Advertisement
Google Ads BL

ఎన్నికలలో.. ఎన్ని కళలో - PR పంచ్


బరితెగించిన కోడి బజార్లో గుడ్డెట్టినట్టు జగమెరిగిన జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ సాక్షిగా పరువుకు నిప్పెట్టారు. 

Advertisement
CJ Advs

పనికిమాలిన పంతాలకు పోయి ఐదు దశాబ్దాల ఘనమైన చరిత్రని గంగపాలు చేసేసేలా ఉన్నారు.  

అలాగని వాళ్ళందరూ ఏమైనా సామాన్యులా...

నైతికత వివరించే విజ్ఞులు - నిబద్దత బోధించే నిపుణులు.

ప్రపంచంలోని ప్రతి అంశాన్నీ చక్కగా విశ్లేషించే ప్రావీణ్యులు.

సమాజం ఎలా ఉండాలో చిక్కని సూక్తులు చెప్పే శాస్త్రజ్ఞులు.

మరి అటువంటి పాత్రికేయులు.. అంతటి ఉద్దండులు 

కలాన్ని పక్కనపెట్టి కయ్యాలకి దిగడం ఏంటి.?

అక్షరాలని వదిలేసి కక్షలకు పోవడం ఏంటి.??

బహుశా ఎలక్షన్ల ప్రభావం ఏ లక్షణాన్నైనా ఏమార్చేస్తుందేమో.!

ఎన్నికలనగానే వివరం విడిచి - విజ్ఞత మరిచి విచక్షణ కోల్పోతారేమో.!

నిత్యం ఎన్నో సిద్ధాంతాలు వల్లించే విలేఖరులు 

నిజానికి చెప్పే సుద్దులకీ - పాటించే పద్ధతులకీ 

పొంతనే ఉండదని నిరూపించిన ఆ రాద్ధాంతం ఏమిటంటే....

ఇటీవలే హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎలక్షన్స్ జరిగాయి.

నిజానికి ఇందులో విశేషమేమీ లేదు. ప్రతి రెండేళ్ళకీ ఓసారి జరిగే తంతే ఇది.

అయితే ఈసారి మాత్రం రాజకీయ ఎన్నికలను తలపించే స్థాయిలో

ఆమధ్య జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలను మరిపించే రీతిలో

వివాదాలు చెలరేగుతున్నాయి - విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కౌంటింగ్ పారదర్శకంగా లేదని కొందరు - రిగ్గింగ్ చేసారని మరికొందరు

ఓటింగే పధ్ధతిగా జరగలేదని ఇంకొందరు ఎవరి వాదనలతో వారు పోలీస్ స్టేషన్ మెట్లెక్కేవరకు వెళ్లారు.

అసలు బాధ్యతలకే తప్ప ఎటువంటి అక్రమ ఆదాయానికీ తావు లేని ప్రెస్ క్లబ్ పదవుల కోసం

ఇంతటి ఆరాటం ఏమిటో - అంతటి పోరాటం ఎందుకో వారికే తెలియాలి.

కానీ ఓటింగ్ విషయంలో అవకతవకలు జరగడం - బ్యాలెట్ బాక్సుల్లోకి  నీళ్లు చేరడం వంటివి మాత్రం

అనుభవజ్ఞులైన పాత్రికేయులు అవలంభించే చర్యలు కావని స్పష్టంగా చెప్పొచ్చు. 

కేవలం 1300 ఓట్లు కలిగిన ఈ  ప్రెస్ క్లబ్ ఎన్నికల కోసమే కుల, మత, ప్రాంత ప్రస్తావనలు తేవడం..

డబ్బు పంపిణీ కూడా జరిగిందనే ఆరోపణలు రావడం విడ్డూరం. 

అన్నట్టు జర్నలిస్టుల సంఘాలు పలు ఉన్నప్పటికీ..

కొన్నిటికి ఎన్నికలే ఉండవు. ఇంకొన్నిటికి ఎన్నికల్లో నిలిచే అభ్యర్థులే ఉండరు.

అక్కడేమో కార్యవర్గం - కార్యాచరణ అంతా తూ తూ మంత్రంగా సాగుతుంటే..

ఇక్కడ మాత్రం ఢీ అంటే ఢీ అన్నట్టు ఉండడం విశేషం. 

అంతేలెండి.. ఎవరు ఎందుకు ఏ కారణంతో ఏం కోరుకుంటారో కానీ 

కొన్నిచోట్ల పట్టించుకోరు. కొన్నిచోట్ల పట్టు వదులుకోరు. 

కొందరు ప్రత్యక్షంగా పోరాడుతూ ఉంటారు. కొందరు వెనకుండి పావులు కదుపుతుంటారు. 

నమ్మిన వ్యక్తులే నారదులవుతారు. స్నేహితులే శకుని పాత్ర పోషిస్తారు. 

ఆ మహత్యం ఎన్నికలది. ఆ ప్రత్యేకత పదవులది.

అయితే ప్రజలకి దిశా నిర్దేశం చేయగలిగే వృత్తిలో వున్న పాత్రికేయులు 

వీలైనంత త్వరగా ఈ వివాదాన్ని పరిష్కరించుకుంటే వివేకవంతులు అనిపించుకుంటారు.

లేక సగటు జనుల్లాగే సాగతీసుకుంటూ వెళితే నీతులు చెప్పడానికే.. అన్న సామెతకి నిదర్శనం అవుతారు.!

✍️-పర్వతనేని రాంబాబు.

Read Here : PR PUNCH - అక్కడే కొడుతోంది తేడా..! 

Cinejosh Special Article PR Punch:

PR Punch On Press Club Election Controversy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs