Advertisementt

సినీజోష్‌ రివ్యూ: S/o సత్యమూర్తి

Thu 09th Apr 2015 06:13 AM
allu arjun new movie son of satyamurthy,son of satyamurthy review,trivikram,devisri prasad,samantha,nitya menon  సినీజోష్‌ రివ్యూ: S/o సత్యమూర్తి
సినీజోష్‌ రివ్యూ: S/o సత్యమూర్తి
Advertisement
Ads by CJ

హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌

S/o సత్యమూర్తి

నటీనటులు: అల్లు అర్జున్‌, సమంత, నిత్యమీనన్‌, 

అదా శర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, 

రావు రమేష్‌ తదితరులు

సినిమాటోగ్రఫీ: ప్రసాద్‌ మూరెళ్ళ

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌

ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి

నిర్మాత: ఎస్‌.రాధాకృష్ణ

రచన, దర్శకత్వం: త్రివిక్రమ్‌

విడుదల తేదీ: 09.04.2015

అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మించిన ‘జులాయి’ చిత్రం సూపర్‌హిట్‌ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత పవన్‌కళ్యాణ్‌తో ఫ్యామిలీ సెంటిమెంట్‌తో రూపొందించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయి డైరెక్టర్‌గా త్రివిక్రమ్‌ రేంజ్‌ని మరింత పెంచింది. లేటెస్ట్‌గా మళ్ళీ ‘జులాయి’ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’. విలువలే ఆస్తి అనే ట్యాగ్‌లైన్‌తో మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్‌ చేస్తూ త్రివిక్రమ్‌ రూపొందించిన ఈ చిత్రం ‘అత్తారింటికి దారేది’ చిత్రంలా సెంటిమెంట్‌ వర్కవుట్‌ అయిందా? ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఈ చిత్రానికి కనెక్ట్‌ చెయ్యడంలో త్రివిక్రమ్‌ ఎంతవరకు సక్సెస్‌ అయ్యాడు? తన డాన్సులతో, కామెడీతో, ఫైట్స్‌తో ఎంటర్‌టైన్‌ చేస్తూ వస్తున్న అల్లు అర్జున్‌ ఫ్యామిలీ సెంటిమెంట్‌ వైపు టర్న్‌ అయి చేసిన ఈ సినిమా ఆడియన్స్‌కి శాటిస్‌ఫ్యాక్షన్‌ ఇచ్చిందా? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే. 

కథ: విరాజ్‌ ఆనంద్‌(అల్లు అర్జున్‌) 300 కోట్లకు అధిపతి అయిన పెద్ద బిజినెస్‌మేన్‌ సత్యమూర్తి(ప్రకాష్‌రాజ్‌) కొడుకు. ఫారిన్‌లో జాలీగా వుండే ఆనంద్‌కి తన తండ్రి యాక్సిడెంట్‌లో చనిపోయాడన్న వార్త తెలిసి ఇండియా వస్తాడు. వచ్చీ రావడంతోనే ఆస్తి, అప్పుల వ్యవహారాలు అతని మీద పడతాయి. తన తండ్రి ఆస్తి అంతా అప్పుల వాళ్ళకి రాసి ఇచ్చేసి తల్లి, అన్న, వదిన, అన్నయ్య కూతురుతో కలిసి కట్టుబట్టలతో బయటికి వస్తాడు. ఉద్యోగం కోసం ప్రయత్నించిన ఎక్కడా దొరకదు. ఆ టైమ్‌లో తన స్నేహితుడి కంపెనీలో ఒక వెడ్డింగ్‌ ప్లానర్‌గా జాయిన్‌ అవుతాడు. తనకు ఆస్తి వున్నప్పుడు పల్లవి(అదా శర్మ)తో ఎంగేజ్‌మెంట్‌ జరుగుతుంది. అతని ఆస్తంతా పోయిందని తెలుసుకున్న పల్లవి ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్‌ చేసుకుంటుంది. వెడ్డింగ్‌ ప్లానర్‌గా పల్లవి పెళ్ళికే అతను వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ పరిచయమైన సుబ్బలక్ష్మీ(సమంత) అలియాస్‌ సమీరతో ప్రేమలో పడతాడు. ఆమె తండ్రి సాంబశివరావు(రాజేంద్రప్రసాద్‌)కి ఆనంద్‌ అంటే పడదు. ఆనంద్‌ తండ్రి ఒక ఆస్తి విషయంలో తనని మోసం చేశాడని, ఆ ఆస్తి ఇప్పుడు దేవరాజునాయుడు(ఉపేంద్ర) అనే ఫ్యాక్షనిస్ట్‌ చేతుల్లో వుందని, దానికి సంబంధించిన పేపర్స్‌ తనకి అప్పగిస్తేనే తన కూతుర్ని ఇస్తానని సాంబశివరావు చెప్తాడు. ఆ ఆస్తికి సంబంధించిన పేపర్స్‌ని తీసుకొచ్చి సుబ్బలక్ష్మీని పెళ్ళి చేసుకుంటానని సాంబశివరావుతో ఛాలెంజ్‌ చేసి బయలుదేరతాడు ఆనంద్‌. సాంబశివరావు ఆస్తికి సంబంధించిన పేపర్స్‌ తేవడంలో ఆనంద్‌కి ఎదురైన సమస్యలేమిటి? నరరూప రాక్షసుడైన దేవరాజునాయుడిని ఆనంద్‌ ఎలా ఎదుర్కొన్నాడు? మానవ విలువలకు ప్రాధాన్యమిచ్చే సత్యమూర్తి.. సాంబశివరావుకు చేసిన మోసం ఏమిటి? చివరికి సుబ్బలక్షి.. ఆనంద్‌కి దక్కిందా? అనేది మిగతా కథ. 

ప్లస్‌ పాయింట్స్‌: నైతిక విలువలు, మానవ విలువలు రోజు రోజుకీ దిగజారుతున్న ఈరోజుల్లో వాటిని చాటి చెప్పేందుకు ఇలాంటి కథను ఎంచుకున్నందుకు త్రివిక్రమ్‌ని అభినందించాలి. ఇప్పటివరకు డాన్సులకు, ఫైట్స్‌కి, మాస్‌ కామెడీకి ఎక్కువ ప్రిఫరెన్స్‌ ఇచ్చిన అల్లు అర్జున్‌ ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునేందుకు సెటిల్డ్‌గా పెర్‌ఫార్మ్‌ చేసే ప్రయత్నం చేశాడు. అతను చేసిన ఇంతకుముందు సినిమాలకు, ఈ సినిమాకి లుక్స్‌ పరంగా బాడీ లాంగ్వేజ్‌ పరంగా, డైలాగ్స్‌ పరంగా చాలా డిఫరెన్స్‌ వుంది. కొన్ని ఎమోషనల్స్‌ సీన్స్‌, సెంటిమెంట్‌ సీన్స్‌లో తన పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. సుబ్బలక్ష్మీగా సమంత క్యారెక్టర్‌కి పెర్‌ఫార్మెన్స్‌ పరంగా ఎలాంటి ప్రత్యేకత లేకపోయినప్పటికీ ఉన్నంతలో తన అభినయంతో గ్లామర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. సెకండాఫ్‌లో ఎంటర్‌ అయ్యే నిత్యమీనన్‌ తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేసింది. దేవిశ్రీప్రసాద్‌ చేసిన పాటల్లో ఒకటి, రెండు పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకున్నాయి. ఆడియో పరంగా పాటలు ఎలా వున్నప్పటికీ విజువల్‌గా బాగున్నాయి. ప్రసాద్‌ మూరెళ్ళ ఫోటోగ్రఫీ సినిమాకి హైలైట్‌ అని చెప్పాలి. ప్రతి సీన్‌ని, ప్రతి ఫ్రేమ్‌ని ఎంతో రిచ్‌గా చూపించాడు. ఆర్టిస్టుల్ని కూడా అందంగా చూపించడంలో సక్సెస్‌ అయ్యాడు. త్రివిక్రమ్‌ డైలాగ్స్‌ గురించి చెప్పాలంటే సెంటిమెంట్‌ డైలాగ్స్‌, క్లాస్‌ పీకే డైలాగ్స్‌ గురించి పక్కన పెడితే కొన్ని కామెడీ డైలాగ్స్‌ బాగా పేలాయి. ఆలీ, బ్రహ్మానందం, ఎం.ఎస్‌.నారాయణతో చెప్పించిన డైలాగ్స్‌, వారితో చేసిన కొన్ని సీన్స్‌ ఆడియన్స్‌ని బాగా నవ్వించాయి. 

మైనస్‌ పాయింట్స్‌: ఈ సినిమాకి ట్యాగ్‌లైన్‌ విలువలే ఆస్తి. దాన్ని సినిమా స్టార్ట్‌ అయిన దగ్గర్నుంచి ఎండ్‌ అయ్యేవరకు ఆడియన్స్‌పై రుద్దాలనుకున్నాడు డైరెక్టర్‌. సందర్భాన్ని బట్టి ఎక్కడో ఒకచోట విలువల గురించి కొన్ని విలువైన డైలాగ్స్‌ చెప్పిస్తే కథకి, సినిమాకి విలువ వుండేది. కానీ, సమయం దొరికనపుడల్లా వాయించేయడం వల్ల ఆ డైలాగ్స్‌ వినలేక ఆడియన్స్‌ చెవులు వాయడం ఖాయం. హీరో క్యారెక్టర్‌ ఎంటర్‌ అయినప్పటి నుంచి తను మంచి వాడినని ప్రూవ్‌ చేసుకోవడానికి హీరో పడే కష్టాలు కూడా ఆడియన్స్‌కి రుచించవు. ఫ్యామిలీ విలువలు అంటూ హీరో చెప్పే డైలాగ్స్‌కి చాలాసార్లు థియేటర్‌లో ఆడియన్స్‌ నిట్టూర్పులు వినిపిస్తాయి. సన్నాఫ్‌ సత్యమూర్తిగా అల్లు అర్జున్‌ క్యారెక్టర్‌కి తప్ప సినిమాలోని ఏ క్యారెక్టర్‌కీ ప్రాధాన్యత వుండదు. అందరి క్యారెక్టర్లు రొటీన్‌గా వుంటాయి, వాళ్ళు చెప్పే డైలాగ్స్‌ రొటీన్‌గా వుంటాయి, వాళ్ళతో తీసిన సీన్స్‌ కూడా రొటీన్‌గానే వుంటాయి. ఫ్యామిలీ సెంటిమెంట్‌ అనే కథాంశం ఎంచుకున్నప్పటికీ అల్లు అర్జున్‌ ఇమేజ్‌ని దృష్టిలో వుంచుకొని కంపల్సరీ ఫైట్స్‌ వుండాలన్నట్టుగా అసందర్భంగా, లెంగ్త్‌ ఎక్కువగా వుండే ఫైట్స్‌ ఆడియన్స్‌ సహనాన్ని పరీక్షిస్తాయి. కన్నడ హీరో ఉపేంద్రతో దేవరాజు నాయుడు అనే క్యారెక్టర్‌ చేయించారు. ఫస్ట్‌ హాఫ్‌లో అతని గురించి రాజేంద్రప్రసాద్‌ ఇచ్చే ఇంట్రక్షన్‌ చూస్తే అందరికీ చెమటలు పట్టించే క్యారెక్టర్‌ అనిపిస్తుంది. దేవరాజు క్యారెక్టర్‌ ఎంటర్‌ అయిన తర్వాత మనకి ఆ ఫీలింగ్‌ ఏ కోశానా కలగదు. అతనికి చెమటలు పట్టడంవల్ల ఎప్పుడూ షర్ట్‌ లేకుండా కనిపిస్తుంటాడు. ఈ సినిమాలో లెక్కకు మించిన ఆర్టిస్టులు వుండడం, వారి క్యారెక్టర్స్‌కి అంత ప్రాధాన్యత లేకపోవడం కూడా సినిమాకి చాలా మైనస్‌ అయింది. దానికి తగ్గట్టు సినిమా లెంగ్త్‌ కూడా ఎక్కువ క్లైమాక్స్‌ ఎప్పుడొస్తుందా అని ఆడియన్స్‌ ఎదురుచూసేలా చేసింది. ఇవన్నీ పక్కన పెడితే సినిమాలో త్రివిక్రమ్‌ మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మిస్‌ అయింది. త్రివిక్రమ్‌ రైటర్‌గా వున్నప్పుడు చేసిన సినిమాలైనా, డైరెక్టర్‌ అయిన తర్వాత చేసిన సినిమాలైనా ఎంటర్‌టైన్‌మెంట్‌కి పెట్టింది పేరు. అతని సినిమాల్లోని డైలాగ్స్‌, కామెడీ సీన్స్‌ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి. ఏ కామెడీ సీన్‌ గురించి చెప్పినా అది ఏ సినిమాలోదో ఇట్టే చెప్పెయ్యగలరు. అలాంటిది ఈ సినిమాలో అలాంటి కామెడీ సీన్‌ ఒక్కటి కూడా లేకపోవడం పెద్ద మైనస్‌గా చెప్పుకోవాలి. కథ మీద, బరువైన డైలాగ్స్‌ మీద, సెంటిమెంట్‌ మీద పెట్టిన శ్రద్ద ఎంటర్‌టైన్‌మెంట్‌ మీద పెట్టలేదన్నది ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ లేకపోగా సినిమాని సాగదీయడం కోసం డైరెక్టర్‌ చేసిన ప్రయత్నం వల్ల చాలా చోట్ల ఆడియన్స్‌ బోర్‌ ఫీల్‌ అవుతారు. 

