొంతమంది క్రిమినల్స్ నుంచి ఆమెను రక్షిస్తాడు సత్యదేవ. ఆ క్రిమినల్స్‌లో విక్టర్(అరుణ్ విజయ్) అనే వ్యక్తితో సత్యతో పరిచయం వుంటుంది. మైఖేల్(సిల్వ) నాయకుడుగా వున్న ఒక ముఠాను పట్టుకునేందుకు కొన్ని సంవత్సరాల క్రితం ఖైదీగా జైల్‌లో ఎంటర్ అయి విక్టర్‌తో పరిచయం పెంచుకుంటాడు. అలా ఇద్దరూ స్నేహితులుగా మారతారు. సత్యను మైఖేల్ గ్యాంగ్ చేర్చడానికి తీసుకొచ్చిన విక్టర్‌కి అతను ఖైదీ కాదని, మైఖేల్ గ్యాంగ్‌ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి వచ్చిన ఐపిఎస్ ఆఫీసర్ అని తెలుసుకొని షాక్ అవుతాడు విక్టర్. నరరూప రాక్షసుడైన విక్టర్ చంద్రముఖి వల్ల మళ్ళీ సత్యని ఫేస్ చెయ్యాల్సి వస్తుంది. అసలు చంద్రముఖిని చంపాలని విక్టర్ గ్యాంగ్ ఎందుకు ట్రై చేస్తోంది? సత్య దగ్గర వున్న పాప ఎవరు? సత్య ఫ్లాష్‌బ్యాక్ ఏమిటి? విక్టర్ గ్యాంగ్ నుంచి చంద్రముఖి రక్షింపబడిరదా? అనేది మిగతా కథ.
ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్: సత్యదేవ క్యారెక్టర్‌లో అజిత్ ఎక్స్‌ట్రార్డినరీగా పెర్‌ఫార్మ్ చేశాడు. చాలా వేరియేషన్స్ వున్న ఈ క్యారెక్టర్‌ని అద్భుతంగా చేశాడు. కొడుకుగా, బాధ్యత గల తండ్రిగా, ప్రేమికుడిగా, నిజాయితీగల పోలీసాఫీసర్‌గా డిఫరెంట్ వేరియషన్స్ వున్న సత్యదేవ క్యారెక్టర్‌లో అజిత్ జీవించాడని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే సినిమాని తన భుజాలమీద వేసుకొని నడిపించాడు అజిత్. చంద్రముఖి క్యారెక్టర్‌లో అనుష్క ఫర్వాలేదనిపించింది. ఎందుకంటే ఆమె క్యారెక్టర్ సినిమాలో ఒక మెయిన్ పాయింట్ అయినప్పటికీ పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్‌లేని క్యారెక్టర్ ఆమెది. సత్యదేవ ఫ్లాష్‌బ్యాక్‌లో ఒక బిడ్డ తల్లిగా కనిపించిన త్రిష క్యారెక్టర్ అందర్నీ ఆకట్టుకుంటుంది. అజిత్, త్రిషల మధ్య జరిగే కొన్ని సీన్స్ అందర్నీ ఆకట్టుకుంటాయి. హీరోకి సమానమైన విక్టర్ క్యారెక్టర్‌లో నటించిన అరుణ్ విజయ్ ఎక్స్‌ట్రార్డినరీగా పెర్‌ఫార్మ్ చేశాడు. అతని క్యారెక్టరైజేషన్‌గానీ, బాడీ లాంగ్వేజ్‌గానీ డైలాగ్స్‌గానీ ఆడియన్స్‌ని టెన్షన్‌కి గురిచేస్తాయి. గౌతమ్ మీనన్ గతంలో చేసిన ‘ఘర్షణ’ చిత్రంలో పండా క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా వుంటుందో దాన్ని మించి పవర్‌ఫుల్‌గా విక్టర్ క్యారెక్టర్‌ని డిజైన్ చేశాడు. సెకండాఫ్‌లో అరుణ్ విజయ్ పెర్‌ఫార్మెన్స్ సూపర్బ్ అనిపించేలా వుంది. ఇక డిసిపిగా నటించిన వివేక్ అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశాడు.
టెక్నీషియన్స్: ఈ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్స్‌లో ముందుగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫర్స్ గురించి. డాన్ మాకార్థుర్, ఎస్.ఆర్.కదిర్ ఎక్స్‌లెంట్ ఫోటోగ్రఫీ అందించారు. ప్రతి సీన్‌ని చాలా రిచ్‌గా చూపించే ప్రయత్నం చేశారు. నైట్ ఎఫెక్ట్‌లో వచ్చే సీన్స్‌ని కూడా బాగా చూపించారు. హేరిస్ జయరాజ్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే సిట్యుయేషన్స్‌కి తగ్గట్టుగా వినసొంపైన పాటలు చేశాడు. పాటల కంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా చేశాడని చెప్పాలి. అయితే ఆంటోని చేసిన ఎడిటింగ్ మాత్రం అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా సినిమా చూస్తున్న ఫీల్‌ని కలిగించింది. కొన్ని అనవసరమైన సీన్స్‌ని కూడా ఇరికించడం వల్ల సినిమా లెంగ్తీగా అనిపిస్తుంది. డైరెక్టర్ గౌతమ్ మీనన్ విషయానికి వస్తే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండిరగ్ వరకు సినిమా గ్రిప్పింగ్‌గా వుండేలా కొంత కేర్ తీసుకున్నాడు. అయితే అతని డైరెక్షన్‌లోనే వచ్చిన ఘర్షణ చిత్రానికి కొనసాగింపుగా ఈ సినిమా అనిపిస్తుంది. ఆ చిత్రంలోని పండా క్యారెక్టర్‌ని విక్టర్ క్యారెక్టర్ పోలి వుండడం కూడా ఘర్షణ చిత్రాన్ని మళ్ళీ చూస్తున్నామా అనే ఫీలింగ్ కలిగిస్తుంది. అలాగే కమల్‌హాసన్‌తో చేసిన రాఘవన్ చిత్రం తాలూకు సన్నివేశాలు కూడా ఈ చిత్రంలో రిపీట్ అయినట్టు అనిపిస్తుంది. కథను ఎంత గ్రిప్పింగ్‌గా చెప్పినా, కొన్ని సీన్స్‌ని అద్భుతంగా చూపించినప్పటికీ సినిమాలో అక్కడక్కడ ఆడియన్స్‌కి బోర్ కొడుతుంది. సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ అనేది లేకపోవడం, ఎంతసేపూ హీరోకి, విలన్‌కి మధ్య సీన్సే వుండడం కూడా ఆడియన్స్‌కి విసుగు పుట్టిస్తుంది.
విశ్లేషణ: గౌతమ్ మీనన్ గతంలో చేసిన చిత్రాలతో పోలీస్తే కథాపరంగా, టెక్నికల్‌గా ఈ సినిమా బాగుందనిపించినా ఫస్ట్ హాఫ్ అంతా కథ ముందుకు కదలదు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఏమాత్రం ఆసక్తికరంగా వుండదు. సెకండాఫ్‌లో హీరోకి, విలన్‌కి మధ్య వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమా స్పీడ్ అందుకుంటుంది. ఫస్ట్ హాఫ్‌లో, సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌లో ఏం జరగబోతోంది అనేది ఆడియన్స్ ఊహకి అందే విధంగానే వున్నాయి. సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ అనేది లేకపోవడం వల్ల సినిమా చూస్తున్న ఆడియన్స్‌కి ఉత్సాహం అనేది వుండదు. పైగా అనుష్క, త్రిష వంటి హీరోయిన్స్ వున్నప్పటికీ వారి గ్లామర్‌ని దర్శకుడు ఉపయోగించుకోకపోవడంవల్ల ఆడియన్స్‌కి కనుల విందు కరువైంది. యాక్షన్ మూవీస్‌ని ఇష్టపడే వారికి ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్‌లు నచ్చే అవకాశం వుంది. అయితే ఇది అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సినిమా కాదు. ఇంతకుముందు వచ్చిన అజిత్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చే అవకాశాలు తక్కువ. ఫైనల్‌గా చెప్పాలంటే మంచి విజువల్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్, థ్రిల్ చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు చూడాలనుకుంటే ‘ఎంతవాడుగానీ..’ చిత్రాన్ని చూడొచ్చు.
ఫినిషింగ్ టచ్: ఎంటర్‌టైన్‌మెంట్ లేని యాక్షన్ మూవీ
సినీజోష్ రేటింగ్: 2.5/5