ఒకప్పుడు బాలీవుడ్ సినీజనాలు తామేదో కారణజన్ముల్లా ఫీల్ అయిపోతూ ప్రాంతీయ భాషా చిత్రాలని కానీ నటీనటుల్ని కానీ పట్టించుకునేవారు కాదు. అందులోనూ మన సౌత్ సినిమానైతే మరింత చులకనగా చూసేవారు. ఆ దశలో మనవాళ్ళు కూడా నార్త్ లో అవకాశాల పట్ల తహతహలాడేవాళ్లు.. తాపత్రయపడేవాళ్లు. కానీ కాలం మారింది. నేడు దక్షిణాది సినిమా దమ్ము చూపించి రొమ్ము విరుచుకుని నిలబడింది.
బాహుబలి భారీ ప్రభంజనంతో ఉలిక్కిపడ్డ బాలీవుడ్ ని ఆ వెంటనే వచ్చిన KGF మరింత ఉడికించింది. దాంతో వాళ్ళ కళ్ళు ఇటు వైపు తిరిగాయి.. అడుగులు మనవైపు పడ్డాయి. ఆపై బాహబలి 2 సృష్టించిన సునామీ దెబ్బకైతే మబ్బులు విడిపోయాయి. మన సినిమాల్లో అవకాశం అంటే హిందీ స్టార్స్ ఇంకేం ఆలోచించకుండా ఠపీమని తలూపే రోజులు వచ్చేసాయి. KGF 2 కోసం సంజయ్ దత్, రవీనా టాండన్ రంగంలోకి దిగితే RRR అవకాశాన్ని ఆలియాభట్, అజయ్ దేవగణ్ అందిపుచ్చుకున్నారు. మళ్ళీ ఆ రెండు సినిమాలూ కూడా అనూహ్యమైన రీతిలో, అంచనాలకు అందని స్థాయిలో అఖండ విజయాలు నమోదు చేయడంతో ఇక బాలీవుడ్ నటీనటులు మన సౌత్ సినిమా ఛాన్స్ అంటే చెంగు చెంగున అంగలేసుకుని, అందిన వెహికల్ పట్టుకుని వచ్చి వాలిపోతూ ఉండడం విశేషం.
ఇపుడు నిర్మాణంలో ఉన్న ప్రతి భారీ తెలుగు చిత్రంలోనూ ప్రతినాయకులు హిందీ హీరోలే కావడం ఎంతైనా గమనార్హం. నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరిలో అర్జున్ రామ్ పాల్ నటిస్తుంటే, దేవర ఎన్ఠీఆర్ ను ఢీ కొట్టేందుకు సైఫ్ ఆలీఖాన్ దిగారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్స్ హరి హర వీరమల్లులో బాబీ డియోల్, OG లో ఇమ్రాన్ హష్మీ అడుగిడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ సలార్ షూట్ ఫినిష్ చేసిన సంజయ్ దత్ ప్రస్తుతం పూరి - రామ్ ల డబుల్ ఇస్మార్ట్ షూట్ లో పాల్గొంటున్నారు. అలాగే ప్రభాస్ పాన్ వరల్డ్ ఫిలిం ప్రాజెక్ట్ K లో బిగ్ బి అమితాబ్ కీలక పాత్ర చేస్తున్నారు. వెంకటేష్ సైన్ధవ్ తో నవాజుద్దీన్ సిద్ధికి కూడా తన టాలెంట్ చూపించనున్నాడు.
అలాగే బాలీవుడ్ బ్యూటీస్ కూడా అందిన అవకాశం వదలట్లేదండోయ్. దీపికా పడుకునే, దిశా పటాని ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ K కోసం కదిలితే, జాన్వీ కపూర్ ఎన్ఠీఆర్ దేవరలో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. పవన్ వీరమల్లులో నోరా ఫతేహి, రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో కైరా అద్వానీ కనువిందు చేయనున్నారు. ఊర్వశి రథౌల ఐటమ్ పాటలతో ఊపుతోంది. వరుణ్ తేజ్ సినిమాతో నోరా ఫతేహి ఎంట్రీ ఇస్తోంది.