ఉషాకిరణ్ ఫిలింస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్
బీరువా
నటీనటులు: సందీప్ కిషన్, సురభి, నరేష్, ముఖేష్ రుషి,
అజయ్, సప్తగిరి, షకలక శంకర్, అనీషా సింగ్ తదితరులు
కెమెరా: ఛోటా కె.నాయుడు
ఎడిటింగ్: గౌతంరాజు
సంగీతం: యస్.యస్.థమన్
మాటలు: వెలిగొండ శ్రీనివాస్
నిర్మాత: రామోజీరావు
కథ, దర్శకత్వం: కణ్మణి
విడుదల తేదీ: 23.1.2015
ఉషాకిరణ్ మూవీస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్.. ఈ రెండు సంస్థలూ ఎన్నో మంచి చిత్రాలు నిర్మించి ఉత్తమాభిరుచి గల చిత్ర నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్నాయి. ఈ రెండు సంస్థలు కలిసి నిర్మించిన విభిన్న చిత్రం ‘బీరువా’. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సక్సెస్ మరో సూపర్‌హిట్ కొడతానన్న కాన్ఫిడెన్స్‌తో హీరో సందీప్ కిషన్ చేసిన సినిమా ఇది. కణ్మణి దర్శకత్వంలో రామోజీరావు నిర్మించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు అగ్ర నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించిన ‘బీరువా’ ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుంది? సందీప్ కిషన్‌కి మరో సూపర్‌హిట్‌ని అందించిందా? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథ: ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకైన అజయ్‌కి దీపిక(అనీషా సింగ్) అంటే మోజు. ఆమెకి ఒక డూప్లెక్స్ హౌస్ గిఫ్ట్‌గా ఇవ్వడమే కాకుండా ఆ ఇంటిని రిచ్‌గా డెకరేట్ చేసుకోవడానికి తన క్రెడిట్ కార్డ్ కూడా ఇస్తాడు. దాంతో దీపిక ఆ కార్డుని భారీగా వాడుతుంది. అలా వాడగా వచ్చిన వస్తువుల్లో ఒక బీరువా కూడా వుంటుంది. అది తెరవగానే అందులో నుంచి హీరో సంజు(సందీప్ కిషన్) ఎంట్రీ ఇస్తాడు. షాక్ అయిన దీపిక తేరుకొని ఆ బీరువాలోకి ఎలా వచ్చావని అడుగుతుంది. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేస్తాడు సంజు. చిన్నప్పటి నుంచి తలిదండ్రులను తన చిలిపి చేష్టలతో విసిగిస్తూ పెరిగిన సంజు అతని తండ్రి సూర్యనారాయణ(నరేష్)తో కలిసి విజయవాడలో అన్ని రకాల సెటిల్‌మెంట్స్ చేసే ఆదికేశవులు(ముఖేష్ రుషి) ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఆదికేశవులు కూతురు స్వాతి(సురభి)ని చూసి మనసు పారేసుకుంటాడు సంజు. రిటర్న్ జర్నీలో సూర్యనారాయణకి తెలీకుండా స్వాతిని డిక్కీలో పడుకోబెట్టి తెచ్చేస్తాడు సంజు. ఇది తెలుసుకున్న ఆదికేశవులు సంజు కోసం వెతుకుతుంటాడు. మరో పక్క సంజుని చంపాలని అజయ్ ట్రై చేస్తుంటాడు. అసలు ఆదికేశవులు ఇంటికి సంజు, సూర్యనారాయణ ఎందుకు వెళ్ళారు? సంజుకి స్వాతి అంతకుముందే తెలుసా? దీపిక బాయ్‌ఫ్రెండ్ అయిన అజయ్ సంజుని ఎందుకు చంపాలనుకున్నాడు? సంజు, స్వాతిల ప్రేమ ఫలించిందా? ఆదికేశవులు వారిద్దరి ప్రేమను అంగీకరించాడా? ఈ విషయాలన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ప్లస్ పాయింట్స్: కథ, కథనం పాతదే అయినప్పటికీ ఏ సీన్‌కి ఆ సీన్ కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఈ సినిమా మెయిన్ ప్లస్ పాయింట్ కామెడీ సీన్స్. ఇంతకు ముందు మనం చూడని కామెడీ సీన్స్ ఈ సినిమాలో మనకి కనిపిస్తాయి. అయితే అక్కడక్కడా చదివిన కొన్ని జోక్స్‌ని కూడా మనం ఈ సినిమాలో విజువల్‌గా చూడొచ్చు. శ్రీకాకుళం స్లాంగ్‌లో షకలక శంకర్ కనిపించిన ప్రతి సీన్‌లోనూ నవ్వించాడు. నరేష్ చాలా కాలం తర్వాత ఫుల్‌లెంగ్త్ కామెడీ రోల్ చేశాడు. ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ ఛోటా కె.నాయుడు ఫోటోగ్రఫీ. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండిరగ్ వరకు రిచ్‌గా చూపించాడు. పెద్ద సినిమా రేంజ్‌లో లైటింగ్‌గానీ, కెమెరా వర్క్‌గానీ వున్నాయి. ముఖ్యంగా హీరో ఇంట్రక్షన్ సాంగ్ ‘బై బై..’ పాటని చాలా బాగా తెరకెక్కించాడు. ఆ పాటకు సాహి సురేష్ వేసిన సెట్స్ కూడా చాలా రిచ్‌గా, ఇప్పటివరకు మనం చూడని విధంగా వున్నాయి. హీరోయిన్ సురభి గ్లామర్ పరంగానూ, పెర్‌ఫార్మెన్స్ పరంగానూ ఆకట్టుకుంది. అనీషా సింగ్ గ్లామర్ కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది. తమ బేనర్స్ ప్రతిష్టను కాపాడుకునే విధంగానే రెండు నిర్మాణ సంస్థలు మేకింగ్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా సినిమా చాలా రిచ్‌గా నిర్మించారు.
మైనస్ పాయింట్స్: సినిమాకి కథే చాలా మైనస్ అని చెప్పాలి. దానికి తగ్గట్టుగానే కథనం కూడా వుండడంతో ఆడియన్స్‌కి ఏ దశలోనూ సినిమా మీద, జరుగుతున్న సీన్స్ మీద, రాబోయే సీన్స్ మీద క్యూరియాసిటీ అనేది కలగదు. ఇలాంటి కాన్సెప్ట్‌తో గతంలో చాలా సినిమాలు చూసేశామన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ ఏమాత్రం ప్లస్ అవ్వలేదు. పాటల్ని విజువల్‌గా గ్రాండ్‌గా చూపించే ప్రయత్నం చేశారు తప్ప ఆడియో పరంగా చాలా వీక్. ఇక రీ`రికార్డింగ్ కూడా చాలా రొటీన్‌గా అనిపిస్తుంది. ఈ సినిమాలో బీరువా కూడా ఒక ప్రధాన పాత్ర పోషించిందని చెప్పారు. కానీ, సినిమాకి టైటిల్ పెట్టదగిన ప్రాధాన్యత కథ పరంగా బీరువాకి లేదు. టైటిల్ పెట్టాం కాబట్టి దానికీ కాస్త ఇంపార్టెన్స్ ఇద్దామన్న ఆలోచన చేశారు తప్ప నిజానికి అంత చెప్పుకోదగ్గ ఐటెమ్ కాదు. ఎడిటింగ్ విషయానికి వస్తే కొన్ని సీన్స్ సినిమా మధ్యలో ఇరికించినట్టు వుంటాయి. సడన్‌గా ఒక సీన్ స్టార్ట్ అయి అంతే స్పీడ్‌గా ఎండ్ అయిపోతుంది. హీరో సందీప్ కిషన్ క్యారెక్టర్‌లో కూడా కొత్తదనం అనేది లేదు. దానికి తగ్గట్టుగానే అతని పెర్‌ఫార్మెన్స్ కూడా వుంది. ఎలాంటి కొత్తదనం లేని క్యారెక్టర్ సందీప్ కిషన్ చేశాడు. డైరెక్టర్ విషయానికి వస్తే ఎంటర్‌టైన్‌మెంట్ అనేది బాగానే వుండేలా చూసుకున్నప్పటికీ కథ, కథనం కొత్తగా లేకపోవడంవల్ల ఆడియన్స్‌కి ఫ్రెష్‌గా అనిపించదు. సీన్ వైజ్ చూసుకుంటే బాగానే వున్నట్టు కనిపించినా ఓవరాల్‌గా చూస్తే సినిమాలో ఏమీ లేదు అనిపిస్తుంది.
విశ్లేషణ: ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో, కొత్త డైలాగ్స్‌తో ఫర్వాలేదు అనిపించినా సెకండాఫ్‌కి వచ్చేసరికి స్టోరీ సాగతీత మొదలవుతుంది. దాంతో అనవసరమైన సీన్లు వచ్చి చేరాయి. రెండు గంటల ఏడు నిముషాల సినిమాలో కథ చెప్పిన భాగం తక్కువ, నిడివి కోసం పెంచిన భాగం ఎక్కువ అన్నట్టుగా వుంటుంది. కథ, కథనం పక్కన పెట్టేస్తే కామెడీని ఎంజాయ్ చెయ్యడానికి సినిమాకి వెళ్ళొచ్చు. మొదటి నుంచి చివరి వరకు కామెడీని ఎంజాయ్ చేసిన ఆడియన్‌కి థియేటర్ నుంచి బయటికి వచ్చాక సినిమాలో కొత్తదనం ఏమీ లేదు అని ఇట్టే చెప్పేయగలడు. చాలా సీన్స్ ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసేశాం అనే ఫీలింగ్ కలుగుతుంది. కొత్తగా వున్న కథని కామెడీని మిక్స్ చేసి చూపిస్తే తృప్తిగా చూసే ఆడియన్స్‌కి కామెడీ ఎంత కొత్తగా వున్నా, కంటెంట్ లేకపోతే పెదవి విరవక మానరు.
ఫినిషింగ్ టచ్: కథ, కథనం పాతగా... కామెడీ కొత్తగా
సినీజోష్ రేటింగ్ : 2/5