ఇ.వి.వి.సినిమా
బందిపోటు
నటీనటులు: అల్లరి నరేష్, ఈష, సంపూర్ణేష్‌బాబు, తనికెళ్ళ భరణి,
రావు రమేష్, పోసాని కృష్ణమురళి, చంద్రమోహన్, సప్తగిరి తదితరులు
కెమెరా: పి.జి.వింద
సంగీతం: కళ్యాణ్ కోడూరి
ఎడిటింగ్: ధర్మేద్ర కాకరాల
నిర్మాతలు: రాజేష్ ఈదర, నరేష్ ఈదర
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
విడుదల తేదీ: 20.2.2015
కామెడీ చిత్రాల హీరోగా రాజేంద్రప్రసాద్ ఎంత పేరు తెచ్చుకున్నారో అంతటి పేరుని ఈమధ్యకాలంలో అల్లరి నరేష్ కూడా తెచ్చుకున్నాడు. 50 చిత్రాలకు చేరువవుతున్న నరేష్ చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం కామెడీ సినిమాలే. ఆ సినిమాలు చేసీ చేసీ నరేష్‌కి బోర్ కొట్టిందేమో గానీ ఓ కొత్త జోనర్‌ని ఎంచుకొని ‘బందిపోటు’ అనే డిఫరెంట్ సినిమాకి శ్రీకారం చుట్టాడు. క్లాస్ సినిమా, ఎ క్లాస్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే సినిమాలు చేసే మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందింది. స్వర్గీయ ఇ.వి.వి.సత్యనారాయణ స్థాపించిన ఇ.వి.వి. సినిమా బేనర్‌ని ఈ చిత్రం ద్వారా పున: ప్రారంభించారు తనయులు రాజేష్, నరేష్. కామెడీ హీరో నరేష్, క్లాస్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి కలిసి చేసిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా నరేష్ మార్క్ కామెడీ అందించిందో, మోహనకృష్ణ మార్క్ ఫీల్‌ని కలిగించిందో తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే.
కథ: విశ్వనాథ్(అల్లరి నరేష్) ఒక దొంగ. దొంగ అంటే మామూలు దొంగ కాదు, క్లాస్ దొంగ. పైగా ఇంటెలిజెంట్ కూడా. ఎదుటివారి మైండ్ సెట్‌ని బట్టి, వారి బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి, వారికున్న ‘సౌండ్’ని బట్టి వారిని దోచుకుంటాడు. అవసరానికి మించి అక్రమంగా సంపాదించిన వారిని టార్గెట్ చేస్తూ దొంగతనాలు చేస్తుంటాడు. ఇదిలా వుంటే ఒకరోజు సడన్‌గా హీరోయిన్ జాహ్నవి(ఈష) విశ్వ ముందు ప్రత్యక్షమవుతుంది. అతను చేసిన దొంగతనాల లిస్ట్ చెబుతుంది. పైగా వాటికి సంబంధించిన వీడియో కూడా చూపిస్తుంది. అంతటితో ఆగకుండా మకరందరావు(తనికెళ్ళ భరణి), శేషగిరి(రావు రమేష్), భలేబాబు(పోసాని కృష్ణమురళి)ల ఫోటోలు చూపించి తన కోసం ఒక పనిచేయాలంటూ డీల్ కుదుర్చుకుంటుంది. ఆ ముగ్గురి దగ్గరా డబ్బు కొట్టెయ్యాలి, వాళ్ళు వార్తల్లోకి ఎక్కాలి, అవమానాల పాలు కావాలి. ఇదీ ఆమె డీల్. దానికి విశ్వ సరేనంటాడు. ఈ ఆపరేషన్‌కి తనకి ఎలాంటి ఫీజూ వద్దని, దానికి కూడా ఒక కారణం వుందని, అది తర్వాత చెప్తానంటాడు. మరి ఆ ముగ్గురినీ ఎలా మోసం చేశాడు? వారి దగ్గర ఎలా డబ్బు కొట్టేశాడు? వాళ్ళను వార్తల్లోకి ఎలా లాగాడు? ఫీజు కూడా తీసుకోకుండా విశ్వ అంత రిస్క్ ఎందుకు చేశాడు అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్: రొటీన్ కామెడీ చిత్రాలతో విసుగెత్తిన అల్లరి నరేష్ ఒక కొత్త కాన్సెప్ట్‌తో సినిమా చెయ్యాలని అనుకోవడం అభినందించాల్సిన విషయం. అది ఎంత వరకు సక్సెస్ అయ్యిందనేది తర్వాత చెప్పుకుందాం. ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ ఫోటోగ్రఫీ పి.జి.వింద ఫోటోగ్రఫీ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వుంది. ముఖ్యంగా ఫారిన్‌లో తీసిన రెండు పాటలు వేటికవే అన్నట్టుగా చాలా అందంగా వున్నాయి. ఇప్పటివరకు ఎవరూ చెయ్యని లొకేషన్స్‌లో పాటలు తీసినట్టుగా అనిపించింది. హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌ని చాలా రిచ్‌గా తీశారు. ఇందులో గ్రాఫిక్ వర్క్ కూడా బాగుంది. ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే విశ్వనాథ్ క్యారెక్టర్‌లో బాగానే సెట్ అయ్యాడు. ఈ సినిమాలో సంపూర్ణేష్‌బాబు కూడా నటించడం కొంత ప్లస్ అయింది. అప్పుడప్పుడు టి.వి.లో కనిపించే పాత్రలో సప్తగిరి కాసేపు నవ్వించే ప్రయ్నతం చేశాడు.
మైనస్ పాయింట్స్: కొత్త కాన్సెప్ట్‌తో సినిమా చెయ్యాలని నరేష్ అనుకోవడం తప్పు కాదు. కానీ, సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్, డైరెక్టర్ సినిమాకి పెద్ద మైనస్ అయ్యాయని చెప్పాలి. ఆడియన్స్‌కి ఏమాత్రం క్యూరియాసిటీ కలిగించని కథాంశం ఇది. పైగా నేరేషన్ చాలా స్లోగా వుండడమే కాకుండా స్టార్టింగ్ టు ఎండిరగ్ బోర్ కొట్టిస్తుంది. ‘బందిపోటు’ అనే టైటిల్‌కి తగ్గ సినిమా కాదు. నరేష్‌ది హీరోయిన్ పగ తీర్చుకోవడానికి ఉపయోగపడే క్యారెక్టర్ మాత్రమే. హీరోయిన్ పగ తీర్చుకోవడమనే కాన్సెప్ట్‌లో కూడా బలం లేదు. చాలా పేలవమైన ఫ్లాష్‌బ్యాక్ చెప్పి హీరోని ముగ్గురు ధనవంతులపైకి ఉసిగొల్పుతుంది. మోహనకృష్ణ నేరేషన్‌కి తగ్గట్టుగానే కళ్యాణ్ కోడూరి మ్యూజిక్ కూడా వుంది. సినిమాలో వున్న నాలుగు పాటలు ఆడియోపరంగా ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం ఫర్వాలేదు అనిపించాడు. ఈ సినిమాకి సంపూర్ణేష్‌బాబు కొంత ప్లస్ అయినప్పటికీ ఎలాంటి ప్రాధాన్యతలేని క్యారెక్టర్ అతనిది. హీరోయిన్ ఈష కూడా సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పాలి. ఆమెకు ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్ ఇచ్చారు. లుక్స్ వైజ్, పెర్‌ఫార్మెన్స్ వైజ్ ఆకట్టుకోలేకపోయింది. మూడు ముఖ్యమైన క్యారెక్టర్లు చేసిన తనికెళ్ళ భరణి, రావు రమేష్, పోసాని కృష్ణమురళిలను సరిగ్గా వాడుకోలేకపోయారు. మోహనకృష్ణ రాసిన మాటలు ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. చాలా రొటీన్ డైలాగ్స్. ఈ సినిమాకి అన్నింటికంటే పెద్ద మైనస్ కామెడీ లేకపోవడం. అల్లరి నరేష్ సినిమా అంటే కామెడీ ఎక్స్‌పెక్ట్ చేసి వచ్చే ఆడియన్స్‌ని హండ్రెడ్ పర్సెంట్ నిరాశపరిచే సినిమా ‘బందిపోటు’.
విశ్లేషణ: నరేష్ వాయిస్ ఓవర్‌తో స్లోగా స్టార్ట్ అయ్యే సినిమా అదే స్లోని మెయిన్ టెయిన్ చేస్తూ ఒక ట్విస్ట్‌తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. సినిమా అంతా సెకండాఫే అనుకునే ప్రేక్షకులకు మరోసారి నీరసం ఆవహిస్తుంది. సెకండాఫ్ అంతా ఎన్నికల ప్రచారాలు, పొలిటికల్ స్టంట్‌తో పదే పదే అవే సీన్స్ చూపిస్తూ క్లైమాక్స్ వరకూ వస్తుంది. క్లైమాక్స్ అయినా ఏమైనా గొప్పగా వుందా అంటే అదీ లేదు. కథలో బలం లేదు, కథనంలో కొత్తదనం లేదు, అన్నింటినీ మించి సినిమాలో కామెడీ లేదు. తను అనుకున్న కథని సరిగ్గా ప్రజెంట్ చెయ్యడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. ఈ సినిమాని క్యూరియాసిటీతో కాకుండా మహాఓపికతో చూడాల్సిన పరిస్థితి ఆడియన్‌కి కలుగుతుంది. ఈ తరహా కథకి ఎక్కువ బడ్జెట్‌తో సినిమా చెయ్యాల్సిన అవసరం లేదు. ఫారిన్‌లో సాంగ్స్ తియ్యాల్సిన అవసరం అంతకన్నా లేదు. కామెడీ మిస్ అవకుండా కొత్త జోనర్‌లో సినిమా చేసి ఆడియన్స్‌ని మెప్పించాలనుకున్న నరేష్ ప్రయత్నం బెడిసి కొట్టిందనే చెప్పాలి. కొంత గ్యాప్ తర్వాత ఇ.వి.వి. సినిమా బేనర్‌ను మళ్ళీ స్టార్ట్ చేసి ఆ బేనర్ ప్రతిష్ఠను మరింత పెంచే సినిమా తీస్తే బాగుండేది. అయినప్పటికీ ప్రొడక్షన్ వేల్యూస్ ఏమాత్రం తగ్గకుండా సినిమా అంతా రిచ్‌గానే చూపించే ప్రయత్నం చేశారు. మోహనకృష్ణ ఎ సెంటర్స్ డైరెక్టర్, క్లాస్, నరేష్ బి, సి సెంటర్స్ హీరో. ఈ ఇద్దరూ కలిసి చేసిన ఈ సినిమా ఏ సెంటర్ ఆడియన్స్‌కీ నచ్చకపోవచ్చు. ఇక ఫలితాల్ని ప్రేక్షకులు ప్రకటించాల్సిందే.
ఫినిషింగ్ టచ్: అల్లరి నరేష్ చెయ్యాల్సిన సినిమా కాదు
సినీజోష్ రేటింగ్: 2/5