ఆర్.సి.సి. ఎంటర్‌టైన్‌మెంట్స్
భమ్ బోలేనాథ్
నటీనటులు: నవదీప్, నవీన్‌చంద్ర, ప్రదీప్, పూజ, పోసాని,
కిరీటి, నవీన్ తదితరులు
కెమెరా: భరణి కె. ధరన్
సంగీతం: సాయికార్తీక్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
మాటలు: శరణ్ కొప్పిశెట్టి, కార్తీక్‌వర్మ దండు
నిర్మాత: శిరువూరి రాజేష్‌వర్మ
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కార్తీక్‌వర్మ దండు
విడుదల తేదీ: 27.2.2015
ఇటీవలికాలంలో క్రైమ్ కామెడీలు, హార్రర్ కామెడీలు తియ్యడానికి దర్శకనిర్మాతలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈమధ్య వచ్చిన స్వామిరారా, కార్తికేయ చిత్రాలు ఆడియన్స్‌ని విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ చిత్రాలకు లభించిన ఆదరణని దృష్టిలో పెట్టుకొని కార్తికేయ నిర్మాతల్లో ఒకరైన శిరువూరి రాజేష్‌వర్మ నవదీప్, నవీన్‌చంద్ర హీరోలుగా కార్తీక్‌వర్మ దండుని దర్శకుడుగా పరిచయం చేస్తూ ‘భమ్ బోలేనాథ్’ చిత్రాన్ని నిర్మించారు. ఈరోజు విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్‌కి ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించింది? అనేది తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే.
కథ: ఓపెన్ చేస్తే జోస్ అలుక్కాస్ నుంచి ఒక ఖరీదైన డైమండ్‌తో బైక్ దిగుతాడు కృష్ణ(నవీన్‌చంద్ర). ఆ డైమండ్‌ని నగల వ్యాపారి పోసానికి చూపించి 30 లక్షలు అడుగుతాడు. అతనికి 30 లక్షలు ఇచ్చేసి ఆ డైమండ్‌ని టేబుల్ పైనే వదిలేసి హడావిడిగా లోపలికి వెళ్ళిపోతాడు. ఇదే అదనుగా డబ్బుతోపాటు డైమండ్ కూడా తీసుకొని ఉడాయిస్తాడు కృష్ణ. కట్ చేస్తే మరో పక్క వివేక్(నవదీప్)కి కొన్ని ప్రాబ్లమ్స్ వుంటాయి. తన లవర్‌తో పెళ్ళి కావాలంటే ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలంటే రెండు లక్షలు కంపెనీకి కట్టాలి. వసూల్ రాజా అనే రౌడీ దగ్గర రెండు లక్షలు తీసుకుంటాడు వివేక్. అయితే అవి పోగొట్టుకుంటాడు. వాటిని సంపాదించడం కోసం స్నేహితుడితో కలిసి ఎటిఎం నుంచి డబ్బు దొంగిలించడానికి సిద్ధ పడతాడు. ఎటిఎం దగ్గరికి వెళ్ళే సరికి బిల్డింగ్ నుంచి ఒక బ్యాగ్ కిందపడుతుంది. అందులో లక్షల్లో డాలర్స్ వుంటాయి. ఆ బ్యాగ్‌ని తీసుకొని మాయమవుతాడు వివేక్. మరో పక్క ప్రదీప్, కిరీటి డ్రగ్ ఎడిక్ట్స్. ఎప్పుడూ గంజాయి మత్తులో తేలుతూ వుంటారు. ఓరోజు ఫ్రెండ్స్‌తో రేవ్ పార్టీలో ఎంజాయ్ చేసేందుకు భారీగా డ్రగ్స్ కారులో వేసుకొని తమ ఇద్దరు లవర్స్‌లో కలిసి బయల్దేరతారు. ఈ మూడు సంఘటనలతో సినిమా నడుస్తుంది. డైమండ్‌తోపాటు 30 లక్షలు తీసుకొని పారిపోయిన కృష్ణ, డాలర్స్ బ్యాగ్‌తో కనిపించకుండా పోయినా వివేక్, కారులో పార్టీకి వెళ్తున్న రెండు జంటలు.. ఈ మూడు బ్యాచ్‌లకు ఏమిటి సంబంధం? వివేక్‌కి దొరికిన బ్యాగ్ ఎక్కడిది? కారులో పార్టీకి బయల్దేరిన జంటలకు మధ్యలో ఏం జరిగింది? అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్: ఈ సినిమాకి వున్న ప్లస్‌లు చాలా తక్కువ. మొదటిగా చెప్పుకోవాల్సింది భరణి కె. ధరన్ ఫోటోగ్రఫీ. చాలా రిచ్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. అందులో సక్సెస్ అయ్యాడు కూడా. మ్యూజిక్ విషయానికి వస్తే సాయికార్తీక్ పాటలతో అంతగా ఆకట్టుకోలేకపోయినా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగానే చేశాడు. ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ఈ సినిమాలో నటించిన వారంతా తమ క్యారెక్టర్ పరిధిలో ఫర్వాలేదు అనిపించారు తప్ప ఎవరికీ ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఈ కథ అలాంటిది కాబట్టి.
మైనస్ పాయింట్స్: డైరెక్టర్ రాసుకున్న కథలో దమ్ము లేదు. కథనంలో కూడా ఎక్కడా గ్రిప్ అనేది లేదు. స్టార్టింగ్ నుంచి ఎండిరగ్ వరకు ఏ సీన్ కూడా ఇంట్రెస్టింగ్‌గా చూపించలేకపోయాడు డైరెక్టర్. ఇందులో ఎవరి క్యారెక్టర్‌కీ అంతగా ప్రాధాన్యత లేదు కాబట్టి ఎవర్నీ ప్రత్యేకంగా చెప్పలేం. సినిమాలో చాలా చోట్ల నవ్వించే ప్రయత్నం చేశారు కానీ, అక్కడక్కడ మాత్రమే ఆడియన్స్ నవ్వే ధైర్యం చేస్తారు. సినిమా మొదలు కాకముందు సిగరెట్ గురించి, మద్యం గురించి కాషన్స్ చెప్పడం, ఆయా సీన్స్ వచ్చినపుడు స్క్రీన్ మీద కాషన్ వేయడం మనం చూస్తున్నాం. అయితే ఈ సినిమాలో ఆ కాషన్ ఎక్కువ సార్లు దర్శనమిస్తుంది. ఇందులో కొన్ని క్యారెక్టర్లు ఎప్పుడూ గంజాయి మత్తులోనే తూగుతూ వుంటాయి. అలాగే క్లైమాక్స్‌లో గంజాయి పొగపెట్టి చేసిన అర్థం లేని కామెడీ ఎప్పటికీ ఆడియన్‌కి అర్థం కాదు. దర్శకుడు ఆడియన్‌ని ఎంటర్‌టైన్ చేద్దామనుకున్నాడా? క్రైమ్‌తో థ్రిల్ చేద్దామనుకున్నాడా? అనేది సస్పెన్స్‌గానే మిగిలిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో మైనస్‌లకు కొదవలేదు.
విశ్లేషణ: ఫస్ట్ హాఫ్‌లో క్యారెక్టర్ల పరిచయం, కథను ఎత్తుకునే విధానం కాస్త స్లో అనిపించినా ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసరికి ఫర్వాలేదు బాగానే లాక్కొచ్చాడు, ఇక సెకండాఫ్‌లో సినిమా గ్రాఫ్ మరింత పెరిగి పీక్స్‌కి వెళ్తుంది అని ఆడియన్స్ అనుకునే లోపే ఇక సినిమాలో ఏమీ వుండదని పది నిముషాల తర్వాత అర్థమవుతుంది. సెకండాఫ్ అంతా నైట్ ఎఫెక్ట్‌లో హైవే రోడ్లు, కార్లతో ఛేజింగ్‌లు, మధ్య మధ్య కారు వున్నా దాన్ని వదిలేసి రన్నింగ్‌లు చేసి కొన్ని బోర్ సీన్స్ తర్వాత సినిమా క్లైమాక్స్‌కి వస్తుంది. ఇక అక్కడి నుంచి సినిమా ఎండ్ టైటిల్స్ వరకు అర్థం లేని సీన్స్, నవ్వు రాని కామెడీతో ప్రేక్షకులకు విసుగు పుట్టించారు. ఫైనల్‌గా చెప్పాలంటే ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చెయ్యని, ఆడియన్స్‌కి థ్రిల్ కలిగించని సినిమా ఇది.
ఫినిషింగ్ టచ్: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.
సినీజోష్ రేటింగ్: 2.25/5