Advertisementt

సినీజోష్‌ రివ్యూ: అనేకుడు

Fri 06th Mar 2015 04:10 AM
anekudu,dhanush,amaira dastur,k.v.anand,ags entertainment,harris jayaraj,anekudu review  సినీజోష్‌ రివ్యూ: అనేకుడు
సినీజోష్‌ రివ్యూ: అనేకుడు
Advertisement

ఎ.జి.ఎస్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌ 

అనేకుడు

నటీనటులు: ధనుష్‌, అమైరా దస్తూర్‌, ఐశ్వర్య దేవన్‌, కార్తీక్‌, 

ఆశిష్‌ విద్యార్థి, జగన్‌ తదితరులు

సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్‌

సంగీతం: హేరిస్‌ జయరాజ్‌

మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి

ఎడిటింగ్‌: ఆంటోని

నిర్మాతలు: కల్పాతి ఎస్‌.అఘోరమ్‌, కల్పాతి ఎస్‌.గణేష్‌,

కల్పాతి ఎస్‌.సురేష్‌

రచన, దర్శకత్వం: కె.వి.ఆనంద్‌

విడుదల తేదీ: 05.03.2015

తమిళ్‌లో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్లో హీరోగా నటించి అక్కడ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వున్న హీరో ధనుష్‌. అక్కడ పేరు తెచ్చుకోవడమే బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ హీరోగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. 2002 నుంచి తమిళ్‌లో సినిమాలు చేస్తున్నప్పటికీ ఇటీవల తెలుగులో విడుదలైన ‘రఘువరన్‌ బి.టెక్‌’ సూపర్‌హిట్‌ కావడంతో తెలుగులోనూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరుగుతోంది. ‘వీడొక్కడే’, ‘రంగం’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో తెలుగులో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు కె.వి.ఆనంద్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో తమిళ్‌లో రూపొందిన ‘అనేగన్‌’ ఇటీవల విడుదలై సూపర్‌హిట్‌ అయింది. తమిళ్‌లో ఈ చిత్రాన్ని నిర్మించిన ఎ.జి.ఎస్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌ తెలుగులో ‘అనేకుడు’ పేరుతో విడుదల చేసింది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ధనుష్‌కి తెలుగులో మరో సూపర్‌హిట్‌ని అందించిందా? ‘వీడొక్కడే’, ‘రంగం’ చిత్రాల తర్వాత కె.వి.ఆనంద్‌ చేసిన ‘అనేకుడు’ ఎంతవరకు ఆడియన్స్‌కి రీచ్‌ అయిందో తెలుసుకోవడానికి సమీక్షలోకి వెళ్దాం. 

కథ: మూడు ముక్కల్లో ఈ కథ చెప్పాలంటే మూడు జన్మల నుంచి ప్రేమించుకుంటున్నా విఫలమవుతున్న తమ ప్రేమను నాలుగో జన్మలో సఫలం చేసుకున్న ఒక ప్రేమ జంట కథ ఇది. ఓపెన్‌ చేస్తే 1962 సంవత్సరంలో బర్మాలో కథ మొదలవుతుంది. బుల్లెబ్బాయ్‌(ధనుష్‌) కూలీ చేసుకొని జీవనం సాగించే వ్యక్తి. ఓరోజు తను పనిచేస్తున్న చోటుకి కొద్ది దూరంలో చిన్న ఎగ్జిబిషన్‌ జరుగుతుంటుంది. అక్కడ తిరుగుతున్న జైంట్‌ వీల్‌ అనుకోకుండా ప్రమాదంలో పడుతుంది. అందులో వున్న సముద్ర(అమైరా దస్తూర్‌)ను ఆ ప్రమాదం నుంచి కాపాడతాడు బుల్లెబ్బాయ్‌. ఆ క్షణం నుంచి అతన్ని అమితంగా ఆరాధిస్తుంటుంది సముద్ర. అలా ఒకరినొకరు ఇష్టపడతారు. ఆ టైమ్‌లోనే బర్మాలో సైనిక తిరుగుబాటు జరుగుతుంది.  దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటుంది సైన్యం. బర్మాలో వున్న భారతీయులంతా భారతదేశానికి వెళ్ళిపోవాలని దేశాధ్యక్షుడు ఆదేశిస్తాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో సముద్రని వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధపడతాడు బుల్లెబ్బాయ్‌. బర్మా దేశస్తురాలైన సముద్ర తెలుగమ్మాయిలా వేషం మార్చుకొని బుల్లెబ్బాయ్‌తో కలిసి ఇండియా బయల్దేరడానికి షిప్‌ ఎక్కుతుంది. పోలీస్‌ ఆఫీసరైన సముద్ర తండ్రి(ముఖేష్‌ తివారి) పోలీసులతో షిప్‌ అంతా వెతికిస్తాడు. అప్పుడు బుల్లెబ్బాయ్‌, సముద్ర పారిపోయే ప్రయత్నంలో సముద్రంలోకి దూకేస్తారు. ఆ టైమ్‌లో సముద్ర తండ్రి బుల్లెబ్బాయ్‌ని షూట్‌ చేస్తాడు. సముద్రంలో దూకిన బుల్లెబ్బాయ్‌ ప్రాణాలు విడుస్తాడు. అతనితోపాటే సముద్ర కూడా ప్రాణ త్యాగం చేస్తుంది. కట్‌ చేస్తే ప్రజెంట్‌లోకి వస్తాం. మధుమిత అనే అమ్మాయితో హిప్నోథెరపీ ద్వారా ఈ కథ చెప్పిస్తుంటుంది ఓ సైకియాట్రిస్ట్‌. బర్మా ఫ్లాష్‌ బ్యాక్‌లో వున్న సముద్ర, ప్రజెంట్‌లో వున్న మధుమిత ఒక్కరే. ఒక గేమింగ్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌ చేసే కంపెనీలో జాబ్‌ చేసే మధుమిత(అమైరా దస్తూర్‌)కి అశ్విన్‌(ధనుష్‌) తారసపడతాడు. మధుమిత అతన్ని గుర్తు పడుతుంది. అతను ఆమెను గుర్తుపట్టడు. మధుమిత మాత్రం అశ్విన్‌ని తన లవర్‌గానే ట్రీట్‌ చేస్తుంది. మధుమితకు గత మూడు జన్మల తాలూకు విషయాలన్నీ గుర్తుంటాయి. అవి అశ్విన్‌కి చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ, అతను అవన్నీ ట్రాష్‌ అని కొట్టిపారేస్తాడు. మూడు జన్మలుగా సక్సెస్‌ అవ్వని వారిద్దరి ప్రేమకు ఏ జన్మలో ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయి? మూడు జన్మల్లో వారి ప్రేమ విఫలం కావడానికి కారకులెవరు? గత జన్మలో జరిగిన విషయాలు మధుమితకు గుర్తు రావడం నిజమేనా? లేక అది ఆమె ఊహా? జన్మ జన్మలుగా తను ప్రేమిస్తున్న తన ప్రియురాలిని అశ్విన్‌ గుర్తు పట్టాడా? మరి నాలుగో జన్మలో ఆ ప్రేమ జంట ప్రేమ ఫలించిందా? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఖచ్ఛితంగా సినిమా చూడాల్సిందే. 

ప్లస్‌ పాయింట్స్‌: వీడొక్కడే, రంగం వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను తన డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేతో సూపర్‌ సక్సెస్‌ చేసిన కె.వి.ఆనంద్‌ ఈ చిత్రంలో కూడా తన స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్‌ చేశాడు. సినిమాలో నాలుగు జన్మలు వున్నప్పటకీ మేజర్‌గా మనకు కనిపించేది మూడు జన్మలు. నాలుగో జన్మని మాత్రం ఒక సాంగ్‌లో చూపించేసి ఓకే అనిపించాడు. ఈ సినిమాకి ధనుష్‌, అమైరాల పెర్‌ఫార్మెన్స్‌, ఫోటోగ్రఫీ, మ్యూజిక్‌, కె.వి.ఆనంద్‌ డైరెక్షన్‌ మేజర్‌ ప్లస్‌ పాయింట్స్‌గా చెప్పాలి. మూడు జన్మల తాలూకు మూడు డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ బుల్లెబ్బాయ్‌, అశ్విన్‌, కాళి పాత్రల్లో ధనుష్‌ జీవించాడని చెప్పాలి. పూర్తి కాంట్రాస్ట్‌తో వుండే మూడు క్యారెక్టర్స్‌లో ధనుష్‌ చూపించిన వేరియేషన్‌ అతను ఒక పరిపూర్ణ నటుడు అని మరోసారి ప్రూవ్‌ చేసింది. ఇక హీరోయిన్‌ అమైరా సముద్ర, మధుమిత, కళ్యాణి పాత్రల్లో చాలా సహజంగా నటించింది. ఒకవిధంగా చెప్పాలంటే సినిమాలో హీరో కంటే హీరోయిన్‌ ఎపిసోడ్సే ఎక్కువగా వున్నట్టు అనిపిస్తుంది. బర్మా అమ్మాయిగా, తెలుగమ్మాయిగా, మోడ్రన్‌ గర్ల్‌గా అమైరా ఇచ్చిన పెర్‌ఫార్మెన్స్‌ చూస్తే ఫ్యూచర్‌లో గొప్ప నటిగా పేరు తెచ్చుకుంటుందని చెప్పొచ్చు. హేరిస్‌ జయరాజ్‌ మ్యూజిక్‌ విషయానికి వస్తే కె.వి.ఆనంద్‌, హేరిస్‌ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు మ్యూజికల్‌గా పెద్ద హిట్‌ అయ్యాయి. అలాగే ఈ సినిమాలో కూడా డిఫరెంట్‌ జనరేషన్స్‌కి సంబంధించిన పాటల్ని చాలా అద్భుతంగా చేశాడు. ఆర్టిస్టులు ఎలా వేరియేషన్‌ చూపించారో హేరిస్‌ కూడా తన మ్యూజిక్‌తో ఆ డిఫరెన్స్‌ని వినిపించాడు. ఓంప్రకాష్‌ ఫోటోగ్రఫీ ఈ సినిమాకి మరో ప్లస్‌ పాయింట్‌. ప్రతి ఎపిసోడ్‌ని ఎంతో అందంగా చూపించాడు. బర్మా ఎపిసోడ్‌, ప్రజెంట్‌గా నడిచే కథని, 1987 ఎపిసోడ్స్‌ని చాలా అద్భుతంగా చిత్రీకరించాడు. కె.వి.ఆనంద్‌ ఎంచుకున్న కథే చాలా రిస్క్‌తో కూడుకున్నది దానితో రెండున్నర గంటలపాటు ప్రేక్షకుడ్ని థియేటర్‌లో కూర్చోపెట్టడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యాడని చెప్పాలి. 