విశ్లేషణ: అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ‘జులాయి’ చిత్రంలా అందర్నీ ఆకట్టుకోదని చెప్పాలి. స్లో నేరేషన్‌తో మొదలయ్యే సినిమా ఎక్కడా స్పీడ్‌ అందుకోకుండా ఫస్ట్‌ హాఫ్‌ వరకూ అక్కడక్కడా కాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగి ఒక బలహీనమైన ఇంటర్వెల్‌ బ్యాంగ్‌తో ఫస్ట్‌ హాఫ్‌ ముగుస్తుంది. సెకండాఫ్‌లో సినిమా గ్రాఫ్‌ పైకి వెళ్తుందిలే అనుకుంటున్న టైమ్‌లో కథ ఎక్కడికీ కదలకుండా అక్కడక్కడే తిరుగుతుంది. సినిమా నిడివి కోసం కొన్ని అనవసరమైన సీన్లు, అవసరంలేని ఫైట్స్‌ ఆడియన్స్‌కి చిరాకు పుట్టిస్తాయి. మానవ విలువలు మనిషికి అవసరం అని సీరియస్‌గా చెప్పదలుచుకున్న డైరెక్టర్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌పై దృష్టి పెట్టే అవసరం రాలేదు. ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే ఈ సినిమాని మొదటి నుంచి క్లైమాక్స్‌ వరకు అల్లు అర్జున్‌ నడిపిస్తాడు. సమంత, అదా శర్మ, నిత్యమీనన్‌ల గ్లామర్‌ సినిమాకి ఎంత మాత్రం ఉపయోగపడలేదు. రాజేంద్రప్రసాద్‌, రావు రమేష్‌, ప్రకాష్‌రాజ్‌ పాత్రలు చాలా రొటీన్‌గా వుంటాయి. స్పెషల్‌ అప్పియరెన్స్‌లో కనిపించే ఉపేంద్ర క్యారెక్టర్‌కి ఏమాత్రం స్పెషాలిటీ లేదు. ఓవరాల్‌గా చెప్పాలంటే త్రివిక్రమ్‌ సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంట్‌ వుంటుంది.. హ్యాపీగా చూడొచ్చు అని థియేటర్‌కి వెళ్ళే ఆడియన్‌ డిజప్పాయింట్‌ అవ్వక తప్పదు. మానవ విలువలు అనేవి ప్రతి మనిషికి ఎంత అవసరమో, నిత్యం టెన్షన్స్‌తో జీవనం సాగించే వారికి రిలీఫ్‌ కూడా అంతే అవసరం. ఆ రిలీఫ్‌ని కోరుకొని థియేటర్‌కి వచ్చే ఆడియన్స్‌కి మనం ఏం చెప్పదలుచుకున్నా వారికి నచ్చే ఎంటర్‌టైన్‌మెంట్‌తోనే చెప్పాల్సిన అవసరం వుంది. అలా కాదని రెండున్నర గంటలు థియేటర్‌లో కూర్చోబెట్టి మన భావాలు వారిపై రుద్దాలని చూస్తే అది వారికి రుచించదు. ఓవరాల్‌గా చెప్పాలంటే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్స్‌పెక్ట్‌ చెయ్యకుండా అందరికీ తెలిసిన కొన్ని మంచి విషయాలు మళ్ళీ త్రివిక్రమ్‌ డైలాగ్స్‌ ద్వారా వినాలనుకునేవారు, చూడాలనుకునేవారు ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాన్ని చూడొచ్చు. 

ఫినిషింగ్‌ టచ్‌: త్రివిక్రమ్‌ మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లేని సీరియస్‌ మూవీ

సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