నిలుచుని నీళ్లు తాగుతావో
పరుగులు పెట్టి పాలు తాగుతావో
అది నీ ఇష్టం.. కానీ
కూర్చున్న కొమ్మని నరుక్కుంటేనే కష్టం.
అన్నీ బాగున్నప్పుడు, కొన్ని కలిసొచ్చినప్పుడు
మనదే సరైన వాదం అనుకుంటాం.
మనం చెప్పేదే వేదం అనుకుంటాం.
ఒక్కసారి అనుకున్నది జరక్కపోతే
ఇంకోసారి ఆశించిన ఫలితం దక్కకపోతే
అప్పుడు తగ్గుద్ది అహం - అప్పుడు దిగుద్ది మదం
అని మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
చరిత్రే చెబుతోంది.. నిదర్శనంగా
ఎందరో నిర్మాతలను, నిష్ణాతులను చూపిస్తోంది.
ఇప్పుడు ఇదంతా ఎందుకంటే..
ట్విట్టర్ లో పర్సనల్ హ్యాండిల్ తో సినిమా అప్ డేట్స్ ని ప్రమోట్ చేస్తూ ఉండే కొంతమంది మీడియా వ్యక్తులను హీరోలు, దర్శక, నిర్మాతలు పెంచి పోషించి తమ సినిమాలను ప్రమోషన్స్ చేయించుకుంటారు. కానీ మీడియా వ్యక్తులు తమకు వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం అస్సలు నచ్చదు. అదే టైమ్ లో మేము ఇంటర్వ్యూ ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానల్ నడుస్తుంది. మేము సినిమాలు తీస్తేనే మీ వెబ్ సైట్స్ నడుస్తున్నాయి అని చిందులు తొక్కే కొంతమంది ఉంటారు. వారికి తెలియాల్సింది ఏమిటంటే మీరు ఎత్తుకి ఎక్కడానికి ఏ నిచ్చెన వేసుకున్నా, ఎన్ని మెట్లు కట్టుకున్నా దానికి గోడ అనే సహకారం అవసరం. అదే అడ్డనుకోవడం, వద్దనుకోవడం అజ్ఞానం, అవివేకం అవుతుంది అంటున్నారు విశ్లేషకులు.
నిజంగా మీడియా వద్దు అనుకుంటే ఇంటర్వ్యూస్ ఇవ్వడమెందుకు? ప్రెస్ మీట్స్ పెట్టడం ఎందుకు? సోషల్ మీడియా లో కాస్త ఫాలోయింగ్ కలిగిన వ్యక్తులకి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి మరీ మీ సినిమాల అప్ డేట్స్ ముందుగా వారితో ట్వీట్లు వేయించుకుని ప్రమోట్ చేయించుకోవడం ఎందుకు? అఫీషియల్ గా అప్ డేట్స్ ఇచ్చే లోపే సదరు వ్యక్తులతో ట్వీట్లు పెట్టించుకుని జనాల్లో దానిపై ఇంట్రెస్ట్ కలిగేలా చెయ్యడమెందుకు? ఆ తర్వాత వాళ్ళను అనడమెందుకు అనేది ఇప్పుడు నెటిజెన్స్ మాట్లాడుకుంటున్న మాటలు.
ఇటీవలే ఓ యువ నిర్మాత ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రెస్ మీడియా పైనే ఫైర్ అయిన విధానంపై ఓ నెటిజన్ స్పందన ఎలా ఉందో చూద్దాం.
బాగా పాపులర్ అయిన ఒక మీమ్ ని అనుకరిస్తూ అపుడెపుడో వచ్చిన లవకుశ దగ్గర్నుంచి మొన్న వచ్చిన పుష్పా వరకు నువ్వే తీసినట్టు, తెలుగు సినిమా ఇండస్ట్రీని, తెలుగు సినిమా మీడియాని నువ్వొక్కడివే పెంచి పోషించేస్తున్నట్టు ఆ బిల్డ్ అప్ ఏంటి రా చింటూ అంటూ సెటైర్ వేసాడు సదరు నెటిజన్.
పాపం.. ఈ నెటిజన్లకు, సోషల్ మీడియాలో వార్స్ చేసుకునే ఫాన్స్ కి తెలియంది ఏమిటంటే, ఏ మీడియా పై వీరు ఫైర్ అవుతారో అదే మీడియా వ్యక్తులని ఫ్లైట్స్ లో తిప్పుతారు. విందులు ఏర్పాటు చేస్తారు. విలువైన గిఫ్ట్ లు ఇస్తారు. ఆన్ ది స్టేజ్ ఒకలా మాట్లాడుతారు. ఆ తర్వాత మరోలా మాట కలుపుతారు. మన యువ నిర్మాతలు నోటి తీట తగ్గించుకుని ఇదే తెలివి కథల ఎంపికలో, సినిమాల ప్లానింగ్ లో చూపిస్తే బాగుంటుంది కదా అన్నారు ఒక సుప్రసిద్ధ సినీ పరిశ్రమ వ్యక్తి.
కంక్లూజన్ ఏంటంటే.. ఎవరైనా, ఏదైనా, ఎవరినైనా ఉద్దేశించి అనాలంటే అదే నేరుగా మాట్లాడాలి. మొత్తం అందరినీ అనకూడదు. మన వద్ద ప్యాకెజీ తీసుకుని కూడా మనకి నెగిటివ్ చేస్తున్నాడే అనే భావం, బాధ మీకుంటే సదరు వ్యక్తికి ధైర్యంగా వాళ్లనే ప్రశ్నించే దమ్ముండాలి. జర్నలిజం విలువలను కాపాడుతూ, జెన్యూన్ గా ఉండే మన సినీజోష్ సైట్ వంటి పలు మీడియా సంస్థల్ని, మొత్తంగా మీడియాని నిందించడం సరి కాదు అనే అభిప్రాయాన్ని తెలియచెప్పడానికే ఈ ఆర్టికల్!!
-Parvathaneni Rambabu.