మైనస్‌ పాయింట్స్‌: సినిమా స్టార్టింగ్‌లో వచ్చే బర్మా ఎపిసోడ్‌ని ఎంతో గ్రిప్పింగ్‌గా చూపించిన దర్శకుడు ప్రజెంట్‌ ఎపిసోడ్‌లో మాత్రం అక్కడక్కడా బోర్‌ కొట్టించాడు. కొన్ని అనవసరమైన సీన్స్‌ ఆడియన్స్‌ని అసహనానికి గురి చేస్తాయి. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ ఫీల్డ్‌ ఎలా వుంది, అందులో పనిచేసేవారికి ఎలాంటి స్ట్రెస్‌ వుంటుంది, వారు లైఫ్‌ని ఎలా ఎంజాయ్‌ చేస్తారు వంటి విషయాలను చూపించే ప్రయత్నంలో కొంత ల్యాగ్‌ వచ్చింది. 1962లో బర్మాలో చనిపోయిన బుల్లెబ్బాయ్‌, సముద్ర ప్రజెంట్‌లో అశ్విన్‌, మధుమితగా జన్మిస్తారు. అంతవరకు ఓకే. అశ్విన్‌ని చూసిన మధుమిత అతన్ని బుల్లెబ్బాయ్‌గా గుర్తిస్తుంది కానీ, బర్మాలోని హీరో ఫ్రెండ్‌ క్యారెక్టర్‌ని, అతని భార్య క్యారెక్టర్‌ని, తన తండ్రి క్యారెక్టర్‌ని ఈ జన్మలో గుర్తించకపోవడం విచిత్రంగా అనిపిస్తుంది. 2 గంటల 40 నిముషాల సినిమాలో చెప్పుకోవాల్సింది మూడు జన్మల గురించే. యువరాజు, యువరాణి అంటూ ఒక పాటలో చూపించే ఎపిసోడ్‌ సినిమాలో లేకపోయినా కథకు ఎలాంటి ఇబ్బంది లేదు. అది పూర్తిగా తీసేస్తే సినిమా నిడివి కాస్త తగ్గేది. 

విశ్లేషణ: డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేతో, డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో కె.వి.ఆనంద్‌ తెరకెక్కించిన ఈ సినిమా ఓ మంచి ప్రయత్నం అనే చెప్పాలి. జన్మ జన్మల ప్రేమకథలు మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అయితే ఆ కథలు, ఆ కథనాలు వేరు, ఈ సినిమా వేరు. ఓ రకంగా చెప్పాలంటే మూడు డిఫరెంట్‌ కథలు చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది.  ఇంతటి భారీ చిత్రాన్ని ఎ.జి.ఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా నిర్మించింది. సినిమా స్టార్టింగ్‌లో వచ్చే బర్మా ఎపిసోడ్‌కే చాలా ఖర్చు పెట్టారు. ఆ మూడు కథల్ని లింక్‌ చేసిన విధానం అందరికీ నచ్చుతుంది. రెండున్నర గంటలకు పైగా వుండే సినిమాలో లాజికల్‌గా కొన్ని లూప్‌ హోల్స్‌ వున్నప్పటికీ, అక్కడక్కడా కాస్త బోర్‌ కొట్టించినప్పటికీ ఓవరాల్‌గా సినిమా బాగుందనిపించాడు దర్శకుడు. ధనుష్‌, అమైరా ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్‌, ఓంప్రకాష్‌ స్టన్నింగ్‌ విజువల్స్‌, హేరిస్‌ జయరాజ్‌ చేసిన మంచి పాటలు, అద్భుతమైన రీరికార్డింగ్‌, కె.వి.ఆనంద్‌ స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌ ఇవన్నీ సినిమా పూర్తయ్యే వరకూ ఆడియన్స్‌ని థియేటర్‌లో కూర్చోబెడతాయి. ధనుష్‌, కె.వి.ఆనంద్‌, ఎ.జి.ఎస్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌ కలిసి చేసిన ఈ గుడ్‌ ఎటెమ్ట్‌ని తమిళ ప్రేక్షకులు యాక్సెప్ట్‌ చేశారు, సినిమాకి ఘన విజయాన్ని అందించారు. మరి తెలుగు ఆడియన్స్‌కి ఈ సినిమా ఎలాంటి ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుందో, ‘అనేకుడు’కి ప్రేక్షకులు ఎలాంటి ఫలితాన్ని అందిస్తారో వేచి చూడాలి. 

ఫినిషింగ్‌ టచ్‌: స్క్రీన్‌ప్లేతో చేసిన మరో మ్యాజిక్‌

సినీజోష్ రేటింగ్ : 2.5/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement