Advertisement
Google Ads BL

BP వద్దు.. AP కావాలి - PR పంచ్


ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేక.. సరైన కలెక్షన్లు తెప్పించలేక తెలుగు సినిమా కుంటుబడుతూ నిర్మాతలు కుదేలవుతోన్న ప్రస్తుత పరిస్థితిపై హుటాహుటీన చర్చలు మొదలయ్యాయి. టికెట్ రేట్ల దగ్గర్నుంచి రెమ్యునరేషన్ల వరకూ పలు అంశాలపై దృష్టి సారించిన నిర్మాతలు మున్ముందుగా తీసుకున్న నిర్ణయం మాత్రం ఓటీటీకి సంబంధించింది కావడం విశేషం. 6 కోట్ల రూపాయల లోపు బడ్జెట్ తో నిర్మితమైన వాటిని చిన్న చిత్రాలుగా పరిగణిస్తూ వాటిని విడుదల తేదీ నుంచి నాలుగు వారాల గడువు తరువాత, అలాగే 6 కోట్ల వ్యయం దాటినవి పెద్ద సినిమాలు కనుక వాటిని 10 వారాల తరువాత ఓటీటీకి ఇవ్వాలంటూ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
CJ Advs

భేష్.. శెభాష్.!

నిబంధన సబబుగానే వుంది కానీ - సవ్యంగా అమలవుతుందా.?

నిర్ణయం సముచితమే కానీ - దీంతోనే అంతా మారిపోతుందా.?

అసలు చెయ్యాల్సినదేంటి... చేస్తున్నదేంటి.. ఓసారి పరిశీలిద్దాం.

అది 1992

అప్పటివరకు దూరదర్శన్ లో వార్తలు, చిత్రలహరి పాటలు మాత్రమే చూస్తూ వస్తోన్న తెలుగువారి ఇళ్లల్లోకి కేబుల్ టీవీ ప్రవేశించింది. జనాన్ని ఆకర్షించడం కోసం కేబుల్ టీవీ ఆపరేటర్లే క్యాసెట్స్ తీసుకొచ్చి సినిమాలు వేసేసేవాళ్ళు. దాంతో సినిమా నిర్మాతలు కంగారుపడిపోయారు. అసలు సినిమాల వీడియో రైట్స్ అమ్మాలా వద్దా అనే డైలమాలోకి వెళ్లిపోయారు. అయితే అదే 1992 లో అగ్ర హీరోల చిత్రాలైన ఘరానామొగుడు, రౌడీ ఇనస్పెక్టర్, చంటి, ప్రెసిడెంట్ గారి పెళ్ళాంతో పాటు అల్లరి మొగుడు, ఆ ఒక్కటీ అడక్కు, చిత్రం భళారే విచిత్రం, సీతారత్నం గారి అబ్బాయి వంటి పలు సూపర్ హిట్ చిత్రాలు కలెక్షన్ల వర్షం కురిపించడం గమనార్హం.

అది 1995

శాటిలైట్ చానెల్స్ ఈ టీవీ, జెమిని టీవీ మొదలయ్యాయి. మళ్ళీ నిర్మాతల్లో గుబులు రేగింది. ఇళ్లల్లోనే ఎంటర్ టైన్ అవుతోన్న సగటు జనాలు థియేటర్లకు రావడం తగ్గించేస్తారేమో అనే అలజడి కనపడింది. కానీ సినిమాని విపరీతంగా ఆరాధించే మన తెలుగు ప్రేక్షకులు అప్పుడు కూడా అండగానే నిలబడ్డారు. అదే 1995 లో పెదరాయుడు, పెళ్లి సందడి వంటి గోల్డెన్ జూబిలీ హిట్సే కాకుండా అమ్మోరు, అమ్మదొంగా, ఆయనకిద్దరు, ఒరేయ్ రిక్షా వంటి పలు చిత్రాలను సూపర్ హిట్స్ గా నిలబెట్టారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే... ఏ శాటిలైట్ ఛానెల్స్ ని చూసి బెంబేలెత్తారో వాటికే తమ సినిమాలను అమ్మి సొమ్ము చేసుకోవడానికి పోటీ పడ్డారు ప్రొడ్యూసర్లు. అఫ్ కోర్స్... అప్పట్నుంచీ ఇప్పటివరకు కూడా శాటిలైట్ రైట్స్ అనేవి నిర్మాతలకు అదనపు ఆసరాగా వుంటూ వస్తున్నాయనేది వాస్తవం.

ఆపై సీరియల్స్ పై సీరియస్..!

ఈ దఫా టీవీ సీరియల్స్ పట్ల సీరియస్ నెస్ క్రియేట్ అయింది. ఆడవాళ్ళంతా టీవీల్లో వస్తోన్న ధారావాహికలకు అతుక్కుపోతుంటే సినిమాలేమైపోతాయ్ అంటూ తలలు పట్టుకున్నారు. లేడీస్ రాకపోతే, ఫ్యామిలీ ఆడియన్స్ లేకపోతే థియేటర్లు ఏమైపోవాలి అంటూ బుర్రలు బద్దలు కొట్టుకున్నారు. కానీ ఆ భయం మాయం కావడానికి ఎక్కువ కాలం పట్టలేదు. బొమ్మరిల్లు నుంచీ బాహుబలి వరకు, అత్తారింటికి దారేది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు నుంచీ శతమానంభవతి, మహానటి వరకు చిన్న పెద్ద తేడా లేకుండా తమకు నచ్చే సినిమా ఏదైనా, ఎప్పుడొచ్చినా థియేటర్లకు రావడానికి సిద్ధమేనంటూ మహిళా ప్రేక్షకులు నిలువెత్తు విజయాల సాక్షిగా నిరూపిస్తూ వస్తున్నారు.

సమాధానమే లేని సమస్య.. పైరసీ.!

గత దశాబ్ద కాలంగా గగ్గోలు పెట్టడమే తప్ప పగ్గాలు వెయ్యలేకపోయిన ప్రధాన అంశం.. పైరసీ భూతం. యాంటీ పైరసీ సెల్ ఎన్నిరకాలుగా ప్రయత్నించినా.. చట్టాలు, శిక్షలంటూ ఎంత హడావిడి చేసినా ఫలితం శూన్యం. పైరసీదారులు నేటికీ మొదటి రోజునే ఆన్ లైన్ లో పైరసీ ప్రింట్ పెట్టేస్తుంటే దానికి కళ్లెం వెయ్యలేక కళ్లప్పగించి చూడాల్సినంతటి దైన్యం. ఇక్కడ కూడా కంటి తుడుపు ఏమిటంటే.. ఇప్పటికీ సరైన సినిమా వచ్చినపుడు పైరసీని పక్కనెట్టి థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ వైపే మొగ్గు చూపుతున్నారు ప్రేక్షకులు.

పరిశీలించుకోవాల్సిన స్థితి.. ప్రస్తుత పరిస్థితి.!

ఓటీటీ వలనే సమస్య వస్తోందా లేక సమస్యకు ఓటీటీ సాకుగా మారిందా అనే అంశాన్ని విశ్లేషించుకోవాల్సిన తరుణమిది. విడుదలైన స్వల్ప వ్యవధిలోనే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తూ ఉండడం వల్ల ఆడియన్స్ థియేటర్స్ కి రావడం లేదంటున్నారు. అసలీ ఓటీటీ అనేదే లేనపుడు, కరోనా అనేదే రానపుడు కూడా కొన్ని సినిమాలు రిలీజ్ అయిన నెలలోపే టీవీల్లో టెలికాస్ట్ అయ్యేవి కదా. వీలైనంత త్వరగా ప్రసారం చేసుకునే డిమాండ్ తో మా టీవీ, జీ తెలుగు చానల్స్ పోటీ పడి మరీ రైట్స్ కొనేవి కదా.

అది మర్చిపోయారా..?

పోనీ పాండమిక్ టైమ్ లో జనం ఓటీటీకి ఎక్కువ ఎడిక్ట్ అయిపోయారు అనుకుందామా అంటే.. కరోనా ఫస్ట్ వేవ్ పూర్తవగానే క్రాక్, ఉప్పెన, జాతిరత్నాలు, వకీల్ సాబ్ సినిమాలకి భారీ వసూళ్లే ఇచ్చారు. ఇక సెకండ్ వేవ్ నుంచి రిలీఫ్ రాగానే మళ్ళీ అఖండ, పుష్ప, బంగార్రాజు, డి.జె.టిల్లు, భీమ్లానాయక్, ఆర్ ఆర్ ఆర్, సర్కారువారి పాట, మేజర్, విక్రమ్ సినిమాలు జనం నుంచి బాగానే లాగాయి కదా.

అది వదిలేశారా..?

పైన గతాన్ని నెమరువేసుకుంది ఎందుకూ అంటే... కాలానుగుణంగా చాలా వస్తూ ఉంటాయి. కానీ అవేవీ థియేటర్ లో పొందే అనుభూతికి సాటి రావు. ఆటంకాలుగా అనిపిస్తాయి. బట్ అవేవీ సినిమాకి పోటీ కావు. ఆడియో రైట్స్ అయినా, వీడియో రైట్స్ అయినా, డబ్బింగ్ రైట్స్ అయినా, రీమేక్ రైట్స్ అయినా, శాటిలైట్ రైట్స్ అయినా, ఓటీటీ రైట్స్ అయినా అన్నీ నిర్మాతకి అదనపు ఆదాయ మార్గాలే. అసలు ఆదాయం సిసలైన సినిమా చూపించి ప్రేక్షకుడిని సంతృప్తి పరచడంలోనే ఉంటుంది. అదే జరిగితే విజయాలు అలవోకగా వస్తాయి అనడానికి గతమే నిదర్శనం. అదే భవిష్యత్ నిర్దేశనం.! 

పాటించాల్సిన పద్ధతి.. పంథా మార్చుకోవడమే.!

నిజానికి ఇది ప్రేక్షకులు థియేటర్లకు రాని పరిస్థితి కాదు. రప్పించలేని దుస్థితి. ఓటీటీ పుణ్యమా అంటూ వివిధ భాషల విభిన్న చిత్రాలను వీక్షిస్తోన్న ప్రేక్షకులకు సగటు సాధారణ సినిమాల్లోని డొల్లతనం వెల్లడైపోయింది. అందుకే దర్శక ఖిలాడీల గారడీ సాగట్లేదు. పక్కా కమర్షియల్ సినిమాలు ఆడట్లేదు. విషయం లేని పాఠాలకు గుణపాఠాలు ఎదురవుతున్నాయి. వాటం చాలని వార్ లు థాంక్యూ చెప్పించుకుని తప్పుకుంటున్నాయి. ఇపుడు నిజంగా, నిశితంగా చేయాల్సిన పని ఆత్మ విమర్శ చేసుకోవడం.! పాటించాల్సిన పద్ధతి..  పంథా మార్చుకోవడం.! 

బీసీ (బిఫోర్ క్రైస్ట్) కథలనూ, బీపీ (బిఫోర్ పాండమిక్) కథలనూ కంచికి వదిలేసి మంచి కాన్సెప్ట్ లతో మనోళ్లు ముందడుగు వేస్తే.. ప్రేక్షకుల అడుగులు కూడా పరుగులుగా మారి మరీ థియేటర్ల వైపుకు దూసుకు వస్తాయి. ఎందుకంటే దమ్మున్న సినెమానెపుడూ దుమ్ము రేపే హడావిడితో థియేటర్లలో చూడడానికే ఇష్టపడతారు ప్రేక్షకులు. ముఖ్యంగా సినిమాని అమితంగా ప్రేమించే మన తెలుగు ప్రేక్షకులు.!

సో.. వీలైనంత త్వరగా మన ఫిలిం మేకర్స్ బీపీ (బిఫోర్ పాండమిక్) థింకింగ్ వదిలేసి ఏపీ (ఆఫ్టర్ పాండమిక్) మోడ్ నీ, మూడ్ నీ అర్ధం చేసుకుంటే అన్ని సమస్యలూ సాల్వ్ అయిపోతాయి. మన దగ్గర కూడా సూరారై పొట్రు (ఆకాశం నీ హద్దురా) వంటి జాతీయ ఉత్తమ చిత్రాలు వస్తాయి.!

అన్నట్టు మనం ఇపుడు ఏ ఓటీటీ వల్ల నష్టం అనుకుంటున్నామో అదే ఓటీటీలో ప్రదర్శితమై జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచి, సూర్యని జాతీయ ఉత్తమ నటుడిగా నిలిపింది సూరారై పొట్రు. సర్లెండి.. సత్తా ఉన్న సినిమాకి సరిహద్దులు ఉండవు. సమర్థులు, సాధకులు సాకులు వెతకరు..!!  

No need BP.. We Need AP - PR punch:

Cinejosh PR Punch Special Article
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs