కమెడియన్ వేణు దర్శకుడంటే ఏదో కామెడీ సినిమా చేస్తాడులే అనుకున్న వాళ్ళందరూ అవాక్కయ్యేలా సగటు జనుల భావోద్వేగాలే తన బలగం అని వెండితెర సాక్షిగా చాటి చెప్పాడు వేణు.
అగ్ర నిర్మాత దిల్ రాజు స్వయంగా కదిలొచ్చి అండగా నిలిచేంతటి అద్భుత కథనం రాసుకుని, రాసింది రాసినట్టు తీసుకుని నేడు ప్రేక్షకుల చేత శెభాష్ అని చెప్పించుకుంటున్నాడు వేణు.
అలాగని వేణు తీసిన బలగం గొప్ప ఇతిహాసం కాదు.. అందులో ఎటువంటి అట్టహాసం లేదు.!
మన ప్రాంతపు మట్టి వాసన ఉంది. మన మనసు లోతుల్లోని గట్టి గాఢత ఉంది.
భుజాలు తడుముకునే అవకాశవాదం ఉంది. నీడలా వెంటాడే అపరాధభావం ఉంది.
కళ్లప్పగించి చూసేలా కథలో ముడిసరుకు ఉంది. కన్నీటి పొరను రప్పించే ముగింపు ఉంది.
అందుకే బలగం చిత్రానికి కాంప్లిమెంట్స్ అందుతున్నాయి.. కలెక్షన్లు పెరుగుతున్నాయి.
అయితే ఇటువంటి సమయంలో కొందరి కన్ను కుట్టడం సహజం.
అటువంటివాళ్ల వెన్ను తట్టడం మరికొందరి కుంచిత స్వభావం.!
ఇంతకీ విషయం ఏమిటంటే.. బలగం కథ తనదేనంటూ ఓ స్వబుద్ధుడు ఆరోపణలు ఆరంభించాడు. కొంతమంది అందుకు వత్తాసు పలికి వార్తలు వండి వార్చే పనిలో పడ్డాడు.
ఆ ఘటికులకు ఘాటుగా సమాధానం చెప్పేందుకు, ఆ తరహా వార్తలకు వాతలు పెట్టేందుకే ఈ వివరణ.
అసలు సదరు సాధకుల సమస్య ఏమంటే.... మరణానంతరం మన పెద్దలకు పిండ ప్రధానం చేసినప్పటికీ ఒకవేళ ఆ పెద్దల కోరికలు కనుక తీరకపోయుంటే కాకులు దానిని ముట్టవు అనే కథను ఆయన స్వయంగా రాసేసుకున్నారట. అదే కథతో ఇప్పుడు బలగం సినిమా తీసేసుకున్నారట.!
ఇప్పుడు దీన్ని మనం అమాయకత్వం అనుకుందామా, అవగాహనారాహిత్యం అనుకుందామా, అక్కసు వెళ్లగక్కడం అందామా..?? ఎప్పుడో శతాబ్దాల కాలం నుంచీ ఉన్న ఆచారాన్నీ, దశాబ్దాల కాలం నుంచీ ఎన్నెన్నో సినిమాల్లో చూస్తూ వస్తోన్న వ్యవహారాన్ని పట్టుకుని అది లిఖించింది నేనే.. సృష్టించింది నేనే అంటుంటే అతడెంతటి ఘనుడో అర్ధం చేసుకుని నవ్వుకోవచ్చు. బహుశా అతగాడు తెలంగాణ యాసలో రాసాను కనుక తనదే వాడేసుకున్నారనే భ్రమలో ఉంటే ముందుగా సదరు రచయిత ఒక పాఠకుడిగా మారి రామాయణ, మహాభారతాలకే ఎందరు ఎన్నెన్ని సంస్కరణలు చేసారో, రాసారో తెలుసుకోవాలి.
ముక్తాయింపు : తొమ్మిది దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో ఈ తరహా సన్నివేశం కొన్ని వందల సినిమాల్లో వచ్చింది. వాటిలో చాలావరకు ప్రస్తుతించే పరిజ్ఞానం మాకుంది కానీ అంతటి అవసరం లేకుండా అదంతా ఔపోసన పట్టే శ్రమ మీకూ రాకుండా ఇటీవలే ఓ భారీ చిత్రం వచ్చింది. సరిగ్గా సంక్రాంతికి విడుదలైన ఆ చిత్రంలోనూ పిండ ప్రధాన సన్నివేశం ఉంటుంది. అక్కడ కూడా కాకి వచ్చి వాలడం అన్నదే ముఖ్యాంశం. గమనించి ఉంటే ఆ సన్నివేశం కూడా మీదేనని ఘర్జించి ఉండేవారేమో.. ఆ పనిలో ఉండండి మరి..!